Sunday, 11 November 2012

రామాయణము- రమణీయకథనాలు-13 శూర్పణఖ గంధర్వ స్త్రీ యా ?


                            శూర్పణఖ  గంధర్వ స్త్రీ యా  ?
                           

         





                      శ్రీమద్రామాయణ మహాకావ్యంలో  ప్రధాన శక్తులుగా   నిలిచి   శ్రీ రామచంద్రుని కీర్తి ప్రతిష్ఠ లు  ఇనుమడించే రీతిలో రామావతార ప్రయోజనాన్ని సాధింపజేయ నిర్మించిన   పాత్రలు మూడు. వానిలో ప్రధానపాత్ర కైకేయి కాగా, ఆవిడకు ప్రేరణ కల్గించిన మంథర ద్వితీయ.

                    మంథర ప్రేరణ కారణం గానే కైకేయి రామ పట్టాభిషేకాన్ని విఘ్నమొనర్చి,  శ్రీ రాముని అరణ్య వాసానికి ప్రయాణింపజేసి తన వంతు కర్తవ్యాన్ని పూర్తి చేసుకొంది. మూడో పాత్ర శూర్పణఖ.

                             పంచవటి లో పర్ణశాల లో తాపసవృత్తి  ని  స్వీకరించి  ఋషులతో  కలసి    వేద పురాణ శాస్త్ర సంబంధ సందేశ, సందేహ వివరణ సమాధానాల తో సత్కాలక్షేపం చేస్తూ  అనుజుడైన లక్ష్మణునితో కలసి  సంవత్సరాలను నడిపిస్తున్న శ్రీ రాముని కవ్వించి, రాక్షసవథకు ప్రేరేపించిన పాత్ర శూర్పణఖ.   దండ కారణ్య స్ధిత సమస్త రాక్షస సమూహాల చావుకు  , ఖరదూషణుల  మరణానికి కూడ కారణభూత ఈమె.  అనంతరం లంకకు  చేరి ఈ నిప్పును అక్కడ కూడ అంటించి, రావణుని లో సీతా వ్యామోహాన్ని రగిలింపజేసి, రావణుని   పంచవటికి రావింపజేసి,  సీతాపహరణాన్ని చేయించి, తుదకు పౌలస్త్యవథ కు  కూడ ఈమే కారణమైంది.
                
                   శూర్పణఖ అసలు పేరు మీనాక్షి.  ఈమె కైకసి విశ్రవసుల కుమార్తె.  ఈమెకు రావణ, కుంభకర్ణ, విభీషణులు, ఖర దూషణులు  సోదరు లౌతారు. మారీచ సుబాహులు ఈమెకు మామయ్యలు.అంటే తాటకి ఈమెకు అమ్మమ్మ. విద్యుజ్జిహ్వుడు అనే రాక్షసుణ్ణి   ఈమె వివాహం చేసుకుంది.  కొన్ని కారణాల వల్ల  తప్పని సరి  పరిస్థితుల్లో రావణాసురుడు  ఆ విద్యుజ్జిహ్వుని సంహరించవలసి వచ్చింది . అప్పటి నుండి ఒంటరియైన శూర్పణఖ  లంకానగరానికి, దండకారణ్యానికి మధ్య యధేచ్చగా తిరుగుతూ కాలం గడుపుతోంది.  ఇదంతా ఎందుకు చెప్పవలసివచ్చిందంటే – కొద్దిగా ఆలోచిస్తే -- రాముని గమనం - అంటే - రామ అయనం అంతా శూర్పణఖ   చుట్టూనే అల్లు కున్నట్టుగా మనకు కన్పిస్తుంది.

               రావణ సంహారమే రామాయణ మైతే,శ్రీ రాముడు రఘువీరుడైంది రాక్షససంహారం మూలంగానే అనుకుంటే ఆ రాక్షసులందరు శూర్పణఖ వంగడము లోనివారే అవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాటక , సుబాహు లు తప్పితే మిగిలిన అందరి మరణానికి ఈమే కారణంమైంది. అభివృద్దికి కూడ ఈమే కారణం. ఎందుకంటే  విభీషణస్తు ధర్మాత్మా అని మొట్టమొదటి సారి విభీషణుని పేరుని  రాముని వద్ద ప్రస్తావించి, విభీషణుని మీద రామచంద్రునికి సదభిప్రాయం  కల్గించింది కూడ శూర్పణఖే.

