Wednesday, 5 August 2015

శతకసౌరభాలు – 6 తమ్మర గోపన్న – శ్రీ జానకీ శతకము -4

                                            
          శతకసౌరభాలు – 6                    
                              


             తమ్మర గోపన్న – శ్రీ జానకీ శతకము  -4







అండయు దండలేక యడియాస యనందగు శత్రుకోటి నా
ర్తుండగుచుండ మీరు కృపతోడుత లెండికఁ జండకాండ కో
దండములన్ధరించి సరదామెయిఁ బ్రోవగ రండటంచు మా
ర్తాండకులప్రకాండునకు దండిగం జెప్పగదమ్మ జానకీ !.
                
   అమ్మా! సీతమ్మ తల్లీ! ఎటువంటి అండదండలు లేకుండా అరిషడ్వర్గాలనే శత్రువర్గం తో పీడించబడుతూ దుఖి:స్తున్న వీడిని దయతో ఆదుకోవడానికి మీరు చండకాండకోదండాల్ని ధరించి బయలుదేరండి. రండి వెళదామని సూర్యవంశ కులప్రకాండుడైన  శ్రీ రామచంద్రునకు నీవు గట్టిగా  నా గురించి చెప్పు   తల్లీ !

                                 ఏ సమయంబు నందయిన నెచ్చటనైనను నెవ్వడైన నా
దోసములన్ క్షమింపుమనఁ దోడనె రాముడు బ్రోచునన్న వి
శ్వాసము సుస్థిరత్వమగు భంగి నొకించుక యేని మంగళా
శాసనముం బొనర్ప రఘు సత్తము తో ననుమమ్మ జానకీ !
                 అమ్మా సీతమ్మతల్లీ! ఏ వేళలో నైనా ,ఏ ప్రదేశం లో నైనా, ఎక్కడైనా , ఎవ్వడైనా సరే   ఓ రామచంద్రా ! నా తప్పులను కాచి నన్ను ఆదుకోవయ్యా. అని వేడుకోగానే చివాలున వచ్చి కాపాడే కరుణామృతహృదయుడు మా రఘురాముడు అనే విశ్వాసం సుస్థిరం గా ఉండే విధం గా  శతకోటి మంగళాశాసనాలు అర్పించి రామచంద్రునితో  నన్ను గూర్చి చెప్పు తల్లీ!
                     
                                           దారలు నాత్మజుల్ సుతలు తమ్ములుఁ దండ్రియు మిత్రబాంధవుల్
 కూరిమిఁ జూపుటల్ ఫలము గోరియె కాని యకారణ ప్రియో
 దారత కాదు కా దఖిలదాతవు దండ్రి వహేతు మత్కృపా
వారిథి నాత్మబంధుఁ  డవపాకృత శత్రుడవీ  వొకండవే !
                     శ్రీ రామచంద్రా!   `భార్య, కొడుకులు,కూతుళ్ళు, సోదరులు , తండ్రి , మిత్రబాంధవులు, మనపై ప్రేమానురాగాలను  ప్రదర్శించడం  మన నుంచి ప్రతిఫలాన్ని ఆశించే కాని   అకారణ ప్రేమతో కాదు. కాని  అఖిలదాతవు  తండ్రివి .  అహేతుక కరుణా సముద్రుడవు. ఆత్మబంధుడవు. అపాకృత శతృడవు నీవు ఒక్కడివే కదా స్వామీ!
            ఇక్కడ తల్లిని గూర్చిన ప్రస్తావన చేయలేదు కవి. తల్లి ప్రేమ నిర్హేతుకమని , నిస్వార్ధమైనది,ప్రతిఫలాపేక్ష రహితమైనదని  చెప్పదలిచాడు గోపన్న. అందుకే తరువాత పద్యం లో “తల్లివి గాన నీవు” అంటూ ప్రారంభించాడు.

                                            తల్లివి గాన నీవు రఘుధాత్రిపు తో గడు నచ్చజెప్పి నా
తల్లడపాటు మాన్పుటకుఁ దప్పక దీక్ష వహింపుమమ్మ !న
న్నెలపు డేలుమమ్మ! హృదయేశ్వరుఁ గూడి మదీయ మానసో
త్ఫుల్ల సరోజమున్ వదలి పోక వసింప గదమ్మ జానకీ !
                      అమ్మా ! నీవు తల్లివి కాబట్టి రఘునాధుని తో నెమ్మదిగా నచ్చ చెప్పి నాలోని వేదనను ,  ఆందోళనను ( రామచంద్రుడు తనను కరుణిస్తాడో లేదో అనేది ఆందోళన) పోగొట్టడానికి నీవు పూనుకోవాలి తల్లీ ! కారణం నీవు తల్లివి కాబట్టి. తల్లి బిడ్డకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది కాబట్టి నీవు నన్ను కాపాడటానికి  తప్పక దీక్ష వహించాలి. ఎల్లప్పుడు నీవే నన్నుకాపాడుతూ ఉండాలి. నీ నాథుడైన శ్రీరాముని తో  కలిసి నా హృదయ కమలమునందు ఎల్లప్పుడు స్ధిరంగా నివసించు తల్లీ !.
          ఈ మహానుభావుడు జీవించి ఉన్నకాలం లో ఒకసారి వీరిని కలిసి నప్పుడు పక్షవాతం వచ్చి కుడి చేయి కొద్దిగా చచ్చుపడిందని, దీని వలన సీతమ్మతల్లి కి కుంకుమపూజ సరిగా చేయలేక పోతున్నానని కన్నీరు పెట్టుకుంటూ చెప్పారు .  నాకు కూడ ఆ విషయం ఆనాడు బాధ కలిగించింది. కాని కొంతకాలం తర్వాత ఏదో ఉత్సవాల సందర్భం లో ఈ మహనీయుణ్ణి మళ్ళీ వేదాద్రి  శ్రీనృసింహుని సన్నిథి లో కలవడం జరిగింది. ఆయన నన్నుచూస్తూనే ఆత్మీయం గా పల్కరించి, తన కుడిచెయ్యి బాగానే పనిచేస్తోందని . ఒక శుక్రవారం  తమ్మర ఆలయం లో అమ్మ సీతమ్మ కు కుంకుమ పూజ చేస్తుంటే   అకస్మాత్తు గా కుడిచెయ్యి దానంతటి కదే చక్కగా పనిచెయ్యడం మొదలు పెట్టిందని ఆయన ఆనందంతో చెపుతుంటే ఆశ్చర్య పోవడం నా వంతు అయ్యింది. “మూకంకరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం” అన్నారు ఆది శంకరులు. దైవం తలుచుకుంటే కానిదేముంటుంది?
మనం ఏమనుకున్నా సీతమ్మ తల్లి మీద ఆయనకున్న అపారమైన విశ్వాసం అది.
                                     
