Saturday, 17 May 2014

శతక సౌరభాలు - 1 దాశరథీ శతకము - 7

శతక సౌరభాలు --1
                           
                             కంచర్ల గోపన్న   దాశరథీ శతకము --7

        


         కాంచన వస్తు సంకలిత కల్మష మగ్నిబుటంబు బెట్టిఁవా
         రించిన రీతి ,నాత్మ నిగిడించిన దుష్కర దుర్మల త్రయంబు
         బంచిత భక్తి యోగ దహనార్చిఁదగుల్పక బాయునే ?  కన
         త్కాంచన కుండలాభరణ ! దాశరథీ! కరుణాపయోనిధీ !       (88 ప )
            
                 ఓ రామచంద్రా  ! ప్రకాశించెడి స్వర్ణ కుండల భూషితుడీ . బంగారు ఆభరణములందలి మలినమును అగ్ని లో పుటము వేసి పోగొట్టినట్లు , ఆత్మకు మనోవాక్కాయముల వలన కల్గిన దోషములు భక్తి యనెడి అగ్ని లో  కాల్చని యెడల పోవు కదా  !

            నీ సతి పెక్కు కల్ములిడ నేర్పరి లోక మకల్మషంబు గా
            నీ సుత చేయు భావనము నిర్మల కార్యధురీణ దక్షుడై
            నీ సుతుఁ డిచ్చునాయువులు నిన్ను భజించినఁ గల్గకుండునే
            దాసుల కీప్సితార్దములు ? దాశరథీ! కరుణాపయోనిధీ !
                           
                   ఓ దాశరథీ  ! నీ ఇల్లాలు  శ్రీ మహాలక్ష్మీ దేవి సంపదలనిచ్చు తల్లి.  నీకుమార్తె గంగాదేవి ఎల్లలోకములను పావనము చేయు నిర్మల.   దోషములు లేని పనులు చేయుటలో నేర్పరి యైన నీకుమారుడు బ్రహ్మదేవుడు  ఆయువులను ఇచ్చును . ఇటువంటి నిన్ను సేవించి భక్తుల కోరికలు తీరకుండునే  రామచంద్రా !
           
             వారిజపత్ర మందిడిన వారి విధంబున వర్తనీయమం
             దారయ రొంపిలోనఁ దనువంటని కుమ్మరిపుర్వు రీతి సం
            సారమునన్ మెలంగుచు  విచారగుఁడై పరమొందు గాదె స
            త్కార మెఱింగి మానవుడు దాశరథీ! కరుణాపయోనిధీ
                         
                               శ్రీరామచంద్రా ! తామరాకుపైన  నీటిబొట్టున్నను ఆకునకు నీరు అంటని విధంగా , బురదలో కుమ్మరిపురుగున్నను దాని ఒంటికి బురద అంటని విధం గా , మానవుడు సంసారము లో ఉన్నను  పరమాత్మ విచారణ లో నున్నచో మోక్షమును పొందగలడు .

           ఎక్కడ తల్లిఁ దండ్రి ? సుతు లెక్కడ వారు ? కళత్ర బాంధవం
          బెక్కడ ? జీవు డెట్టి ? తను వెత్తినఁ బుట్టుచుఁ బోవుచున్న వాఁ
          డొక్కడె పాపపుణ్య ఫల మొందిన నొక్కడె కానరాడు వే
          ఱొక్కడు వెంటనంటి భవమొల్ల నయా కృపజూడుమయ్య నీ
          టక్కరి మాయలం దిడక దాశరథీ! కరుణాపయోనిధీ !
                        

                                      శ్రీ రఘునాథా !  తల్లి ,తండ్రి భార్య ,బిడ్డలు చుట్టములు వీరందఱు ఎవరు . ఈ జీవుడు ఎటువంటి శరీరాన్ని ధరించిన  తానే పుడుతూ , ఒంటరిగా తానే పోతూ ఉంటాడు. పుణ్య పాప ఫలములు వాడొక్కడే పొందును కాని ఎవ్వడు తోడురాడు. ఈ మాయ అంతయు నీదే స్వామీ  ! నన్ను ఈ టక్కరి మాయ లందు వేయకయ్యా రామా ! నాకు ఈ జన్మము  ,సంసారము వద్దు స్వామీ ! 
    

