Monday, 7 April 2014

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 10 సుయజ్ఞోపాఖ్యానము అను తత్త్వవిలోకనము




శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు --10       
             
                             సుయజ్ఞోపాఖ్యానము  అను తత్త్వవిలోకనము
                
                  



                     శ్రీ మన్నారాయణుని అవతారమైన ఆదివరాహమూర్తి చేతిలో హిరణ్యాక్షుడు మరణించాడు.తన సోదరుని శ్రీమహావిష్ణువు చంపివేశాడని తెలుసుకున్న హిరణ్యకశిపుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ ఘోణిగాడు (వరాహము)  నాకు భయపడి   ఏ అడవుల్లోనో , సముద్రం లోనో, పర్వతాల చాటునో ,మునుల పంచనో ఎక్కడో ఒకచోట దాక్కుని ఉంటాడు. వాడి పుట్టుపూర్వోత్తరాలు ఎవ్వరికీ తెలియవు. మనం ఎదురు తిరిగితే వాడు ఎదుర్కొంటాడు. మనం వెంట పడితే కాని దొరకడు.  వాడు ఎక్కడ దాక్కున్న  పట్టుకొని నా పదునైన బల్లెంతో వాడి కంఠాన్ని  తెగ నరికి ఆ వేడి నెత్తురు తో నా తమ్మునికి తర్పణం విడుస్తాను అంటూ  చిందులు వేయసాగాడు.
                                           “   శ్రీ మహా విష్ణువు ను సంహరిస్తే ఆ దేవతల పని  అయిపోయినట్టే.   అందుకని ఎక్కడ  వేదాధ్యయనము ,యజ్ఞయాగాదులు , జపతపాలు , వ్రతాలు నిర్వహించబడుతుంటాయో అక్కడికి వెళ్ళి వాని నన్నింటిని ధ్వంసం చేయండి. ఎందుకంటే  విష్ణువంటే ఎవరో కాదు.అతడే వేదం . అతడే యజ్ఞం. వైదిక కర్మకాండకు అతడే మూలం.  అందుకే  ఎక్కడ గోవులు ,విప్రులు సుఖం గా జీవిస్తుంటారో, ఎక్కడ వేద ధర్మాలు, ఆశ్రమ నియమాలు , క్రమం తప్పక ఆచరించబడుతుంటాయో వాని నన్నింటినీ సర్వనాశనం చేయండి. అప్పుడు విష్ణువు తనకు తానే దిగి వస్తాడని తన అనుచరులైన రాక్షసవర్గాన్ని  ఆదేశించాడు హిరణ్యకశిపుడు.
                      
                  ఈ సమయం లో హిరణ్యాక్షుని భార్యలను, కొడుకులను ఓదార్చి, పుత్రశోకం తో తల్లడిల్లిపోతున్న తల్లి దితిని  ఊరడిస్తూ  హిరణ్యకశిపుడు   ఎన్నో జీవనసత్యాలను  వివరిస్తాడు. ఆ సందర్భం లోనిదే సుయజ్ఞోపాఖ్యానము. శ్రీ మదాంధ్ర మహాభాగవతం సప్తమస్కంధం లో మనకు ఈ ఉపాఖ్యానం కన్పిస్తుంది. తల్లితో  హిరణ్యకశిపుడు ఇలా అంటున్నాడు.
               
                ఓ తల్లీ ! ఈ లోకం ఒక చలువపందిరి  వంటిది.   ప్రాణులందరు కూడ దాహం కోసం వచ్చే బాటసారులే. చలివేంద్రం వద్దకు బాటసారులు దాహం తీర్చుకోవడానికి వచ్చి వెళ్లిపోతున్నట్లు , మనం కూడ ఈ సంసారం లోకి  వచ్చి  మన పని కాగానే వెళ్లిపోతూ ఉంటాం. ఎప్పుడు ఒకేచోట కలిసి ఉండం. కలుస్తూ ఉంటాం.విడిపోతూ ఉంటాం. అలాగే నీ చిన్నకుమారుడు కూడ  మహావీరులు వెళ్లే లోకానికే వెళ్లాడు. నీవు దు:ఖించాల్సిన అవసరం లేదు.
                 సర్వజ్ఞుడయిన  ఆ ఈశ్వరుడు సర్వాధికారి . సర్వాత్ముడు. సత్యుడు. నిర్మలుడు. అనంతుడు. ఆఢ్యుడు. ఆత్మస్వరూపుడు. నిరంతరం తన మాయా ప్రవర్తన మహిమ వలన త్రిగుణాలను కల్పించి , ఆ గుణసంయోగం వలన శరీరం ధరించి , లీలగా వినోదిస్తూ ఉంటాడు. కదలని చెట్లు కదలాడే నీళ్ళల్లో కదులుతున్నట్లు కన్పించినట్లుగా , కళ్లు తిరుగుతుంటే భూమి తిరుగుతున్నట్లుగా  అన్పించినట్లు  , భావవికారాలు లేని ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుడు చంచల మనస్కులకు చంచలుడు గా అన్పిస్తాడు కాని ఆయన అచంచలుడు.
                         లక్షణ రహితుడైన ఆ భగవంతుడు  అప్పుడప్పుడు  కొన్నిలక్షణాలను పొంది కర్మబంధాలలో చిక్కుకొని యోగ వియోగాలను అనుభవిస్తుంటాడు. పుట్టుక ,నాశము ,శోకము ,వివేకము , చింత ,స్మరణము అనేవి అనేక రకాలు. ఈ పరమార్థాన్ని వివరించడానికి పెద్దలు ప్రేతబంధు యమ సంవాదము అనే కథ చెప్తారు. ఆ కథ చెపుతాను విన మని  చెప్పి సుయజ్ఞోపాఖ్యానాన్ని తల్లికి విన్పించాడు హిరణ్యకశిపుడు.
             పరమ భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదునకు తండ్రి . పూర్వజన్మ లో సర్వలోకశరణ్యుడైన శ్రీమన్నారాయణునకు  ద్వారపాలకుడు నైన హిరణ్యకశిపుని చేత  ఈ ఉపాఖ్యాన ప్రస్తావన  శ్రీ మహాభాగవత ప్రత్యేకత.  
              “ ఉశీనరదేశం లో సుయజ్ఞుడనే ఒక రాజు ఉండేవాడు. అతడు ఒకానొక యుద్ధం లో  శతృవుల చేతిలో  అతి ఘోరం గా మరణించాడు. అతని రత్నకవచం చిరిగిపోయింది. ఖడ్గం విరిగి పోయి ,రత్నహారాలు తెగిపోయి, శరీరమంతా ధూళి ధూసరితమై , గాయాలనుండి  నుండి నెత్తురు కారుతోంది .దంతాలు బిగుసుకు పోయి ,చేతులు తెగిపోయి  వేరుగా పడి పోయాయి.  
                     ఆ  సుయజ్ఞుని కళేబరం చుట్టూ  అతని భార్యాపుత్రులు , బంధుజనులు  చేరి భోరుభోరున విలపిస్తున్నారు. నీవు లేకపోతే  మేము బతకలేమని ,మేము నీతోనే సహగమనం చేస్తామని అతని భార్యలు రోదిస్తున్నారు. ఇంతలో సాయంత్ర మయ్యింది. ఆ సమయం లో వారి రోదనలను విని యమధర్మరాజు విప్రబాలకుని వేషం లో  అక్కడకు వచ్చాడు. వారి దగ్గరకు వెళ్లి కాలనిర్ణయాన్ని  గూర్చిఈ విధం గా  బోధించసాగాడు.
                    మందమతులారా !   తనవారి మీద ఎక్కువగా మక్కువ  పెంచుకొని , కాలం తీరిన వారి కోసం ఇంతగా  దు:ఖించడం విచిత్రం గా ఉంది. పుట్టిన ప్రతిజీవి  మరణించడం  మీరు నిత్యం చూస్తూనే ఉంటారు. పుట్టిన తరువాత గిట్టని ప్రాణి ఉండదు . మరి చనిపోని వారి లాగా మీరు చనిపోయిన వారికోసం  ఎందుకు ఏడుస్తున్నారు. చావు ను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాని పని.  ప్రాణి ఎక్కడ నుండి వచ్చిందో మళ్లీ  అక్కడ కు వెళ్ళడం దాని సహజలక్షణం. చిన్ననాడే తల్లిదండ్రులను వీడి అడవిలో క్రూరమృగాల మధ్య చిక్కినా ఆ పరమేశ్వరుని  దయవుంటే  సురక్షితం గా ఉంటాం.  మనం తల్లి గర్భం లో ఉండగా ఎవడు మనల్ని పోషించాడో  ఆ భగవంతుడే అడవిలో ఉన్నా కూడ రక్షిస్తాడు. అంటే భగవంతుడే  సర్వదా సర్వథా రక్షకుడు.

