Friday, 12 October 2012

రామాయణము-రమణీయకథనాలు -8 జటాయువు




                                               జటాయు వు
                           
   

                      శ్రీ మద్రామాయణం లో    జటాయువు ఒక పక్షి మాత్రమే కాదు.  ఒక ప్రథాన పాత్ర. సీతాపహరణం జరిగాక బాధా క్రోధ అవమానాలతో నలిగిపోతూ , ఏమైందో ,ఏమిజరిగిందో అర్ధంకాని అయోమయావస్థలో నున్న రామునకు సీతాపహరణాన్ని గురించి, రావణుని గూర్చి  ముందుగా చెప్పి రామబాణానికి లక్ష్యాన్ని నిర్థేశించిన  కీర్తి జటాయువు కే దక్కుతుంది.

                   జటాయువు దశరథునికి మిత్రుడు.అంతకు మించి రామభక్తుడు. ఒక పర్యాయం ఇంద్ర సభ నుండి తిరిగి వస్తూ శని ప్రబావానికి లోనై రథమునుండి జారిపోబోతున్న దశరథుణ్ణి రక్షించి అతనికి స్నేహితుడయ్యాడు. అదిఎప్పటిమాటో. కాని ఇప్పడు వయసుమీద కొచ్చి కూర్చొంది. వయసులో చేసిన సాహసాలు గుర్తుచేసుకొనే వయసుకొచ్చేశాడు.

                       అగస్త్య మహర్షి అనుజ్ఞ తీసుకొని చిత్రకూటానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులకు మార్గమథ్యంలో తారసపడతాడు జటాయువు. తనను తాను పరిచయం చేసుకోవడమే గాక దశరథుని తో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకొని రామచంద్రుడు తీసుకున్న నిర్ణయాన్ని హర్షించడమే కాకుండా ,రామలక్ష్మణులు ఏదైనా పనిమీద బయటకువెళ్లినప్పుడు తాను సీతమ్మ కాచు కుంటానని గూడ  కాపలాతనాన్ని మీద వేసుకుంటాడు జటాయువు. ఎందుకంటే ఆ సేవాగుణం వారి వంశం లోనే అనూచానంగా వస్తున్న ధర్మం.  

                           జటాయువు తండ్రి అరుణుడు . ఇతనినే అనూరుడు అని కూడా అంటారు.  వినత కశ్యపుల కుమారుడు. తల్లి తొందర పాటుతో గర్బవిచ్ఛిత్తి చేసుకోవడం వలన   అ -నూరుడు గా{ అనగా ఊరువులు లేని వాడుగా] జన్మించి, సూర్యభగవానునికి సారథి గా వెళ్లిపోయాడు. ఆది దేవుడైన ఆదిత్యునితో పాటు  అరుణు డై ప్రాత: కాలపు తొలి పూజలందుకుంటున్నాడు.
  
                 ఇతని బాబాయి గరుడుడు. ఈయనే సౌపర్ణుడు. తల్లి దాసీత్వాన్ని  పోగొట్టడానికి స్వర్లోకం నుండి అమృతాన్ని తెచ్చినవాడు. ఆ సమయంలో ఇంద్రుడు కోపించి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే  దాని దెబ్బకు ఒక ఈక మాత్రమే ఊడి, సుపర్ణుడని కొనియాడ బడిన వాడు గరుడుడు. ఇతనే గరుత్మంతుడై విష్ణుమూర్తి కి వాహనంగా ఉంటున్నాడు. పక్షిరాజు గా సేవలందుకుంటున్నవాడు.

       ఇతని సోదరుడు సంపాతి.  దక్షిణ సముద్రతీరం చేరిన వానరసైన్యము సీతాదేవి జాడ తెలుసుకోలేక హతాశులై అవమానభారంతో తిరిగి వెళ్లలేక,  వెళ్లినా అక్కడ జరిగే అనర్థాలను,   హఠాన్మరణాలను తలచుకొని,  చివరకు ప్రాయోపవేశమే శరణ్యమని చివరిసారిగా రామకథను చెప్పుకుంటూ జటాయువు వృత్తాంతాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో గుహలోనుండి బయటకువచ్చి తనసోదరుని మరణానికి దుఖించడమే కాకుండా, సీతమ్మజాడ  తెలియక మరణించడానికి కూడ సిద్దమైన  రామదండుకు మార్గనిర్ధేశం చేసి రావణుని లంకలో,  అశోకవనంలో ఉన్న  సీతమ్మ విషయాన్ని చెప్పి,  కింకర్తవ్యతా విమూఢులైన వానరసైన్యానికి నూతన జవసత్వాలు నింపి  కర్తవ్యోన్ముఖులను చేసిన పాత్ర సంపాతి.
               