          తొరసిన కాయము ల్ముదిమి తోచినఁజూచి ప్రభుత్వముల్సిరుల్
          మెఱపులు గాగఁ జూచి మరి మేదినిలోఁ దమతోడివారు ముం
          దరుగుట జూచి ; తగు నాయు వెఱుంగక మోహపాశము
          ల్తరుగని వారికేమి గతి ? దాశరథీ! కరుణాపయోనిధీ !
      
               శ్రీరామా ! .ఏర్పడిన ఈ శరీరములు ముసలి వై ,సంపదలు రాజ్యములు  మెఱుపు వలే నశించిపోవునని , ఈ భూమిమీద తనతో పుట్టిన వారెందరో  చనిపోవుచండుటను చూచి కూడ తన ఆయుష్షును  గురించి ఆలోచింపక తాము శాశ్వతమనే అజ్ఞానపాశములలో చిక్కుకున్న వారి గతి ఏమౌనో గదా !

         సిరిగల నాడు మైమఱచి  చిక్కిననాడు దలంచి పుణ్యముల్
         పొరి పొరి జేయనైతి ,నని పొక్కిన గల్గునె గాలిచిచ్చుపైఁ
         గెరలిన వేళ ,దప్పిగొని కీడ్వడు వేళ , జలంబుగోరి త
         త్తరమునఁ ద్రవ్వినం గలదె దాశరథీ! కరుణాపయోనిధీ!

                ఓ రామా !  సంపద ఉన్నప్పుడు మదముతో మైమఱచి , పేదఱికము కల్గిననాడు  పుణ్యములు చేయలేదే యని దుఖించిన ఏమి ప్రయోజనము. అగ్ని ప్రమాదము  సంభవించినపుడు, దాహము వేసినప్పుడు నీటి కోసం బావిని త్రవ్వ యత్నించిన ఫలమేమి  !
     

                 జీవనమింకఁ బంకమునఁ జిక్కిన మీను చలింప కెంతయుం
           దావున నిల్చి జీవనమె తద్దయుఁ గోరు విధంబు చొప్పుడం
           దావలమైన గానిఁ గురిఁదప్పని వాడు తరించువాడయా
           తావక భక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ !
   
             శ్రీరామా !  చెఱువులో నీరెండి పోయినను  బురద లో చిక్కిన చేప నీటిపైనే గురిపెట్టుకున్నట్లు ,భక్తియోగము తో నీపై మనస్సు నిల్పిన వాడు  సంసారమును  దాటగలడు..

           సరసుని మానసంబు సరసజ్ఞు డెఱుంగును ,ముష్కరాధముం
           డెఱిగి గ్రహించువాడె ?  కొలనేక నివాసము గాంగ దుర్దురం
            బరయగ నేర్చునెట్లు ? వికచాబ్జ మరంద రసైక సౌరభో
           త్కరము మిళింద మొందు క్రియ దాశరథీ! కరుణాపయోనిధీ !
         
                   శ్రీ రామచంద్రా !   యోగ్యుల మనస్సును యోగ్యులెరుంగగలరు కాని నీచుల వలన కాదు. కమలములందలి తేనె యొక్క పరిమళము తేనెటీగకు తెలియును గాని ఆ కొలనులోనే ఉండెడి కప్పకేమి తెలియును . తెలియదు కదా అని అర్ధము .
        
             నోచిన తల్లిఁదండ్రికి తనూభవు డొక్కడె చాలు మేటి చే
             జాచనివాడు ,వేఱొకడు చాచిన లేదనకిచ్చువాడు , నో
             రాచి నిజంబె కాని పలుకాడనివాడు , రణంబు నందు మై
             దాఁచనివాడు  భద్రగిరి ! దాశరథీ! కరుణాపయోనిధీ !
                    
                        శ్రీ రామా ! పుణ్యాత్ములైన తలిదండ్రులకు   దానమునకై చేయి చాచని వాడు , అడిగిన వారికి లేదనక ఇచ్చువాడు , అబద్ధమాడని వాడు , యుద్ధము నందు పిరికి తనము  చూపని వాడు నైన గొప్పవాడు ఒక్క కుమారుడే చాలును. అటువంటి కొడుకును కన్న ఆ తల్లిదండ్రులు ధన్యులు .

          శ్రీ యుత ! జానకీరమణ ! చిన్మయరూప ! రమేశ ! రామ ! నా
         రాయణ ! పాహి పాహి యని ప్రస్తుతి జేసితి నా మనంబునన్
         బాయక కిల్పిషవ్రజ విపాటన మందగ జేసి సత్కళా
         దాయి ఫలంబు నాకిడవె ! దాశరథీ! కరుణాపయోనిధీ !
             