 ఎవ్వడు సృజించుఁ బ్రాణుల , నెవ్వడు రక్షించుఁ ద్రుంచు నెవ్వఁ డనంతుం
 డెవ్వఁడు విభు డెవ్వఁడు వాఁ డివ్విధమున మనుచుఁ బెనుచు హేలారతుడై . (7 – 48 )
                
                      ఈ విశ్వాన్ని ఎవ్వడు సృష్టించి, రక్షించి , నశింప చేస్తున్నాడో, ఎవ్వడు అనంతుడో , ఎవ్వడు ఈ బ్రహ్మాండానికంతటికీ అథిపతి యో , వాడే లీలావిలాసం గా ఈ లోకాన్ని రక్షిస్తూ , పోషిస్తూ ఉంటాడు. డబ్బుని వీథి లో పడేసినా దైవయోగం బాగుంటే సురక్షితంగా ఉంటుంది. గీత బాగుండకపోతే ఇంట్లో మూల దాచి పెట్టినా  పోతుంది. అలాగే  బలహీనుడు అడవిలో ఉన్నా భగవంతుని కృప ఉంటే వృద్ధి పొందుతాడు. దైవానుగ్రహం లేకపోతే బలవంతుడైనా ఒంటిస్థంభం మేడలో  రక్షకభటులచే రక్షింపబడుతున్నా మరణిస్తాడు.
                అడవి రక్షలేని యబలుండు వర్థిల్లు
               రక్షితుండు మందిరమునఁ జచ్చు. ( 7 – 49 )
                ఆ భగవంతుని తత్వ్తం ఎవ్వరికీ అర్థం కాదు.  ఆయన వలన ఈ సమస్త జీవకోటి కాలకర్మ వశమై ఈ బ్రహ్మాండ చక్రం లో వర్తిల్లుతూ ఉంటుంది. ఆత్మ స్వరూపుడు, అగమ్యుడు నైన ఆ ఈశ్వరుడు త్రిగుణాతీతుడు. పంచభూతాత్మకమైన ఈ  దేహమనే భవనం లో  పురుషుడు పూర్వకర్మానుసారియై ప్రవర్తిస్తూ, కాలం తీరగానే ఈ దేహం నుంచి వెళ్లి పోతాడు. దేహం అశాశ్వతం. అందులోని ఆత్మపురుషుడు శాశ్వతుడు. ఎప్పటికైనా దేహం చెడిపోతుంది కాని  ఆత్మకు నాశనము లేదు. పురుషుడు ,దేహము వేరువేరే కాని ఎప్పుడూ ఒకటి కాదు.  దారువు లో అగ్ని దాగి ఉన్నట్లు ,శరీరం లో గాలి ఉన్నట్లు , తామరతూడు లోపల  శూన్యం ఉన్నట్లు, దేహం లో దేహి వేరుగా ఉంటాడు.
                   ఈ మహారాజు  దీర్ఝనిద్రలోకి  వెళ్లిపోయాడు. ఇతని లోని మాటలు మాట్లాడే , మాటలు వినే జీవుడు ఎప్పుడో వెళ్లిపోయాడు. ప్రాణానికి మూలమైనటువంటి వాయువు ఉన్నా అది విడిగా భాషించలేదు. వినలేదు . జీవుడు ప్రాణానికీ , దేహానికీ వేరుగా ఉండి కూడ ముఖ్యుడై ఇంద్రియప్రభావం తో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ఆత్మరూపుడు పంచభూతాలను , పంచేద్రియాలను , మనస్సును , లింగదేహాన్ని విలాసం గా ధరిస్తూ మళ్లీ విడిచి పెడుతూ ఉంటాడు. ఈ ప్రపంచానికంతటికీ ఫ్రభువు వేరే ఉన్నాడు.   అందువలన దీని కోసం మీరు బాధపడటం , దు:ఖించడం అవివేకం కదా. ఎప్పటి వరకు ఆత్మ దేహాన్ని ధరించి ఉంటుందో  అప్పటి వరకూ ఈ కర్మయోగం జరుగుతూనే ఉంటుంది. ఆ తరువాత ఆత్మ దేహాన్ని విడిచి పెట్టగానే   ఈ బంధాలన్నీ తెగిపోతాయి. వీటితో సంబంధ మే ఉండదు. అది తెలియక మీరు దు:ఖిస్తున్నారు.
                   
