శతకసౌరభాలు - 4
                             వేమన శతకము -2
                       నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు చంపు
                     
బైటఁ గుక్క చేత భంగపడును
                     
స్ధాన బల్మి గాని తనబల్మి కాదయా
                      
విశ్వదాభిరామ వినురవేమ !
                               ఓ వేమా !   మొసలి నీళ్ళ లో ఉంటే ఏనుగు నైనా అవలీలగా  చంపగలదు కాని అదే మొసలి నీటిని విడిచి బైట
ఉన్నప్పుడు కుక్క చేతనే  వెంటాడి
చంపబడుతుంది. ఎందుచేతనంటే అక్కడ మొసలికి ఉన్నది స్ధానబలమే కాని సహజ బలం కాదు.
అందుకే   ‘నీళ్ళలోన మొసలి నిగిడి దూరము పారు
బైట మూరెడైన పాఱలేదు ‘  అంటాడు మరొకచోట  వేమన.
  డబ్బు విలువ                    
                          కులము
లేని వాడు  కలిమి చే వెలయును 
                       
కలిమి లేని వాడు కులము  దిగును
                      
కులము కన్న భువిని కలిమి  ఎక్కువ
సుమీ 
                       
విశ్వదాభిరామ వినురవేమ !
                        ఓ వేమా!   కులం లేకపొయినా , గుణం లేకపోయినా డబ్బున్నవాడు
సమాజం లో కీర్తించబడతాడు. ధనము లేనివాడు ఉన్నత కుల సంజాతుడైనను వాడిని  తక్కువగానే చూస్తారు. ఎందుకంటే ఈ లోకం లో డబ్బు
కున్న విలువ  మరి దేనికీ లేదు.   
                   కులము గలుగువారు గోత్రంబు గలవారు
                    
విద్యచేత విఱ్ఱ వీగువారు
                     
పసిడి గల్గు వాని బానిస కొడుకులు  
                     
విశ్వదాభిరామ వినురవేమ !
                         ఓ వేమా.!    నేటి సమాజం లో కులగోత్రాలు గొప్పవని చెప్పుకొనేవారు, మేము
గొప్ప విద్వాంసులమని విర్రవీగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడ డబ్బున్న వాళ్ళకి
తొత్తులుగా , బానిసలు గా వ్యవహరిస్తారే కాని 
దాని కంటే అతీతులు కాదంటున్నాడు వేమన. 
ధన ప్రభావం అంత గొప్పది . అందుకే ‘డబ్బు లేని వాడు డుబ్బు కు కొఱగాడు’ అంటారు పెద్దలు. ‘ధనమూలమిదం జగత్ ’ అన్నది జగమెరిగిన
మాట. ‘డబ్బు
చేతిలో దేవుడున్నాడనేది ‘ జానపదుల మాట.
       లోభి గుణము
                  కనియు కానలేడు కదలింపడా నోరు
                 
వినియు వినగ లేడు విస్మయమున
                 
సంపద గలవాని సన్నిపాతంబిది
                   
విశ్వదాభిరామ వినురవేమ !
                 సర్వమును ఇచ్చునట్టి ఆ
దైవమునకు ప్రియమైన  ఓ వేమా ! డబ్బున్న వాడు
ఎదుటివాడు పడుతున్న బాధలను , కష్టాలను చూస్తూ కూడ చూడనట్లుంటాడు.  నోరువిప్పి మాటాడడు. మన బాధలు చెప్పు కుంటుంటే
వినినట్టుగానే ఉంటాడు కాని వినడు.  
విచిత్రమేమిటంటే   చూసినా చూడనట్టు
,మాట్లాడినా మాట్లాడనట్టు , విన్నా విననట్లు ఉండటం   సన్నిపాత రోగ లక్షణ మైతే ఇటువంటి రోగమే
ధనవంతుడికి  ఉంటుందని  తెగేసి చెపుతున్నాడు వేమన.  
                 