                         రామదర్శనం కాకపోయినా పరోక్షంగా రామసేవలో తరించిన పాత్రలలో సంపాతి రెండవవాడు . పరోక్షంగా రామసేవలో తరించిన మొదటి పాత్ర స్వయంప్రభ అని ఇంతకు ముందే చెప్పుకున్నాం.{ రా.ర.క—2. } అంగద జాంబవంత  హనుమదాదులవంటి రామభక్తులచేత చితిని పేర్పించుకున్న అదృష్టశాలి సంపాతి.   ఇది వీరి  వంశ సేవా చరిత్ర.  శ్రీమహావిష్ణువుకు పానుపైన ఆది శేషువు కూడ వీరి వంశంలోని వాడే. అది వేరే సంగతి.
                       
          జటాయువు దశరథునికి మిత్రునిగా కన్పించినా , రామునిపై భక్తి భావమే ప్రబలంగా ఉంది. సీతను అపహరించి, తన రధంపై  ఆకాశమార్గం పట్టాడు రావణుడు. సహాయంకోసం ఆక్రందిస్తోంది అసహాయశూరుడైన రామచంద్రుని ఇల్లాలు .  కునుకులో ఉన్న జటాయువు  ఆ కేక కు ఉలిక్కిపడి లేచాడు. ప్రమాదాన్ని గుర్తించాడు. రావణుని రధానికి అడ్డంగా వచ్చేశాడు.
                     
                            అది దాస ధర్మంలో ప్రథమ లక్షణం. ఈపని తనవల్ల అవుతుందా లేదా అని అతను ఆలోచించడు.ఈ పని తన ప్రభువు కోసం తాను చేయాలన్నదే అతని ధ్యేయం . విజయం సాధిస్తే  ప్రభువు చేసే ప్రశంస చాలు. మరణిస్తే అంతక మించిన ఆత్మతృప్తే లేదు. ఇదే దాసగుణం ఆంజనేయుణ్ణి సముద్రం దాటించింది. సీతమ్మను చూపించింది. లంకను కాల్పించింది.శ్రీ రామచంద్రుని కి చూడామణి ని అందించి  రఘురాముని బిగి కౌగిలిని కానుకగా పొందింది ఇదే దాసగుణం. లక్ష్మణుని చేత” పరవానస్మి “అని పించినా,  భరతుని చేత   “రాజ్యం చాహంచ రామస్య” అని పించినా  అది దాసభక్తే. స్వామి కార్యాన్ని ప్రతిఫలాపేక్షలేకుండా చేయడమే దాసునకు ఆనందం. అందుకే ------- {  “నా   ప్రభువుకు  ప్రియము చేకూర్చడానికి  ఈపని  నేను చేసితీరాలి ” అను కుంటాడు దాసుడు}.

   “ అవశ్యం తు మయా కార్యం  ప్రియంతస్య  మహాత్మనం  “  అంటాడు జటాయువు.
                     
                  ముసలి పక్షిని చూసి  హేళనగా బాణాలను గుప్పించాడు రావణుడు. చంచువులతో పొడుస్తూ, నఖాలతో గ్రుచ్చుతూ రావణుణ్ణి గాయపరిచాడు జటాయువు. సారథిని చంపి విల్లువిరిచి రథాన్ని తునాతునకలు చేశాడు.రథం నాశనం కాగా సారథి గుఱ్ఱాలు మరణించగా  భూమిమీద పడ్డాడు రావణుడు.

               “ తస్య తీక్ష్ణనఖాభ్యాంతు చరణాభ్యాం మహాబల:
                 చకార బహుధా గాత్రే వ్రతా న్పతగ  సత్తమ:  “  {  వా.3-71-5}

                 కొద్ది సేపు పోరాటం  తర్వాత వృద్దుడైన జటాయువు అలసిపోయాడు.అవకాశం తీసుకొని చంద్రహాసం ఝళిపించాడు రావణుడు.రెక్కలు తెగిన జటాయువు రక్తసిక్త గాత్రంతో నేల కూలాడు.  ఇదే అదను గా భావించి వేగంగా పారిపోయి  సీతను అశోకవనంలో నిలిపాడు రావణుడు. 
                                       
                      జటాయువు రావణునితో యుద్ధం చేసినంత సేపు అతనిని చంపుతానని అనలేదు. అనడు.ఎందుకంటే అతడు రావణుణ్ణి సంహరించలేడు. ఆ విషయం అతనికే తెలుసు. రామలక్ష్మణులు వచ్చేవరకు  రావణుని  గమనాన్ని ఆలస్యం చేద్దామనే ప్రయత్నమే జటాయువుది.  అందుకే—“ముహూర్తం తిష్ట రావణ”  “నహిమే జీవమానస్య నయిష్యసి శుభామిమామ్” {నేను బతికి ఉండగా ఈమెను నీవు తీసుకొనివెళ్లలేవు} “జీవితేనా2పి రామస్య,” “కిన్నుశక్యం మయాకర్తుం గతౌదూరం నృపాత్మజా” ,  “ముహూర్తం పశ్య” “ యుద్ధాతిథ్యం ప్రదాస్యామి” {వా.3-50-224-264 వరకు} ఇత్యాది పలుకులతో  రెచ్చగొడుతూ ముక్కుతో పొడుస్తూ గోళ్ళతో రక్కుతూ రావణుణ్ణి పీడిస్తాడు .ఇందుకు ప్రథానకారణం రావణుని ప్రయాణాన్ని వీలైనంత సేపు అడ్డుకొని ఆలస్యం చేయడమే.
   
