జటాయు వు
శ్రీ మద్రామాయణం లో జటాయువు ఒక పక్షి మాత్రమే కాదు. ఒక ప్రథాన పాత్ర. సీతాపహరణం జరిగాక బాధా క్రోధ అవమానాలతో నలిగిపోతూ , ఏమైందో ,ఏమిజరిగిందో అర్ధంకాని అయోమయావస్థలో నున్న రామునకు సీతాపహరణాన్ని గురించి, రావణుని గూర్చి ముందుగా చెప్పి రామబాణానికి లక్ష్యాన్ని నిర్థేశించిన కీర్తి జటాయువు కే దక్కుతుంది.
జటాయువు దశరథునికి మిత్రుడు.అంతకు మించి
రామభక్తుడు. ఒక పర్యాయం ఇంద్ర సభ నుండి తిరిగి వస్తూ శని ప్రబావానికి లోనై రథమునుండి
జారిపోబోతున్న దశరథుణ్ణి రక్షించి అతనికి స్నేహితుడయ్యాడు. అదిఎప్పటిమాటో. కాని
ఇప్పడు వయసుమీద కొచ్చి కూర్చొంది. వయసులో చేసిన సాహసాలు గుర్తుచేసుకొనే
వయసుకొచ్చేశాడు.
అగస్త్య మహర్షి అనుజ్ఞ
తీసుకొని చిత్రకూటానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులకు మార్గమథ్యంలో తారసపడతాడు
జటాయువు. తనను తాను పరిచయం చేసుకోవడమే గాక దశరథుని తో ఉన్న స్నేహాన్ని గుర్తు
చేసుకొని రామచంద్రుడు తీసుకున్న నిర్ణయాన్ని హర్షించడమే కాకుండా ,రామలక్ష్మణులు
ఏదైనా పనిమీద బయటకువెళ్లినప్పుడు తాను సీతమ్మ కాచు కుంటానని గూడ కాపలాతనాన్ని మీద వేసుకుంటాడు జటాయువు.
ఎందుకంటే ఆ సేవాగుణం వారి వంశం లోనే అనూచానంగా వస్తున్న ధర్మం.
జటాయువు తండ్రి అరుణుడు . ఇతనినే
అనూరుడు అని కూడా అంటారు. వినత కశ్యపుల
కుమారుడు. తల్లి తొందర పాటుతో గర్బవిచ్ఛిత్తి చేసుకోవడం వలన అ -నూరుడు గా{ అనగా ఊరువులు
లేని వాడుగా] జన్మించి, సూర్యభగవానునికి సారథి గా
వెళ్లిపోయాడు. ఆది దేవుడైన ఆదిత్యునితో పాటు
అరుణు డై ప్రాత: కాలపు తొలి పూజలందుకుంటున్నాడు.
ఇతని బాబాయి గరుడుడు. ఈయనే సౌపర్ణుడు.
తల్లి దాసీత్వాన్ని పోగొట్టడానికి
స్వర్లోకం నుండి అమృతాన్ని తెచ్చినవాడు. ఆ సమయంలో ఇంద్రుడు కోపించి వజ్రాయుధాన్ని
ప్రయోగిస్తే దాని దెబ్బకు ఒక ఈక మాత్రమే ఊడి,
సుపర్ణుడని కొనియాడ బడిన వాడు గరుడుడు. ఇతనే గరుత్మంతుడై విష్ణుమూర్తి కి వాహనంగా ఉంటున్నాడు. పక్షిరాజు గా సేవలందుకుంటున్నవాడు.