గొడ్డుటావుఁ బిదుక కుండ గొంపోయిన
                
బండ్ల నూడ దన్ను పాల నీదు
                
లోభి వాని నడుగ లాభంబు లేదయా
                 
విశ్వదాభిరామ వినురవేమ !
                     సర్వేశ్వరునకు ప్రియమైన ఓ వేమా !     గొడ్డు పోయిన ఆవు దగ్గరకు పాల పిదుకడానికి
పాత్ర తీసుకెళ్లి కూర్చుంటే పండ్లు రాలేట్టు తన్నుతుంది కాని పాలను ఇవ్వదు. అలాగే
నువ్వు ఎంత అవసరం లో ఉన్నా పిసినారి వాడి దగ్గరకు సహాయం కోసం వెడితే  అవమానకరమైన మాటలను పడవలసి వస్తుంది కాని  కొంచెం 
ప్రయోజనం ఉండదు .
                 
మేక కుతిక పట్టి మెడ చన్ను గుడువగా
                  
ఆక లేల మాను నాశ గాక
                 
లోభివాని నడుగ లాభంబు లేదయా
                  
విశ్వదాభిరామ వినురవేమ !
                             ఓ వేమా ! 
మేక మెడ క్రింద చన్నులా వేలాడే మాంసపు తిత్తిని పట్టుకొని  ఆశగా ఎంతసేపు  
కుడిచినా   పాలు రావు . ఆకలి తీరదు
కదా. అలాగే పిసినారి ని ఆర్ధిక సహాయం కోసం 
ఎంతసేపు దేవిరించినా మనకు సమయం వృధా తప్పితే దక్కేది ఏమీ ఉండదు.
                                  పెట్టి పోయ లేని వట్టి నరులు భువిని
                                 పుట్టనేమి వారు
గిట్టనేమి
                                  పుట్టలోన
చెదలు పుట్టవా గిట్టవా
                                   విశ్వదాభిరామ
వినురవేమ ! 
                   
ఓ వేమా ! దాన
గుణము లేని నరులు ఈ భూమి మీద పుట్ట నెందుకు. చావనెందుకు . అటువంటి  వారి వలన ఎవరికి  లాభము.పుట్టలోని చెదలు పుడుతూ , నశిస్తూ
ఉన్నట్టే ఈ పిసినారి వాళ్ళు  కూడ పుట్టడం
చావడానికే తప్పితే ఎవ్వరికీ అణు మాత్రం కూడ ఉపయోగ పడరు కదా !
  తత్త్వ వివేచన
                      ఏమి గొంచు వచ్చె నేమి తా గొని పోవు
                      
పుట్టువేళ నరుడు గిట్టువేళ
                     
ధనము లెచటికేగు తా నెచ్చటి కేగు
                      
విశ్వదాభిరామ వినురవేమ !
                    ఓ వేమా ! 
ఈ జీవి భూమి మీదకు వచ్చే టప్పుడు ఏమి తీసుకొచ్చింది . రేపు  పోయేటప్పుడు ఏమి తీసుకెడుతుంది. నానబాధలు పడి
సంపాదించిన డబ్బు ఎక్కడికి పోతుంది . తన కట్టె కాలి తానెక్కడికి పోతాడు. ఈ
విషయాలను మానవుడు  తెలిసికూడ మర్చిపోయి
ప్రవర్తిస్తుంటాడు.
                      