                    ఈ పని  తాను చేయగలనా? లేదా? అనే సందేహం దాసునకు కలుగదు. స్వామి కార్యాన్ని చేయడమే దాసునికి ఆనందం.అందుకే ముసలివాడు, నిరాయుధుడు, అసహాయుడు నైన జటాయువు తన ప్రాణాల నర్పించి స్వామి సేవలో తరించాడు.


              
                          జటాయువు పడిన ప్రదేశము,జటాయుమంగలం,కొల్లంజిల్లా,కేరళ.

     
                    రావణునిచే కొనిపోబడుతున్న సీతాదేవి సైతం చెట్టుపై నిద్రిస్తున్న జటాయువును చూచి తనను రక్షించమని ప్రార్థించలేదు . నిరాయుథుడు వృద్ధుడునైన  జటాయువు  ఆయుధదారి యైన రావణుని ఎదిరిస్తే మరణిస్తాడు. తన పరిస్థితిని రామలక్ష్మణులకు  చెప్పడానికి సాక్షి కూడ మిగలడనే భయం సీతకుంది. అందువల్లనే 

    “  నైషవారయితుం శక్య స్తవ క్రూరో నిశాచర
     సత్వవాన్ జితకాశీచ సాయుధశ్చైవ దుర్మతి “{ వా-3-49-40}

          ఆయుధధారి యైన వీనిని నీవు ఎదుర్కొనలేవు. రామలక్ష్మణులతో నావిషయం వివరంగా చెప్పవలసిందనే ప్రార్ధించింది.  కానీ ,-- జటాయువు దాసుడు.ప్రాణభయంతో పారిపోవడం  దాసలక్షణమే కాదు.     

       “ దశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్యసంశ్రయ”  అని తనను తాను పరిచయం చేసుకుంటాడు జటాయువు. ఈ భాగంలో ---

     “ పురాణే సనాతనే ధర్మే – దాస్యవృత్తా విత్యర్థ: – స్థిత:  తదేక పరాయణ: – సత్యం –సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇత్యుక్త:  పరమాత్మా సంశ్రయ: ఆలంబనం యస్యస: – భగవదేకోపాయ నిష్ట ఇత్యర్థ: 3  -------------- మయిదాసే  స్థితే తవ సీతాపహరణం         న యుక్త మితి భావ : “  [ చతుర్వాఖ్య-1214-124 ]  అని గోవిందరాజీయం, --జటాయువు  లో దాసత్వాన్ని నిరూపించింది.

                   రావణుని కొంతసేపు నిలువరిస్తే  రామలక్ష్మణులు వస్తారనే ఆశే  జటాయువు ని యుద్దానికి సిద్ధం చేసింది. “యది శూరో2స్తి ముహూర్తం తిష్ట “ అన్నమాటల్లోని ధ్వని ఇదే. ముహూర్త కాలం లో రాముడు రాగలడనే విశ్వాసం జటాయువుది.” రామో యుధి వధిష్యతి “[3-50-23} అంటాడు.  చివరకు ప్రాణాలిచ్చైనా నేను వారికి ప్రియం కలిగిస్తాను.{ అవశ్యం తు మయా కార్యం ప్రియంతస్య మహాత్మనం} అన్న పలుకులు  ప్రభుసేవలో ప్రాణత్యాగానికి సిద్ధమైన సేవకునివి.
                  అసలు జటాయువు రాముడు  వచ్చేవరకు జీవించి ఉండటానికి కారణం  సీతానుగ్రహమేనని స్కంద పురాణం చెపుతోంది.

          “దేవీ మాం ప్రాహ రాజేంద్ర యావత్సంభాషణం మమ
            భవతస్తావ  దాస న్మే ప్రాణ ఇత్యాహ జానకీ”

 రాముని అనుగ్రహంతో మోక్షప్రాప్తి లభించింది జటాయువుకు.

              “ రాఘవస్య ప్రసాదేన స గృధ్ర: పరమం పదమ్
                హరే: సామాన్యరూపేణ ముక్తిం ప్రాయాత్ఖగోత్తమ:”

                  రామభక్తితో ముక్తి నందిన జీవరాశిలో జటాయువు అగ్రగణ్యుడు. అనన్యమనస్కుడై, భగవంతుని కొఱకు పోరాడి ప్రాణాల్ని ధారవోసి , ఆయన సమక్షంలో , ఆయనపై దృష్టి నిలిపి, ఆయన చేతుల్లోనే మరణించి ,ఆయన చేతనే శాస్త్ర విహిత సంస్కారాలు పొందిన ధన్యజీవి జటాయువు. 