                                విఖనసు సూత్రమందుఁ బ్రభవించిన యట్టి నృసింహసూరికిన్
సఖియగు నర్సమాంబికకు జన్మము నొందిన గోపదాసు నా
ర్తఖలుని బ్రోచు భార మిక దప్పదు మీకని నొక్కి చెప్పు మ
య్యఖిల నియంతయౌ  రఘుకులాగ్రణి తో దయయుంచి జానకీ !
                          అమ్మా!జానకీ దేవి!   వైఖానసాన్వయం లో  , నర్సాంబా నృసింహసూరి దంపతులకు పుట్టిన  గోపదాసు అనే  ఈ పాపాత్ముని బ్రోచే భారం  మీదేనని, అఖిల లోక నియంతయైన శ్రీరామచంద్రుని తోటి  ఇది  మీకు తప్పదని నొక్కి చెప్పు తల్లీ!.

మంగళమబ్జనేత్ర ! శుభమంగళ మంబుదగాత్ర! ప్రోల్ల స
న్మంగళ మార్యమిత్ర ! తవ మంగళమస్త !ని సన్నుతించు దీ
నుం గృప నేలుడం చెటులనో విభుతో నని, నన్ను క్షేమదృ
ష్టిం గనుమమ్మ యమ్మ నతజీవన దాత్రివి గమ్మ జానకీ !  (110)
                  
                         అమ్మా!  వేడిన వారిని కాపాడే చల్లని తల్లీ సీతమ్మా! వికసించిన తామరపూల వంటి నేత్రములు కలవాడా! మంగళకరమైన నీలమేఘశ్యాముడా! నీకు శుభమగుగాక! అని ప్రార్థించే ఈ దీనుని దయతో కాపాడమని , ఏదోవిధం గా  ప్రభువైన రామచంద్రుని తో చెప్పి , నన్ను నీ చల్లని చూపులతో రక్షించవమ్మా తల్లీ జానకీ దేవీ ! మీకు శుభమగుగాక! 

నేనొకరుండగాను దయనీయుడ నాదుకుటుంబమంతయున్
నా నిఖిలాత్మబంధువులు నాప్రియమిత్రులు నాసుహృత్తుల
న్యూనరఘూత్తమోత్తమ కృపోచితులై సుఖియింప భద్రసం
ధాన మొనర్చి బ్రోవు మిక తల్లికృపా2మృతవల్లి జానకీ !

                ఈ పద్యం ఈ శతకం లో చివరిది. శతకమంతా తనను కాపాడమనీ ,రక్షించమనీ , ఏలుకోమని పరిపరి విధాల ప్రార్థించిన కవి ఈ పద్యం లో   తన కుటుంబాన్ని , సమస్తమైన ఆత్మ బంధువులను , ప్రియ మిత్రులను , స్నేహితులను  అపారమైన శ్రీరామచంద్రుని దివ్యానుగ్రహానికి పాత్రులయ్యేటట్లు   స్వామి తో చెప్పి రక్షించవలసిందని దయామృతవల్లి యైన సీతమ్మతల్లిని వేడుకుంటున్నాడు కవి.
          
               తనతో పాటు తన వారినందరిని బ్రోచే భారం సీతమ్మ తల్లి పై వేశాడు కవి . అంటే తనకు లభించే ఫలితం తనవారికి కూడ కలగాలనే  తాపత్రయం, తనను ఎలాగూ అమ్మలగన్న సీతమ్మతల్లి కాపాడుతుంది కాబట్టి తనతో వారిని కూడ తరింప చేయాలని కవి తపన.  మహాత్మానాం వసుధైక కుటుంబకమ్ అని కదా ఆర్యోక్తి.
             
                             ఆది శంకరుల కనకధారాస్తవమ్ లోని ఒక శ్లోకం ఈ సమయం లో గుర్తుకొస్తోంది.
                                    
                                     కమలాసన పాణినా లలాటే
                                     లిఖితా మక్షరపంక్తి మస్య జన్తో:
                                     పరిమార్జయ మాతరంఘ్రిణా తే
                                      ధనికద్వార నివాస దు:ఖ దోగ్ధ్రీమ్ !!
       అమ్మా ! కలుముల జవరాలా  !  ఆ బ్రహ్మదేవుని చేత ఈ జీవుల నుదుటమీద   ధనవంతుల వాకిట్లో దు:ఖ భాగులై  జీవించండని వ్రాసిన అక్షర సమూహాలను నీ కాలి తో తుడిచివేయవలసింది (ఊడ్చివేయవలసింది)  తల్లీ !
                   ఈ భూమి పై డబ్బున్న వాడి పంచన బ్రతికే బ్రతుకు ఎవ్వరికీ ఉండగూడదనే ఉదార భావన మహర్షులది. అందుకే వారు జగద్గురువులు. జగదేకపూజ్యులు ,  లోకారాధ్యులు, ప్రాతస్మరణీయులు అయ్యారు.
                          తన వారందరు తను చెసే  రామనామధ్యాన, స్మరణ, రచనా వ్యవసాయానికి సహకరించక పోతే తాను ఈ  రామ ధ్యాన, రామ కావ్య రచనా ప్రక్రియలను కొనసాగించగలిగే వాడిని కాదని, అందువలన  తన వాళ్ళని కూడ తనతో  పాటు కాపాడమని కవి విన్నపం.
                              

                                ఇది తమ్మరగోపన్న రచించిన జానకీ శతకమునకు
                                                 తేజస్వినీ వ్యాఖ్య సంపూర్ణము.



