శతక సౌరభాలు
- 1
కంచర్లగోపన్న దాశరథీ శతకము - 6
దైవముఁ దల్లి తండ్రిఁ దగు దాత గురుండు సఖుండు
నిన్నె సం
భావన చేయుచున్న తఱిఁ బాపము లెల్ల మనోవికార దు
ర్భావితు జేయుచున్నవి కృపామతి వై నను గావుమీ జగ
త్పావన మూర్తి భద్రగిరి ! దాశరథీ ! కరుణాపయోనిధీ.!
శ్రీరామచంద్రా ! తల్లి ,తండ్రి ,దాత ,గురువు , మిత్రము అన్నీ
నీవే నని భావించి ధ్యానం చేసేటప్పుడు నేను
చేసిన పాపాలన్నీ నామనస్సును వికారముల చే చెడ్డ ఆలోచనల పాలు చేయుచున్నవి. జగత్పావన
మూర్తి వైన నీవు నన్ను దయతో రక్షించవలసినది స్వామీ !
వాసవు రాజ్యభోగ సుఖవార్థినిఁ దేలు
ప్రభుత్వ మబ్బ నా
యాసకు మేరలేదు కనకాద్రి సమాన ధనంబుఁ గూర్చినం
గాసును వెంటరాదు కనికానక చేసిన
పాపపుణ్యముల్
వీసరబోవ నీవు పదివేలగుఁ జాలు భవంబు
లొల్ల నీ
దాసునిఁగాగ నేలుకొను దాశరథీ ! కరుణాపయోనిధీ.!
శ్రీరామా ! దేవేంద్రునితో
సమానమైన రాజభోగ మబ్బినను ఆశ కు అంతుండదు. మేరుపర్వతమంత ధనరాశి సంపాదించినను కాసు
కూడ వెంటరాదు. తెలిసీ తెలియక చేసిన పుణ్యపాపములు ఎటువంటి వైనను వీసమెత్తు
తగ్గకుండా వెంట వస్తాయి. కావున రామా. ఇతరములతో నాకు పనిలేదు. నీవే నాకు చాలును.
ఇంక మరు జన్మలు వద్దు. నన్ను నీ సేవకుని గా ఏలుకొనవలసినది.
మనమున నూహపోహణములు మర్వకమున్నె కఫాది రోగముల్
తనువున నంటి మేని బిగి దప్పకమున్నె
నరుండు మోక్ష సా
ధనమొనరింప వలయుఁ దత్త్వ విచారము
మానియుండుటల్
తనువునకున్ విరోధమగు దాశరథీ ! కరుణాపయోనిధీ.!
శ్రీరామా ! మనస్సు స్వాధీనము తప్పక ముందే . కళ్ళె మొదలైన రోగములు శరీరము లో ప్రవేశించి దేహపటుత్వము తగ్గక ముందే
, మానవుడు మోక్షసాధన
చేయవలెను . ఆత్మ విచారణ చేయకుండుట దేహము
నకు మంచిది కాదు.
ముదమున కాటపట్టు ,భవమోహమదద్విరదాంకుశంబు , సం
పదల కొటారు ,కోరికల పంట ,పరంబున కాది ,వైరుల
న్నదన జయించు త్రోవ , విపదబ్దికి నావ గదా ,సదా భవ
త్సదమల నామ సంస్మరణ దాశరథీ ! కరుణాపయోనిధీ.!
ఓ దాశరథీ ! శ్రీరామా !
యనెడి నీ నామ స్మరణ సంతోషమును కల్గించును . సంసారమనెడి బంధములను తొలగించును .
సంపదలు కల్గి , కోరికలు తీరును మోక్షమునకు
మార్గము సుగమమగును . అరి
షడ్వర్గములను జయించవచ్చును . ఆపదలను తేలికగా దాటవచ్చును .
దురిత లతానుసారి భవదుఖకదంబము రామనామ భీ
కరతర హేతిచే దెగి వకావకలై చనకుండ
నేర్చునే
దరికొని మండుచుండు శిఖదార్కొనిన్ శలభాదికీటకో
త్కరము విలీనమై చనదె ? దాశరథీ
! కరుణాపయోనిధీ !
శ్రీరామచంద్రా ! పాపములనెడి తీగతో బంధించబడిన సంసార దుఖ సమూహములు శ్రీరామనామమనెడి ఖడ్గము చే తెగిపోవును.
నిప్పును సమీపించిన మిడుతలు మొదలైన పురుగులు
నాసనము చెందును కదా !
హరిపదభక్తి నింద్రియ జయాన్వితు డుత్తము డింద్రియంబులన్
మరగక నిల్పనూదినను మధ్యముఁ డింద్రయ పారవశ్యుడై
పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతి నైన నన్ను నీ
దరమున నెట్లు గాచెదవో దాశరథీ !
కరుణాపయోనిధీ !
శ్రీ రఘునాథా ! శ్రీ హరి భక్తులలో ఇంద్రియములను జయించిన
వాడు ఉత్తముడు. ఇంద్రియములకు లోబడక మనస్సును మరల్చుకో గలిగిన వాడు మధ్యముడు.
ఇంద్రియములకు లోబడిన వాడు నికృష్టుడు.
నీచుడు. అని పెద్దలు చెపుతారు . మరి నేను చెడ్డ బుద్ధి గలవాడను . ఐనా నన్ను ఏ
రీతిగా రక్షిస్తావో రామచంద్రా !