                   జటాయువు మానవ పరిభాషలో  గొప్ప అదృష్ట వంతుడు. ఎందుకంటే                 దశరథునికి  కూడ లభించని అదృష్టం జటాయువు కి లభించింది .ఏ వ్యక్తి కైనా గొప్ప సంపద సంతానం. అది గృహస్థాశ్రమ ధర్మం. ఏ గృహస్థుడైనా  చివరి సమయంలో తన బిడ్డలు  తనప్రక్కన ఉండాలని కోరుకుంటాడు. కాని దశరథునికి నలుగురు కొడుకులున్నా మరణసమయంలో ఎవరూ దగ్గరలేరు. శ్రీ రామచంద్రుని కన్నతండ్రి కి  విథి రాసిన ఱాత అది. జటాయువు ను మాత్రం రాముడు  దగ్గరుండి నేలపై పరుండబెట్టి ఓదార్చాడు .అపరకర్మలు చేశాడు. అతని కోసం దు:ఖించాడు.ఉత్తమ లోకాలను ప్రసాదించాడు.
              
              “ సీతాపహరణజం దు:ఖం న మే సౌమ్య తథావిధమ్
                   యథా వినాశే గృధ్రస్య  మత్కృతేచ పరంతప”{ వా-3-68-26 ]

“  సీతాపహరణం వలన కలిగిన దుఖానికన్నా పక్షిరాజు నాకోసం మరణించాడన్న  బాధే ఎక్కువుగా వుంది”అం టాడు రామచంద్రుడు.
                    
                      “ రాజా దశరథశ్ర్శ్రీమాన్సధా  మమ మహాయశా:
                        పూజనీయశ్చ మాన్యశ్చ తథాయం పతగేశ్వర”{ వా- 3-68-28  }

                 “ నాకు  నాతండ్రి యైన దశరథుడు ఎంతటి పూజనీయుడో, ఈపక్షి రాజు కూడ అంతే పూజనీయుడని” నివాళి ఘటించడమే కాకుండా----- 
                       “ మయాత్వం సమనుజ్ఞాతో గ్చ్ఛలోకాననుత్తమాన్
                        గృధరాజ మహాసత్త్వ సంస్కృతశ్చ మహాప్రజ”{ వా-3-68-30}

                అంటూ  యజ్ఞశీలురు, ఆహితాగ్నులు  భూదానం చేసినవారు  ఎటువంటి ఉత్తమ లోకాలను పొందుతారో అటువంటి లోకాలను పొందవలసినదిగా  ఆదేశిస్తాడు. అంటే  రామచంద్రుడు  తన తండ్రి కోసం ఏమి చేయలేదో అదికూడ జటాయువు కోసం చేసాడు. అంటే భగవానుడు దాసజనపక్షపాతి యనేది   మరొకసారి ఋజువైపోయింది.” సిరికిన్ చెప్పక  శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపక--------- గజప్రాణావనోత్సాహియై”  బయలుదేరిన లక్ష్మీనాథుని  భక్తజన పక్షపాతి కాడని ఎవ్వరనగలరు. ?


     రామాయణం మొత్తం మీద రెండు పాత్రలు మాత్రమే సీతారాములకోసం ప్రాణత్యాగం చేసినట్లు మనం గుర్తించవచ్చు. ఒకరు దశరథుడు. రెండవవాడు జటాయువు. జటాయువు త్యాగం  దశరథుని కంటే గొప్పదిగా కన్పిస్తుంది.  కావుననే”-సుగ్రీవో హనుమాన్ ఋక్షో గజోగృధ్రో...”.అంటూ ముక్తుల నడుమ స్తుతిపాత్రుడైనాడు . 

                   దశరథుడు రాముని ఎడబాటు సహించలేక మరణిస్తే, జటాయువు సీతమ్మ కోసం ప్రాణత్యాగం చేసింది. తనుచేసిన  త్యాగానికి కన్నీరు కారుస్తున్న ప్రభువు చేతుల్లో మరణిస్తున్న  జటాయువు కన్నుల్లో ఎంత ఆనందం, ఎంత ఆత్మసంతృప్తి ,  ఎంత ప్రభుభక్తి, పొంగులు వారిందో  మన ఊహలకు అందదు.  అందుకే సేవాధర్మానికి, త్యాగగుణానికి  జటాయువు ఒకప్రతీకగా, ఒక చిహ్నంగా నిలిచిపోయింది. 