*****************************************************************************

Monday, 3 August 2015

శతకసౌరభాలు – 6 తమ్మర గోపన్న – శ్రీ జానకీ శతకము -3

                              

  శతకసౌరభాలు – 6
                                        


             తమ్మర గోపన్న – శ్రీ జానకీ శతకము  -3

                                    



                                        వేలకువేలు దీను లతివేలముగా పదమాశ్రయించి జే
జే లొనరింపగాఁ జరణ సేవకసేవధి యైన రాముఁడా
గోలల లోన నన్మరువ గూడదు సుమ్మని వెంట నుండి యీ
           పాలసు నేలుకొమ్మనుచుఁ బల్కుము సత్కృప యుంచి జానకీ !   (74)
                                


                                             అమ్మా ! సీతమ్మ తల్లీ! వేలాది మంది ఆర్తులు శ్రీరామచంద్రుని పాదాల నాశ్రయించి జేజేలు సమర్పిస్తుంటే ఆర్తజనరక్షా దీక్షితుడైన ఆ పతితపావన నాముడు నా రాముడు ఆ గోలలో  పడి నన్ను మరచిపోకూడదని వెంటనే ఉండే నీవు ఈ పాపిని కూడ రక్షించమని  నాపై దయతో దాశరథి కి చెప్పు తల్లీ !

స్థిరతరమైన ప్రేమమున సేవకుడై తనుదానె దాస్యమం
దొరులకుఁ బాలొసంగుటకు నొల్లక యెక్కడ నెట్టిలోపముం
   బొరయకయుండఁ జేయుటకుఁ బూనిన లక్ష్మణు నంత వానిగా
నరయుటకై వరంబడుగుమా రఘువీరుని తోడ జానకీ !
                                
                                  అమ్మా ! సీతమ్మ తల్లీ !  అన్నయైన రామభద్రుని పై నున్న స్థిరమైన ప్రేమ తో తనకు తానే అన్నకు సేవకుడు గా నియమించుకున్న లక్ష్మణుడు  శ్రీరామచంద్రుని సేవలో మరొకరికి ఏ మాత్రం అవకాశం ఇవ్వడానికి ఇష్టపడక , ఎక్కడ ఎటువంటి లోపం కలగకుండా అన్నకు చేయడానికి సిద్దపడ్డ ఆ లక్ష్మణుని వలే నన్ను కూడ కరుణించే వరం శ్రీ రఘువరుని అడగలేవా తల్లీ !
                          కవి తనను లక్ష్మణుని తో పోల్చుకుంటూ ,  లక్ష్మణుని వలే సేవ చేసే భాగ్యం తనకు కూడ కల్గించమని . ఆ వరం కూడ సీతమ్మతల్లి యే రామచంద్రుని అడిగి ఇప్పించాలని వేడుకుంటున్నాడు.

 శ్రీ రామచంద్రుని వంటి కొడుకు, సీతమ్మ వంటి వదిన ,లక్ష్మణుని వంటి తమ్ముడు కావాలనే కదా  తెలుగు జాతి ప్రతి సంవత్సరం  శ్రీరామనవమి వేడుకల్లో కోరుకునేది.   

                                   దురిత విచారులైన ఖరదూషణ ముఖ్యులు చుట్టుముట్టి సం
  గర మొనరించుచో , శర వికర్షణముం బొనరించు వీర సుం
  దరుడయినట్టి మేటి సరదారుని రాముని జేరి తెల్పు మ
ద్దురితపరంపరల్ గరుణ తో విదళించెడి భంగి జానకీ !
               
                        అమ్మా! జానకీదేవి ! యుద్ధభూమి లో  దుర్మార్గులైన ఖరదూషణాది రాక్షసులను మట్టుపెట్టుటకు చేసే శరసంధానం చేస్తూ  విహరిస్తున్న  వీర సుందరుడైన మా మేటి సర్ధారు రామచంద్రుని  చేరి, నా పాపాలను క్షమించి దయతో కరుణించమని చెప్పు తల్లీ!
       
                    శ్రీరామచంద్రుని గొప్పతనాన్ని ఒక వైపు వర్ణిస్తూనే, తనను కాపాడమని ప్రార్ధించడం కవి అనుసరించిన విధానం.  ఆ సమయం లో  ఉచితానుచితాలు  కవి ఆలోచించడు. భక్తుని లోని ఆర్తి అటువంటిదే మరి.
            
        ఎందుకంటే ..  ఖరదూషణవధ సమయం లో  ఆ భయంకర యుద్దాన్ని చూసి సీత భయపడుతుందేమోనని ,  శ్రీరామచంద్రుడు  లక్ష్మణుని పిలిచి ఆమెను దూరం గా ఉన్న పర్వత గుహలోనికి తీసుకెళ్లవలసినది గా ఆజ్ఞాపిస్తాడు.  అంటే ఖరదూషణాది నలభైవేలమంది రాక్షసులను ఒక్క రామచంద్రుని రామబాణం మాత్రమే మట్టుపెట్టింది. (అరణ్య.24.సర్గ)
                            
                    ఖరదూషణ వధానంతరం భర్త చెంతకు వచ్చిన సీతాసాధ్వి తన  నాథుడైన శ్రీరామచంద్రుని గాఢంగా కౌగిలించుకొని ఆయన గాయాలకు తన కౌగిలివెచ్చదనమనెడి వేడి చేత  కాపడం పెట్టినట్లు గా ఒక ఆధునిక కవి  రసరమ్యంగా వర్ణించాడు.

        ముందెపుడో  లభించు రఘుముఖ్యుని పూజ లటం చరణ్య మం
దెందుననో లభించు ఫలమెంగిలి చేయుచు నందులోని తీ
యందన మెంచి స్వామి కిడు నా శబరిం గరుణించి మించు నీ
                        సుందరు తోడ నన్గరుణఁ జూడుమటంచను మమ్మ జానకీ !              (79)

                        అమ్మా!  శ్రీరామచంద్రుని ఇల్లాలా ! ఎప్పుడో  నీలమేఘశ్యాముడు శ్రీరామచంద్రుడు వస్తాడని , ఆయన కోసమని అడవి యంతా  గాలిస్తూ , దొరికిన ప్రతి పండును ఎంగిలి చేసి దానిలోని తియ్యదనాన్నిపరీక్షించి, ఎంచి మరీ స్వామి కోసం  భద్ర పరిచి అందించిన  ఆ శబరి ని కరుణించినట్లుగానే నీ నాథుని తో  నన్ను కరుణించమని చెప్పు తల్లీ ! 
                                    