                                 శ్రీరామా ! జానకీనాథా .!  జ్ఞానస్వరూపుడా !  శ్రీలక్ష్మీనాథా !  రామా !  నారాయణా ! రక్షింపుము రక్షింపుము అని నామనస్సు నందు స్తోత్రము చేశాను. నీవు నా మనస్సు నందు నిల్చి  నాలోని పాపాల నన్నింటిని   నశింపజేసి  నాకు  శుభకరమైన మోక్షము నీయవలసినది రామా !

       ఎంతటి పుణ్యమో ? శబరి ఎంగిలిఁ గొంటివి వింతగాదె ? నీ
      మంతనమెట్టిదో ? యుడుత మేనిఁ గరాగ్ర నఖాంకురంబులన్
      సంతసమందఁ జేసితివి; సత్కులజన్మ మదేమి లెక్క? వే
       దాంతము గాదె నీమహిమ ?  దాశరథీ! కరుణాపయోనిధీ !
                     
                                    శ్రీరామచంద్రా ! నీ చేతలలోని రహస్యమేమో కాని రామా ! ఆ శబరి ఎంగిలి తిన్నావు  ఆవిడ ఎంత పుణ్యాత్మురాలో. ! నీ చేతి వేళ్ళ తో ఉడుత శరీరమును నిమిరి  దానిని సంతోషపెట్టావు . నీ గొప్పతనము జ్ఞానమే కాని  వంశము కాదు కదా శ్రీ రామా !

          బొంకనివాడె యోగ్యుఁ డరి పుంజము లెత్తినచోట బోరికిన్
          జంకనివాడె జోదు , రభసంబున నర్ధి కరంబు సాచినం
          గొంకని వాడె దాత మిము గెల్చి భజించిన వాడె ఫో నిరా
         తంకమనస్కుడెన్నఁ గను దాశరథీ! కరుణాపయోనిధీ !
          
                         శ్రీరామా ! అసత్యము చెప్పని వాడే యోగ్యుడు. యుద్ధరంగము నందు భయపడని వాడే వీరుడు. అడిగిన వారికి లేదనక ఇచ్చువాడే దాత . నిన్ను స్మరించి సేవించిన వాడే నిజమైన భక్తుడు.
     
              భ్రమరము కీటకంబు గొని పాల్పడి ఝంకరణోపకారియై
              భ్రమరము గా నొనర్చునని పల్కుటఁ జేసి భవాది దుఖసం
              తమస మెడల్చి ,భక్తి సహితంబు గ జీవుని విశ్వరూప త
              త్త్వమును ధరించుటే మరుదు దాశరథీ! కరుణాపయోనిధీ !
            

                                      శ్రీరామా ! తుమ్మెద ఒక పురుగు ను తీసుకొచ్చి  దాని వద్ద శ్రద్ధ తో ఝంకారము చేయుచూ , దానిని తుమ్మెద గా మార్చునని ( ? ) చెప్పెడి మాటలు  వింతగా లేవు. ఎందువలనంటే నీవు జీవుల  జన్మాది సంసార దు:ఖసంబంధమైన అజ్ఞానమనెడి  చీకటిని పోగొట్టి , భక్తితో కూడిన విశ్వరూప తత్త్వము నొందించుట గొప్ప కదా స్వామీ !

             తరువులు పూచి కాయలగుఁ దత్కుసుమంబులు పూజగా భవ
             చ్చరణము సోకి  దాసులకు సారములౌ ధనధాన్యరాశులై
             కరిభట ఘోటకాంబర నికాయములై ,విరఝానదీ సము
             త్తరణ మొనర్చుఁ జిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ !
                         

                              శ్రీరామా  !  చెట్లు పూసి , అనంతరం కాయలౌతాయి. కాని ఆ పూలనే నీకు పాదపూజ చేసినచో నీ సేవకులకు   అవి  మంచిగా పరిణామ మొంది ధనధాన్య రాశుల నిచ్చును . చిత్రము గా అవియే భటులు ,గుఱ్ఱాలు ఏనుగు లు గా గల పరివారమేర్పడి  .తుదకు విరజానది ని దాటించి వైకుంఠమును చేర్చును.
   
          పట్టితి భట్టరార్య గురు పాదములిమ్మెయి నూర్ధ్వపుండ్రముల్
          బెట్టితి , మంత్రరాజ మొడిఁ బెట్టితి ,నయ్యమకింకరాళికిన్
          గట్టితి బొమ్మ ; మీ చరణ కంజములందుఁ దలంపు బెట్టి పో
          దట్టితి పాపపుంజముల ; దాశరథీ ! కరుణాపయోనిధీ !
                   