                      జటాయు తీర్థం -రామేశ్వరం                                  చిత్రాలు-గుగుల్ సౌజన్యంతో

                జటాయువు కు అంత్యక్రియలు  చేయడానికి  ఆరు నదుల తీర్థంతోపాటు  గయ తీర్థాన్ని కూడ  రామచంద్రుడు తన బాణం చేత ఆకర్షించాడు. దానినే “జటాయు తీర్థం “అని పిలుస్తున్నారు . ఇది కేరళ లోని  విజయరాఘవస్వామి దేవాలయం.తిరుపత్తుకుంజి లో మనకు కన్పిస్తుంది. ఇది   సకలపాపహరణం గా ప్రజలు భావిస్తున్నారు.                      పడిపోయిన  జటాయువును  చూచిన రామచంద్రుడు   ఎక్కడ  ” లే “అని ఆజ్ఞా పించాడో                 ఆ ప్రదేశమే “ లే-పక్షి “> అయి లేపాక్షి అయ్యిందని కొందరి వాదన. అదే మన అనంతపురం  జిల్లా లోని “లేపాక్షి “ దేవాలయమని వీరి వాదన.
  


 ************           గృధ్రాధిప గతి దాయక రామ   ************************                        

Sunday, 7 October 2012

అంతా రామమయం –మరొక అనుబంధం


                               
అంతా రామమయం –మరొక అనుబంధం

                                      ప్రపంచంలోనే శ్రీమంతుడైన మన ఏడుకొండల శ్రీనివాసునకు గత రెండువేల సంవత్సరాలుగా ఎంతోమంది సార్వభౌములు,  చక్రవర్తులు, సామంతుల,నుండి సామాన్య భక్తుల వరకు సమర్పించిన బంగారు నాణాలను “ సాక్షి దినపత్రిక” ఆదివారం 15 సెప్టెంబరు 2012 సంచికలో ప్రచురించింది. దీనిలో క్రీ.శ 1వ శతాబ్ధంలో రోమన్ చక్రవర్తి  కాలం లో ముద్రించిన రాజు రాణి తోకూడిన అరుదైన నాణాలు,” క్రీ.శ 8 నుంచి10 వ  శతాబ్ధం లోని పశ్చిమ గంగరాజుల నాణాలు....తర్వాత పల్లవులు,హోయసాళులు  చోళులు  పాండ్యులు యాదవులు విజయనగరరాజులు వరహాలు గద్దేనము ఫణం పోనులు  మొఘల్ అక్పర్ హైదరాలీ టిప్పుసుల్తాన్ బ్రిటీషు ఈస్టిండియా ముద్రించిన పగోడాలు, మొహర్లు, అష్రఫీలు
వీటిలో ఉన్నాయి “   అని వ్రాయబడింది .{ సాక్షిఫన్ డే  16-9-2012 -30 వ పేజి}                                                                                                                                                         
                   దీన్ని తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచిక గా “సాక్షి” అందించింది. వీనిలో మనం ప్రకటించిన బంగారు నాణెం లేక పోవడం  నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది . మ్యూజియం లో పెట్టబోయే నాణాల్లో ఉంటుందేమో వేచిచూడాలి. తిరుమలమ్యూజియంలో బంగారు నాణాలను సందర్శించే అవకాశాన్ని టి.టి.డి. కల్పించబోతుండటం ఆహ్వానించదగ్గదే.    విజ్ఞులతో పంచుకోవడానికే ఈ విషయాన్ని మీముందుంచుతున్నాను. ఈ నాణాలను ప్రచురించిన” సాక్షి దినపత్రిక “ కు కృతజ్ఞతలు.

                        
                                 సాక్షి పత్రిక లోనివి { ఛాయాచిత్రం}
 ఇది మనం ప్రచురించిన నాణెం
       ఛాయాచిత్రం
 ******************************************************************************

Tuesday, 2 October 2012

రామాయణము - రమణీయకథనాలు -7 - భరతుడు

                
                    
                     భ ర తు డు 
      
          

                      శ్రీ మద్రామాయణం లో రామచంద్రుని  కీర్తి చంద్రికలను ఒరుసుకొని నిలబడగల్గిన గుణభద్రుడు కైకేయీపుత్రుడు భరతుడు. ఏ అధికారం కోసం  ,రాజ్యభోగాలకోసం భారతం లో రక్తపుటేరులు పారాయో, దేనికోసం వాలి సుగ్రీవులు , రావణాదులు తమలో తాము సంఘర్షించుకున్నారో అటువంటి రాజ్యలక్ష్మి కోరి వచ్చినా వలదని తృణీకరించాడు.           

                           భ్రాతృసేవాపరాయణుడై, దాసాను దాసుడుగా మారి, సభామథ్యంలో “రాజ్యం  చాహం చ రామస్య” అంటూ దోసిలి యొగ్గి,రామచంద్రుని తీసుకొనిరావడం కోసం చిత్రకూటానికి వెళ్లి, ఆయన మాటలను త్రోసిపుచ్చలేక, పాదుకలతో మరలి, రాముని పేరనే పదునాలుగేండ్లు నిష్కాముడై రామప్రతినిథిగా రాజ్యమేలిన సుగుణోదాత్తుడు, రాజయోగిగా,యోగిరాజుగా కీర్తి శిఖరాలనథిష్టించిన ఉదాత్తగుణోపేతుడు  భరతుడు.