                                              వాలిని గూలనేసి , కపిపాలుని గా నొనరించి సూర్యజున్
గాలిసుతున్ నిను న్గనుట కై వడి లంకకుఁ బంప నాతడున్
లీల మహాబ్ది దాటి , యట నిన్గనుగొంటి ననంగఁ గౌగిటన్
దేలిచి యేలుకొన్న రఘుదేవుని నన్గనఁ జేయు జానకీ !

                                    అమ్మా!  సీతమ్మతల్లీ !  వాలిని సంహరించి , సుగ్రీవుని కిష్కింథా రాజ్యానికి రాజును చేసి, వాయునందనుని నీవున్న తావు కనుక్కోవడానికి లంకకు పంపాడు. ఆ ఆంజనేయుడు కూడ అవలీలగా సముద్రాన్ని దాటి, నిన్ను దర్శించి, మరలి వచ్చి అచ్చట నిన్ను చూశానని చెప్పగా   ఆ సమయం లో వాయునందనుని కౌగిలి లోనికి తీసుకుని ఏలుకున్న  ఆ రఘునాథునకు నన్ను కూడ పాలించమని చెప్పు తల్లీ !
              
                          ఆ వాయునందనుని ఆదరించినట్లే నన్ను కూడ శ్రీరాముడు కౌగిలించుకొని ఏలుకోవాలని కవి అన్యాపదేశం  గా అర్థిస్తున్నాడు.

అన్ని యెఱింగి నిన్ననల మందునఁ ద్రోచిన యట్టి వానినే
నెన్నడు నమ్మజాల జననీ!నిను నమ్మిన భంగి నౌట నన్
గ్రన్ననఁ బ్రోచు భారమును గైకొని మచ్చికఁ జెప్పుమమ్మ నా
 విన్నపమెల్ల మెల్ల రఘువీరునతో దయయుంచి జానకీ
                          
                                అమ్మా! జానకీమాతా ! అన్నీ తెలిసి కూడ నిన్ను అగ్ని ప్రవేశం చేయించిన  శ్రీ రామచంద్రుని  నిన్ను నమ్మినట్టు గా నేను ఎప్పటికీ నమ్మను తల్లీ ! అందువలన నన్ను కాపాడెడి భారాన్ని నీవే తీసుకొని ఏదో విధం గా నా మొఱను రఘుచంద్రుని తో నీవే విన్నవించు తల్లీ !

                                       ఒక్కడు నేని నన్ను శరణొందిన యాతడు ద్రోవగాఁ బడం
        డెక్కడనే నటన్న వ్రతమే సుదృఢంబుగఁ దెల్పియుండె నా
రక్కసి ఱేని సోదరుని రక్షణఁ జేసెడు నప్పు డౌట చే
నక్కర మీఱఁ జెప్పు మఖిలాధిపు తో మదఘంబు జానకీ !
                        
                                    అమ్మా ! సీతమ్మ తల్లీ! రావణుని తమ్ముడైన విభీషణుని రక్షించే టప్పుడు శ్రీరామచంద్రుడు “ నన్ను  శరణు వేడిన వానిని ఒక్కడిని కూడ రక్షించకుండా వదిలి పెట్టని వ్రతము కలవాడనని’’దృఢం గా ప్రకటించాడు. అందు వలన సమయం చూసి అఖిలలోక చక్రవర్తి యైన   ఆ శ్రీరాముని తో నన్ను గూర్చి  చెప్పవలసినది తల్లీ !

దోసము జేసి నాడనుచు దొడ్డదొరల్ కడుఁ గోపగించుచో
దోసము సేయకున్న విబుధుండెవఁడాశ్రితుండై భవత్సమా
శ్వాసముఁ గోరి యుండగలవాడని ,వీనిని నింక గాచుటే
వాసి యటంచు నప్పతిత పావనుతో నను మమ్మ జానకీ.
                       
                                          అమ్మా ! సీతమ్మా ! దొడ్డదొరయైన రామచంద్రమూర్తి నన్ను గూర్చి “ వీడు పాపాలు చేశాడు. వీనిని రక్షింపకూడదని “ కోపగిస్తే  “స్వామీ ! పాపాలు చెయ్యని వాడు ఎవ్వడు  మీ అనుగ్రహం కోరి మీ చెంతకు వస్తాడని, అటువంటి వానికి మీతో ఏమి పని అని అందువలన  మీరు వీనిని కాపాడటమే మనకు  గౌరవమనీ ’’  చెప్పి స్వామిని ఒప్పించు తల్లీ !

                                    తనయుడు చెడ్డవాడయినఁదండ్రిది తప్పగుఁ గాని యింత త
జ్జననిది తప్పుకా దయిన స్వామికి నీకపకీర్తి గల్గు చుం
డినఁ గనజాల నాజ్ఞ యిడుడీ యిక నీతని బ్రోచుదాన నం
        చని తెలుపంగదమ్మ హృదయాధిపుతో దయయుంచి జానకీ !
                   
                                తల్లీ ! సీతామాత !  కొడుకు చెడ్డవాడయితే ఆ తప్పు తండ్రి ది కాని తల్లి ది కాదుగదా ! అయినా ప్రభువైన మీకు అపకీర్తి కల్గుతుంటే నేను సహించలేను. ఆజ్ఞ ఇవ్వండి వీణ్ణి నేను కాపాడతానని  స్వామి తో పల్కి నన్ను ఏలుకో తల్లీ !

అనిశము ధర్మవర్తనము నందు మనంబు స్థిరత్వభావమొం
ది నిలుచునట్లొనర్పక బదింబదియూరక చూచుచుండుటన్
మనదియ తప్పుగాని మన నందను తప్పిదిగాదటంచు నీ
వను మిఁకనైన శ్రీ రఘుకులాగ్రణి తో దయయుంచి జానకీ !
                