                                       శ్రీరామచంద్రా ! శ్రీ రఘునాథ భట్టాచార్యుల వారి పాదముల నాశ్రయించి , యీ విధంగా  నామములను ధరించి , శ్రీరామ తారక మంత్రాన్ని గ్రహించి , యమ భటులను తిరస్కరించి , మీ పాదపద్మాలనే మదిలో స్మరిస్తూ , పాపసమూహాలను పారాద్రోలాను ఓ సీతాపతీ !
               
          అల్లన లింగమంత్రి సుతు డత్రిజ గోత్రజు డాదిశాఖ కం
          చెర్ల కులోద్భవుండనఁ బ్రసిద్ధుడనై భవదంకితంబు గా
          నెల్లకవుల్ నుతింప రచియించిన గోపకవీంద్రుడన్ జగ
          ద్వల్లభ ! నీదు దాసుడను ; దాశరథీ ! కరుణాపయోనిధీ !    ( 103 ప )
          
                    శ్రీ రామచంద్రా  ! దయానిథీ  !  లింగన మంత్రి కుమారుడను . ఆత్రేయసగోత్రుడను. కంచెర్ల వంశంలో పుట్టిన వాడను .  ఆదిశాఖ అనగా శుక్లయజుశ్శాఖీయుడను అయిన గోపన్న అను కవీశ్వరుడనైన  నేను  నీ దాసుడనై  రామదాసు గా లోకేశ్వరుడవైన నీకు అంకితము గా  కవులెల్లరు మెచ్చునట్లుగా  ఈ శతకాన్ని రచించాను .  
          ఇది  శ్రీ కంచెర్ల గోపన్న నామధేయ శ్రీ భక్త రామదాస విరచితమైన
             
                           శ్రీ దాశరథీ శతకము, తేజస్వినీ వ్యాఖ్యా సహితము .
                                                             
                                                                  సంపూర్ణము.






*********************************************************************

Tuesday, 13 May 2014

శతక సౌరభాలు - 1 దాశరథీ శతకము -- 6

     
శతక సౌరభాలు - 1
                                                       కంచర్లగోపన్న       దాశరథీ శతకము - 6

     


                  దైవముఁ దల్లి తండ్రిఁ దగు దాత గురుండు సఖుండు నిన్నె సం
       భావన చేయుచున్న తఱిఁ బాపము లెల్ల మనోవికార దు
       ర్భావితు జేయుచున్నవి కృపామతి వై నను గావుమీ జగ
       త్పావన మూర్తి భద్రగిరి ! దాశరథీ ! కరుణాపయోనిధీ.! 
      
                       శ్రీరామచంద్రా ! తల్లి ,తండ్రి ,దాత ,గురువు , మిత్రము అన్నీ నీవే నని భావించి ధ్యానం చేసేటప్పుడు  నేను చేసిన పాపాలన్నీ నామనస్సును వికారముల చే చెడ్డ ఆలోచనల పాలు చేయుచున్నవి. జగత్పావన మూర్తి వైన నీవు నన్ను దయతో రక్షించవలసినది స్వామీ !
         
         వాసవు రాజ్యభోగ సుఖవార్థినిఁ దేలు ప్రభుత్వ మబ్బ నా
         యాసకు మేరలేదు  కనకాద్రి సమాన ధనంబుఁ గూర్చినం
         గాసును వెంటరాదు కనికానక చేసిన పాపపుణ్యముల్
         వీసరబోవ నీవు పదివేలగుఁ జాలు భవంబు లొల్ల నీ
         దాసునిఁగాగ నేలుకొను దాశరథీ ! కరుణాపయోనిధీ.!
         
          శ్రీరామా  ! దేవేంద్రునితో సమానమైన రాజభోగ మబ్బినను ఆశ కు అంతుండదు. మేరుపర్వతమంత ధనరాశి సంపాదించినను కాసు కూడ వెంటరాదు. తెలిసీ తెలియక చేసిన పుణ్యపాపములు ఎటువంటి వైనను వీసమెత్తు తగ్గకుండా వెంట వస్తాయి. కావున రామా. ఇతరములతో నాకు పనిలేదు. నీవే నాకు చాలును. ఇంక మరు జన్మలు వద్దు. నన్ను నీ సేవకుని గా ఏలుకొనవలసినది.