ఈ పద్యం లో భక్తులలోని మూడు రకాల వారిని రామదాసు
వివరించాడు.
వనకరి చిక్కె మైనసకు , వాచవికిం జెడిపోయి మీను తా
వినికికిఁ జిక్కె జిల్వ కనువేదుఁఱు జెందెను లేళ్ళు తావిలో
మనికి నశించెఁ దేటి తరమా యిరుమూటిని గెల్వ నైదు సా
ధనముల నీవెకావనగు దాశరథీ ! కరుణాపయోనిధీ !
శ్రీరామా ! దయాసముద్రా ! అడవి యేనుగు ఆడ ఏనుగు మీద మోజు చేత వేటగాడికి
దొరికిపోతుంది. జిహ్వచాపల్యం తో చేప ఎర కోసం
వచ్చి గాలానికి చిక్కుకుంటుంది. పాము నాగస్వరానికి లొంగిపోయి పట్టుపడుతుంది.
ఎండమావులను చూచి నీరు అనుకొని భ్రమించి
పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి మరణిస్తాయి
లేళ్లు. మొగలిపూల వాసనకు ఆకర్షించబడి , అందలి పుప్పొడి
కన్నులలో పడి గుచ్చుకొని తేనెటీగ మరణిస్తుంది.
గెలువ సాధ్యము కాని ఈ ఐదింటినుండి
( త్వక్ చక్షుశ్శోత్ర ఘ్రాణ రసన వీటిని
జ్ఞానేంద్రియాలు అంటారు ) ఐదు ఉపాయాల చేత నన్ను రక్షించవలసినది.
కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు
మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణదనర్ప వీనులు భవత్కధలన్ వినుచుండ , నాస మీ
యఱుతను బెట్టు పూసరుల కాసఁగొనం
బరమార్ధ సాధనో
త్కరమిది చేయవే కృపను దాశరథీ ! కరుణాపయోనిధీ !
శ్రీరామా ! నా చేతులు మీకు నమస్కరించునట్లును ,నా కన్నులు
మిమ్ములనే చూచునట్లును , నా నాలుక మీ నామస్మరణ చేయునట్లును ,
నా చెవులు మీ కధలను వినునట్లుగను , నా ముక్కు
మీ మొడయంది అలంకరించిన పూలమాలల వాసనను ఆఘ్రాణించు నట్టును ఈ పంచేంద్రియములను నేను మోక్షసాధనములు గా ఉపయోగించు
అవకాశమును మీరు నాకు దయచేయవలసినది .
చిరమగు భక్తినొక్క తులసీదళ మర్పణ చేయువాడు ,ఖే
చర గరుడోరగ ప్రముఖ సంఘములో
వెలుగన్ సదాభవత్
స్భురదరవింద పాదముల బూజ లొనర్చిన వారికెల్లఁ ద
త్పర మఱచేతి ధాత్రి గద దాశరథీ! కరుణాపయోనిథీ
! ( 85 ప )
ఓ
రామచంద్రా ! మానవుడు నిలకడైన భక్తితో నీకొక తులసీ దళము సమర్పించినా కూడ సిద్ధ గంధర్వాదుల లోకము సంప్రాప్తించును .
నీపాదపద్మములను సేవించిన వారికి మోక్షము
కరతలామలకము కదా !
శ్రీ రామచంద్రుని అసమాన దైవత్వాన్ని , శ్రీరామ నామ ప్రాశస్త్యాన్ని
మనసారా స్మరించి, తనవి తీర వర్ణించి పులకిస్తున్నాడు శ్రీ
రామదాసు.
భానుఁడు తూర్పునందు గనుపట్టినఁ
బావకచంద్రతేజముల్
హీనతఁ జెందినట్లు ,జగదేకవిరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నఁ బరదైవమరీచు లడంగకుండునే
దానవ గర్వనిర్ధళన దాశరథీ!
కరుణాపయోనిథీ !
శ్రీరామా ! రాక్షసుల గర్వమును నశింపజేసినవాడా
! సూర్యడు ఉదయించగానే చంద్రునికిని , అగ్నికిని
కాంతి తగ్గినట్టు గా జగదేకవిరాజితమైన నీ పాదపద్మాలను ధ్యానించుచున్న యెడల ఆ కాంతి లో ఇతరదేవతల తేజస్సు మసకబారును కదా !
నీ మహనీయ తత్త్వరస నిర్ణయబోధ కధామృతాబ్ది లో
దామును గ్రుంకులాడక
వృధా తను కష్టమునొంది మానవుం
డీ మహిలోక తీర్ధములనెల్ల మునింగిన దుర్వికార హృ
త్తామస పంకముల్ విడునె దాశరథీ! కరుణాపయోనిథీ !
శ్రీరామా ! నీయొక్క తత్వ్తమును తెలిపెడి రామకధామృత సముద్రము
లో మునుగులాడక , మానవుడు
అనవసరము గా దేహమును కష్టపెట్టి
భూలోకమందు గల ఎల్లతీర్ధములలోను
గ్రుంకులిడినా కూడ మనస్సు నంటుకొనిన దుర్వికారములు కల అజ్ఞానమనెడి బురద వదలదు కదా స్వామీ !.
చదువుతూ ఉండండి . మరికొన్ని అందిస్తాను .
No comments:
Post a Comment