Friday, 5 February 2016

శతకసౌరభాలు -8 జయజయ శ్రీనివాస- శ్రీవల్లి -2


శతకసౌరభాలు -8

  జయ జయ శ్రీనివాస- శ్రీవల్లి -2

                              




                                      శిల్పి వీవు నీ సురుచిర శిల్పమేను

                                    ద్రష్ట వీవు నీ సులలిత దృష్టి నేను
                                   స్రష్ట వీవు నీ సుమధుర సృష్టి నేను
                                    స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!


                  
                   ఆనంద నిలయ వాసా  ! శ్రీ శ్రీనివాసా ! నీవు శిల్పివి.  నీవు చెక్కిన   అందమైన శిల్పాన్ని నేను. నీవు ద్రష్టవు. నేను నీ సులలితమైన దృష్టిని. నీవు స్రష్టవు . నేను నీవు సృష్టించిన మనోహరమైన సృష్టిని. నీకు జయమగు గాక !.

అల్పజీవియు మంచి సంకల్పమున్న
గొప్పవారి గౌరవము గైకొన గలండు
ఉడుత బుడత రాముని ప్రేమ నొంద లేదె
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
            
                        శ్రీ శ్రీనివాసా!  అల్పుడైన వాడు కూడ సంకల్పబలముంటే  గొప్పవారి చేత సైతం గౌరవించబడతాడు. సేతు నిర్మాణ సమయం లో  అల్పజీవియైన ఉడుత  శ్రీరామచంద్రుని చేత  మన్నించబడింది కదా !
                   
                                        భక్తి  పరవశులైన  సద్భక్త వరుల
గుణమె గణనీయమగు వారి కులము కాదు
శబరి బదరీ ఫలాలు దాశరథి తినడె
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
            
                 తిరుమల గిరి వాసా !  శ్రీ వేంకటేశా ! మహా భక్తుల సద్గుణములే వారిని గొప్పవారిగా  చేస్తాయి కాని  వారు పుట్టిన కులము వలన వారు  ఉన్నతులు గా కీర్తించ బడరు. శబరి కాంత అందించిన పండ్లను రామచంద్రుడు ప్రేమతో స్వీకరించడం లోని  నీతి ఇదే కదా! .

కాని పనులకు జని హాని గనుట కంటె
ఉన్నదాననె సంతృప్తి నొంద మేలు
వాలి జోలికి పోయి రావణుడు చెడడె
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
            
                శ్రీ శ్రీనివాసా ! కొఱగాని పనులకు వెళ్లి ప్రాణహాని తెచ్చుకున్న దాని కంటే ఉన్న దాని తో తృప్తిచెంది జీవించడం మేలు . ఎందుకంటే రావణుడంతటి వాడు ఉన్న చోట ఉండకుండా వాలి చెంతకు వెళ్లి పరాభవము ను పొందాడు కదా!.

సిరులు చేకూర తను దాను మరచునేని
స్నేహమా అది మిత్ర విద్రోహ మగును
మాధవుండు కుచేలుని మరచినాడె
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
            
                  శ్రీ శ్రీనివాసా ! చిరుదరహాసా ! సంపదలు కూడగానే కన్నుమిన్ను కానక ప్రవర్తించడం అది స్నేహమనిపించుకోదు. మిత్ర ద్రోహ మనిపించుకుంటుంది.  భారతం లో ద్రుపదుడు తన సహాధ్యాయి , మిత్రుడు నైన ద్రోణుని అవమానించి ముప్పు తెచ్చుకున్నాడు. కాని భాగవతం లో శ్రీకృష్ణుడు తన చిన్ననాటి మిత్రుడు, పరమ దరిద్రుడు నైన కుచేలుని ఆదరించి మన్నించి స్నేహానికి అర్ధాన్ని తెలియచెప్పాడు.                   