                  ప్రాణులు  మహామాయ అనే భ్రాంతి లో పడి తల్లిదండ్రులు , భార్యబిడ్డలు , స్నేహితులు, బంధువులు , ఆశ్రితులు అంటూ  అనురాగాలను, అనుబంధాలను పెంచుకొని , ఇళ్లు , వాకిళ్లు , సంపదలూ , సామ్రాజ్యాలను  సంపాదించుకుంటారు, ఎప్పుడైనా మనకు కలలో కన్పించిన సంపద యథార్థమౌతుందా ?  కర్మానుబంధం ఉన్నంతకాలం సంయోగం , కర్మఫలం అనుభవించాక వియోగం ఏర్పడుతుంది.
                         ఈ మాయా గుణ ప్రపంచాన్ని గూర్చి తెలిసిన తత్త్వజ్ఞులు నిత్యానిత్యములను గురించి సుఖ దు:ఖాలను పొందరు. అజ్ఞానులు మాత్రమే సంయోగం కలిగితే పొంగిపోతూ , వియోగం కలిగితే కుంగిపోతూ ఉంటారు. 
                                   పూర్వం ఒక అడవిలో   ఒక కిరాతుడు  పక్షులను వేటాడి జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయమే లేచి వాడు వేట కు బయలుదేరాడు. అడవి లో వలలు వేసి పిట్టలను పట్టుకుంటూ , దొరికిన పక్షుల రెక్కలు విరిచి  సంచిలో వేసుకుంటూ లోకభీకరం గా  తిరుగసాగాడు. ఇంతలో కాలచోదితమై ఒక అడవి పిచ్చుకల జంట కిరాతుడి కంటపడింది. ఇంకేముంది. నేర్పు గా వలపన్ని ఆడపిచ్చుక ను పట్టుకొని , రెక్కలు విరిచి సంచిలో వేసుకున్నాడు. అది చూచి  మగపిచ్చుక  వలవల విలపించసాగింది.
                   
                అయ్యో! ప్రియురాలా ! అడవిలో ఎక్కడో ఇంత మేత మేసి, పడియల నీరు త్రాగి , ఒకరికి అపకారం చేయక బతుకుతున్నాం కదా. కఠినాత్ముడైన ఆ బ్రహ్మ మన నొసటిని ఈ బోయవాడి చేతిలో చావమని వ్రాశాడు కాబోలు. ఆ పాపిష్టిదేవుడికి మన బతుకు ఇంత బరువయ్యిందా ?   మనందరినీ ఒకేసారి  ఆ కిరాతుని వలలో వేయక   ఇలా ఎడబాటు కల్గించిన  ఆ విధి వంకర చేష్టలను ఏమనాలి.                              

ఱెక్కలు రావు పిల్లలకు ,ఱేపటి నుండియు మేత గానమిం
బొక్కుచుఁ గూటిలో  నెగసి పోవగ నేరవు , మున్ను తల్లి యీ
దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కినిక్కి న
ల్దిక్కులఁ చూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా ! ( 7 – 63 )
   
         అయ్యయ్యో ! మన పిల్లలుకు ఇంకా  రెక్కలు కూడ రాలేదు. తెల్లవారిన దగ్గర నుంచి మేత లేక ఏడుస్తుంటాయి. గూటినుంచి వెళ్లడానికా ఎగరలేవు. అమ్మ ఆహారం పట్టుకుని ఇటువైపు నుంచే వస్తుందనే ఆశతో దీనం గా నాలుగు దిక్కులు  చూసే ఈ పిల్లల వేదనను ఎలా భరించగలను.
                అంటూ ఆడపిచ్చుక వియోగాన్ని తలచుకొని దు:ఖిస్తోంది ఆ మగపిచ్చుక.   ఇంతలో బోయవాడు  ఆ పిచ్చుకను చూచి , వెంటనే బాణం తో కొట్టాడు . కాలం తీరిన మగపక్షి కెవ్వున అరుస్తూ  నేలకూలి ప్రాణాలు విడిచింది.
                   కాలము డాసిన నేలం , గూలక పోవశమె యెట్టి గుణవంతులకున్. ( 7-66)
   కాలం మూడితే ఎంతటి గుణవంతుడు , ధనవంతుడు , బలవంతుడైనా మరణించక తప్పదు కదా.!              
                 కాబట్టి  మరణం ఎప్పుడు ఎలా ఎక్కడొస్తుందో తెలియదు. చచ్చిపోయిన మీ నాథుని కోసం మీరు  వంద  సంవత్సరాలు ఏడ్చినా   ఆయనను  చేరుకోలేరు. మృతిఁ బొందిన వారలు చేర వత్తురే. ( 7 -67 ) చచ్చిన వారు ఎప్పుడైనా లేచి వచ్చారా!  “ అంటూ పల్కిన  కపటబాలకుడైన యమధర్మరాజు మాటలను విన్న సుయజ్ఞుని  బంధువులు ఆశ్చర్యపోయారు.   ఈ విశ్వం శాశ్వతం కాదని అర్థం చేసుకొని , శోకాన్ని వదిలి మహారాజు కు ఉత్తర క్రియలు పూర్తిచేశారు.  బాలుని రూపం లో వచ్చిన యమధర్మరాజు అంతర్థానమయ్యాడు.
                   ఈ వృత్తాంతమంతా హిరణ్య కశిపుడు తన తల్లికి, తమ్ముని భార్యాబిడ్డలకు చెప్పి వారిని సమాధానపరచి  మరల ఇలా అన్నాడు.
పరులెవ్వరు దామెవ్వరు  పరికింపగ నేక మగుట భావింపరు, త
త్పరమజ్ఞానము లేమిని బరులును నేమనుచుఁ దోఁచుఁభ్రాణు కెల్లన్.( 7 – 69 )
                       ప్రాణులకు పరతత్త్వ చింతన లేకపోవుడం వలన  నేను , మనము  , వాడు , పరులు అనే , తేడాగా భావిస్తారు. వారు , మేము అని అజ్ఞానులు మాత్రమే అనుకుంటారు. ఆలోచిస్తే మనం అందరూ ఒక్కటే .  ఆ పరమాత్మ ఒక్కడే. అటువంటి వివేచన మనకు కలగాలి. అంటూ ముగించాడు హిరణ్య కశిపుడు.
                                                    హిరణ్యకశిపుని  యొక్క ఈ సుదీర్ఘ వివరణ తో తత్త్వవిలోకనం కలిగిన  ఆతని తల్లి యైన దితి , హిరణ్యాక్షుని ఇల్లాండ్రైన ఆమె కోడళ్లు దుఖోపశమనాన్ని పొందగలిగారు. కాని విచిత్రమేమిటంటే  -- ఇంత చెప్పిన హిరణ్యకశిపునకు మాత్రం వార్ధక్యము , మరణము లేని జీవితము , త్రిలోకాధిపత్యము కావాలనే సంకల్పం కలిగి మందరాద్రి కి వెళ్లి ఘోర తపస్సు ప్రారంభించాడు.     దైవ యోగము అనుల్లంఘనీయము కదా !
                  