             మనమున నూహపోహణములు మర్వకమున్నె కఫాది రోగముల్
        తనువున నంటి మేని బిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా
        ధనమొనరింప వలయుఁ దత్త్వ విచారము మానియుండుటల్
        తనువునకున్ విరోధమగు దాశరథీ ! కరుణాపయోనిధీ.!

                    శ్రీరామా  ! మనస్సు స్వాధీనము తప్పక ముందే . కళ్ళె మొదలైన రోగములు   శరీరము లో ప్రవేశించి దేహపటుత్వము తగ్గక ముందే , మానవుడు  మోక్షసాధన చేయవలెను .  ఆత్మ విచారణ చేయకుండుట దేహము నకు మంచిది కాదు.

                   ముదమున కాటపట్టు ,భవమోహమదద్విరదాంకుశంబు , సం
       పదల కొటారు ,కోరికల పంట ,పరంబున కాది ,వైరుల
       న్నదన జయించు త్రోవ , విపదబ్దికి నావ గదా ,సదా భవ
        త్సదమల నామ సంస్మరణ దాశరథీ ! కరుణాపయోనిధీ.!

                   ఓ దాశరథీ ! శ్రీరామా ! యనెడి నీ నామ స్మరణ సంతోషమును కల్గించును . సంసారమనెడి బంధములను తొలగించును . సంపదలు కల్గి , కోరికలు తీరును  మోక్షమునకు  మార్గము   సుగమమగును . అరి షడ్వర్గములను జయించవచ్చును . ఆపదలను తేలికగా దాటవచ్చును .
      
                 దురిత లతానుసారి భవదుఖకదంబము రామనామ భీ
          కరతర హేతిచే దెగి  వకావకలై చనకుండ నేర్చునే
         దరికొని మండుచుండు శిఖదార్కొనిన్ శలభాదికీటకో
                   త్కరము విలీనమై చనదె ? దాశరథీ ! కరుణాపయోనిధీ !

                       శ్రీరామచంద్రా ! పాపములనెడి  తీగతో బంధించబడిన సంసార దుఖ సమూహములు  శ్రీరామనామమనెడి ఖడ్గము చే తెగిపోవును. నిప్పును సమీపించిన మిడుతలు మొదలైన పురుగులు  నాసనము చెందును కదా !
      
                       హరిపదభక్తి నింద్రియ జయాన్వితు డుత్తము డింద్రియంబులన్
                మరగక నిల్పనూదినను మధ్యముఁ డింద్రయ పారవశ్యుడై
         పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతి నైన నన్ను నీ
         దరమున నెట్లు గాచెదవో దాశరథీ ! కరుణాపయోనిధీ !
         
     శ్రీ రఘునాథా ! శ్రీ హరి భక్తులలో ఇంద్రియములను జయించిన వాడు ఉత్తముడు. ఇంద్రియములకు లోబడక మనస్సును మరల్చుకో గలిగిన వాడు మధ్యముడు. ఇంద్రియములకు లోబడిన వాడు  నికృష్టుడు. నీచుడు. అని పెద్దలు చెపుతారు . మరి నేను చెడ్డ బుద్ధి గలవాడను . ఐనా నన్ను ఏ రీతిగా రక్షిస్తావో రామచంద్రా !
                               ఈ పద్యం లో  భక్తులలోని మూడు రకాల వారిని రామదాసు వివరించాడు.

          వనకరి చిక్కె మైనసకు , వాచవికిం జెడిపోయి మీను తా
          వినికికిఁ జిక్కె  జిల్వ కనువేదుఁఱు జెందెను లేళ్ళు తావిలో
          మనికి నశించెఁ దేటి తరమా  యిరుమూటిని గెల్వ నైదు సా
          ధనముల నీవెకావనగు దాశరథీ ! కరుణాపయోనిధీ !

                    శ్రీరామా ! దయాసముద్రా !  అడవి యేనుగు ఆడ ఏనుగు మీద మోజు చేత వేటగాడికి దొరికిపోతుంది.  జిహ్వచాపల్యం తో చేప ఎర కోసం వచ్చి గాలానికి చిక్కుకుంటుంది. పాము నాగస్వరానికి లొంగిపోయి పట్టుపడుతుంది. ఎండమావులను చూచి నీరు  అనుకొని భ్రమించి పరుగెత్తి పరుగెత్తి  అలసిపోయి మరణిస్తాయి లేళ్లు. మొగలిపూల వాసనకు ఆకర్షించబడి , అందలి పుప్పొడి కన్నులలో పడి గుచ్చుకొని తేనెటీగ మరణిస్తుంది.   గెలువ సాధ్యము కాని   ఈ ఐదింటినుండి ( త్వక్ చక్షుశ్శోత్ర ఘ్రాణ రసన  వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు  )  ఐదు ఉపాయాల చేత నన్ను రక్షించవలసినది.