 ఎంతవాడైన నితరుల చెంత చేరి
చేయి జాచుట యన చాల చిన్న బోవు
బలి నడుగ వామనులు గారొ ప్రభువు గారు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!   (29)
                 
             శ్రీ  శ్రీనివాసా ! చిద్విలాస భాసా ! ఎంత గొప్పవాడైన  పరుల వద్దకు యాచనకు వెళ్ళితే ఎంత చిన్నపోతాడో  నీవు బలి వద్దకు వామనుడి గా వెళ్లి లోకానికి తెలిపావు గా స్వామీ. విశ్వవ్యాపి వై, విరాడ్రూపుడవైన నీవు వామనుడవైన వైనం యాచనావృత్తి లోని చిన్నతనాన్ని (వామనత్వాన్ని) లోకానికి ఎఱుక చేసింది ప్రభూ!.

ధర్మపథము వీడని మహోదారమతికి
సాయమగు చుండు జంతు సంచయము కూడ
రామకార్యము దీర్చె మర్కటము లెల్ల
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (28 )
         
                  ఆపద మొక్కులవాడా! అనాథ రక్షకా ! ధర్మ మార్గం లో నడిచే మహాను భావులకు లోకం లో జంతుసంతతి  కూడ సహాయం చేస్తాయి. రామకార్యానికి కోతులు చేసిన సాయం  లోకానికి తెలియనిది కాదు గదా ! .

దుష్టకర్ము దురాచారు ధూర్తమతిని
 అనుజులైన త్యజించెద రంత మందు
విడిచి రాడె రావణుని  విభీషణుండు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (29 )
         
              శ్రీ వేంకటేశ్వరా ! దురాచార పరాయణుడు , ధూర్తుడు , దుర్మార్గుడు నైన వాడిని చివరి సమయం లో సోదరులు కూడ వదిలి వేస్తారు. విభీషణుడు రావణుని వదిలివేసిన వృత్తాతం లోక విదితమే కదా ! .
                     ఈ గ్రంథరచనా విధానం భక్త్యావేశం లోను ఒక ప్రణాళికా బద్ధం గా కొనసాగిందని మనం భావింపవచ్చు. ఎందుకంటే 21 వ పద్యం నుండి30 వ పద్యం వరకు రామాయణ కధాఘట్టాలను ప్రస్తావించిన రచయిత్రి 32 వ పద్యం  40 వరకు  శ్రీ ఆది నారాయణ మూర్తి ధరించిన దశావతార వైభవాన్ని వర్ణించి తరించింది. 
సోమకుని వ్రచ్చి బ్రహ్మకు శ్రుతుల నిచ్చి
విశ్వ సాహిత్యలక్ష్మి కి వెలుగు దెచ్చి
పేరు గాంచిన మత్స్యావతార మీవ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (31)
                శ్రీ శ్రీనివాసా ! సోమకాసురుని సంహరించి  వేదాలను పరిరక్షించి విశ్వ సాహిత్య లక్ష్మి కి వెలుగు లందించిన  మత్స్యావతార మూర్తివి నీవే కదా ప్రభూ !. నీకు జయమగు గాక ! .

పాలమున్నీట మందర పర్వతమ్ము
మునిగిపోకుండ జొచ్చి వీపున ధరించి
కీర్తి గాంచిన శ్రీ కూర్మమూర్తి వీవ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
          
         శ్రీ  వేంకటేశా !  క్షీరసాగర మథన సమయం లో మందర పర్వతం మునిగిపోకుండా కూర్మమూర్తివై,  మందర పర్వతాన్ని వీపున భరించి  అమృతోద్బవానికి కారణమైన కీర్తిమంతుడవు, దివ్య రూపుడవు నీవే కదా ! .