                   చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతా లవిత్రంబులు స
                   న్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్ .( 7 – 6)
                               
                                          నమో వేదమాతరం



                               
      


*******************************************************************************



Thursday, 3 April 2014

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 9 గజేంద్ర మోక్షము

     


 శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు – 9
                        

                     గజేంద్రమోక్షము
                   
             


                    భగవంతుని నమ్మిన వారి కెన్నడు కూడ నాశము లేదని చెప్పడమే భాగవతం యొక్క పరమార్ధం  “    నన్ను మఱువని వారిని నేను ఏనాడు మరువను.  నన్ను మఱచిన యెడలన్ మఱతును. ఈ సంగతి తెలుసుకొని ఇతరులను వేడకుండా   నన్నే  నమ్మి ప్రార్థించిన వారిని నేను తప్పక ఆదుకుంటాను.  యెఱిఁగి మొఱఁగక మఱవక మొఱ యిడిర యేని వారిని  కాపాడతానంటాడు పరమాత్మ.తనను మర్చిపోయిన వారిని తాను మర్చిపోతానని, తనను నమ్ముకున్న వారిని తాను ఆదుకుంటానని స్పష్టంగా చెప్పాడు శ్రీమహాలక్ష్మి తో శ్రీమహావిష్ణువు ఈ గజేంద్రమోక్షఘట్టం లో. (8-130).   " నీవే తప్పనిత: పరంబెరుగన " నే  ఆత్మసమర్పణ భక్తునిలో కలిగినప్పుడే భగవత్సాక్షాత్కారం జరిగేది.అదే విషయాన్ని గజేంద్రమోక్ష ఘట్టం మనకు సవివరంగా విశదీకరిస్తుంది .  
                
                

    అంతేకాదు.భక్తుడు కర్మపరతంత్రుడై నిత్యకృత్యాలను నిర్వహించుకుంటూనే విష్ణువు ను సేవించగలగాలి.  ఈ నియమాలను పాటిస్తే మెల్లగా పాపాలన్నీ నశించిపోతాయి. ప్రబలమైన విష్ణుభక్తి ఎప్పుడు నాశనము కాదు. ప్రబలమైన విష్ణుభక్తి సెడదు (8-126). అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. దైవబలం లేనందువల్లనే గుణ రహితులైన దుర్జనులకు ఏనుగులు ,గుఱ్ఱాలు , సంపదలు ,  ఆలుబిడ్డలు నశించిపోతారు.  గుణవంతులైన వారు చెడకుండా జీవిస్తారు. వారిలో విష్ణుభక్తి యందు ఆసక్తి పెరుగుతుంది..  అందుకే చెడని పదార్ధములు విష్ణుసేవానిరతుల్. అన్నాడు పోతన.
                
                    
                      ఆంధ్ర మహాభాగవతం అష్టమస్కంధం లో మనకు గజేంద్ర మోక్ష ఘట్టం దర్శనమిస్తుంది. ఈ వృత్తాంతం ఒకనాట తెలుగునాట పరిపాటి గా వినిపించిన పరమ భక్తిమయ కావ్యం. ఐదవ తరగతి తోనే విద్యాభ్యాసం అయిపోయే ఆనాటి రోజుల్లో  ఆంధ్రదేశం లో తల్లిదండ్రులు తమ పిల్లలకు  తెచ్చి ఇచ్చి చదివించే పుస్తకాల్లో ఒకటి  ఈ గజేంద్ర మోక్షం.   డెబై,ఎనభై సంవత్సరాలకు పూర్వమే పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్ధన చేయించేటప్పుడు ఎవ్వని చే జనించు జగమెవ్వనిలోపల అనే పద్యాన్ని చెప్పించేవాళ్లు. అది  నాటి సమాజం మీద  ఆంధ్ర మహాభాగవత ప్రభావానికి నిదర్శనం.  ఏభైయ్యారు సంవత్సరాలక్రితం నాచేత ఆ పద్యాన్ని చదివింపచేసిన శ్రీ పాపారావు మేష్టారు నాకు ఇప్పటికీ గుర్తున్నారు.
          


                    పాలసముద్రం లో త్రికూటమనే  ఒక పర్వతం ఉంది. దానికి బంగారం, వెండి, ఇనుము తో నిండిన మూడు శిఖరాలున్నాయి. అది పదివేల ఆమడల పొడవు, అంతే వెడల్పు , ఎత్తు కలిగి ఉంది. ఆ పర్వత సమీపం లోని అడవుల్లో కొన్ని మదపుటేనుగుల సమూహాలున్నాయి. అవి గుంపులు గుంఫులు గా సంచరిస్తూ పచ్చని పచ్చిక బయళ్లను వాసన చూసి,కాళ్లతో మట్టగిస్తూ, పండ్ల చెట్లను రాసుకుంటూ, కొమ్మలను విరుస్తూ, చిన్నచిన్న జంతువులను బెదరిస్తూ విహరించసాగాయి. అలా తిరుగుతున్న ఏనుగుల  గుంపులో ఒక గజేంద్రుడు  తన ఆడ ఏనుగులతో చెర్లాడుతూ  గుంపు నుండి వెనకపడ్డాడు. దైవవశం చేత తెలివి కోల్పోయి, దారితప్పి, ఆడ ఏనుగులతో కలిసి వేరుమార్గాన ప్రయాణించసాగాడు. దప్పిక తో అలసిపోయిన ఆడ ఏనుగులు వెన్నంటి రాగా, ఆయాసం తో అలసి పోయి, ప్రయాణించి, ప్రయాణించి, ఒక మడుగు చెంతకు చేరుకున్నాడు గజేంద్రుడు.
        
                    పది లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అథినాధుడైన ఆ గజేంద్రుడు ఆ సరస్సులో అత్యంత విలాసం గా, విహరించసాగాడు. అదే  సమయం లో ఆ మడుగు లో ఉన్న ఒక మొసలి రాహువు సూర్యుణ్ణి పట్టు కున్నట్టుగా ఆ గజేంద్రుని ముందు రెండు కాళ్లను ఒడిసి పట్టుకొని నీటి లోపలికి లాగసాగింది. కాని ఆ గజేంద్రుడు ఏమాత్రం భయపడలేదు.తన దంతాల మొనలతో బలంగా ఆ మొసలి చిప్పల క్రిందిభాగాలు  కదిలిపోయేటట్లుగా పొడిచింది. ఆ మొసలి పట్టు తప్పింది. అది ఏనుగు కాళ్లు వదిలి దానితోకను తన కోరలతో కొరికింది. ఈ విధం గా ఆ కరి, మకరుల పోరాటం వెయ్యేండ్లు భయంకరం గా, అతిభయంకరం గా జరిగింది.  అతల కుతల లోకాల్లోని వారంతా   ఆ కరి మకరుల పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
  
     కరిఁ దిగుచు మకరి సరసికిఁ గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్
       గరికి మకరి మకరికిఁ కరి భర మనుచును నతల కుతల భటు లరుదుపడన్  ( 8 – 54).