                         పదునాలుగేండ్లు రాజ్యాన్ని పాలించి అన్నరామచంద్రుని  రాక ఆలస్యమైతే అగ్నిప్రవేశానికి సిద్ధపడిన నిష్కాముడితడు.” ఈ మహనీయుని కన్నతల్లి కైకేయి   ఏదైనా పాపం చేసి ఉంటే --   అది ఈ పుత్రుని పుణ్యవారాశి లో  ప్రక్షాళనం గావించబడి పవిత్రీకృతమైంది. భరతుని దృఢభక్తి , తృష్ణాపరాఙ్ముఖత మాతృమూర్తి కల్మషాన్ని సైతం కడిగివేసింది.” అన్నాడు మహాకవి కాళిదాసు.    

                                                                                                          
                            “ దృఢభక్తి రితి జ్యేష్టే రాజ్యతృష్ణా పరాఙ్ముఖ:
                              మాతు: పాపస్య భరత: ప్రాయశ్చిత్త మివాకరోత్ “

                భ్రాతృ ప్రేమలో రామభరతులిద్దరూ పోటీపడతారు.చిత్రకూటానికి వస్తున్న భరతుణ్ణి చూసి. యుద్దానికొస్తున్నాడని సందేహించి క్రోధించిన లక్ష్మణునితో శ్రీరాముడు  --
  
  “ వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్య మస్మై ప్రదీయతామ్ “{ వాల్మీకం-అరణ్య-97-17]
అంటాడు.” నీకు రాజ్యం కావాలంటే భరతునిక్ చెప్పి యిప్పిస్తా”నన్న రామునితో రామానుజుడు ఇంకేమనగలడు. రాజ్యభోగాల్ని భార్యా బంధువుల్ని వదలి అన్నవెంట అడవులకొచ్చిన తమ్మునికి అప్పుడర్థమైంది భరతుని ఔన్నత్యం.

               భరత లక్ష్మణులకు రామునియందున్న ప్రేమ అపూర్వమే.ఇరువురకు రాముడంటే ప్రాణం. ఇరువురు రాముని సుఖాన్నే గాఢంగా కాంక్షించారు.రాముని సేవనే వాంఛించారు.కాని ప్రవృత్తి లో తేడా ఉంది. లక్ష్మణునకు రాముని చెంతనే ఉండి ఆయన్ని దర్శించు కుంటూ సేవించుకోవడమే కోరిక. ధర్మాధర్మ విచక్షణ అతనికి అవసరం లేదు. రామచంద్రునికి సుఖం కల్గించడానికి ఎవరిని సంహరించడాని కైనా వెనుకాడని తత్త్వం అతనిది . లక్ష్మణునికి రామచంద్రుని యొక్క సుఖ సంతోషాలే ముఖ్యం
.
                 కాని భరతునకు  రాముని చెంత లేకపోయినా రాముని కొఱకు , ధర్మ బద్ధమయిన ఆతని ఆజ్ఞ కొఱకు శిర సొగ్గటం --  తాను ధర్మమని తలచిన దానిని రాముడు చెప్పినా అంగీకరించని స్థైర్య సంపద అతని కున్నాయి. రాజ్య స్వీకార నిరాకరణమే అందుకు ప్రబల  నిదర్శనం.తల్లికోరికలు , తండ్రివాగ్దానాలు అంగీకరించబడలేదు. జ్యేష్టుడే రాజు కావాలన్న   క్షత్రియధర్మం ప్రబలమైందక్కడ. అందుకే తాను రాముణ్ణి అంగీకరింపజేశాడు. రామ ప్రతినిథి గా మాత్రమే అయోథ్యను పరిపాలిస్తానన్నాడు. అదే చేసి చూపాడు. 
      
     రామునికి   భరతుని పైనున్న ప్రేమాధిక్యత ఎన్నోపర్యాయాలు వేరువేరు ప్రదేశాల్లో ప్రస్పుటమౌతుంది.దోహదక్రియలచే పెంచబడిన ఉద్యానలత వలె లక్ష్మణుని ప్రేమ రాముని చెంత రమణీయంగా పెరిగితే – భరతుని ప్రేమ  ప్రకృతిలో పెంపారు అరణ్యలతిక వలె గుబాళించినది. అడవిపూల పరిమళాలు వనలత లకు చెందవు కదా. అందుకే గుహుడు భరతునితో   ---   “ అయత్నా దాగతం రాజ్యం యత్త్యక్తు మిహేచ్చసి
      