సకల ధాత్రీ తలంబును చాప చుట్టి
పరువు లెత్తు హిరణ్యాక్షు పట్టి చీల్చి
ధరణి నేలు వరాహవతార మీవ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!(33) 
                     
                     శ్రీ శ్రీనివాసా ! సురుచిర దరహాసా ! మా పాలిటదైవమా ! సమస్త భూ మండలాన్ని చాప చుట్టగా చుట్టి పట్టుకు పోతున్న హిరణ్యాక్షుడిని పట్టి   సంహరించి  ధరణి ని   ఏలిన పరంధాముడవు నీవే కదా! .
                                 విల్లు చేజార కర్తవ్య విముఖుడైన
పార్ధు గీతాప్రబోధఁ గృతార్థు చేయు
విజయసారథి నీవ గోవింద దేవ
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస!   (38)
               
                శ్రీ పద్మావతీ  వల్లభా ! శ్రీ శ్రీనివాసా ! కురుక్షేత్ర సంగ్రామం లో కౌరవసేనను చూసి యుద్ధ పరాఙ్ముఖుడైన అర్జునునికి  గీతోపదేశం చేసి జగద్గురువైన విజయసారథివి నీవే కదా! తిరుమల వాసా !గోవిందా ! నీకు జయమగు గాక !
క్రూర ధూర్త స్వభావుల బారి నుండి
భారతావని స్వాతంత్ర్య భావమంద
ఖడ్గ మూనెడు కళ్యాణ కల్కి వీవ
                   స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!        (40)
           
   శ్రీ శ్రీనివాసా! పాపపంకిలమైన కలియుగాంతమునందు  దుష్టుల బారి నుండి ఖడ్గధారివై భారతావనిని  రక్షించెడి  కళ్యాణకల్కి రూపుడవు నీవే కదా వేంకటేశా !
సత్యరూపుడ నీవు నే సత్యమగుదు
సాధ్యుడవు నీవు నే సాధనమును
శ్రుతివి నీవు నిన్నంటిన స్మృతిని నేను
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! 

                         శ్రీ ఏడుకొండల వేంకటేశ్వరా !  నీవు సత్యరూపుడవైనచో నేను సత్యము ను. నీవు సాథ్యుడవైనచో నేను సాధనమును. నీవు వేదమువైనచో నేను వేదాంగమునౌతాను.

                 మళ్లీ 43 వ పద్యం  నుండి 51 వ పద్యం వరకు  నారద భక్తి సూత్రాలలో చెప్పబడిన దశ విధ భక్తి మార్గాలను ప్రస్తావిస్తూ వాని ద్వారా ముక్తి పొందిన  భక్తులను  గుర్తుచేసుకొని పులకించి పోతుంది రచయిత్రి.
శ్రవణం కీర్తనం విష్ణో :స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్ !!.

భాగవత గాథ దివస సప్తకము విన్న
అల పరీక్షిత్తు కైవల్య మందుకొనియె
స్వామి ఇట్టిది నీ కథా శ్రవణ మహిమ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! 

                     శ్రీ శ్రీనివాసా !  ఆనాడు మరణ మాసన్నమైన పరీక్షిత్తు కోవలం ఏడు రోజులు భాగవతాన్ని విన్నంత మాత్రానే మోక్షాన్ని పొందాడు . నీ దివ్య కథాశ్రవణ మహిమ ఎంత గొప్పదో కదా ప్రభూ !
మహతి చేబూని నారద మౌని నీదు
నామ సంకీర్తనమున ధన్యతను గాంచె
ఆర్తి హరియించు స్వామి నీకీర్తనంబు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!    (44)

                      శ్రీ శ్రీనివాసా ! నారద మహర్షి మహతి అనే  పేరు గల వీణ ను నారాయణ నారాయణ అనే నీ నామ సంకీర్తన చేయుచూ ధన్యతను గాంచాడు. స్వామీ . నీ నామ సంకీర్తనము ఆర్తిని హరించెడి పరమౌషధము కదా స్వామీ !.

 కర్కశ కరాళ మకర వక్త్రమున జిక్కి
భక్తి స్మరించు కరిని కాపాడినావు
సరసిజాతాక్ష యిదియె నీ స్మరణ మహిమ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! 

                    శ్రీ శ్రీనివాసా ! అతి కర్కశమైన మొసలి కోరలలో చిక్కుకొని , వేరు గతిలేక భక్తి తో  నిన్ను స్మరించిన గజరాజు ను కాపాడినావు. సరసిజాక్షా. ఇది నీ  నామ స్మరణ మహిమ యే కదా !
                                గంధ మాల్యాంబరమ్ముల కాన్కలిచ్చి
నిన్ను సమర్చించి మోక్షమందినది కుబ్జ
యుష్మదర్చన సర్వ సౌఖ్యోదయంబు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! (47)

                శ్రీ వేంకటేశ్వరా ! నిన్ను అర్చించడం వలన కలుగు ఫలితాన్ని కుబ్జ వృత్తాతం లోకానికి తెలియ    చెప్పింది.  మధురా పుర వీధులలో పరిమళ భరితమైన  శరీరానికి పూసుకొనే గంధాన్ని ,అందంగా అల్లిన పూలమాలలను , పట్టువస్త్రాలను నీకు కానుక గా యిచ్చిన కుబ్జ తన వికార రూపాన్ని పోగొట్టుకొని, సుందర రూపాన్ని పొందింది. నిన్ను అర్చించడం వలన ప్రయోజనం  ఆమెకు వెంటనే లభించింది కదా స్వామీ !  

                                   గోపబాలురు నీ తోడ కూడియాడి
ధన్యులైరి త్రిలోకైక మాన్యు లైరి
సఖ్యభావంబు లోని ప్రాముఖ్య మేమొ
            స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!      (50)

                   శ్రీ శ్రీనివాసా! అనాడు రేపల్లె లో గోప బాలురు నీతోడ  ఆడి పాడి నీ స్నేహము తో  గొప్పవారు గా కొనియాడ బడు తున్నారు. సఖ్యభక్తి లోని గొప్పతనమదియే కదా !
ఆత్మలకు ఆత్మయౌ పరమాత్మ వీవు
అందుకొన్నావు రాధ ఆత్మార్పణంబు
 మహిత మోక్షానురక్తి నీ మధుర భక్తి
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (51)

                 శ్రీ శ్రీనివాసా ! ఆత్మలకు ఆత్మయైన పరమాత్మవు నీవే కదా. అందుకే రాధాదేవి యొక్క సర్వ సమర్పణాన్ని అందుకొన్నావు.  మధురభక్తి మార్గము మోక్ష ద్వారానికి  దగ్గర దారి  కదా ! .
                రాధాదేవి గుర్తుకు రాగానే ఇక్కడ నుండి రచయిత్రి మధుర భక్తి భావనా నిమగ్నయై  ఇరవై ఆరు పద్యాల వరకు ప్రయాణం చేస్తుంది. మధ్య మధ్య లో దేవులపల్లి  వారి భావ కవితా  పరిమళాలను విరియింప చేస్తూ  చిరునవ్వుల వానలు , మల్లెల జల్లులు , మలయ మారుతాలు , కల కూజితాలు, కమ్మతేనెల విందులు  సందడి చేస్తాయి. ఆ ఆనందపు టావేశం లోని  చివరి పద్య మిది.

చల్ల చల్లగ నా మనశ్శయ్య మీద
సుంత శయనించి సేద తీర్చు కొనుమయ్య
విశ్వ సంసారమున నెంత విసిగినావొ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (76)
       
     ఎంత మధుర భావనో చూడండి.   విశ్వ సంసార సంవీక్షణ లో అలసి పోయిన తన స్వామిని చల్ల చల్ల గా తన మనశ్శయ్య మీద సుంత అంటే కొంచెం సేపు శయనించి సేద తీర్చుకొనమని  తియ్య తియ్యగా  మధురాతి మధురంగా వేడుకొంటోంది  శ్రీ నివాస మహాప్రభు ని రచయిత్రి.

                                                    మూడవ భాగం త్వరలో.......................

*******************************************


Saturday, 30 January 2016

Na inta nilachipo Govinda by Dr.Sobharaj.

శతకసౌరభాలు -8 జయ జయ శ్రీనివాస- శ్రీవల్లి -1

శతకసౌరభాలు -8
 జయ జయ శ్రీనివాస- శ్రీవల్లి -1
            




                        జయజయ శ్రీనివాస అనే పేరుతో  రచయిత్రి శ్రీవల్లి రచించిన తేటగీతి శతకం ఇది .ఈ శతకం లో తిరుమల వాసుని దివ్యదర్శనానికి తహతహలాడే జీవుని వేదన   తేటతేట తెలుగు పదాలతో ముగ్ధమనోహరంగా వర్ణించబడింది.  ఆ తిరుమల వాసుని దర్శనం భూలోకవాసులకు కల్గించే ఆనందాన్ని అక్షరాల్లో వర్ణించడం  పదివేల పడగల ఆ ఆదిశేషువు కు కూడ అసాధ్యమన్న విషయం జగద్వితమే. ఆ ఆనంద నిలయుని సురుచిర సుందర రూపాన్ని ఎంతసేపు దర్శించినా తనివి తీరని తపన కోట్లాది మంది భక్తులకు అనుభవైకవేద్యమే .
                
                     రచయిత్రి  ఆ ఏడుకొండలవాని  అనంతమయ తేజోరూపాన్ని దర్శించి  పొందిన ఆనందం ,   ఆ పద్మావతీ ధవుని స్నిగ్ధ దరహాస చంద్రికలు తనను  నిలువెల్లా తడివి పులకరింపచేస్తే ఆ పులకలు ఆమని మొలకలై, కవితలు గా వెలికివచ్చి , తనివి తీరని ఆనందంతోశతకరూపాన్ని పొందాయి.
     
                       రచయిత్రి పేరు  శ్రీవల్లి యని ముఖపత్రం(Title page) మీద   ప్రకటించబడింది. కాని అది చూడగానే ఇది అసలు పేరు కాదేమో నని , కలం పేరు( Pen name) అయ్యుంటుందని అనిపించింది.  అందుకు ఆధారంగా 108 వ పద్యం లో-  
                
                                                 అందుకో అనురాగ మరంద పూర్ణ
                                        మన్న పూర్ణేశ్వరీ హృదయాంబుజమ్ము
                                       వందరేకులు వలపులు చిందుచుండె
                                         స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస!
              
                           శతకాన్ని పూర్తి చేసిన ఆనందం అన్నపూర్ణేశ్వరి హృదయం నుండి శతదళ పద్మమై వలపులను చిందించింది.  ఆ ఆనందనిలయుని పై ఒక అచ్చ తెలుగు ఛందస్సు లో తెలుగు వారి హృదయాలకు చేరువుగా ఒక  శతకాన్ని  వ్రాసి, ఆ తిరుమలగిరి రాయని కి సమర్పించిన ధన్యజీవి రచయిత్రి.   ఆ ఏడుకొండలవానికి తన చిరుపొత్తాన్ని అంకిత మిస్తూ ఇలా అంటుంది.
                   
                                             అణువణువు కూడ నీకె సమర్పితమ్ము
అక్షరమక్షరమ్ము నీ కంకితమ్ము
ఏడుకొండలసామి గ్రహింపవేమి
    స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!

                         ఈ శతకాన్ని 1980 కృష్ణాపుష్కరాల  ప్రచురణ గా  తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించింది.  ముఖపత్రం మీద 1981 అని ,  ముఖపత్రం   చివరిపేజి క్రింద 15-1 82 అని , రెండవపేజీ లో 1980 అని ఉంది. నేను మాత్రం ఈ పుస్తకాన్ని 21-9-92 న పుష్కరవేళ  విజయవాడ లో కొన్నాను. ఎందుకంటే పాఠకులకు పుస్తకానికి సంబంధించిన ముద్రణ సమాచారాన్ని అందించడానికి మాత్రమే ఈ ప్రస్తావన.
             
                               ఈ  శతకం “స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!” అనే మకుటం తో తేటగీతి ఛందస్సు లో వ్రాయబడింది.  ఈ శతకం లో 108 పద్యాలున్నాయి .  శ్రీ తిరుమల తిరుపతి  దేవస్ధానం వారు శ్రీనివాస బాలభారతి – క్రమంలో ఈ గ్రంధాన్ని 17 వ గ్రంధం గా అందించింది.  ఈ జయజయ శ్రీనివాస అలతి అలతి పదాలతో మధురభక్తి భావ గుంఫితమై పాఠక హృదయాలను రసవాహిని లో ఓలలాడిస్తుంది. ఈ శతకం లో  రచయిత్రి కొన్నియెడల మీరాబాయి మధురభక్తి, కొన్నియెడల రాధాదేవి ప్రణయ తత్వాన్ని, మరికొన్ని యెడల గోపభామల పారవశాన్ని , పలుతావుల అన్నమయ్య ఆరాథనాభావాన్ని బహుభంగుల  ప్రదర్శించి , ఒకే నర్తకి  బహురూపుల నర్తించి రక్తి కట్టించినట్లు శ్రీ శ్రీవల్లి తిరుమలవాసుని శ్రీచరణ మంజీరమై నర్తించి తరించింది.
                   
                            ఇటువంటి  రచనకు నాలుగు మాటలు వ్రాసే భాగ్యం  నాకు లభించడం ఆ తిరుమలవాసుని అనుగ్రహం గానే భావిస్తున్నాను.
                 
                                ఓం నమో వేంకటేశాయ.

శ్రీకరంబైన తిరుమల శిఖరి కరుణ
కాకరంబైన దివ్యమహస్సు దాల్చి
ఆర్తులను బ్రోచు కళ్యాణమూర్తి వీవు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!

                సర్వ శుభములను అందించెడి ఈ తిరుమల కొండపై కరుణాసముద్రుడవై నిలిచి ,దివ్యమైన మహత్వముతో ఆర్తులను ఆదుకొనెడి  చిరుదరహాస భాసా ! తిరుమలవాసా !  శ్రీనివాసా! జయము. జయము. నీకు జయమగు గాక !.

ఏడుకొండలపైన  నీరేడు జగము
లేడు గడ యంచు నమ్మి నిన్ వేడుకొనగ
నిండుకొలువున్న బంగారుకొండ వీవు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!

                            ఆపద మొక్కుల వాడా ! అడుగడుగు దండాల వాడా!  ఈ ఏడేడు లోకాలకు  రక్షకుడవు నీవే నని నమ్మి నిన్ను ప్రార్ధించగా ఏడుకొండలపైన నిండుగా కొలువున్న బంగారు కొండవు నీవు. సుమ సుందర దర హాసా ! తిరుమల వాసా ! నీకు జయము. జయము.


మోహ గాఢాంధ కార విమోచనములు
సురుచిరోదార చైతన్య సూచనములు
లోక బాంధవ నీ దివ్యలోచనములు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!

                   సుమధుర సుందర దరహాసా ! శ్రీ  శ్రీనివాసా ! నీ దివ్య నేత్రములు మోహమనే గాఢాంధకారాన్ని తొలగించి , కాంతిమయమైన చైతన్యాన్ని దర్శింపచేసి , సర్వలోకాలను తేజోమయం చేసేవి స్వామీ ! .


విశ్వ విశ్వంభరా పర్యవేక్షణములు
రచిత నిత్య జగత్త్రయ రక్షణములు
వేంకటేశ్వర భవదీయ వీక్షణములు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
                        
                              శ్రీవేంకటేశ్వరా ! నీయొక్క చల్లని చూపులు సమస్తమైన విశ్వాన్ని అవలోకిస్తూ , ముల్లోకాలను సర్వ వేళలా సంరక్షిస్తూ ఉండేవి కదా స్వామీ !.