          ఆ పోరాటాన్ని చూసిన వారు ఒకసారి  ఏనుగు కంటే మొసలి బలమైనదని , మరోసారి  మొసలి కంటే ఏనుగు బలమైందని అనుకోసాగారట. క్రమక్రమంగా గజరాజు బలం క్షీణించసాగింది. స్ధానబలం తో మొసలి విజృభించసాగింది. అంతా బాగున్నప్పుడు తన అంతవాడు లేడని విఱ్ఱవీగే జీవికి కష్టాలు కమ్ముకోగానే దేవుడు గుర్తుకొస్తాడు. "కలడు కలండనెడు వాడు కలడో లేడో "అనే సందేహము వస్తుంది.  ఉంటే నన్నేందుకు ఆదుకోవడం లేదనే ఉక్రోషము వస్తుంది.చివరకు "నీవే తప్ప నిత:పరంబెరుగననే "ఆత్మ సమర్పణదశ కు వస్తుంది.  ఈ వివిధ దశలన్నీ తను తప్ప వేరేదీ లేదని భావించే ఒక అహంభావి,  సర్వాంతర్యామి యైన భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించే దశకు చేరటాన్ని మనకు  ఈ వృత్తాతం నిరూపిస్తుంది.

            ఎవ్వనిచే జనించు జగ ; మెవ్వని లోపల నుండు లీనమై ;
           యెవ్వని యందు డిందు ; పరమేశ్వరు డెవ్వడు ; మూలకారణం
           బెవ్వ ; డనాదిమధ్యలయుడెవ్వడు ; సర్వము దానయైన వా
            డెవ్వడు ; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్. ( 8 -73 )

                         జీవితం  లో పోరాడటానికి  తన శక్తి చాలనప్పుడు తనకంటే మించిన శక్తి ఒకటి ఉందని, అదే తనను కాపాడగలదనే ఆశ , ఆలోచన  జీవిలో కలగడానికి కూడ పూర్వజన్మ వాసనా బలం ఉండాలి . లేకపోతే బాధల్లో నలిగిపోతూ కూడ భగవంతుణ్ణి  మరచిపోయి వేడుకోలేని నిర్భాగ్యులు ఈ లోకం లో ఎంతమంది లేరు. అందుకే గజరాజు కు పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తి వలన సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకునేటట్లు భగవత్ప్రేరణ  కలిగింది. అందుకే  భగవత్ప్రార్ధన కు పూనుకున్నాడని మనం గమనించాలి.                

                             ఈ లోకం ఎవ్వని వలన పుడుతోందో , ఎవ్వని లో ఉంటోందో , ఎవ్వని లో నశిస్తోందో , ఎవడు పరమాత్ముడో , ఎవడు ఈ సమస్త విశ్వానికి మూలకారకుడో ,  ఎవ్వడు అన్నీ తానై ఉంటాడో  అటువంటి ఈశ్వరుణ్ణి  నేను శరణు వేడుతున్నాను అంటాడు గజేంద్రుడు. అంటే ఆ సర్వాంతర్యామి ఎవరో తెలియని అజ్ఞానం లోనే జీవి కొట్టుమిట్టాడుతున్నాడన్న మాట. ఇది తొలి దశ.

         లోకంబులు లోకేశులు , లోకస్థులుఁ దెగిన తుది నలోకం బగు పెం
        జీకటి  కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్ . ( 8-75 )

              లోకాలు , లోకాలను ఏలే వారు , ఈ లోకాల్లో ఉండే వారు అందరూ నశించిన తరువాత కూడ ఆ కారు చీకట్లకు అవతల  అఖండమైన దివ్యరూపం తో  ప్రకాశించే ఆ భగవంతుని  నేను భావించి సేవిస్తున్నాను . ముక్తసంగులైన మునులు ,భగవంతుని చూడాలని కోరుకునే వారు,  అందరి మేలు ను కోరుకునే వారు , సాధు చిత్తులు , సాటిలేని వ్రతాలు  ఆచరించే వారు , ఎవరి పాదాలను సేవించి తరిస్తున్నారో ఆ దేవ దేవుడే నాకు రక్ష యగు గాక .భగవంతునికి పుట్టుక , పాపము , ఆకారము , కర్మ ,పేరు ,  గుణములు ఉండవు.  అతడు ఈ లోకాలను సృష్టించి ,నశింపచేయడం కోసం తన మాయ తో ఇవన్నీధరిస్తాడు . ఆత్మకాంతి లో ప్రకాశించే వాడు. ఆత్మకు మూలమైన వాడు , ఊహలకూ , మాటలకూ అందని వాడు , పరిశుద్ధుడు , శాంతస్వరూపుడు, మోక్షాధిపతి , ఆనందానికి మూలభూతుడు, అయిన ఆ ఈశ్వరుని నేను ప్రార్ధిస్తున్నాను. భగవంతుడు ఒక్కడే . అతడు బహురూపుడు. కాని అన్నీ అతడే. అన్నింటిలోను అతడే కన్పిస్తాడు.  ఈ పద్యం లో ఏకేశ్వరోపాసన ప్రతిబింబిస్తోందని విజ్ఞులు భావిస్తున్నారు.