                          కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
             స్మరణదనర్ప  వీనులు భవత్కధలన్ వినుచుండ , నాస మీ
             యఱుతను బెట్టు పూసరుల కాసఁగొనం బరమార్ధ సాధనో
             త్కరమిది చేయవే కృపను దాశరథీ ! కరుణాపయోనిధీ !  

                       శ్రీరామా  ! నా చేతులు మీకు నమస్కరించునట్లును ,నా కన్నులు మిమ్ములనే చూచునట్లును , నా నాలుక మీ నామస్మరణ చేయునట్లును , నా చెవులు మీ కధలను వినునట్లుగను , నా ముక్కు మీ మొడయంది అలంకరించిన పూలమాలల వాసనను ఆఘ్రాణించు నట్టును    ఈ పంచేంద్రియములను నేను  మోక్షసాధనములు గా  ఉపయోగించు  అవకాశమును మీరు నాకు దయచేయవలసినది .

             చిరమగు భక్తినొక్క తులసీదళ మర్పణ చేయువాడు ,ఖే
       చర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదాభవత్
       స్భురదరవింద పాదముల బూజ లొనర్చిన వారికెల్లఁ ద
                        త్పర మఱచేతి ధాత్రి గద దాశరథీ! కరుణాపయోనిథీ !   ( 85 ప )

                ఓ రామచంద్రా  ! మానవుడు నిలకడైన భక్తితో  నీకొక తులసీ దళము సమర్పించినా కూడ  సిద్ధ  గంధర్వాదుల లోకము సంప్రాప్తించును . నీపాదపద్మములను సేవించిన వారికి మోక్షము  కరతలామలకము కదా !
           శ్రీ రామచంద్రుని  అసమాన దైవత్వాన్ని , శ్రీరామ నామ ప్రాశస్త్యాన్ని మనసారా స్మరించి, తనవి తీర వర్ణించి పులకిస్తున్నాడు శ్రీ రామదాసు.

                           భానుఁడు తూర్పునందు గనుపట్టినఁ బావకచంద్రతేజముల్
           హీనతఁ జెందినట్లు ,జగదేకవిరాజితమైన నీ పద
                     ధ్యానము  చేయుచున్నఁ బరదైవమరీచు లడంగకుండునే
            దానవ గర్వనిర్ధళన  దాశరథీ! కరుణాపయోనిథీ !     

                  శ్రీరామా ! రాక్షసుల గర్వమును నశింపజేసినవాడా ! సూర్యడు ఉదయించగానే చంద్రునికిని , అగ్నికిని కాంతి తగ్గినట్టు గా జగదేకవిరాజితమైన నీ పాదపద్మాలను ధ్యానించుచున్న యెడల  ఆ కాంతి లో ఇతరదేవతల తేజస్సు  మసకబారును కదా !

                 నీ మహనీయ తత్త్వరస నిర్ణయబోధ కధామృతాబ్ది లో
                         దామును గ్రుంకులాడక వృధా తను కష్టమునొంది  మానవుం
                  డీ మహిలోక తీర్ధములనెల్ల మునింగిన  దుర్వికార హృ
                                          త్తామస పంకముల్ విడునె దాశరథీ! కరుణాపయోనిథీ !                      

                   శ్రీరామా !  నీయొక్క తత్వ్తమును తెలిపెడి రామకధామృత సముద్రము లో  మునుగులాడక ,  మానవుడు  అనవసరము గా దేహమును కష్టపెట్టి  భూలోకమందు గల ఎల్లతీర్ధములలోను  గ్రుంకులిడినా కూడ మనస్సు నంటుకొనిన దుర్వికారములు కల  అజ్ఞానమనెడి బురద వదలదు కదా స్వామీ  !.

                                                                చదువుతూ ఉండండి . మరికొన్ని అందిస్తాను .