ఇతని సోదరుడు సంపాతి. దక్షిణ సముద్రతీరం చేరిన వానరసైన్యము సీతాదేవి
జాడ తెలుసుకోలేక హతాశులై అవమానభారంతో తిరిగి వెళ్లలేక, వెళ్లినా అక్కడ జరిగే అనర్థాలను, హఠాన్మరణాలను తలచుకొని, చివరకు ప్రాయోపవేశమే శరణ్యమని చివరిసారిగా
రామకథను చెప్పుకుంటూ జటాయువు వృత్తాంతాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో గుహలోనుండి
బయటకువచ్చి తనసోదరుని మరణానికి దుఖించడమే కాకుండా, సీతమ్మజాడ తెలియక మరణించడానికి కూడ సిద్దమైన రామదండుకు మార్గనిర్ధేశం చేసి రావణుని
లంకలో, అశోకవనంలో ఉన్న సీతమ్మ విషయాన్ని చెప్పి, కింకర్తవ్యతా విమూఢులైన వానరసైన్యానికి నూతన
జవసత్వాలు నింపి కర్తవ్యోన్ముఖులను చేసిన పాత్ర సంపాతి.
రామదర్శనం కాకపోయినా పరోక్షంగా రామసేవలో తరించిన
పాత్రలలో సంపాతి రెండవవాడు . పరోక్షంగా రామసేవలో తరించిన మొదటి పాత్ర స్వయంప్రభ
అని ఇంతకు ముందే చెప్పుకున్నాం.{ రా.ర.క—2. } అంగద జాంబవంత
హనుమదాదులవంటి రామభక్తులచేత చితిని పేర్పించుకున్న అదృష్టశాలి సంపాతి. ఇది వీరి
వంశ సేవా చరిత్ర. శ్రీమహావిష్ణువుకు
పానుపైన ఆది శేషువు కూడ వీరి వంశంలోని వాడే. అది వేరే సంగతి.
జటాయువు దశరథునికి
మిత్రునిగా కన్పించినా , రామునిపై భక్తి భావమే ప్రబలంగా ఉంది. సీతను అపహరించి, తన రధంపై
ఆకాశమార్గం పట్టాడు రావణుడు. సహాయంకోసం ఆక్రందిస్తోంది అసహాయశూరుడైన
రామచంద్రుని ఇల్లాలు . కునుకులో ఉన్న
జటాయువు ఆ కేక కు ఉలిక్కిపడి లేచాడు.
ప్రమాదాన్ని గుర్తించాడు. రావణుని రధానికి అడ్డంగా వచ్చేశాడు.
అది దాస ధర్మంలో ప్రథమ
లక్షణం. ఈపని తనవల్ల అవుతుందా లేదా అని అతను ఆలోచించడు.ఈ పని తన ప్రభువు కోసం తాను
చేయాలన్నదే అతని ధ్యేయం . విజయం సాధిస్తే
ప్రభువు చేసే ప్రశంస చాలు. మరణిస్తే అంతక మించిన ఆత్మతృప్తే లేదు. ఇదే
దాసగుణం ఆంజనేయుణ్ణి సముద్రం దాటించింది. సీతమ్మను చూపించింది. లంకను
కాల్పించింది.శ్రీ రామచంద్రుని కి చూడామణి ని అందించి రఘురాముని బిగి కౌగిలిని కానుకగా పొందింది ఇదే
దాసగుణం. లక్ష్మణుని చేత” పరవానస్మి “అని పించినా,
భరతుని చేత “రాజ్యం చాహంచ రామస్య” అని పించినా
అది దాసభక్తే. స్వామి కార్యాన్ని ప్రతిఫలాపేక్షలేకుండా చేయడమే దాసునకు
ఆనందం. అందుకే ------- { “నా ప్రభువుకు ప్రియము చేకూర్చడానికి ఈపని
నేను చేసితీరాలి ” అను కుంటాడు
దాసుడు}.
“ అవశ్యం తు
మయా కార్యం ప్రియంతస్య మహాత్మనం
“
అంటాడు జటాయువు.
ముసలి పక్షిని చూసి హేళనగా బాణాలను గుప్పించాడు రావణుడు. చంచువులతో
పొడుస్తూ, నఖాలతో గ్రుచ్చుతూ రావణుణ్ణి గాయపరిచాడు జటాయువు. సారథిని చంపి
విల్లువిరిచి రథాన్ని తునాతునకలు చేశాడు.రథం నాశనం కాగా సారథి గుఱ్ఱాలు
మరణించగా భూమిమీద పడ్డాడు రావణుడు.