                  కలడందురు దీనులయెడఁ గలడందురు పరమయోగి గణముల పాలం
                  గల డందు రన్ని దిశలను , గలడు కలం డనెడు వాడు కలడో లేడో. (8 – 86 )

             దేవుడు ఉన్నాడంటారు. ఆర్తులను ఆదుకుంటాడంటారు.  ఉత్తములైన యోగుల చెంత ఉంటాడంటారు. అన్నిదిక్కులలోను ఉన్నాడు , ఉన్నాడు ,  అనే ఆ దేవుడు అసలు ఉన్నాడా ? లేడా ?అనే విచికిత్స కు వచ్చాడు గజేంద్రుడు .ఇది రెండో దశ. అంటే తన లోని అహం కారం పూర్తిగా తొలగలేదు. అందు మూలం గా పెల్లుబికిన అహం భావం లోని తురీయాంశమే  ఈ విచికిత్సకు  కారణం.భగవంతుడు ఉంటే ఎందుకు రాడు  ? అనేది విచికిత్స. అంటే పూర్తిగా భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించలేని మన స్థితి ఇక్కడ మనకు  కన్పిస్తుంది.  ‘ సంశయాత్మా వినశ్యతి అంటుంది భగవద్గీత. భక్తుని లో రావలసిన పరివర్తన ఇది కాదు. అన్యథా శరణం నాస్తి , త్వమేవ శరణం మమ అనే దశకు చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందన్న మాట. అందుకే  -

               కలుగడే నాపాలి  కలిమి సందేహింప  కలిమి లేములు లేక కలుగు వాడు ,
               నాకడ్డ పడరాడె  నలి నసాధువులచే బడిన సాధుల కడ్డపడెడు వాడు ,
                .....................................................................................
             లీలతో నా మొఱాలింప డే మొఱగుల మొఱలెరుంగుచుఁ దన్ను మొఱగువాడు ( 8 – 87 )

                       ఆ భగవంతుడు దీనజనుల మొఱలను  వింటూ తన్ను తానే మరచిపోయేవాడట. అందుకే ‘ ‘ ‘ ‘  వినడే , చూడడే , తలపడే వేగరాడే   అంటూ మొత్తుకున్నాడు గజేంద్రుడు.

              విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
              శాశ్వతు  నజు బ్రహ్మ ప్రభు ,నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్. ( 8- 88 )

                       ఈ విధం గా పరి పరి విధాల ప్రార్ధించిన గజేంద్రుడు తుదకు  మనస్సులో ఈశ్వర సన్నిధానాన్ని కల్పించుకున్న వాడై – ఇలా ప్రార్ధించాడు.

                   లావొక్కింతయు లేదు ; ధైర్యము విలోలం బయ్యె ; బ్రాణంబులున్
                   ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్చె; దనువున్ డస్సెన్ ; శ్రమం బయ్యెడిన్
                   నీవే తప్ప నిత: పరం బెరుగ; మన్నింపం దగున్ దీనునిన్
                   రావే యీశ్వర ! కావే వరద; సంరక్షింపు భద్రాత్మకా ! ( 8- 90 )

              ఈ పద్యం లో  కన్పించే లావు అన్న పదానికి శక్తి, బలము అనే అర్థాలు చెపుతాము. కాని ఇక్కడ  ‘లావు ఒక్కింత కూడ లేదు అనడం లో అంతరార్థం  ‘నాలోని అహం కొంచెం కూడ మిగలలేదు . అంతా నశించిపోయింది.   ఇక నీవే దిక్కు అని వేడుకోవడమే.  ఎప్పుడైతే అహంకారం  నశించిందో   శరణాగతత్వబుద్ధి సంప్రాప్తిస్తుంది. అందుకే నీవే తప్ప నిత: పరంబెరుగ ..రావే యీశ్వర  కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా ! అన్న ఆర్తి పతాకస్థాయిని చేరుకుంది. జీవుని వేదన  రోదన గా రూపు దాల్చింది.

            వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థుల కో
               యను దట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యెఁ గరుణావార్థీ ! (8 – 91 )

                         భగవత్తత్వం బోధ పడింది. ఓ దయా సముద్రుడా !   జీవుల పిలుపులు వింటావట. పోరాని చోట్లకైనా పోతావట. శరణు వేడిన వారు పిలిస్తే వెంటనే ఓ  అని పలుకుతావట.  సమస్తమూ తెలిసినవాడవట. కాని ఇప్పుడు ఇదంతా సందేహం గా ఉంది అంటాడు  గజేంద్రుడు. అవును. ఎంత చెప్పినా  తన వరకు వస్తే కాని అసలు వేదన తెలియదని కదా సామెత. అందుకే  అట ,అట అంటూనే సందేహమయ్యె అనేశాడు గజరాజు.ఇన్ని గాయాలకు చికిత్స చేశాను గాని నా గాయమంత నొప్పి ఎవరికీ లేదన్నాడట ఒక వైద్యుడు. అందుకే –

          ఓ కమలాప్త ! యో వరద ! యో ప్రతిపక్ష విపక్ష దూర ! కు
         య్యో! కవియోగివంద్య సుగుణోత్తమ ! యో శరణాగతామరా
         నోకహ ! యోమునీశ్వర మనోహర ! యో విమలప్రభావ ! రా
         వే ! కరుణింపవే !  తలపవే ! శరణార్థిని నన్ను  గావవే !  ( 8 – 92 )

                     భగవంతుడు కరుణావార్థి (కరుణా సముద్రుడు ) శరణాగతామరానోకహ ( శరణాగతుల పాలిట కల్పవృక్షం వంటివాడు ) .   అటువంటి భగవానుడు ఇంతగా వేడుతున్న భక్తుణ్ణి కాపాడకుండా ఉండగలడా. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఆ గజేంద్రుడు  ఆర్తరక్షకుడైన ఆ కమలామనోహరుని ఠావులు తప్పిన ప్రాణాలతో , అలసిన శరీరంతో   అర్థిస్తూ ఉండగానే ఆ మకరి   కరి   ప్రార్థనకు విఘాతం కలిగించాలన్నట్టుగా గజేంద్రుని తీవ్రంగా గాయపరచి , కోపం గా నీటిలోకి లాగింది.  అప్పుడు  గజరాజు చేసిన ఆర్తనాదమే కుయ్యో. అది రోదన తో చేసిన ఆక్రందన. ఆదుకునే వాడు వస్తాడనే విశ్వాసం తో ఆయన ఇంకా తొందరగా రావాలనే ఆశతో చేసిన ఆక్రందన అది. అందుకే పోరాని చోట్లకైనా పోతావట అంటూ దేవదేవుని సర్వవ్యాపకత్వాన్ని గుర్తుచేసుకొని ధైర్యం తెచ్చుకున్నాడు గజేంద్రుడు.

                          ఆ లక్ష్మీనాథుడు అరక్షిత రక్షకుడు. అంటే రక్షణ లేని వారిని రక్షించే ప్రభువు ఆయన. అటువంటి ఈశ్వరుడు వచ్చి తనను కాపాడతాడని భారం మొత్తం భగవంతుని పై వేసి ఆకాశం వైపు  నిక్కి నిక్కి  చూస్తూ  నిట్టూర్పులు విడుస్తూ,  ఆకాశానికి  చెవులప్పగించి చూస్తోందట ఆశగా గజేంద్రుడు. ఏశబ్దం విన్నా  తనను కాపాడ్డానికి భగవంతుడే వచ్చాడనుకునే స్థితికి వెళ్ళిపోయింది గజరాజు. ఇప్పుడు గజేంద్రుడు భక్తియుతుడు. అందుకే భగవంతుడు దిగి వస్తున్నాడు.