                                 అమ్మా! సీతమ్మతల్లీ !  మన కుమారుని వంటి  ఈ భక్తుని మనస్సు ఎల్లప్పుడూ ధర్మమార్గం లో స్థిరంగా  ప్రవర్తించేటట్లు గా చేయకుండా  చూస్తూ ఊరుకున్న మనది తప్పు కాని  తప్పులు చేసిన వాడిది తప్పు కాదని రఘురాముని తో నీవైనా చెప్పు తల్లీ !

                                 ఖ్యాతములైన సద్గుణములన్నియు మీ కడనుంట స్వాశ్రిత
వ్రాతము నేలకున్న యెడ వచ్చు నపప్రథ మీకు గాని యీ
 పాతకి కించు కేని మతి వచ్చుట కల్ల , యటౌట మెల్లగా
నీతని బ్రోవు మంచు హృదయేశ్వరుతో ననుమమ్మ జానకీ !
                                       అమ్మా ! సీతమ్మతల్లీ ! ప్రసిద్ధములైన గుణము లన్నియూ మీ వద్దనే కొలువై ఉండటం వలన  మిమ్ములను ఆశ్రయించిన వారిని కాపాడక పోతే వచ్చే చెడ్డపేరు మీకు గాని ఈ పాపాత్ముడి కి కొంచెం కూడ రాదు కదా ! అందువల్ల ఏదో విదం గా వీడిని రక్షించమని మెల్లగా నాథుని తో విన్నవించు తల్లీ ! 

అక్షరమూర్తి వీవనుచు నాత్మనెఱింగిన పెద్దవారి వా
క్యాక్షరముల్ మనోంబుజంబునం దొకయించుక నమ్మి సత్కవి
త్వాక్షర పంక్తులన్ భవదనంతయశంబు రచించుచుండె నం
చీ క్షణమే వచింపు హృదయేశ్వరు తో దయయుంచి జానకీ !  (99)
                  
                             
               అమ్మా!  సీతమ్మతల్లీ ! నీవు అక్షరమూర్తి వని వ్రాసిన ఆత్మజ్ఞానులైన పెద్దల మాటలను  మనస్సున నమ్మి చక్కని అక్షరాలలో  అనంతమైన  తమ యశస్సు ను వ్రాస్తున్నాడని ఈ క్షణమే నన్ను గూర్చి ప్రభువు తో చెప్పు తల్లీ !
                                                                 చివరిభాగం త్వరలో.................



*****************************************************************************

Sunday, 12 July 2015

శతకసౌరభాలు – 6 తమ్మర గోపన్న – శ్రీ జానకీ శతకము -2

           


    శతకసౌరభాలు – 6
                             

                తమ్మర గోపన్న – శ్రీ జానకీ శతకము  -2







                                 

                                   ధరణియు నాకసంబును నథ శ్శిల పై శిల గాగ సత్యమే
                                      స్ధిరమగు బొడ్డుగాగ నతి శీఘ్రత వర్తిలు నీ ప్రపంచమన్
తిరుగలి లో నలంగు నతి దీనుని వీనిని గావుమంచు నీ
వరుసము తోడ శ్రీ రఘుకులాగ్రణి తో నను మమ్మ జానకీ !  
                        


               అమ్మా!  జానకీదేవీ! ప్రపంచమనే ఈ తిరుగలికి భూమ్యాకాశాలు క్రింది రాయి , పై రాయి కాగా  సత్యమే మధ్య బొడ్డు పుడక గా ఉండి మిక్కిలి వేగం తో  పరిభ్రమిస్తుడగా  ఈ తిరుగలి లో పడి నలిగి పోతున్న ఈ దీనుని కాపాడమని రఘుకులాగ్రణి తో చెప్పు తల్లీ.!
                                       
                                మతి గల మీర లిట్టి మతిమాలినబిడ్డల కాటవస్తు సం
తతులిడి , వానితో సదమదంబయి మిమ్ముఁ దలంపకున్నచో
నతి కలుషాత్ములంచెనె దరా  కఱుణాళులకిధ్ది ధర్మమే
గతి నగునంచుఁ బల్కు రఘుకాంతునితో దయయుంచి జానకీ ! 
                    
                     అమ్మా.! సీతమ్మ తల్లీ.! మతిమంతులయిన మీరే  మతిమాలిన బిడ్డలకు ఈ లౌకిక ప్రపంచం లో ఆడు కోవడానికి వివిధములైన వస్తువులను సమకూర్చి , వాటితో వాడు  సతమతమై పోతూ మిమ్మల్ని స్మరించడం మర్చిపోతే వాడిని పాపాత్ముడని నిందిస్తారా. కరుణాళువు లైన మీకు ఇది  ఏ విధంగా ధర్మమని పిస్తోంది స్వామీ. అని రఘుకాంతుని అడగవమ్మా జనకుని కూతురు వైన ఓ రామచంద్రుని ఇల్లాలా.!

సకల చరాచర ప్రజల జన్మ జరామరణస్వభావ బో
ధకమగు పద్దు నుండి మన దాసుని తప్పు రికార్ఢు మీ రహే
తుక కృప నెఱ్ఱ గీత యిడి త్రోసి క్షమింపక తప్ప దంచు మ
        చ్చిక మెయి విన్నవింపు రఘుశేఖరు తో దయయుంచి జానకీ !  
                   అమ్మా!. జానకీమాత.!సమస్త చరాచర జీవరాశి యొక్క జన్మ జరామరణాదులను వ్రాసే పద్దు నుండి మన దాసుని యొక్క తప్పుల రికార్డు ను అంటే పాపాల చిట్టా ను  మీరు దయాన్వితులై  ఎఱ్ఱగీత గీసి  కొట్టివేసి వీడిని క్షమింపక తప్పదని   మచ్చిక మన ప్రభువునకు విన్నవించు తల్లీ.!
      