తనువదెవరి సొమ్ము తనదని పోషింప
                    
ద్రవ్య మెవరి సొమ్ము దాచుకొనగ
                       
ప్రాణమెవరి సొమ్ము పారిపోకను నిల్వ
                       
విశ్వదాభిరామ వినురవేమ !
                       ఓ వేమా ! ఈ శరీరం తనకు
చెందినదనే మోహంతో చక్కని సౌందర్య సాధనాలను వాడుతూ , ఎండకు ,చలికి  బలి కాకుండా కాపాడు కుండూ ఉంటాము.  ఈ దేహం ఏమైనా శాశ్వతమా  ?. నీ దని కాపాడుకోవడానికి. 
డబ్బంతా   ఎవరి సొంతమని నీవు పోగేసి
కూడ పెడుతున్నావు.  అలాగే  ప్రాణం ఏమైనా నీ స్వంతమా? పారిపోకుండా
ఉండటానికి. కాలం వచ్చినప్పుడు హంస లేచి వెళ్లి పోతుంది.   ఇవన్నీ అశాశ్వతాలని తెలిసి కూడ జీవుడు మాయ లో
పడి ‘ నాది’ ‘ నేను’ అనే భ్రాంతిలో పడి కొట్టుకుంటుంటాడు.
                               అందుకే
ఆంద్రమహాభారతం లో యక్షుడు ధర్మరాజును ప్రశ్నిస్తూ 
ఈ లోకం లో ఆశ్చర్యకరమైన విషయమేమిటని అడుగుతాడు. అందుకు ధర్మజుడు
సమాధానమిస్తూ. ...
            “ అహన్యహని భూతాని
గచ్ఛన్తీహ యమాలయమ్
            
శేషా :
స్ధావర  మిచ్ఛన్తి కిమాశ్చర్య మిత : పరమ్ !! “
                   -అంటాడు. అంటే
ప్రతిరోజు  జీవులు యమ సదనానికి వెళుతూనే
ఉన్నారు. కాని మిగిలిన  వారు తాము పోయేవారం
కాదని . శాశ్వతులమని భావిస్తున్నారు . ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది అంటాడు.
                               ఈ మాయే  ఈ లోకాన్ని నడిపిస్తోంది.   దీన్నే 'వైష్ణవమాయ 'అంటుంది మహా భాగవతం . 
     అన్నదాన  ప్రాశస్త్యము                  
                   అన్నిదానము లను అన్నదానమె గొప్ప
                   
కన్నతల్లి కంటె ఘనత లేదు
                    ఎన్న గురుని కన్న  నెక్కుడు లేదయా 
                     విశ్వదాభిరామ వినురవేమ ! 
                              ఓ వేమా. దాన గుణము సర్వదా కొనియాడదగినది. దానము లన్నింటిలోనికి అన్నదానము గొప్పది . ఆకలి తో ఉన్న జీవికి
ఆప్యాయంగా  అందించే ఆహారానికంటే మించిన
దానం మరొకటి లేదు. కన్నతల్లిని మించిన దైవము లేదు.  గురువును మించిన గొప్పవాడు లేడు.
       ఆశ
                    ఆశ చేత మనుజు లాయువు గలనాళ్ళు
                
తిరుగుచుందురు భ్రమ ద్రిప్ప లేక
               
మురికి భాండమందు ముసురు నీగల భంగి 
                
విశ్వదాభిరామ వినురవేమ !
                      ఓ వేమా.  ఆశ యనేది మిక్కిలి చెడ్డది.  ఆశా పాశములచేత బంధించబడిన నరుడు  అనేక కష్టాల పాలౌతాడు.  ఆ ఆశ చేతనే మానవులు మాయ లో చిక్కుకొని, మురికి
కుండ చుట్టూ తిరిగే ఈగల్లాగా  బతికి
ఉన్నంతకాలం దేనికో ఆరాట పడు తుంటాడు. 
                           ఆశ పాపజాతి
అన్నింటి కంటెను
                          
ఆశ చేత యతులు మోస పోరె
                         చూచి విడుచు వారు శుద్ధాత్ము
లెందైన
                          
విశ్వదాభిరామ వినురవేమ !
           ఓ వేమా. ఆశ  అన్నింటికంటే మిక్కిలి చెడ్డది. ఈ ఆశ యనే
ఉచ్చులో చిక్కుకొని గొప్ప గొప్ప యతీశ్వరులే మోసపోయారు.  తెలిసి విడిచిన వారే విశుద్ధాత్ములుగా  కీర్తించ బడుతున్నారు.
                       
ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి
                       
గోచి బిగియ గట్టి గుట్టు దెలిసి
                      
నిలిచి నట్టి వాడె నెఱయోగి యెందైన
                        
విశ్వదాభిరామ వినురవేమ !
         ఓ వేమా. ఆశ యనే  మాయా పాశాలను కోసివేసి , శరీరం లో జ్వలించే
కోరికలనే కామాగ్నిని చల్లార్చి, కౌపీనాన్ని 
బిగియ కట్టి , జీవుల జనన మరణ జీవ రహస్యాల గుట్టు మట్టులను   తెలుసుకొని , నిలిచిన వాడినే  నిజమైన యోగి అంటారని ఆత్మయోగి యైన వేమన
అభిభాషణ. అందుకే సర్వేశ్వరునికే అభిరాముడనని తనకు తానే ప్రకటించుకున్నాడు  యోగి వేమన.
                       