                               బ్రహ్మాది దేవతలందరూ గజేంద్రుని ఆక్రందనలు విని కూడ వారికి విశ్వవ్యాపకత్వం లేకపోవడం మూలంగా గజరాజు కు సాయపడలేక చేతలుడిగి ఉండిపోయారట. విశ్వమయుడు , విభుడు , విజయశీలి అయిన  శ్రీమహావిష్ణువు గజేంద్రుని కాపాడటానికి నిశ్చయించుకొని దిగి వస్తున్నాడు.

                  అల వైకుంఠ  పురంబు లో నగరి లో నా మూల సౌధంబు దా
                 పల మందార వనాంతరామృత సర ప్రాతేందు కాంతోప లో
                 త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
                 హ్వల నాగేంద్రమ పాహి పాహి యన కుయ్యాలించి సంరంభియై ( 8 -95 )

                        ఈ పద్యం రాని తెలుగు వాడు ఆనాడు ఉండేవాడు కాదంటే అతిశయోక్తిలేదు. అంత అందమైన , అతిశయమైన పద్యం ఇది. అతిశయమని ఎందుకన్నానంటే భక్తుని కుయ్యాలించి  ఆదుకోవడానికి బయలుదేరాడు లక్ష్మీపతి. ఎక్కడనుండి. వైకుంఠంనుండి. వైకుంఠం ఎక్కడుంది. అక్కడెక్కడో ఉంది.  అనిచెపుతారు. అందుకే అక్కడెక్కడో ఉన్న వైకుంఠాన్ని మన మనోనేత్రం  ముందుకు తీసుకురావడానికి మహాకవి చేసిన ప్రయత్నం  పద్యం లోని మొదటి రెండు అక్షరాల్లో   గొప్ప గా కుదురుకుంది అల అని.  ‘ అల అంటే ఎక్కడో ............. . అంటే అన్ని ఊర్థ్వలోకాలకు ఆ పైన  అల ... అక్కడెక్కడో అల్లంత దూరం లో  జీవుని మాటకు ,చూపు కు , కేక కు, చివరకు ఆక్రందనకు , ఆర్తనాదానికి కూడ  అందనంత  దూరం లో ఉన్నది ఆ  వైకుంఠం. ఆ వైకుంఠ పురం  లో శ్రీ లక్ష్మీనారాయణుల అంతపురం. ఆ అంతపురం లో  ఆ .....    మూల సౌధానికి సమీపం లో  కల్పవృక్షవనం. ఆ వనం లో ఒక అమృతసరస్సు. దాని చెంత చంద్రకాంత శిలానిర్మితమైన  ఒక అందమైన తిన్నె . దానిపై కలువపూల పానుపు. ఆ పాన్పు మీద శ్రీమన్నారాయణుడు  కలుముల జవరాలు , తన ఇల్లాలు , అయిన శ్రీ లక్ష్మీదేవి తో వినోదిస్తున్నాడు . అంతదూరం లో ఉన్నవైకుంఠం లో  ,  ఇల్లాలి తో వినోదం లో ఉండగా ఆ సమయం లో ఆ ఇందిరారమణునకు  గజేంద్రుని ఆర్తనాదం విన్పించింది. కారణం ఆయన ఆపన్నప్రసన్నుడు. అనాథ జన రక్షకుడు. భక్తపాలన కళా సంరంభకుడు కదా.   కో అని పిలిస్తేఅని పలికే దైవం కదా ఆ ఆది నారాయణుడు. . అందుకే  వెంటనే బయలుదేరాడు.  ఈ విశేష మంతా అల అనే పదం ద్వారా దర్శింపచేశాడు భక్తకవి పోతన.

                    ఈ పద్యం లోని అమృతసరస్సు వలన ఈ పద్యానికే అమృతత్వం ప్రాప్తించింది.  పోతన భాగవత రచనా  సమయం లో  ఈ పద్యాన్ని  శ్రీ మహావిష్ణువే  స్వయం గా వచ్చి పూర్తిచేసి వెళ్లాడని తెలుగునాట కథలు గా చెప్పుకుంటున్నారంటే ఈ పద్యం లోని మాధుర్యం  తెలుగు వారి గుండెలను ఎంతగా  పులకింపచేసిందో మనం  ఊహించవచ్చు. ఈ సందర్భం లో  భక్తకవి పోతన ను గూర్చి తెలుగునాట  వాడుక లో ఉన్న కొన్ని కథలను  ఇదే బ్లాగు లో   పలికెడిది భాగవతమట.... అనే వ్యాసం లో చెప్పుకున్నాము. వీలైతే చూడవచ్చు.

                             భక్తజనరక్షణార్థం భగవంతుడు ఎంత  వేగిర పడతాడో  మనకు ఈ ఘట్టం నిరూపిస్తుంది. భక్తపరాధీనుడైన భగవానుని లీలలు కొల్లలు గా మన సాహిత్యం లో మనకు కన్పిస్తాయి. కుంటెన పంప పోయితివో అంటూ  కాళహస్తీశ్వరుని  భక్తపరాధీనతను నిలదీసిన మహాకవి ధూర్జటి ని తెలుగు వారు మర్చిపోలేరు కదా.

                సిరికిం చెప్పడు శంఖ చక్రయుగముం జేదోయి సంధింపఁ డే
                పరివారంబు ను జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
                తర ధమ్మిల్లముఁ జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
                పరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై ( 8 -96 )

              గజరాజు  ప్రాణాలను కాపాడాలనే ఆతృతలో ఉన్న  శ్రీమహావిష్ణువు  ఇల్లాలైన లక్ష్మీదేవికి కూడ చెప్పకుండా బయలుదేరాడు.శంఖ చక్రాది ఆయుధాలను తీసుకోలేదు. సేవకాజనాన్ని ఎవరినీ పులవకుండా , గరుత్మంతుని  ప్రయాణానికి సిద్ధం చేయమని  ఆజ్ఞాపించకుండా, చెవుల క్రింది వరకు జారిపోయిన సిగముడి ని కూడ సవరించుకోకుండానే బయలుదేరాడు అనాథ జన రక్షకుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇవన్నీ మరచిపోయినా ఫర్వాలేదు. ప్రణయ కోపం తో  అలిగి వెళ్లిపోతున్న శ్రీ రమారమణి పైటచెంగును పట్టుకున్న వాడై, తొందరలో ఆ లక్ష్మీదేవి  పైటను  కూడ వదిలి పెట్టకుండా  అలాగే ఆతృత గా భక్తజన పాలన కళా సంరంభుడై బయలుదేరాడట  నారాయణుడు. కాదు లక్ష్మీనారాయణుడై బయలుదేరాడు సమస్త జంతు హృదయారవింద సదన సంస్థితుడైన   ఆ వైకుంఠనాథుడు.