              లోకం లో ఉన్న సంప్రదాయం  ప్రకారం Red line   గీయడమంటే వ్రాసింది అది తప్పు అని , దానిని సరి చేయాలనేది సంకేతం. ఆ విషయాన్నే కవి  అమ్మ సీతమ్మ కు చెపుతున్నాడు. తన తప్పుల చిట్టా ను ఒక్క ఎఱ్ఱగీత తో కొట్టేసి తనను పవిత్రుణ్ణి చేయమని ,  అందుకు అమ్మను సిఫార్సు(recommendation)  చేయమని వేడుకుంటున్నాడు. అమ్మ దగ్గర బిడ్డకు అడగకూడనిది ఉండదు కదా. తల్లి వద్ద బిడ్డకుండే చనువు అటువంటిది.
                                      
                                         తప్పు లొనర్చినాడనని తానయి చెప్పుచు మీ సమక్షమం
దిప్పగిదిన్ విధేయుడగు నీతనిఁ బ్రోవకయున్న నెప్పుడున్
దప్పు లొనర్చి లేదను నతథ్యపు వాదిని బ్రోచుటెట్టులో
            చెప్పుడు చూతమంచు రఘుశేఖరు తో ననుమమ్మ జానకీ !           ( 51 )
                  
                          అమ్మా .! సీతామాతా ! తాను తప్పుల చేశానని తనకు తాను గా మీసమక్షం లో తప్పులొప్పుకుంటున్న విధేయుడైవ వీడిన మనం బ్రోవని యెడల తప్పులు కూడ తాను టువంటి తప్పులు చేయలేదని బుకాయించే అబద్దాలకోరు ను కాపాడటం ఎలాగో చెప్పండి చూస్తానని రఘునాథునితో అనవమ్మ జానకీ.
                                       
                                              వరమతియైన గౌతముని పత్నికిఁ గల్గిన జారదోష బం
ధురతర మంతయు న్దొలగ ద్రోచి స్వపాద విసర్పణంబునన్
స్థిర తర కీర్తి చంద్రికల దేశము నెల్లెడ నింపినట్టి నీ
 వరునకు రామచంద్రున కవశ్యము నాగతి దెల్పు జానకీ !

        అమ్మా! సీతమ్మ తల్లీ ! సుగుణ శీల యైన గౌతమమహర్షి ధర్మపత్ని కి అంటిన  జారత్వమనే భయంకరమైన కళంకాన్ని తన పాదస్పర్శ చే తోసివేసి , శాశ్వతమైన కీర్తి చంద్రికలతో ప్రకాశింపచేసిన  నీ వరుడైన  మా రామచంద్ర ప్రభువు నకు  నన్నుగూర్చి  తెలియ చెప్పుము తల్లీ.!
                                    
                                 చనువున స్వీయరాజ్య మనుజప్రకరంబుల నెల్ల బిడ్డలన్
జనకుడు వోలె నేలికొను సద్గుణుఁ డా జనకుండొనర్చు చుం
డిన సవనంబుఁ జూడగ వడిన్ గుశికాత్మజు వెంబడించు రా
               మునకు మదీప్సితం బఖిలము న్వివరింప గదమ్మ జానకీ !   (55)
                 
                                           అమ్మా.! జానకీ దేవీ.! జనకుడు (తండ్రి ) తన బిడ్డలను చూసుకున్నట్టు గా తన పాలన లోని ప్రజలందరిని జనకుని వలే పాలించు సద్గుణ శీలి యైన ఆ జనకమహారాజు చేసెడి యజ్ఞాన్ని చూడడానికి గురువైన విశ్వమిత్రుని వెంట వడివడిగా అడుగు లేస్తూ మిథిలా నగరం  లో ప్రవేశించిన శ్రీ రామచంద్రునకు నా కోరికను మెల్లగా వెల్లడించు తల్లీ.!
                                          
                                    దివిజుల కేన్గదల్చుట కతి శ్రమ సాథ్య మనల్పసార మా
భవుని శరాసమద్ది వెస భగ్నమొనర్చె విదేహరాట్సభా
భవనగతాఖిలప్రజ సెబాసని మెచ్చుకొనంగ నట్టి రా
ఘవులకు నావెతల్ తెలుపఁగా వలె నమ్మ యిఁకేని జానకీ !
                     
                     అమ్మా.! దేవతలకు కూడ కదల్చడానికి అతిశ్రమము , అసాధ్యము , అనల్పము నైన శివధనుస్సు ను జనకరాజ సభా భవనం లో చేరిన సమస్త జనవాహిని సెబాసని మెచ్చుకొనేటట్లు గా భగ్నమొనర్చిన ఆ రాఘవునకు ఏ విధంగానైనా నా బాధలను తెలియ జేయాలి తల్లీ.!
               శ్రీరామచంద్రుని గొప్పతనాన్ని  ప్రస్తావిస్తూనే తన ఘోషను  తల్లి కి వినిపించడం మాత్రం మర్చిపోవడం లేదు కవి. ఈ సమయం లో నైనా రామయ్య తనను ఔ నంటాడేమో నని కవి  ఆశ.
                                 
                                   అమిత సురూప సంపదల నందఱి మీఱెడు మిమ్ముజూచి  వి
భ్రమ పడినట్టి రాముని కరంబున నీ కరముంచి యవ్విదే
హమహిపు డొప్పగింప నతి హర్షమునన్ గ్రహియించు నాటి మో
దము దలపించువేళఁ దమ దాసుని ముచ్చట తెల్పు జానకీ !  
                    
                                    అమ్మా.! అత్యంత సుందర సుకుమార లావణ్యసీమ వైన నిన్ను   చూసి శ్రీ రామచంద్రుడు విభ్రమాంబుథిలో  తేలియాడుతున్న  వేళ  నీ తండ్రి జనకమహారాజు   ఆ రాఘవేంద్రుని చేతిలో  నీ చేతిని  ఉంచగా , శ్రీ రామచంద్రుడు నీ మృదుపాణి ని అందుకొంటూ ,  అనుభవించిన  ఆ ఆనందపు మధుర మనోహర క్షణాలను  గుర్తుచేసుకొనే మీ ముచ్చట్ల మథ్య  లో  ఈ  దాసుని గురించి కూడ ఒక్కమాట చెప్పు తల్లీ.!   