*********************************************************************************

Sunday, 11 May 2014

శతక సౌరభాలు - 1 దాశరథీ శతకము - 5


శతకసౌరభాలు -1
                 
                             కంచర్ల గోపన్న  దాశరథీ శతకము

     



             అగణిత జన్మ కర్మ దురితాంబుధి లో బహుదు:ఖవీచికల్
             తెగిపడ నీదలేక  జగతీధవ నీ పద భక్తి నావ చే
             దగిలి తరింపగోరితిఁ బదంపడి నాదు భయంబు మాన్ప వే
             తగదని చిత్త మందిడక దాశరథీ ! కరుణాపయోనిధీ !
          
               శ్రీ రామా ! అనేక జన్మల యందలి కర్మల పాపములనెడి  సముద్రము లో  అనేకములైన దు:ఖములనెడి అలల దెబ్బలకు   ఈదలేక  నీ యొక్క దివ్య పాదభక్తి యనెడి ఓడను పట్టుకొని  పాపమనెడి సముద్రమును దాట దలచినాను. తగదని మనసు లో భావించక   నా భయమును పోగొట్టి  నన్ను కాపాడ వలసినది తండ్రీ !
       
          నేనొనరించు పాతకము లనేకము లైనను నాదు జిహ్వకున్
          బానకమయ్యె మీ పరమ పావన నామము   తొంటి రాచిల్కరా
          మా  నను గావుమన్నఁ దుదిమాటను సద్గతి నొందె  గావునన్
    దాని ధరింప గోరెదను దాశరథీ ! కరుణాపయోనిధీ !
      
            దశరధ రామా ! నేను చేయునట్టి పాపములు అనేకములైనను  మీ పరమ పవిత్ర నామము నా నాలుకకు మిక్కిలి మధురము గా నున్నది. పూర్వమొక చిలుక  శ్రీరామా ! నన్ను రక్షింపుమని పలికి   దాని వలన మోక్షమును పొందినది. కావున నేను కూడ నీ దివ్యనామమునే నేను స్మరించెదను.

             పరధనమున్ హరించి ,పరభామలనంటి , పరాన్నమబ్బినన్
       మురిపమ కాని ,మీఁద నగు మోస మెఱుంగదు మానసంబు దు
       స్తరమది   కాలకింకర గదాహతిఁ బాల్పడనీక మమ్ము నే
       తఱి దరిఁజేర్చి  ప్రోచెదవో? దాశరథీ ! కరుణాపయోనిధీ !

                            ఓ రామా  1 పరధనముల నపహరించుట , పరభామలను పొందుట ,  ఇతరుల తిండి తినుట , బాగానే ఉండును కాని వాని వలన  తరువాత కల్గెడి నష్టము మనస్సుకు తెలియదు . వీనినుండి తప్పించుకొనుట కష్టము . కావున రామచంద్రా  మేము యమభటుల గదాఘాతముల  బారిన పడకుండా మమ్మల్ని ఏ విధంగా కాపాడి ఒడ్డుకు చేరుస్తావో నీదయ  రామచంద్ర ప్రభూ !

           చేసితి ఘోరకృత్యములు , చేసితి భాగవతాపచారముల్
           చేసితి నన్యదైవముల జేరి భజించిన వారి పొందు నే
           చేసిన నేరముల్ దలచి చిక్కుల బెట్టకుమయ్య ; యయ్య ; నీ
           దాసుడనయ్య ; భద్రగిరి ! దాశరథీ ! కరుణాపయోనిధీ !

                 రామా !నేను భయంకరమైన పాపములను చేసితిని. భగవద్భక్తుల యెడ దోషములు . నీభక్తులు కాని వారితో  స్నేహమును చేసితిని. నేను చేసిన ఈ తప్పులన్నింటినీ  తలచి నన్ను బాధలు పెట్టవద్దు , అయ్యా ! నేను నీ భక్తుడను స్వామీ !
   
              పరులధనంబుఁ జూచి పరభామలఁజూచి హరింపగోరు ను
             ద్ధురమగు నామనస్సను దొంగను బట్టి భవత్సుదాస్య వి
             స్భురిత వివేక పాశమున జుట్టి భవచ్చరణంబనే మరు
             త్తరువునఁ గట్టివేయగదె దాశరథీ ! కరుణాపయోనిధీ !    