             తన వెంటన్ సిరి , లచ్చివెంట నవరోధవ్రాతమున్ , దాని వె
             న్కను బక్షీంద్రుడు , వాని పొంతను  ధను: కౌమోదకీ శంఖ చ
             క్ర నికాయంబును , నారదుండు , ధ్వజనీకాంతుండు రా వచ్చి రొ
             య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్ . (8 -98 )        

                ఆకాశమార్గం లో శ్రీమహా విష్ణువు , ఆయన  చేతి లో పైటచెంగు ఉండిపోవడం తో ఆయనతో సమానం గా నడవలేక నడుస్తూ శ్రీ మహాలక్ష్మి , అయ్యవారు , అమ్మవారు  ఎక్కడికో వెళుతున్నారని వారిని అనుసరించిన అంత పుర కాంతలు , వారి వెనుక గరుత్మంతుడు , అతని సరసనే ధనుస్సు ,విల్లు ,శంఖ చక్రాదులు ,వాని వెంట నారదుడు , ఆ తరువాత సర్వసైన్యాధిపతి విష్వక్సేనుడు ఇలా ఒకరి వెంట ఒకరు రాచ నగరు నుండి బయటకు రాగానే చూసిన  ఆ వైకుంఠపుర వాసులు  ఏదో జరిగిపోతోందని ఒక్కరొక్కరుగా బయలుదేరి చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ శ్రీమహావిష్ణువు వెంట రాసాగారట.

                                     శ్రీ మహావిష్ణువు తో సమానం గా నడవలేక, పైట చెంగు ఆయన చేతిలో ఉండటం తో ఆగలేక  తడబడుతూ నడుస్తోంది శ్రీ మహాలక్ష్మీ.

     అడిగెద నని కడువడిఁ జను , నడిగినఁ దను మగుడ నుడువఁ డని నడ యుడుగున్
     వెడవెడ చిడిచిడి ముడి తడబడ , నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ .(8 -103 )

                       ప్రభువు ఎక్కడికి వెడుతున్నారో చెప్పడంలేదు.  ఎవరైన అనాథ స్త్రీల జనాలాపాలు విన్నాడా ? అమరావతి పై రాక్షసులు ఏమైనా దాడి చేశారా ? వంటి సందేహాలతో   మనోనాథుడైన శ్రీ మహావిష్ణువు  ను ఎక్కడికి ఎందుకు  వెళుతున్నారో ?  అడుగుదామని  గబగబ రెండడుగు లు ముందుకు వేసేదట శ్రీ మహాలక్ష్మి. అడిగితే ఆ తొందరలో సమాధానం చెప్పడేమో నని  సంశయించి ఆ ప్రయత్నాన్ని మానుకునేది.  అడుగులు వేస్తూ, ఆగిపోతూ తడబడుతూ నడుస్తున్న తన ఇల్లాలిని కూడ పట్టించుకోకుండా, నమస్కారాలను సమర్పిస్తూ సేవించుకుంటున్న గగనచరులైన దేవతల మ్రొక్కులను కూడ మన్నించక ,  మనోవేగం తో  కరి మకరులు పోరాడుతున్న సరోవర సమీపానికి చేరుకున్న శ్రీమహావిష్ణువు ఆ మొసలిని చంపడానికి తన చక్రాన్ని ప్రయోగించాడు.

               కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగాఁ బంపె స
               త్వరితా కంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
               పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండభాండచ్ఛటాం
              తరనిర్వక్రముఁ బాలితాఖిల సుధాంధశ్చక్రమున్ జక్రమున్ .  (8 -109 ) 

                   భూమండలాన్ని కంపింపచేసే వేగం తో  ,సమస్తలోకాలను కాంతిమయం చేస్తూ, ఆ చక్రం మొసలి శిరస్సును ఖండించింది. గజేంద్రుడు సంసార బంధాలనుండి విడివడిన విరక్తుని వలే , చీకటిని వదిలిన చంద్రుని లాగ మొసలి పట్టు విడిపించుకొని, ఉత్సాహం గా కాళ్లు విదిలించి , భగవంతుని దయవలన బ్రతికి తన ఆడ ఏనుగులను చేరుకున్నాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. భగవంతుని నమ్మిన భక్తుడు  ఆదుకోబడి, చేదుకోబడ్డాడు.

                            ఇంతకీ   అసలు ఈ  కరి మకరులు ఎవరు అనేది ప్రశ్న. హూహూ అనే గంధర్వుడు దేవలముని శాపం వలన మొసలి రూపాన్నిపొందాడు. స్వామి అనుగ్రహం తో  శాప విముక్తుడై, తిరిగి గంధర్వలోకాన్ని చేరుకున్నాడు.    

             మొసలి తో పోరాడిన గజరాజు పూర్వజన్మ లో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు. విష్ణుభక్తులలో శ్రేష్ఠుడైన ఈ మహారాజు ద్రవిడదేశాన్ని పాలించేవాడు.ఈ విష్ణుభక్తుడు ఒక పర్వతం మీద మౌనవ్రతం లో ఉంటూ విశేషపూజలతో భగవంతుని సేవించేవాడు. ఒకరోజున  ఇంద్రద్యుమ్నుడు  ఏకాగ్రచిత్తం తో విష్ణువును ధ్యానిస్తూ ఉండగా , ఆ ప్రాంతానికి అగస్త్యుడు రావడం తటస్థించింది. తనను చూసి కూడ , పల్కరించకుండా , కనీసం  కూర్చున్న చోటు నుండి లేవకుండా  ఉన్న ఇంద్రద్యుమ్నుని చూసి  ఆగ్రహించాడు అగస్త్యుడు. అజ్ఞానం తో కూడిన ఏనుగు గా పుట్టమని ఇంద్రద్యుమ్నుని  శపించాడు. అతడే  ఈ గజేంద్రుడు. అతని సేవకులందరు  అతని అనుచరులు గా , అనుయాయులు గా   జన్మించారు.  ఇంద్రద్యుమ్నుడు ఏనుగు గా పుట్టినప్పటికీ  విష్ణుభక్తి వలన  మాత్రమే మోక్షాన్ని పొందాడు. ప్రబలమైన విష్ణుభక్తి ఎన్నిజన్మలకైన  చెడదు అన్నది  విష్ణుభక్తుల విశ్వాసము.
     
          ఓం నమో భగవతే వాసుదేవాయ     ఓం నమో నారాయణాయ



*************************************************************************