కాంత లతాంత సౌరభ వికస్వర భాస్వర పుష్పవాటికా
భ్యంతర భర్మ హర్మ్య హరిణాంకమణి ప్రవిభక్త వేదికో
పాంతములందుఁ గేల్గొని విహార ముచ్చటలాడువేళ వృ
                           త్తాంతము నాది తెల్పు హృదయాధిపుతో దయయంచి జానకీ !      (60 )
               
                         అమ్మా.! సీతమ్మ తల్లీ !. పూలపరిమళాలు మత్తుగా పరుచకొనే  పుష్పవనం  లోపలి  అభ్యంతర మందిర సమీపమందలి   చంద్ర శిలా వినిర్మిత వితర్దికల చెంత  చేయి చేయి కలుపు కొని ముచ్చటలాడుకొనుచు విహరించే సమయం లో నీ హృదయనాథుని తో నా హృదయ వేదనను దయచేసి కాస్త విన్పించు తల్లీ !
కవికి ఈ పద్య నిర్మాణ సమయం లో  మహాకవి బమ్మెర పోతన ఆంధ్రమహా భాగవతం గజేంద్రమోక్ష ఘట్టం లోని
                          
                             “అల వైకుంఠపురంబు లో నగరి లో ఆమూల సౌథంబు దా
                              పల మందార వనాంతరామృత సర: ప్రాంతేందు కాంతోపలోత్పలపర్యంకం”  గుర్తుకొచ్చింది.
                     
                           ఆ లక్ష్మీ నారాయణులే ఈ సీతారాములు కదా ! అనుకొంది కవి మనస్సు. ఇంకేముంది. ఒక అందమైన పూలతోట. అందు లో ఒక ఏకాంత  మందిరం. దాని చెంత  చంద్రశిలానిర్మితమైన తిన్నెలు. వాని చెంత చేతిలో చెయ్యి వేసుకొని ముచ్చటలాడుకుంటూ విహరిస్తున్న కొత్త దంపతులు గా సీతారాములు కవి మన: ఫలకం మీద కదలాడారు. ఎంత మధురదృశ్యమో చూడండి.ఆ దృశ్యాన్ని దర్శించిన కవి ఎంత అదృష్ట వంతుడో కదా! కాని  ఈ సమయం లో తన ప్రాణనాథునికి  తనను గురించి  వివరించమని  అమ్మ సీతమ్మ ను అర్ధిస్తున్నాడు  కవి. ఆ శ్రీరామచంద్రునకు  తన వంటి పాపాత్ముడి పాపాలను విని సహించి సముద్ధరించమని చెప్పడానికి ఇదే సరైన సమయమని కవి భావనై ఉంటుంది.
  
                         “నడి రేయి ఏ జాము లో స్వామి నినుఁ జేర దిగివచ్చునో... విభునకు మా మొఱ వినిపించలేవా” అంటూ ఆర్తి తో వేడుకొనే భక్తజన సందోహం ప్రభువును నిత్యం పిలుస్తూనే ఉన్నారు కదా!
                                                
                                            
                                       దోసము లెన్నఁబోక కృపతో నతరక్షణ దీక్షితుండు దా
నే సమయంబు నందయిన నేగి నతార్తుల నెల్ల నేలి పోఁ
ద్రోసి గృహంబు సేర రుచిరూషిత రమ్య సువర్ణ రత్న సిం
                        హసన మిచ్చువేళ నను నాదట జెప్పఁగదమ్మ జానకీ !                  (61 )

 ఈ సమయం లో కవి లో గజేంద్రమోక్షణ ఘట్టం కదలాడుతోందనడానికి   ఈ పద్యం కూడ నిదర్శనమే.
                       
                                    అమ్మా! సీతమ్మ తల్లీ.! దీనజనరక్షణ వ్రతుడైన ప్రభువు రామయ్య వేళాపాలా లేకుండా ఎప్పుడు పడితే  అప్పుడు బయలుదేరి వెళ్లి  ఆర్త జన రక్షణ,  దుష్ట జన శిక్షణ చేసి  ఆలస్యం గా ఇంటికి వస్తే  “స్వామీ! ఎక్కడకు వెళ్ళారు ?ఏం చేసి వచ్చారు? “వంటి ప్రశ్నలతో స్వామిని తప్పు పట్టక ఆయన అర్ఘ్య, పాద్యాదులను ఇస్తూ నన్ను కూడ ఆదుకొమ్మని చెప్పు తల్లీ.
                   

                  ఇంట్లో ఉన్న ఇల్లాలికి చెప్పకుండా దీనజనుల ఆర్తరావం వినగానే బయలుదేరి వెళ్ళిపోవడం శ్రీ హరి కి అలవాటు. “తను వేంచేయు పదంబు పేర్కొనక పోవడం”   ఆర్త జన రక్షకునకు అలవాటే కదా! అందుకే “సిరికిం చెప్పడు, శంఖ చక్రయుగమున్ సంధింపడు” అంటూ చెప్పుకొచ్చాడు  గజేంద్రమోక్షం లో పోతన మహాకవి.   పాపం ఆయన ఎక్కడకు వెడుతున్నాడో అడుగుదామనుకొన్న లక్ష్మీదేవి కూడ       --- 
                                              
                                                 “అడిగెదనని కడువడి జను
                                                  అడిగిన దను మగుడ నుడువడని నడయుడుగున్ “–

అంటూ ఆ శ్రీమహాలక్ష్మి ఆతృత ఈ పద్యం గా రూపుదిద్దుకొంది గజేంద్రమోక్ష ఘట్టం లో.
                             
                                       శ్రీ తులసీదళంబు లమరించి యనల్ప సుగంధ బంధుర
ఖ్యాతము లైన భవ్య కుసుమాదులఁ గూర్చిన  మాలికావళుల్
ప్రీతిని కంఠమందు సవరించుచు మెల్లన దాపుచేరి నా
చేతలు విన్నవింపు రఘుశేఖరుతో దయయుంచి జానకీ !
             