                దండకారణ్యం లో నరవాసన  తగిలి పరుగెత్తుకొచ్చిన ఈమె రామచంద్రుని దర్శనం తో  ఆకలిని మర్చిపోయి,కామవికార యై ఆ పుంసాం మోహనరూపుడైన  పురుషోత్తముని పరిణయాన్ని ఆశిస్తుంది.  అందుకోసం రాముని ఇల్లాలిని ఛంపడానికి కూడ సిద్ధపడుతుంది.
              

          







             శూర్పణఖ ను కామమోహిత ను చేసిన ఆ  సుందర రాముని                          సు మనోహర  రూపాన్ని వాల్మీకి వర్ణించిన  విధానం చూస్తే శూర్పణఖే కాదు. సమస్త లోకము మోహపాశబద్ధమై జగమంతా రామమయం గా మారిపోతుందనడం లో  అతిశయోక్తిలేదు . వాల్మీకి వర్ణనలోను  స్వభావోక్తే గాని అతిశయోక్తి కన్పించదు .

               దీప్తాస్యం చ మహాబాహుం పద్మపత్రాయతేక్షణమ్
                 గజవిక్రాన్త గమనం జటా మండలధారిణం
                 సుకుమారం మహాసత్త్వం పార్ధివ వ్యంజనాన్వితమ్
                 రామం ఇందీవరశ్యామం  కందర్ప సదృశప్రభమ్
                 బభూవ ఇంద్రోపమం దృష్ట్వా  రాక్షసీ కామమోహితా   3-17.7,8
        
                పరిపూర్ణ పురుషుని రూపం ఎలా ఉండాలో  మహర్షి వాల్మీకి  రామఛంద్రుని ధర్శించి మన కళ్ళముందు రూపు కట్టించాడు.  అవివాహిత లైన   ఆడపిల్లలు కలలుగనే   ఆత్మీయ పురుషుని అందమైన రూపమది. అందుకే  రామచంద్రుడు పుంసాం మోహనరూపు డయ్యాడు. రామాయణం మహాకావ్యమైంది.

         ప్రకాశవంతమైన మోము కలవాడు, ఆజానుబాహుడు,  పద్మపత్రవిశాలాక్షుడు, గజ గమనుడు, జటామండలశోభితుడు, సుకుమారుడు ,మహాబలుడు,రాజ లక్షణ లక్షితుడు, ఇందీవరశ్యాముడు, మన్మథ సదృశుడు, ఇంద్రుని తో సమానమైన వాడు నైన శ్రీ రామచంద్రుని చూచి ఆ రాక్షసి కామమోహితయైంది. ఇది పై శ్లోకానికి భావం. 

                      ఈసందర్భంలో  వాల్మీకి  రామ శూర్పణఖ లను  ఒకేశ్లోకంలో దర్శింప జేసిన తీరు కూడ కడు రమణీయంగా ఉంటుంది.

                  సుముఖం దుర్ముఖీ రామం వృత్తమథ్యం మహోదరి
                      విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజా
                        ప్రీతిరూపం విరూపా సా సుస్వరం భైరవస్వనా
                         తరుణం దారుణా వృద్దా దక్షిణం వామభాషిణీ         3-17.9,10
                        
                 పై శ్లోకంలో ఆకుపచ్చవర్ణం శ్రీ రాముని  కి, అరుణ వర్ణం రాక్షసి కి విశేషణాలు గా   మనం గమనించవచ్చు.

            అందమైన ముఖము, సన్నని నడుము విశాలమైన నేత్రాలు, సుందరమైన కేశపాశము, ముచ్చటైన రూపము మృదువైన కంఠస్వరము,  సరళసంభాషణాచతురుడు తరుణవయస్కుడు అయిన వాడు రామఛంద్రుడు.     .                
                          కాగా – దుర్ముఖి, మహోదరి విరూపాక్షి,  ఎఱ్ఱని వెంట్రుకలు , భయంకర మైన రూపము, కఠినమైన కంఠస్వరము, వృద్దురాలై ,వక్ర సంభాషణ కలిగినది శూర్పణఖ.
             
            వాల్మీకి మహర్షి శూర్పణఖ ను అంద వికారిగాను రాక్షసరూపిణి గానే వర్ణించాడు. కాని కంబ రామాయణం లో శూర్పణఖ చాలా అందగత్తె గా కన్పిస్తుంది.
              