     “  ధన్య స్త్వం న త్వయా తుల్యం పశ్యామి జగతీ తలే “ { వాల్మీకం-2-85-21}

లోకంలో నీవంటి వారిని చూడలేదన్న” గుహుని పల్కులు అక్షర సత్యాలు. భరతుని    పాత్ర బారతీయ సాహిత్యానికి మణిమకుటం. కాని రామచంద్రుని పాదాల చెంత శిరసు వాల్చిన ఆ మహాభక్తుని తన కాంతిలో లీనం చేసుకున్న శ్రీరాముడు – ఏకరూపుడుగా విరాజిల్లాడని   పిస్తుంది.          
                  అయాచితంగా వస్తున్న రాజ్యాన్ని వదిలి వేసి, భూశయనం ,జటావల్కల థారణం వ్రతంగా స్వీకరించి, పాదుకాపూజలో పథ్నాగేళ్లు గడిపిన రామభక్తుడు  భరతుడు . కర్మిష్ఠి. రాజయోగి. అందుకే వేదాంత దేశికులు –“తన యుపజ్ఞామహిమచే సమస్త భూమియందును రామపాదుకా ప్రభావాన్ని సమారూఢ మొనర్చిన భక్తవరులలో భరతుడు ప్రధాను” డంటారు.

         “ భరతాయ పరం నమో2స్తు నిత్యం ప్రధమోదాహరణాయ
          భక్తిభాజాం యదుపజ్ఞ మశేషత: పృధివ్యాం ప్రథితో రామపాదుక ప్రభావ:
                 





                               వేదనతో క్రుంగేటప్పుడు ,ఆనందంతో పొంగేటప్పుడు శ్రీరామునకు భరతుడే 
గుర్తుకొచ్చేవాడు. వారి ప్రేమ అటువంటిది.  ఆనందంలోను ,వేదనలోను, అయినవారే కదా మనకు గుర్తు   కొచ్చేది. భరతుని లోని భ్రాతృభక్తి  కన్నా” త్యాగభావనే” అతను రాముని వద్దకు చేరడానికి తోడ్పడింది.అతని విశుద్ధ ప్రేమ వర్తనం మానవ ప్రపంచంలో భ్రాతృప్రేమకొక పవిత్రోదాహరణ గా నిలిచిపోయింది.   
        
               “ న సర్వే భ్రాతరస్తాతే భవంతి భరతోపమా:” {వా.6-14,15 } అన్న రాముని పల్కుల్లోనే భరతుని ఔత్కృష్ట్యం విరాడ్రూపంగా భాసిస్తుంది.” అహమేవ నివత్స్యామి చతుర్ధశ వనే సమా:” అని అరణ్యం లో పిత్రాజ్ఞ కు లోబడి  పథ్నాలుగు సంవత్సరాలు నిలుస్తానని భరతుడు సిద్ధపడితే –“ జానామి భరతం క్షాంతం గురు సత్కార కారణమ్”  అని మెచ్చుకొని –
             “ అనేన ధర్మశీలేన వ్రతాత్ ప్రత్యాగత: పున:
              భ్రాత్రాసహ భవిష్యామి పృధివ్యా: పతిరుత్తమ:”       {వా.2-62-12}

      తమ్ముని    ప్రార్థనను మన్నించి, పథ్నాలుగేళ్ల తర్వాత అతనితో కలిసి రాజ్యాన్ని పంచుకుంటానంటాడు జ్యేష్టుడు. రాముని చెంతనుండి రామసేవలో ఆనందాన్నిపొందిన తమ్ముడు లక్ష్మణుడు కాగా, అన్నగారికై అయోథ్య నే అరణ్యంగా భావించి జీవించిన మహనీయుడు భరతుడు.ఒక్కమాటలో చెప్పాలంటే---ఇంతటి త్యాగమూర్తి ,ఋజువర్తి ,భ్రాతృవత్సలుడు, ప్రజాశ్రేయ కాముడు నిష్కామకర్ముడైన ఉత్తమపాత్ర  నాన్యతోదర్శనీయం.
                
           “  రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరం  “అన్న దశరథుని పల్కుల్లోను ,”దిష్ట్యాన చలితో ధర్మాదాత్మతే శుభలక్షణ “ అని కౌసల్య --- “ సత్యసంధే మహాత్మని” --- “ అనేన ధర్మశీలేన భరత: ఖలు ధర్మాత్మా” “ భరత స్సత్యవిక్రమ:” అన్న సముదాత్త ప్రశంసలు వాల్మీకివి . వాల్మీకి  రామునివి.{ వా. రా.2-61,62,}

                  వాల్మీకంలో చిత్రకూట సమాగమం అత్యంత కరుణరససంభరితమైన సన్నివేశం కాగా రామచరితమానస్ లో భరతుని పాత్ర మరింత రమ్యత
నాపాదించు కొంది.చిత్రకూట వాతావరణమంతా ఆ సౌభ్రాత్ర సౌరభం తో నిండిపోతుంది.ఈ ఘట్టం వేయి ప్రయాగల కన్నా పవిత్రమైనదని  రామాయణ విమర్శకులు భావించారు.
      