నీళ్ళలోని మీను నెఱి మాంస మాశించి
                       
గాలమందు జిక్కు కరణి భువిని
                       
ఆశ దగిలి నరుడు నాలాగె  చెడిపోవు
                        
విశ్వదాభిరామ
వినురవేమ !
                    ఓ వేమా. నీళ్ల లో ఉండే  చేప 
గాలానికి  వేలాడుతున్న   ఎఱ ను చూసి ఆశ పడి  గాలానికి చిక్కుకొని మరణించి నట్లే మానవుడు ఆశ
యనే గాలానికి చిక్కుకొని  నాశనమై
పోతున్నాడు. 
         రాజసేవ
                         
చచ్చి పడిన పశువు చర్మంబు కండలు
                            పట్టి పెఱికి తినును
పరగ గ్రద్ద  
                             గ్రద్ద వంటి వాడు
జగపతి కాడొకో
                                     విశ్వదాభిరామ వినురవేమ !
                                       ఓవేమా  !  చచ్చిన పశు కళేబరాన్ని  గ్రద్ద పీక్కు తిన్నట్టు గా రాజనే వాడు జనులను
పన్నుల రూపంలో దయాదాక్షిణ్యాలు లేకుండా 
పీడించుకొని తింటాడు. రాజు గ్రద్ద లాంటివాడే.
                          ఎరుక లేని దొరను నెన్నాళ్ళు గొలిచిన
                        
బ్రతుకు లేదు వట్టి భ్రాంతి కాని
                        
గొడ్డుటావు పాలు గోరితే చేపునా  
                         
విశ్వదాభిరామ వినురవేమ ! 
                                               ఓ వేమా! మన కష్టాన్ని
గుర్తించి మన్నించలేని  ప్రభువును ఎంతకాలం
విశ్వాసం గా  సేవించినా మనం  ఆశపడటం తప్పితే ఫలితమేమీ ఉండదు. మనకు అవసరమని
గొడ్డు పోయిన ఆవు దగ్గరకు  వెళ్ళి బ్రతిమలాడితే
మాత్రం పాలు ఇస్తుందా ? ఇవ్వదు కదా !
                           అలను బుగ్గ పుట్టి నప్పుడే క్షయ మౌను 
                        
కలను గాంచు లక్ష్మిఁ గనుట లేదు
                       
ఇలను భోగ భాగ్య మీ తీరు గాదొకో
                        
విశ్వదాభిరామ వినురవేమ !
                                          ఓ వేమా ! 
సముద్రపు అలల యందు బుడగ పుట్టి ఏ విధంగా క్షణకాలం లో నశించిపోతుందో , కలలో
కన్పించిన ధనరాశులు వాస్తవం లో ఏ విధంగా 
అదృశ్య మై పోతాయో అలాగే ఈ భూమి మీద భోగభాగ్యాలనేవి క్షణభంగురాలే కాని
శాశ్వతాలు కావు.
                           కోతి నొనర దెచ్చి కొత్తపట్టము గట్టి
                          
కొండముచ్చు లెల్ల గొలిచి నట్లు
                            నీతి హీనునొద్ద
నిర్భాగ్యులుండుట 
                          
విశ్వదాభిరామ వినురవేమ !
                               ఓ వేమా ! 
 కోతిని రాజును చేసి
కొండముచ్చులన్నీ చేరి కొలిచినట్లుగా నీతిమాలిన వారి వద్ద నిర్భాగ్యులు
చేరుతుంటారు.  అయోగ్యుని కి పట్టం కడితే
అవినీతి పెరిగిపోయి , అసమర్ధులు అధికారులౌతారు.
 ****************************  మూడవ భాగం త్వరలో  **********************************