           ఈ ఘట్టం లో శూర్పణఖ తో రామలక్ష్మణుల  యొక్క సంభాషణావైఖరి, ఇరువురి మధ్యలో ఆమె ను అటు ఇటు పంపిస్తూ ఆటపట్టించి   అవమానించిన తీరు బాగుండలేదన్న విమర్శ ప్రాచ్య, పాశ్చాత్య విమర్శకులలో తరచు కన్పిస్తోంది.  కాని విషయవాంఛతో నున్న పశువు ను రెచ్చగొడితే ప్రాణం తీయడానికికూడ సిద్ధమౌతుంది.  అలాగే విషయస్పృహ తో నున్న ఒక ఆడదాని ని   కవ్వించి , అవమానించి పంపిస్తే , దండకారణ్యమే కదిలి వస్తుంది. ఆ తరువాత లంకలో పునాదులు కదులుతాయి. కథాగమనవేగాన్ని పెంచి , త్వరగా రామకార్యం పూర్తి కావాలంటే అంత మాత్రం అవసరమనుకున్నాడు ఆదికవి. అదే జరిగింది.
                   
               సీతను చంపఢానికి ఉద్యుక్తురాలౌతున్న శూర్పణఖను రామాజ్ఞ తో లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి వదిలేశాడు. ఉద్ఖాత్య ఖడ్గం చిచ్ఛేద్య కర్ణనాసం మహాబల: 3-18.21    వాల్మీకిరామాయణంలో లక్ష్మణుడు శూర్పణఖ కు ముక్కు చెవులు  కోసినట్లు చెపితే అనంతర కాలికులు కొంతమంది స్తనాలు కూడ కోయించారు.  ఏమైతేనేం.?" చుప్పనాతి శూర్పణఖ" కు  శృంగభంగమైంది. కథ లంకకు చేర, చివరకు సుఖాంతమైంది.

              అయితే ఈశూర్పణఖ  వృత్తాంతానికి ఫూర్వ కర్మ వాసన ఏమైనా ఉందా అని యోచిస్తే ఆశ్చర్య రామాయణంలో కన్పించింది. తన పైకి దూసుకొస్తున్న  శూర్పణఖ ను  చూచి భయపడుతున్న సీతను సముదాయిస్తూ రాముడు ఆశ్చర్య రామాయణం లో పూర్వ కర్మానురూపం తు తస్మాదేవం ఫలం గతా అంటాడు. ఆ సందర్భంగా వ్యాఖ్యాతలు  శూర్పణఖ పూర్వజన్మ వృత్తాంతాన్ని ప్రస్తావించారు.

              ఈ శూర్పణఖ పూర్వమొక  గంధర్వాంగన. స్వర్గలోకంలో ఒకనాడు  శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో  శేష పాన్పు పై శయనించి యుండగా, ఈ గంధర్వాంగన  మహావిష్ణువు పైనున్న మక్కువతో ఆయనను చూడడానికి యత్నించింది.ఆది శేషుడు తన పడగలతో మహావిష్ణువు కన్పించకుండా మూసివేశాడు. కోపించిన గంధర్వకాంత శేషుని చెవులమీద, ముక్కుమీద పిడికళ్ళ తో పొడిచింది. అప్పుడు మహాలక్ష్మి శేషుని  సమర్ధిస్తూ మాట్లాడుచుండగా, ఇంతలో గంధర్వాంగన యొక్క భర్త వచ్చి లక్ష్మిదేవి తో వివాదించుచున్న తన భార్యను కోపించి భూమి యందు రాక్షసిగా జన్మింప శపించాడు. అప్పుడు క్రోధించిన గంధర్వాగన కాలాంతరమున నావలన నీభర్తతో నీకు వియోగము సంభవించగలదని శ్రీమహాలక్ష్మిని శపించెను. ఆ గంధర్వాంగనే ఈ శూర్పణఖ. ఆ శేషుడే ఈ లక్ష్మణుడు.”              { ఆశ్చర్య.రా.3-227.}
                
                 కొంతమందైతే  రావణుడు తన భర్తను చంపాడనే కోపాన్ని మనసులో పెట్టుకొని శూర్పణఖ కావాలనే  రాక్షసనాశనం చేయించిందని వ్రాశారు. అంటే భారతం లో శకుని కోపం  వంటిది ఈ శూర్పణఖ కోపమని వీరి ఉద్దేశ్యం.

                          ఈ విధంగా రామాయణంలో చిన్న పాత్ర గా కన్పించినా ప్రధానపాత్ర యై నిలిచింది శూర్పణఖ.






*******************************************************************

1 comment:

శ్యామలీయం said...

శూర్పనఖ యొక్క భ్రర్త విద్యుజ్జిహ్వుడు అనే‌ గంధర్వుడు అని యెక్కడో చదివినట్లు గుర్తు.