                              అమ్మా! సుగంధ బంధురమైన సుమమాలల మధ్య అందంగా కూర్చిన తులసీ దళాలతో అల్లిన పూలదండలను ప్రేమ మీర  నీ నాథుని మెడ లో వేసి మృదువు గా సరిచేయుచూ మెల్లగా దగ్గరకు చేరి నను గూర్చి విన్నవించవా తల్లీ!

                                       కూరిమి పేరిమిన్ కపిల గోరసముల్ నులిగోరు వెచ్చగా
నారిచియుంచితిన్ ఘనకృపాకర మీఱిక నారగింపుడీ
క్షీరములంచు నర్పణముఁ జేసెడు వేళనైన దాసునిం
గూరిచి విన్నవింపు రఘుకుంజరు తో దయయుంచి  జానకీ.
                
                           అమ్మా!జానకీదేవీ!  “ఓ దయా సాగరుడవైన రామచంద్ర ప్రభూ.! ప్రేమానురాగాలతో  కపిలథేనువు పాలను నులివెచ్చగా చల్లార్చి మీకోసం సిద్ధంచేశాను. ఇకనైనా స్వీకరించండీ “  అని స్వామి కి సమర్పించెడి ఆ మధురమైన  సమయంలో నైనా  ఈ దాసుని గూర్చి స్వామి తో వివరించు తల్లీ!

అతిశయ నవ్యసౌరభము లన్ని  కకుప్పుల నిండ నిండు న
ద్ఫుతమగు వింత యత్తరువుఁ బూయుచునో, ఘనసార దీప్తహా
రతుల మరించియో రఘువరా మన బిడ్డని మాట యేమి చే
సితిరని మాతృవత్సలత చే నడుగన్వలెనమ్మ జానకీ!
                               
                                        అమ్మా! అతిశయించిన క్రొత్త  పూల వాసనల ఘమఘమ లు దిక్కులు  నిండు చుండ గా అద్ఫుతమైన వింత వాసనల వెదజల్లు అత్తరును స్వామికి అలదేటప్పుడో , మంచి కర్పూరపు మంగళ హారతు లను అందిస్తూనో,  ఓ రఘువీరా. మన బిడ్డ విషయం ఏం చేశారని మాతృప్రేమ తో నీవే అడగాలమ్మా.!
                   
                               ఇక్కడ ముందు వెనుక ఒక ఇరవై పద్యాలను వ్రాసేటప్పుడు కవి కి వాల్మీకి రామాయణం లోని అయోథ్య , అరణ్య కాండలలో వాల్మీకి వర్ణించిన  చిత్రకూట, పంచవటుల లోని సీతారాముల విహారాలు గుర్తుకొచ్చాయనిపిస్తోంది. అనంతర కవులు కూడ సీతారాముల గోదావరీ తీర  విహారాలను మధుర మనోహరం గా వర్ణించారు కదా.!

 శ్రీ గుణశాలి లాలి! యతసీకుసుమాభ శరీర లాలి! ది
వ్యాగమ సన్నుతోత్తమపదాంబుజ లాలి యటంచు దాసికా
పూగము రాగతాళము లపూర్వము గా మణి హేమడోలికా
                  భాగమునం బరుండిన యపార కృపాంబుధి నూచుచుండగా – ( 69 )
                    అమ్మా! సీతమ్మ తల్లీ.!   నవరత్న ఖచితమైన బంగారు తూగుటుయ్యల పై పరుండిన అపార దయా సముద్రుడైన మా రామయ్య తండ్రి ని  “రామాలాలీ! మేఘశ్యామా లాలీ! దివ్యాగమ సన్నుతోత్తమ పదాంబుజ లాలీ! దశరథ తనయా లాలీ !అంటూ  సేవకా జనము  రాగతాళ పూర్వకంగా గానం చేస్తూ ఊయల ఊపుతుంటే  -------- 
       
    నూగుచుఁ దత్సమీపమున నుండిన నీ జలతారు పయ్యెదన్
లాగుచు హావభావ సువిలాసము లొప్పగ నార్తదీనర
క్షాగుణపాలినీ యని యెకానొకముచ్చట జెప్పువేళలన్
                                 నాగతి విన్నవింపు రఘునాధునితో దయయుంచి జానకీ !   (70)
                 శ్రీ రామభద్రుడు ఊయల ఊగుచూ ఆ సమీపం లో ఉన్న  నీ జలతారు పైటను విలాసం గా లాగుచూ “ఆర్త దీన రక్షా గుణ పాలినీ” అని పిలిచి  ముచ్చటించు  వేళ నా గతి కూడ తెలియచెప్పు తల్లీ.!
              
               ఆంథ్రమహా భాగవతం లో కుచేలుడు శ్రీకృష్ణ మందిరాన్ని చేరేసరికి శ్రీకృష్ణపరమాత్మ  తూగుటుయ్యల లోనే గదా దర్శనమిస్తాడు.  ఆ  సన్నివేశమే కవికి ఇక్కడ ప్రేరకమై “ఆర్త దీన రక్షా గుణపాలిని” యైన అమ్మ సీతమ్మ పైటను రామయ్య చేతిలో ఉంచాడు.
                                            
                                కొంతకుఁ గొంత నిద్దురను గూర విభుండు, సఖీజనాళి శు
ద్ధాంతము వీడునంత హృదయాధిపు తల్ప మలంకరించి యే
కాంత మిథ:ప్రసంగములయందు నొకింతగ నేని నాదు వృ
            త్తాంతము సెప్పుమా రఘుకులాబ్ది సుధానిథి తోడ జానకీ !   (71)
                      
                          అమ్మా! జానకీ దేవీ.! ఊయల ఊగుచూ స్వామి కొద్ది కొద్ది గా నిద్రలోకి జారుకుంటున్న వేళ , దాసీ జనమంతా  అంత:పురం నుంచి వెళ్ళిపోగా,  నీవు  శయ్యను అలంకరించి , ఏకాంత ప్రసంగాల సమయం లో కొంచెం గా నా విషయాన్ని  రఘుకులాబ్ది సోముని తోటి విన్నవించు తల్లీ.!
                                   

                                   

                                                                                         మూడవ భాగం ---త్వరలో





సీతారామశ్రీరామ శ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామ శ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామసీతారామ