Saturday, 9 August 2014

శతకసౌరభాలు - 4 వేమనశతకము - 2

శతకసౌరభాలు - 4

                             వేమన శతకము -2

                      


                       నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు చంపు
                      బైటఁ గుక్క చేత భంగపడును
                      స్ధాన బల్మి గాని తనబల్మి కాదయా
                       విశ్వదాభిరామ వినురవేమ !
       


                               ఓ వేమా !   మొసలి నీళ్ళ లో ఉంటే ఏనుగు నైనా అవలీలగా  చంపగలదు కాని అదే మొసలి నీటిని విడిచి బైట ఉన్నప్పుడు కుక్క చేతనే  వెంటాడి చంపబడుతుంది. ఎందుచేతనంటే అక్కడ మొసలికి ఉన్నది స్ధానబలమే కాని సహజ బలం కాదు. అందుకే   ‘నీళ్ళలోన మొసలి నిగిడి దూరము పారు బైట మూరెడైన పాఱలేదు ‘  అంటాడు మరొకచోట  వేమన.

  డబ్బు విలువ                   
                     
                          కులము లేని వాడు  కలిమి చే వెలయును
                        కలిమి లేని వాడు కులము  దిగును
                       కులము కన్న భువిని కలిమి  ఎక్కువ సుమీ
                        విశ్వదాభిరామ వినురవేమ !
                     

                        ఓ వేమా!   కులం లేకపొయినా , గుణం లేకపోయినా డబ్బున్నవాడు సమాజం లో కీర్తించబడతాడు. ధనము లేనివాడు ఉన్నత కుల సంజాతుడైనను వాడిని  తక్కువగానే చూస్తారు. ఎందుకంటే ఈ లోకం లో డబ్బు కున్న విలువ  మరి దేనికీ లేదు.   
                  
                   కులము గలుగువారు గోత్రంబు గలవారు
                     విద్యచేత విఱ్ఱ వీగువారు
                      పసిడి గల్గు వాని బానిస కొడుకులు 
                      విశ్వదాభిరామ వినురవేమ !
                

                         ఓ వేమా.!    నేటి సమాజం లో కులగోత్రాలు గొప్పవని చెప్పుకొనేవారు, మేము గొప్ప విద్వాంసులమని విర్రవీగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడ డబ్బున్న వాళ్ళకి తొత్తులుగా , బానిసలు గా వ్యవహరిస్తారే కాని  దాని కంటే అతీతులు కాదంటున్నాడు వేమన.  ధన ప్రభావం అంత గొప్పది . అందుకే ‘డబ్బు లేని వాడు డుబ్బు కు కొఱగాడు’ అంటారు పెద్దలు. ‘ధనమూలమిదం జగత్ ’ అన్నది జగమెరిగిన మాట. ‘డబ్బు చేతిలో దేవుడున్నాడనేది ‘ జానపదుల మాట.
   
       లోభి గుణము
            
             
                  కనియు కానలేడు కదలింపడా నోరు
                  వినియు వినగ లేడు విస్మయమున
                  సంపద గలవాని సన్నిపాతంబిది
                    విశ్వదాభిరామ వినురవేమ !
                 
                 సర్వమును ఇచ్చునట్టి ఆ దైవమునకు ప్రియమైన  ఓ వేమా ! డబ్బున్న వాడు ఎదుటివాడు పడుతున్న బాధలను , కష్టాలను చూస్తూ కూడ చూడనట్లుంటాడు.  నోరువిప్పి మాటాడడు. మన బాధలు చెప్పు కుంటుంటే వినినట్టుగానే ఉంటాడు కాని వినడు.   విచిత్రమేమిటంటే   చూసినా చూడనట్టు ,మాట్లాడినా మాట్లాడనట్టు , విన్నా విననట్లు ఉండటం   సన్నిపాత రోగ లక్షణ మైతే ఇటువంటి రోగమే ధనవంతుడికి  ఉంటుందని  తెగేసి చెపుతున్నాడు వేమన. 

                  గొడ్డుటావుఁ బిదుక కుండ గొంపోయిన
                 బండ్ల నూడ దన్ను పాల నీదు
                 లోభి వాని నడుగ లాభంబు లేదయా
                  విశ్వదాభిరామ వినురవేమ !

                     సర్వేశ్వరునకు ప్రియమైన ఓ వేమా !     గొడ్డు పోయిన ఆవు దగ్గరకు పాల పిదుకడానికి పాత్ర తీసుకెళ్లి కూర్చుంటే పండ్లు రాలేట్టు తన్నుతుంది కాని పాలను ఇవ్వదు. అలాగే నువ్వు ఎంత అవసరం లో ఉన్నా పిసినారి వాడి దగ్గరకు సహాయం కోసం వెడితే  అవమానకరమైన మాటలను పడవలసి వస్తుంది కాని  కొంచెం  ప్రయోజనం ఉండదు .
             
                  మేక కుతిక పట్టి మెడ చన్ను గుడువగా
                   ఆక లేల మాను నాశ గాక
                  లోభివాని నడుగ లాభంబు లేదయా
                   విశ్వదాభిరామ వినురవేమ !


                             ఓ వేమా !  మేక మెడ క్రింద చన్నులా వేలాడే మాంసపు తిత్తిని పట్టుకొని  ఆశగా ఎంతసేపు   కుడిచినా   పాలు రావు . ఆకలి తీరదు కదా. అలాగే పిసినారి ని ఆర్ధిక సహాయం కోసం  ఎంతసేపు దేవిరించినా మనకు సమయం వృధా తప్పితే దక్కేది ఏమీ ఉండదు.


                                  పెట్టి పోయ లేని వట్టి నరులు భువిని
                                 పుట్టనేమి వారు గిట్టనేమి
                                  పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా
                                   విశ్వదాభిరామ వినురవేమ ! 


                    ఓ వేమా ! దాన గుణము లేని నరులు ఈ భూమి మీద పుట్ట నెందుకు. చావనెందుకు . అటువంటి  వారి వలన ఎవరికి  లాభము.పుట్టలోని చెదలు పుడుతూ , నశిస్తూ ఉన్నట్టే ఈ పిసినారి వాళ్ళు  కూడ పుట్టడం చావడానికే తప్పితే ఎవ్వరికీ అణు మాత్రం కూడ ఉపయోగ పడరు కదా !


  తత్త్వ వివేచన
  

                      ఏమి గొంచు వచ్చె నేమి తా గొని పోవు
                       పుట్టువేళ నరుడు గిట్టువేళ
                      ధనము లెచటికేగు తా నెచ్చటి కేగు
                       విశ్వదాభిరామ వినురవేమ !


                    ఓ వేమా !  ఈ జీవి భూమి మీదకు వచ్చే టప్పుడు ఏమి తీసుకొచ్చింది . రేపు  పోయేటప్పుడు ఏమి తీసుకెడుతుంది. నానబాధలు పడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోతుంది . తన కట్టె కాలి తానెక్కడికి పోతాడు. ఈ విషయాలను మానవుడు  తెలిసికూడ మర్చిపోయి ప్రవర్తిస్తుంటాడు.


                       తనువదెవరి సొమ్ము తనదని పోషింప
                     ద్రవ్య మెవరి సొమ్ము దాచుకొనగ
                        ప్రాణమెవరి సొమ్ము పారిపోకను నిల్వ
                        విశ్వదాభిరామ వినురవేమ !


                       ఓ వేమా ! ఈ శరీరం తనకు చెందినదనే మోహంతో చక్కని సౌందర్య సాధనాలను వాడుతూ , ఎండకు ,చలికి  బలి కాకుండా కాపాడు కుండూ ఉంటాము.  ఈ దేహం ఏమైనా శాశ్వతమా  ?. నీ దని కాపాడుకోవడానికి.  డబ్బంతా   ఎవరి సొంతమని నీవు పోగేసి కూడ పెడుతున్నావు.  అలాగే  ప్రాణం ఏమైనా నీ స్వంతమా? పారిపోకుండా ఉండటానికి. కాలం వచ్చినప్పుడు హంస లేచి వెళ్లి పోతుంది.   ఇవన్నీ అశాశ్వతాలని తెలిసి కూడ జీవుడు మాయ లో పడి ‘ నాది’ ‘ నేను’ అనే భ్రాంతిలో పడి కొట్టుకుంటుంటాడు.

                               అందుకే ఆంద్రమహాభారతం లో యక్షుడు ధర్మరాజును ప్రశ్నిస్తూ  ఈ లోకం లో ఆశ్చర్యకరమైన విషయమేమిటని అడుగుతాడు. అందుకు ధర్మజుడు సమాధానమిస్తూ. ...

            “ అహన్యహని భూతాని గచ్ఛన్తీహ యమాలయమ్
             శేషా : స్ధావర  మిచ్ఛన్తి కిమాశ్చర్య మిత : పరమ్ !! “

                   -అంటాడు. అంటే ప్రతిరోజు  జీవులు యమ సదనానికి వెళుతూనే ఉన్నారు. కాని మిగిలిన  వారు తాము పోయేవారం కాదని . శాశ్వతులమని భావిస్తున్నారు . ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది అంటాడు.

                               ఈ మాయే  ఈ లోకాన్ని నడిపిస్తోంది.   దీన్నే 'వైష్ణవమాయ 'అంటుంది మహా భాగవతం .

     అన్నదాన  ప్రాశస్త్యము                 

                  
                   అన్నిదానము లను అన్నదానమె గొప్ప
                    కన్నతల్లి కంటె ఘనత లేదు
                    ఎన్న గురుని కన్న  నెక్కుడు లేదయా
                     విశ్వదాభిరామ వినురవేమ ! 
                         

                              ఓ వేమా. దాన గుణము సర్వదా కొనియాడదగినది. దానము లన్నింటిలోనికి అన్నదానము గొప్పది . ఆకలి తో ఉన్న జీవికి ఆప్యాయంగా  అందించే ఆహారానికంటే మించిన దానం మరొకటి లేదు. కన్నతల్లిని మించిన దైవము లేదు.  గురువును మించిన గొప్పవాడు లేడు.

       ఆశ
                 

                    ఆశ చేత మనుజు లాయువు గలనాళ్ళు
                 తిరుగుచుందురు భ్రమ ద్రిప్ప లేక
                మురికి భాండమందు ముసురు నీగల భంగి
                 విశ్వదాభిరామ వినురవేమ !
               
                      ఓ వేమా.  ఆశ యనేది మిక్కిలి చెడ్డది.  ఆశా పాశములచేత బంధించబడిన నరుడు  అనేక కష్టాల పాలౌతాడు.  ఆ ఆశ చేతనే మానవులు మాయ లో చిక్కుకొని, మురికి కుండ చుట్టూ తిరిగే ఈగల్లాగా  బతికి ఉన్నంతకాలం దేనికో ఆరాట పడు తుంటాడు.

                
                           ఆశ పాపజాతి అన్నింటి కంటెను
                           ఆశ చేత యతులు మోస పోరె
                         చూచి విడుచు వారు శుద్ధాత్ము లెందైన
                           విశ్వదాభిరామ వినురవేమ !
             

           ఓ వేమా. ఆశ  అన్నింటికంటే మిక్కిలి చెడ్డది. ఈ ఆశ యనే ఉచ్చులో చిక్కుకొని గొప్ప గొప్ప యతీశ్వరులే మోసపోయారు.  తెలిసి విడిచిన వారే విశుద్ధాత్ములుగా  కీర్తించ బడుతున్నారు.
                       
                        ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి
                        గోచి బిగియ గట్టి గుట్టు దెలిసి
                       నిలిచి నట్టి వాడె నెఱయోగి యెందైన
                         విశ్వదాభిరామ వినురవేమ !

         ఓ వేమా. ఆశ యనే  మాయా పాశాలను కోసివేసి , శరీరం లో జ్వలించే కోరికలనే కామాగ్నిని చల్లార్చి, కౌపీనాన్ని  బిగియ కట్టి , జీవుల జనన మరణ జీవ రహస్యాల గుట్టు మట్టులను   తెలుసుకొని , నిలిచిన వాడినే  నిజమైన యోగి అంటారని ఆత్మయోగి యైన వేమన అభిభాషణ. అందుకే సర్వేశ్వరునికే అభిరాముడనని తనకు తానే ప్రకటించుకున్నాడు  యోగి వేమన.

                        నీళ్ళలోని మీను నెఱి మాంస మాశించి
                        గాలమందు జిక్కు కరణి భువిని
                        ఆశ దగిలి నరుడు నాలాగె  చెడిపోవు
                         విశ్వదాభిరామ వినురవేమ !

                    ఓ వేమా. నీళ్ల లో ఉండే  చేప  గాలానికి  వేలాడుతున్న   ఎఱ ను చూసి ఆశ పడి  గాలానికి చిక్కుకొని మరణించి నట్లే మానవుడు ఆశ యనే గాలానికి చిక్కుకొని  నాశనమై పోతున్నాడు.

         రాజసేవ

                          చచ్చి పడిన పశువు చర్మంబు కండలు
                            పట్టి పెఱికి తినును పరగ గ్రద్ద 
                             గ్రద్ద వంటి వాడు జగపతి కాడొకో
                                     విశ్వదాభిరామ వినురవేమ !

                                       ఓవేమా  !  చచ్చిన పశు కళేబరాన్ని  గ్రద్ద పీక్కు తిన్నట్టు గా రాజనే వాడు జనులను పన్నుల రూపంలో దయాదాక్షిణ్యాలు లేకుండా  పీడించుకొని తింటాడు. రాజు గ్రద్ద లాంటివాడే.
                     
                          ఎరుక లేని దొరను నెన్నాళ్ళు గొలిచిన
                         బ్రతుకు లేదు వట్టి భ్రాంతి కాని
                         గొడ్డుటావు పాలు గోరితే చేపునా 
                          విశ్వదాభిరామ వినురవేమ !
                     

                                               ఓ వేమా! మన కష్టాన్ని గుర్తించి మన్నించలేని  ప్రభువును ఎంతకాలం విశ్వాసం గా  సేవించినా మనం  ఆశపడటం తప్పితే ఫలితమేమీ ఉండదు. మనకు అవసరమని గొడ్డు పోయిన ఆవు దగ్గరకు  వెళ్ళి బ్రతిమలాడితే మాత్రం పాలు ఇస్తుందా ? ఇవ్వదు కదా !
                         
                           అలను బుగ్గ పుట్టి నప్పుడే క్షయ మౌను
                         కలను గాంచు లక్ష్మిఁ గనుట లేదు
                        ఇలను భోగ భాగ్య మీ తీరు గాదొకో
                         విశ్వదాభిరామ వినురవేమ !
                  
                                          ఓ వేమా !  సముద్రపు అలల యందు బుడగ పుట్టి ఏ విధంగా క్షణకాలం లో నశించిపోతుందో , కలలో కన్పించిన ధనరాశులు వాస్తవం లో ఏ విధంగా  అదృశ్య మై పోతాయో అలాగే ఈ భూమి మీద భోగభాగ్యాలనేవి క్షణభంగురాలే కాని శాశ్వతాలు కావు.
                    
                         
                           కోతి నొనర దెచ్చి కొత్తపట్టము గట్టి
                           కొండముచ్చు లెల్ల గొలిచి నట్లు
                            నీతి హీనునొద్ద నిర్భాగ్యులుండుట
                           విశ్వదాభిరామ వినురవేమ !
                             

                               ఓ వేమా !   కోతిని రాజును చేసి కొండముచ్చులన్నీ చేరి కొలిచినట్లుగా నీతిమాలిన వారి వద్ద నిర్భాగ్యులు చేరుతుంటారు.  అయోగ్యుని కి పట్టం కడితే అవినీతి పెరిగిపోయి , అసమర్ధులు అధికారులౌతారు.






 ****************************  మూడవ భాగం త్వరలో  **********************************
                         

                       

                       
                      



Wednesday, 30 July 2014

శతకసౌరభాలు -4 వేమనశతకము -1

శతక సౌరభాలు -4
                                                            
                                                                 వేమన శతకము -1
                                   

                                   తొలకరి వానలో తడవని వాడు , వేమన పద్యం చదువని వాడు తెలుగు వాడు కాదనేది తెలుగు నాట నానుడి. జీవితం తొలిరోజుల్లో భోగి వేమన గా విలాసాల్లో తేలియాడిన వేమారెడ్డి  తుదకు కామిగాని వాడు మోక్షగామి కాడని  జగతికి  తత్త్వగురువై, లోకసంచారం చేసి  , వేలాది ఆటవెలదులతో తెలుగుజాతి  ముంగిట్లో   విజ్ఞాన జ్యోతులను వెలిగించి , మూఢనమ్మకాల్ని నిరసించి , సంఘసంస్కర్త గా ప్రజల మన్ననల నంది , తుదకు కటారుపల్లె లో జీవసమాధి పొందాడు.  తెలుగు భాషకు ఎంతో సేవ చేసిన ఆంగ్లదొర సి.పి బ్రౌన్  ఆంధ్రదేశం నలుమూలల నుండి వేలాదిగా వేమన పద్యాలను సేకరించి , అచ్చొత్తించి , వేమన సాహిత్యాన్ని  రాబోయే తరాలకు పదిలంగా అందించాడు.
                  పదిహేడవ శతాబ్దానికి చెందిన వేమన వేలాది పద్యాలు వ్రాసినట్లుగా చెప్పబడుతున్నా ,3500  పై చిలుకు పద్యాలు మాత్రమే  “వేమన పద్య రత్నాకరము “ పేరుతో ముద్రించబడి లభిస్తున్నాయి.  తెలుగు లోగిళ్ళ లో వేమన శతకం పఠనీయ గ్రంథమై పోయింది.  అందుకే వేమన పద్యం రాని వాడు తెలుగు నాట లేడు. “విశ్వదాభిరామ వినురవేమ “ అనే మకుటంతో ఉన్న ఈ శతకం లో ని మకుటానికి
అర్ధాలు మాత్రం రకరకాలు గా చెపుతున్నారు. అభిరామయ్య అనే కంసాలి  వేమనకు స్వర్ణ విద్య నేర్పాడని , ఆ విశ్వాసంతో అతనిపేరు వచ్చేటట్లుగా మకుటం ఉందని ఒక వాదన. విశ్వదుడైన వాడు  అభిరాముడు . అనగా
భగవంతుడైన వాడు ఆనందదాయకుడు అని, ఆయనను ఉద్దేశించి ఆత్మయోగి యై వేమన ఈ పద్యాలను చెప్పాడని మరో  వాదన.
                                 నిత్యాన్వేషణ శీలియై లోక సంచారం చేసి  మానవజీవితం లోని  సత్యాసత్యాలను వివేచించిన మహాయోగి మన వేమన. అందుకే  తెలుగునాట వేమన వాక్కు వేదవాక్కు అయ్యింది. వేమన యోగం అంతా అన్వేషణ గానే సాగిందని విమర్శకుల అభిప్రాయం. సామాన్యుల భాష లోనే శక్తివంతమైన ఉపమానాలను ప్రయోగించి తాను చెప్పదలచిన భావాన్ని సూటిగా పాఠకుని గుండెకు తాకేటట్లుగా చెప్పగలగడం వేమన యోగి ప్రత్యేకత.  
                  వేమన పద్యాలకు  టీకా , వ్యాఖ్యానం అవసరం లేదన్నంతగా అలతి అలతి పదాలతో అనల్పార్ధాల్ని అందించిన మహాకవి వేమన.అందుకే ప్రజల నాలుక పైనే నాట్యమాడుతూ , శతాబ్దాలు గడిచినా వేమన పద్యాలు తెలునాట వెలుగులను నింపుతూనే ఉన్నాయి.  ఇంతకు ముందు   అందించిన  మూడు శతకాలకు తేజస్వినీ పేరుతో  వ్యాఖ్యానం అందించాను.  ఇక్కడ కూడ వేమన వెంటే నడుస్తాను .   

      నా  ఈ blog  ని ఆదరిస్తున్న అశేష వీక్షకులకు ముఖ్యంగా   ఖండాంతర , దేశాంతరాలలో ఉండి కూడ మాతృభాషా మాధుర్యాన్ని  ఆస్వాదిస్తూ , తెలుగు భాషామతల్లిని అపురూపంగా  ఆదరిస్తున్న సహృదయ వీక్షకులకు (viewers)   నిండు మనస్సు తో కృతజ్ఞతా పూర్వక అభివందనాలను   అందిస్తున్నాను.

                    నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు  
                      తళ్కుబెళ్కురాళ్ళు తట్టెడేల
                     చాటుపద్య మిలను చాలదా యొకటైన
                      విశ్వదాభిరామ వినురవేమ !

                                              జాతి రత్నానికి ఉన్న విలువ  మెఱుగు రాళ్ళ కు రాదు.   వేలాది పద్యాలు ఉన్నా చాటు పద్యానికి ఉన్న విలువ మిగిలిన వాటికి ఉండదు కదా. వేమన పద్యాలు ఇంద్రనీలమణు లనుకుంటే  ఇతర పద్యాలు ఎన్నో రంగురాళ్ళ వంటివే కదా.

                              గంగిగోవుపాలు గంటెడైనను చాలు
                              కడివెడైన నేమి ఖరము పాలు
                             భక్తిగల్గు కూడు పట్టెడైనను చాలు
                             విశ్వదాభిరామ వినురవేమ !

                           మంచి ఆవుపాలు గరిటెడైన శ్రేష్టమే. గాడిదపాలు కడివేడైనను ప్రయోజనం లేదు. అదే విధంగా ప్రేమతో పెట్టెడి అన్నం పిడికెడైనా తృప్తినిస్తుంది.కాని అభిమానం లేని కూడు కుండెడు తిన్నా  తృప్తి లభించదు.

                  ప్రియములేని విందు పిండివంటల చేటు
                 భక్తిలేని పూజ పత్రి చేటు
                పాత్రమెఱుగని ఈవి బంగారు చేటురా
                విశ్వదాభిరామ వినురవేమ !

                      అపాత్ర దానం వలన  ధనవ్యయం తప్పితే ఫలిత ముండదు. ఏ విధంగా నంటే  దేవుని మీద విశ్వాసం లేని పూజ కు  పూలు దండగ.  మనసు లో ప్రేమ లేకుండా పెట్టిన విందు భోజనానికి వంటలు దండగ.యోగ్యుడు కాని వాడికి చేసిన దానం కూడ దండగే అవుతుంది.

                 మృగమదంబు చూడ మీద నల్లగ నుండు
                 పరిఢవిల్లు దాని పరిమళంబు
                గురువులైన వారి గుణము లీ లాగురా
                విశ్వదాభిరామ వినురవేమ !

                      కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నా దాని పరిమళం సమ్మోహనాన్ని కల్గిస్తుంది. అలాగే మంచివారి గుణాలు  పైకి కన్పించకపోయినా గొప్పగా ఉండి ,లోకంలో మెప్పు పొందుతాయి.

                          మేడిపండు చూడ మేలిమై యుండును
                           పొట్ట విచ్చి చూడ పురుగు లుండు
                           పిరికి వాని మదిని బింక మీలాగురా
                           విశ్వదాభిరామ వినురవేమ !

                            మేడిపండు చూట్టానికి పైకి నిగనిగలాడుతూ కన్పించినా  దాన్ని ఒలిచి చూస్తే లోపలన్నీ పురుగు లుంటాయి. అదే విధంగా పిరికివాడు పైకి ధైర్యంగా డాంబికంగా కన్పించినా  వాని లోపల భయం ఉండనే ఉంటుంది.

                    కులములోన నొక్క గుణవంతుఁ డుండిన
                     కులము వెలయు వాని గుణము చేత
                    వెలయు వనములోన మలయజమున్నట్లు
                         విశ్వదాభిరామ వినురవేమ !  

                    వనములో  ఒక్క  మంచిగంధం చెట్టు ఉంటే  దాని  మూలంగా ఆ వనమంతా గంధపు పరిమళాలు  వ్యాపించి   ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. అలాగే కులం లో ఒక్క మంచివాడు పుడితే అతని వలన ఆ వంశానికే ఎంతో పేరు ప్రతిష్టలు వస్తాయి.

                            పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు
                          మాటకన్న నెంచ మనసు దృఢము
                          కులము కన్న నెంచ గుణము ప్రధానంబు
                           విశ్వదాభిరామ వినురవేమ !

                                    దేవుని పూజలు చేసి నంత మాత్రాన బుద్ధి మంతుడు కాడు.  పూజ కన్న నిశ్చలమైన బుద్ధే ప్రధానము. మంచిమాటలు చెప్పిన దాని కంటే వానిని ఆచరించే దృఢమైన చిత్తశుద్ధి ఉండాలి.  అందుకే కులము కంటే కూడ గుణమే ప్రధానమని చెప్పబడుతోంది. 

                                 వేఱుపురుగు చేరి వృక్షంబుఁ జెఱచును
                                 చీడపురుఁగు చేరి చెట్టు  చెఱచుఁ
                                కుత్సితుండు చేరి గుణవంతుఁ జెఱచురా
                                 విశ్వదాభిరామ వినురవేమ !

                                   వేఱు పురుగు చేరి మహావృక్షాన్ని సైతం సర్వనాశనం చేస్తుంది. చీడ పట్టిన చెట్టు మొదలంటా  ఎండి పోయి  నాశనమై పోతుంది. అదే విధంగా చెడ్డవానితో  చేసే  సహవాసం గుణ వంతుని  సర్వనాశనం చేస్తుంది.

                                   అల్పబుద్ధి వాని కధికారమిచ్చిన
                                  దొడ్డవారి నెల్లఁ దొలగఁ ద్రోచు
                                 చెప్పుదినెడి కుక్క చెఱకు తీపెఱుగునా
                                  విశ్వదాభిరామ వినురవేమ !


                                              చెప్పు తినే కుక్కకి చెఱకు  తీపి తెలియనట్లుగా అల్పబుద్ధి యైన వానికి మంచితనమంటే ఏమిటో తెలియదు కాబట్టి  అల్పబుద్ధిగలవానికి  అధికారం ఇస్తే మంచివారి నందరిని  ఉద్యోగాల్లోంచి  తీసేస్తాడు. మంచితనం లోని తీయదనం  దుర్మార్గుడుకి తెలియదు కదా !

                                 విద్యలేనివాడు విద్యాధికుల చెంత
                                 నుండి నంతఁ బండితుండు కాడు
                                 కొలని హంసలఁ కడ కొక్కెర యున్నట్లు
                                 విశ్వదాభిరామ వినురవేమ !

               చదువురానివాడు పండితుల చెంత ఉన్నంత మాత్రం చేతనే పండితుడైపోడు.ఎందుకంటే  సరోవరంలో  హంసలతో కొంగలు ఉంటున్నాయి  కదా ! మరి ఏనాడైనా  ఒక్క కొంగ అయినా  హంసగా  మారిందా ? లేదు కదా !
 
                                      పాముకన్న లేదు పాపిష్టి జీవంబు
                                      అట్టి పాము జెప్పి నట్టె వినుము
                                     ఖలుని గుణము మాన్ప ఘనులెవ్వరును లేరు
                                     విశ్వదాభిరామ వినురవేమ !

                    పాము కంటే ప్రమాదకరమైన విష జంతువు మరొకటి లేదు కాని   ఆ పామును  కూడ మచ్చిక చేసుకొని చెప్పినట్టు చేయించవచ్చును. కాని దుర్మార్గుని గుణాలను  మార్చడమనేది ఎంత గొప్పవారికైనా సాధ్యంకాదు.


                                    వేము పాలు వోసి ప్రేమతోఁ బెంచిన
                                    చేదు విఱిగి తీపి చెంద బోదు
                                    ఓగు నోగేఁగాక యుచితజ్ఞుఁ డెటులౌను
                                     విశ్వదాభిరామ వినురవేమ !