సరస రాకా సుధాకర స్వామి వీవు
నిండు గుండెల పండువెన్నెలను నేను
పొరలి ప్రవహింతు నీ శుభంకర కరాల
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
                      
                      శ్రీ శ్రీనివాసా ! నిండుపున్నమి చందమామవు నీవు.  నిండుగా గుండెలను పులకరింప జేసెడి పండువెన్నెలను నేను.  శుభంకరమైన నీ చేతులలోచేరి పులకించి ప్రవహిస్తాను ప్రభూ !.

              చిద్వలాసుడైన శ్రీనివాసుని చేతులలో లీలగా  వెన్నెల సోనగా వాలి సోలి పోవాలనే మధురమైన కోరిక రచయిత్రిది.                                         


                                       నిత్య పరిపూర్ణ రసపయోనిధి వి నీవు
లలిత లావణ్య శృంగార లహరి నేను
కలసి పోయెద నీ తరంగముల స్వామి
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
                      
                           ముగ్ధ మనోహర సుందర హాస భాసా ! శ్రీ శ్రీనివాసా ! నీవు నిత్య పరిపూర్ణ రసాంబుధివి. నేను లలిత లావణ్య శృంగార ప్రవాహమునై, నీ తరంగముల   ,కలసిపోయి నీలో లీనమై పోతాను స్వామీ !.                        
                       
                                   పతితపావన వేదసంహితవు నీవు
పరమ సుకుమార భాస్వర స్వరము నేను
నీ పదము లంటి చరియింపనిమ్ము నన్ను
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
                    
                   శ్రీ ఏడుకొండల వేంకటేశ్వరా!  పరమ పవిత్రమైన వేదసంహితవు నీ వైతే నేను  వేదమును ప్రకాశింపచేసెడి పరమ సుకుమార స్వరాన్నై నీ పాదాల నాశ్రయించి తరించే భాగ్యాన్ని  నాకు ప్రసాదించు స్వామీ !.

 ముగ్ధమోహన గోపాలమూర్తి వీవు
కావి కెమ్మోవి పిల్లన గ్రోవి నేను
సృష్టి పులకింపగా ధ్వనించెదను నేను
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!

               తిరుమలగిరి వాసా ! నీవు  ముగ్ధ మోహన సుకుమార సుందర మోహన రూపుడవైన గోపాలుడవు నీవు.  మధురమైన నీ ఎఱ్ఱని పెదవి పై రాగాలు పలికెడి వేణువు నేనై ఈ సృష్టి సర్వము పులకించేటట్లు  మధురంగా ధ్వనిస్తాను ప్రభూ !.
                తిరుమల వాసుని గూర్చి వచ్చిన గ్రంథాలు చిన్నవి, పెద్దవి కలిపి లక్షల్లో ఉండి ఉండవచ్చు. వానిలో తాను కూడ కలిసిపోయి ఆ కమలానాథుని  వర్ణించిన ఒక రచయిత్రి గా మిగిలిపోవాలని శ్రీ శ్రీవల్లి కోరిక. అందుకే ఆ మోహనరూపుని  పిల్లనగ్రోవిని తానై సృష్టి పులకించగా ధ్వనిస్తానని  కోరుకుంటోంది. ఈ జయజయశ్రీనివాస అనే పిల్లన గ్రోవి సృష్టించిన కవనమే మధుర నాదమే ఈ  సృష్టి ని పులకింప చేస్తుందని కవయిత్రి మాటల్లో ధ్వని.

 నిత్య సుందర సాహిత్య సత్య మీవు
విశ్వ మంగళ భావనావేశ మేను
అంకితమ్మౌదు నీదు ప్రేమాంకము నకు
    స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!   (15)
                   
                     శ్రీ పద్మావతీ మనోహరా ! సత్యము నిత్యము  సుందరము నైన సాహిత్యానివి నీవైతే  విశ్వ శుభంకరమైన భావావేశాన్ని నేనై   ప్రేమమయ మైన నీ అంకసీమ  ఒదిగిపోయి నన్ను నీకు అంకితం చేసుకొని నీలో లీనమై పోదును స్వామీ !