                  భరతుడు చిత్రకూటానికి తరలి వస్తున్నాడనితెలిసి , ఉత్తేజితుడైన లక్ష్మణునితో రాముడు ఇలా అంటాడు.
      “ కహేతాత్ తుమ్హసీతి సుహా ఈ  …………………….
         ……………………….               భారసింథు బినసాఇ “{ రా.మానస్-అ.దో.230.-3,4}
           “  నాయనా లక్ష్మణా నీవు చక్కని నీతి వాక్యాన్ని  చెప్పావయ్యా  నిజమే రాజ్యధికారం వల్ల కలిగే అహంకారం అన్నింటికన్నా ప్రమాదభూయిష్టమైంది. కాని భరతుని వంటి వ్యక్తి ఈ బ్రహ్మ సృష్ఠిలో ఉన్నాడని వినలేదు .కంటితో చూడలేదు.బ్రహ్మ విష్ణు మహేశ్వర పదవులు లభించినా భరతునకు అహంకారం కలుగదు. ఈ అయోథ్య ఒక లెక్కా. ఒక గంజి బొట్టు పడినందు వల్ల క్షీరసాగరం మలినమవుతుందా.? “ ఈ ఒక్క ఉదాహరణ చాలు. రామభక్తులకు భరతుని పై నున్న  ప్రతిపత్తి ఎటువంటిదో తెలుసుకోవడానికి . 
     
           ఈ సందర్భంగా ఒక  తెలుగు కావ్యం లోని చక్కని సన్నివేశం గుర్తుకొస్తోంది.రామ పరిష్వంగ భాగ్యాన్ని పొందిన అదృష్టశాలి మన పవనసుతుడు. ఇతనికే భరతుని కౌగిలి కూడ లభిస్తే ఇక  ఆనందానికి అవధులుండవు కదా. అదే ఇక్కడ జరిగింది.

                రావణ వథానంతరం అయోథ్య బయలుదేరిన రాముడు వాయుసుతుని పిల్చి ముందుగా అయోథ్య కు వెళ్లి  భరతుని చూచి  క్షేమసమాచారాలు అందించి,వివరాలు తెలుసుకొని రావలసిందిగా పంపిస్తాడు. అయోథ్య కు వెళ్లి జడలు కట్టిన శిరోజాలతో, చిక్కిన శరీరంతో , మునివృత్తిలో  ఉన్న వాణ్ణి ,కటికనేల మీద పడుకోవడం వలన కాయలు కాసిన వెన్ను ,ప్రక్క  భాగాలు కల్గిన  భరతుని దర్శించి, అతని మనోభావాలు తెలుసుకొని, తిరిగివచ్చి, భరద్వాజాశ్రమంలో ఉన్న రామునకు విన్నవించుకున్నాడు.

           “   రామ  వార్తను చెప్పితి రమ్యచరిత   నీ ఋణమ్మును చెల్లింప నేర ననుచు 
   అలముకొనె నన్ను- అదియేమి యద్భుతమ్మొ నీ పరీరంభ గతి నిల్చె నెమ్మనమున”
                                                {  భారతం-  రా.వసునందన్ -608.612 ప}
           రామచంద్రుని ఆగమన వార్తను  తెల్పిన ఆంజనేయునకు  నీ ఋణం
 నేను తీర్చలేనంటూనే  “కౌగిలి “ని కానుకగా ఇచ్చాడు భరతుడు. భరతుని కౌగిలి లో     "రాముని కౌగిలి” అనుభూతి ని పొందానని చెపుతున్నాడు ఆంజనేయుడు.” మరువలేని అనుభూతి మైథిలీ నాథుని పరిష్వంగమని” రామ భక్తులను ఊరిస్తున్నాడు. ఇక్కడ రామ భరత అభేద ప్రతిపాదనే కవి లక్ష్యం . ఇటువంటి ఘట్టాలు రామ కావ్యాల్లో కొల్లలు గా కన్పిస్తాయి.
                 కైకేయి దుశ్చర్య వల్ల ఛిన్నాభిన్నం కాబోతున్న ఉమ్మడి కుటుంబవ్యవస్థ ను,దాని గౌరవ మర్యాదల్నికాపాడటమే కాకుండా ఉమ్మడి కుటుంబం లో జ్యేష్టుని కివ్వాల్సిన  స్ధానమేమిటో ప్రపంచానికి తెలియపర్చిన మహోన్నత పాత్ర భరతుడు .లేకపోతే 10,000 సంవత్సరాలకు పూర్వమే భారత జాతి గర్వంగా చెప్పుకుంటున్న ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ      మటుమాయమై పోయేది.  ఆంజనేయుని తర్వాత రామభక్తులు పూజించే భక్తాగ్రగణ్యుడు భరతుడే ! రామ పాదుకాశ్రిత భక్త శేఖరుడు  భరతుడు. అందుకే భరతునికి గుడికట్టి పూజలు  కూడ చేస్తున్నారు రామభక్తులు.                                                                                  

                    The Koodalmanikyam Temple in the state of Kerala is the only temple of Bharata in India.                  {wiki pedia –bharata]



**************** శ్రీ రామ రామ భరతాగ్రజ  రామ రామ  *********9441056609**