“ తస్య తీక్ష్ణనఖాభ్యాంతు
చరణాభ్యాం మహాబల:
చకార బహుధా గాత్రే వ్రతా
న్పతగ సత్తమ: “ {
వా.3-71-5}
కొద్ది సేపు పోరాటం తర్వాత వృద్దుడైన జటాయువు అలసిపోయాడు.అవకాశం
తీసుకొని చంద్రహాసం ఝళిపించాడు రావణుడు.రెక్కలు తెగిన జటాయువు రక్తసిక్త గాత్రంతో నేల
కూలాడు. ఇదే అదను గా భావించి వేగంగా
పారిపోయి సీతను అశోకవనంలో నిలిపాడు
రావణుడు.
జటాయువు రావణునితో యుద్ధం చేసినంత సేపు అతనిని చంపుతానని అనలేదు. అనడు.ఎందుకంటే అతడు రావణుణ్ణి సంహరించలేడు. ఆ విషయం అతనికే తెలుసు. రామలక్ష్మణులు వచ్చేవరకు రావణుని గమనాన్ని ఆలస్యం చేద్దామనే ప్రయత్నమే జటాయువుది. అందుకే—“ముహూర్తం తిష్ట రావణ” “నహిమే జీవమానస్య నయిష్యసి శుభామిమామ్” {నేను బతికి ఉండగా ఈమెను నీవు తీసుకొనివెళ్లలేవు} “జీవితేనా2పి రామస్య,” “కిన్నుశక్యం మయాకర్తుం గతౌదూరం నృపాత్మజా” , “ముహూర్తం పశ్య” “ యుద్ధాతిథ్యం ప్రదాస్యామి” {వా.3-50-224-264 వరకు} ఇత్యాది పలుకులతో రెచ్చగొడుతూ ముక్కుతో పొడుస్తూ గోళ్ళతో రక్కుతూ రావణుణ్ణి పీడిస్తాడు .ఇందుకు ప్రథానకారణం రావణుని ప్రయాణాన్ని వీలైనంత సేపు అడ్డుకొని ఆలస్యం చేయడమే.
ఈ పని తాను చేయగలనా? లేదా? అనే సందేహం దాసునకు కలుగదు. స్వామి కార్యాన్ని
చేయడమే దాసునికి ఆనందం.అందుకే ముసలివాడు, నిరాయుధుడు, అసహాయుడు నైన జటాయువు
తన ప్రాణాల నర్పించి స్వామి సేవలో తరించాడు.
జటాయువు పడిన ప్రదేశము,జటాయుమంగలం,కొల్లంజిల్లా,కేరళ.
రావణునిచే కొనిపోబడుతున్న సీతాదేవి సైతం చెట్టుపై నిద్రిస్తున్న జటాయువును చూచి తనను రక్షించమని ప్రార్థించలేదు . నిరాయుథుడు వృద్ధుడునైన జటాయువు ఆయుధదారి యైన రావణుని ఎదిరిస్తే మరణిస్తాడు. తన పరిస్థితిని రామలక్ష్మణులకు చెప్పడానికి సాక్షి కూడ మిగలడనే భయం సీతకుంది. అందువల్లనే
“ నైషవారయితుం శక్య స్తవ క్రూరో నిశాచర
సత్వవాన్ జితకాశీచ సాయుధశ్చైవ దుర్మతి “{ వా-3-49-40}
ఆయుధధారి యైన వీనిని నీవు
ఎదుర్కొనలేవు. రామలక్ష్మణులతో నావిషయం వివరంగా చెప్పవలసిందనే ప్రార్ధించింది. కానీ ,-- జటాయువు దాసుడు.ప్రాణభయంతో పారిపోవడం దాసలక్షణమే కాదు.