                              
                                 నిత్య కళ్యాణ సౌందర్య నిధివి నీవు
వికచ సురభిళ వకుళ మాలికను నేను
నీదు గళసీమ నన్ను రాణింప నిమ్ము
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
                  
                                శ్రీనివాసా ! నీవు నిత్యకళ్యాణ సౌందర్య రాశివి. నేను వికసించి పరిమళించెడి పొగడ పూల మాలికను. ఈ పొగడపూల మాల  నీ గళసీమ ను అలంకరించెడి  అదృష్టాన్ని  ప్రసాదించు ప్రభూ ! .


నిర్మలంబైన శబ్దసన్నిధివి నీవు
యోగ్యమైనట్టి భావసౌబాగ్య మేను
లోకమున చిల్కెదము రసశీకరములు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
               శ్రీనివాసా !  నీవు శక్తి వంతమైన శబ్దానివి. నేను  అర్ధవంతమైన భావ సౌభాగ్యాన్ని. మనమిద్దరము ఏకమై ఈ లోకాన రసబిందువులను చిలకరిద్దాము.
                       కవికులతిలకుడైన మహాకవి కాళిదాసు  పార్వతీ పరమేశ్వరుల యోగాన్ని వాగర్ధాలతో ఉపమించిన వైనం  రసజ్ఞులకు  పరిచయ పూర్వమే. ఆ శ్లోకాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం.

వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ :ప్రతిపత్తయే
     జగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!
                           
                                     
                                    ముగ్ధ మోహన కారుణ్యమూర్తి వీవు
సరస మంజుల కరుణారసమ్ము నేను
కరగి ప్రవహింతు నీ వాలుగనుల యందు
      స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!    (18)
                        
                              శ్రీ వేంకటేశా !  ముగ్ధమోహన  కారుణ్య మూర్తివి నీవు .  సరస మంజుల కరుణ రసాన్ని నేను. కరుణరసమైన నేను కరిగి  కారుణ్య మూర్తి వై, భక్తులను కటాక్షించెడి  నీ వాలు కనుల  నుండి ప్రవహించెడి  భాగ్యాన్ని  నాకు ప్రసాదించు స్వామీ ! .


నీవు నటరాజు నేను నీ పావనాంఘ్రి
కాపురంబుండు సౌవర్ణ నూపురమును
పొంగి పులకింతు నీ నాట్య భంగిమముల
     స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!    (20)
                  
                     సుందర దరహాసా ! శ్రీ శ్రీనివాసా ! నీకు జయము. నీవు  నటరాజమూర్తివైతే నేను నీ పవిత్ర పాదముల నంటిపెట్టుకొని ఉన్న  బంగారు మువ్వనై  , నీవు నర్తించెడి     వివిధమైన  నాట్యభంగిమల  పొంగి పులకించి పోతాను. నీ పాద మంజీరమై జీవించెడి అదృష్టాన్ని నాకు కల్గించు ప్రభూ!.

                                  ముగ్ధ సంగీత శృంగారమూర్తి వీవు
సరస సాహిత్య సౌందర్య సార మేను
 అల్లుకోనిమ్ము  నీ తనూవల్లి  నిండ
         స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! (21)
               
             తిరుమలగిరి వాసా ! మధుర మోహన సంగీత శృంగార రసైక మూర్తివి నీవు. సరస సాహిత్య సౌందర్య సారాన్ని నేను. సన్నని తీగ వంటి నీ సుందర మైన శరీరాన్నంతటిని నన్ను గాఢంగా  అల్లుకోనిమ్ము స్వామీ !  నీకు జయయ మగు గాక !
                                                                    
                                          
                                                                       రెండవ భాగం  త్వరలో-----

*******************************************