                        వేపచెట్టు కి పాలుపోసి పెంచినా దాని సహజసిద్దమైన చేదు పోయి తీపిదనం రాదు. అదేవిధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని  ఎన్ని మంచి మాటలు చెప్పినా చెడ్డవాణ్ణి మంచి వానిగా మార్చలేము.

                                            పాలు పంచదార పాపరపండ్ల లో
                                            జాల బోసి వండఁ జవికిరాదు
                                           కుటిల మానవులకు గుణమేల కల్గురా
                                          విశ్వదాభిరామ వినురవేమ !

                               పాపర పండ్లు  కటికచేదుగా ఉండే పండ్లు. అటువంటి పండ్ల లోని చేదు పోవడానికి పాలు, పంచదార పెద్దమొత్తంలో గుమ్మరించి వంటచేసినా   చేదుపోనట్లే దుర్మార్గులకు మంచిబుద్ధులు చెప్పి ఎంతగా మార్చుదామనుకున్నా  ఫలితం ఉండదు. వారి లోని దుర్గుణాలు  ఎంతకు పోవు కదా. !

                           ముష్టి వేపచెట్టు మొదలంట ప్రజలకు
                           బరగ మూలికలకుఁ బనికి వచ్చు
                          నిర్దయాత్మకుండు నీచుఁ డెందులకౌను
                          విశ్వదాభిరామ వినురవేమ !

                                    వేపచెట్టు చేదు గల్గిన చెట్టయినా కూడ దాని అన్నిభాగాలు మూలికలుగా వైద్యానికి ఉపయోగపడతాయి. కాని నిలువెల్ల చెడును అంటే దుర్మార్గపు ఆలోచనలను నింపుకున్న నీచుడు ఎందుకూ ఉపయోగపడడు కదా. !

                               కాని వారి  తోడఁ గలసి మెలగుచున్నఁ
                               గాని వాని గానె కాంతు రవనిఁ
                               తాటి క్రిందఁ బాలు త్రాగిన చందమౌ
                                విశ్వదాభిరామ వినురవేమ !


                                 చెడ్డవారితో కలిసి తిరుగుతుంటే మనల్ని కూడ చెడ్డవారి గానే ఈ లోకం భావిస్తుంది. ఎందుకంటే తాటిచెట్టు క్రింద కూర్చొని పాలుతాగినా చూసేవారు కల్లు తాగుతున్నావనే అనుకుంటారు కదా !

                                      తామసించి చేయదగ దెట్టి కార్యంబు
                                      వేగిరింప నదియు విషమె యగును
                                       పచ్చికాయఁ దెచ్చి పండింప ఫలమౌనె
                                        విశ్వదాభిరామ వినురవేమ !

                                     ఆవేశంతో , కోపం తో  ఏ పని చేయకూడదు. తొందరపడి చేస్తే ఆ పని పాడైపోవచ్చు.  ఎందుకంటే  పచ్చికాయ ను తెచ్చి పండపెడితే మాత్రం అది ఫలమవ్వదు కదా ?

                             కోపమునను ఘనత కొంచెమై పోవును
                            గోపమునను మిగుల గోడు గలుగు
                             గోప మడచె నేని గోర్కెలు నీడేరు
                              విశ్వదాభిరామ వినురవేమ !
                          
                        మన లోని గొప్పతనం కోపం మూలం గా తగ్గిపోతుంది. కోపం వలన మిక్కిలి ఇబ్బందులు  కలుగుతాయి.  కోపాన్ని తగ్గించుకుంటే కోర్కెలను సాధించుకోవచ్చు.

                               నీళ్ళమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
                                బైట మూరె డైన బాఱ లేదు
                                నెలవు తప్పుచోట నేర్పరి కొరగాడు
                                 విశ్వదాభిరామ వినురవేమ !    

                   నీటి మీద పడవ ఒడిదుడుకులు లేకుండా చక్కగా ప్రయాణం చేస్తుంది. నేలమీద  మూరెడైనా ముందుకు  వెళ్లలేదు. ఎందుకంటే తన చోటు కానిచోట ఎంతనేర్పరి యైన నెగ్గుకు రాలేడు కదా !


    **************   *************   రెండవభాగం  త్వరలో**********************************