“ దశగ్రీవ స్థితో
ధర్మే పురాణే సత్యసంశ్రయ” అని తనను తాను పరిచయం చేసుకుంటాడు జటాయువు. ఈ
భాగంలో ---
“ పురాణే
సనాతనే ధర్మే – దాస్యవృత్తా విత్యర్థ: – స్థిత:
తదేక పరాయణ: – సత్యం –సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇత్యుక్త: పరమాత్మా సంశ్రయ: ఆలంబనం యస్యస: – భగవదేకోపాయ నిష్ట ఇత్యర్థ: 3 -------------- మయిదాసే స్థితే తవ సీతాపహరణం న యుక్త మితి భావ : “ [ చతుర్వాఖ్య-1214-124 ] అని గోవిందరాజీయం, --జటాయువు లో దాసత్వాన్ని
నిరూపించింది.
రావణుని కొంతసేపు నిలువరిస్తే రామలక్ష్మణులు వస్తారనే ఆశే జటాయువు ని యుద్దానికి సిద్ధం చేసింది. “యది శూరో2స్తి ముహూర్తం తిష్ట “ అన్నమాటల్లోని ధ్వని ఇదే. ముహూర్త కాలం లో
రాముడు రాగలడనే విశ్వాసం జటాయువుది.” రామో యుధి
వధిష్యతి “[3-50-23} అంటాడు. చివరకు ప్రాణాలిచ్చైనా నేను వారికి ప్రియం కలిగిస్తాను.{ అవశ్యం తు మయా
కార్యం ప్రియంతస్య మహాత్మనం} అన్న
పలుకులు ప్రభుసేవలో ప్రాణత్యాగానికి
సిద్ధమైన సేవకునివి.
అసలు జటాయువు రాముడు వచ్చేవరకు జీవించి ఉండటానికి కారణం సీతానుగ్రహమేనని స్కంద పురాణం చెపుతోంది.
“దేవీ మాం ప్రాహ రాజేంద్ర యావత్సంభాషణం మమ
భవతస్తావ
దాస న్మే ప్రాణ ఇత్యాహ జానకీ”
రాముని అనుగ్రహంతో
మోక్షప్రాప్తి లభించింది జటాయువుకు.
“ రాఘవస్య ప్రసాదేన స గృధ్ర: పరమం పదమ్
హరే: సామాన్యరూపేణ
ముక్తిం ప్రాయాత్ఖగోత్తమ:”
రామభక్తితో ముక్తి
నందిన జీవరాశిలో జటాయువు అగ్రగణ్యుడు. అనన్యమనస్కుడై, భగవంతుని కొఱకు పోరాడి
ప్రాణాల్ని ధారవోసి , ఆయన సమక్షంలో , ఆయనపై దృష్టి నిలిపి, ఆయన చేతుల్లోనే మరణించి
,ఆయన చేతనే శాస్త్ర విహిత సంస్కారాలు పొందిన ధన్యజీవి జటాయువు.
జటాయువు మానవ పరిభాషలో గొప్ప
అదృష్ట వంతుడు. ఎందుకంటే
దశరథునికి కూడ లభించని అదృష్టం
జటాయువు కి లభించింది .ఏ వ్యక్తి కైనా గొప్ప సంపద సంతానం. అది గృహస్థాశ్రమ ధర్మం.
ఏ గృహస్థుడైనా చివరి సమయంలో తన
బిడ్డలు తనప్రక్కన ఉండాలని కోరుకుంటాడు.
కాని దశరథునికి నలుగురు కొడుకులున్నా మరణసమయంలో ఎవరూ దగ్గరలేరు. శ్రీ రామచంద్రుని
కన్నతండ్రి కి విథి రాసిన ఱాత అది.
జటాయువు ను మాత్రం రాముడు దగ్గరుండి నేలపై
పరుండబెట్టి ఓదార్చాడు .అపరకర్మలు చేశాడు. అతని కోసం దు:ఖించాడు.ఉత్తమ లోకాలను ప్రసాదించాడు.
“ సీతాపహరణజం దు:ఖం న మే సౌమ్య తథావిధమ్
యథా
వినాశే గృధ్రస్య మత్కృతేచ పరంతప”{ వా-3-68-26 ]
“ సీతాపహరణం వలన కలిగిన దుఖానికన్నా పక్షిరాజు నాకోసం మరణించాడన్న బాధే ఎక్కువుగా వుంది”అం టాడు రామచంద్రుడు.
“ రాజా దశరథశ్ర్శ్రీమాన్సధా మమ మహాయశా:
పూజనీయశ్చ మాన్యశ్చ తథాయం పతగేశ్వర”{ వా- 3-68-28 }
“ నాకు నాతండ్రి యైన దశరథుడు ఎంతటి పూజనీయుడో, ఈపక్షి రాజు కూడ అంతే పూజనీయుడని” నివాళి ఘటించడమే కాకుండా-----
“ మయాత్వం సమనుజ్ఞాతో గ్చ్ఛలోకాననుత్తమాన్
గృధరాజ మహాసత్త్వ సంస్కృతశ్చ మహాప్రజ”{ వా-3-68-30}
అంటూ యజ్ఞశీలురు, ఆహితాగ్నులు భూదానం చేసినవారు ఎటువంటి ఉత్తమ లోకాలను పొందుతారో అటువంటి లోకాలను పొందవలసినదిగా ఆదేశిస్తాడు. అంటే రామచంద్రుడు తన తండ్రి కోసం ఏమి చేయలేదో అదికూడ జటాయువు కోసం చేసాడు. అంటే భగవానుడు దాసజనపక్షపాతి యనేది మరొకసారి ఋజువైపోయింది.” సిరికిన్ చెప్పక శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపక--------- గజప్రాణావనోత్సాహియై” బయలుదేరిన లక్ష్మీనాథుని భక్తజన పక్షపాతి కాడని ఎవ్వరనగలరు. ?
రామాయణం మొత్తం మీద రెండు పాత్రలు మాత్రమే
సీతారాములకోసం ప్రాణత్యాగం చేసినట్లు మనం గుర్తించవచ్చు. ఒకరు దశరథుడు. రెండవవాడు
జటాయువు. జటాయువు త్యాగం దశరథుని కంటే
గొప్పదిగా కన్పిస్తుంది. కావుననే”-సుగ్రీవో హనుమాన్ ఋక్షో గజోగృధ్రో...”.అంటూ ముక్తుల నడుమ స్తుతిపాత్రుడైనాడు .
దశరథుడు రాముని ఎడబాటు సహించలేక మరణిస్తే,
జటాయువు సీతమ్మ కోసం ప్రాణత్యాగం చేసింది. తనుచేసిన త్యాగానికి కన్నీరు కారుస్తున్న ప్రభువు
చేతుల్లో మరణిస్తున్న జటాయువు కన్నుల్లో
ఎంత ఆనందం, ఎంత ఆత్మసంతృప్తి , ఎంత ప్రభుభక్తి,
పొంగులు వారిందో మన ఊహలకు అందదు. అందుకే సేవాధర్మానికి, త్యాగగుణానికి జటాయువు ఒకప్రతీకగా, ఒక చిహ్నంగా
నిలిచిపోయింది.
జటాయు తీర్థం -రామేశ్వరం చిత్రాలు-గుగుల్ సౌజన్యంతో
జటాయువు కు అంత్యక్రియలు చేయడానికి
ఆరు నదుల తీర్థంతోపాటు గయ
తీర్థాన్ని కూడ రామచంద్రుడు తన బాణం చేత
ఆకర్షించాడు. దానినే “జటాయు తీర్థం “అని పిలుస్తున్నారు . ఇది కేరళ లోని విజయరాఘవస్వామి దేవాలయం.తిరుపత్తుకుంజి లో మనకు
కన్పిస్తుంది. ఇది సకలపాపహరణం
గా ప్రజలు భావిస్తున్నారు. పడిపోయిన జటాయువును
చూచిన రామచంద్రుడు ఎక్కడ ” లే “అని ఆజ్ఞా
పించాడో ఆ ప్రదేశమే “ లే-పక్షి “> అయి లేపాక్షి అయ్యిందని కొందరి వాదన. అదే మన
అనంతపురం జిల్లా లోని “లేపాక్షి “ దేవాలయమని వీరి
వాదన.
No comments:
Post a Comment