               శ్రీరామా ! పరధనమును ,పరస్త్రీలను , కోరునట్టి బలమైన నామనస్సనెడి దొంగను పట్టి నీ సేవ వలన ఏర్పడిన  తెలివి అనెడి  త్రాటిచే  నీయొక్క పాదమనెడి కల్పవృక్షమునకు  బంధించుము .
                     అనగా నా మనస్సును ఇతర పాప చింతనముల వైపు పోకుండా నీ పాదసేవన మనెడి భక్తి తో బంధించవలసినదని రామదాసు ప్రార్ధన

               సలలిత రామనామ జపసార మెఱుంగను గాశికాపురీ
         నిలయుడణ గాను  మీ చరణ నీరజ రేణు మహాప్రభావముల్
         దెలియ నహల్యగాను  జగదీవర నీదగు సత్యవాక్యముల్
         దలపగ రావణాసురుని తమ్ముడ గాను భవద్విలాసముల్
         దలఁచి నుతింప నాతరమె దాశరథీ ! కరుణాపయోనిధీ !    

                 శ్రీ రామచంద్రా .! నీ దివ్యనామ జప మహత్మ్యము  తెలిసికొన నేను కాశీ విశ్వేశ్వరుడను కాను . నీ పాదధూళి శక్తి  తెలియగ అహల్యను కాను. నీ సత్య వాక్యముల శక్తి ని తెలియ  విభీషణుని కాను . నీ యొక్క లీలలను వర్ణింప నాతరమా స్వామీ !

           దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ
           దాసుల దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు ,నే
           జేసిన పాపమో వినుతిఁ జేసిన గానవు , గావుమయ్య నీ
           దాసులలోన నేనొకడ దాశరథీ ! కరుణాపయోనిధీ !    

                                రామయ్యా  !  నీకు శబరి దగ్గర బంధువా ? ఆమెను కరుణించావు . నీ  సేవకులకు సేవకుడనా ఆ  గుహునకు నీ సేవాభాగ్యాన్ని కలిగించావు . నేనేమి పాపం చేశానని  ప్రార్థించినా నన్ను కరుణింపకున్నావు . రామా  ! నేను కూడ నీ సేవకులలో ఒకడనే .నన్ను కాపాడవయ్యా.
   
           జలనిధు లేడు నొక్క మొగిఁ జక్కికి దెచ్చె శరంబు ఱాతి నిం
           పలరగ జేసె నాతిగఁ బదాబ్జ పరాగము నీ చరిత్రమున్
           జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగ లేరు ,గావునన్
           దలప నశక్యమయ్య నిను  దాశరథీ కరుణాపయోనిధీ.

                 శ్రీరామా  ! నీబామము ఏడు సముద్రాలను లొంగదీసుకున్నది. నీపాదధూళి  ఱాతిని స్తీ గా మార్చినది. బ్రహ్మాదులు సైతం  నీ చరిత్రను పొగడలేరు. అటువంటి నిన్ను గురించి ఆలోచించుట నాతరము కాదు స్వామీ.!

          క్రోతికి శక్యమా అసుర కోటుల గెల్వగ గెల్చెఁ బో నిజం
          బాతని మేన శీతకరుండౌట  దవానలుఁడెంత వింత మా
          సీత పతివ్రతా మహిమ సేవకు భాగ్యము  మీ కటాక్షముల్
          ధాతకు శక్యమా పొగడ   దాశరథీ ! కరుణాపయోనిధీ !

                      శ్రీరామా.!  ఒక  కోతి రాక్షసులను సంహరించిందన్నను , వానరుని శరీరంమీద అగ్నిహోత్రుడు చల్ల గా మారాడన్నను , అవి గొప్పవింతలు .  ఇదంతా కూడ మా తల్లి సీతామహాదేవి పాతివ్రత్య మహిమ , సేవకుడైన ఆంజనేయుని అదృష్టము , మీ యొక్క కృపా కటాక్షములే కారణము . నీ మహిమలను పొగడుటకు  చతుర్ముఖుడైన బ్రహ్మ కు సైతము  సాధ్యము కాదు. నేనెంతవాడను .

           భూపలలామ రామ !రఘుపుంగవ రామ !  త్రిలోకరాజ్య సం
           స్ధాపక రామ ! మోక్ష ఫలదాయక రామ !  మదీయ పాపముల్
           వాపగదయ్య రామ !  నిను ప్రస్తుతి జేసెదనయ్య రామ !  సీ
           తాపతి ! రామ ! భద్రగిరి ! దాశరథీ ! కరుణాపయోనిధీ.!

               రాజులలో శ్రేష్టుడా.!రామచంద్రా ! ముల్లోకములను పాలించువాడా. ! మోక్షదాయకుడవైన ఓ రామచంద్రా ! నిన్ను  ప్రార్థించెదను. నాపాపములను పోగొట్టి రక్షింపుము సీతాపతీ.!

            నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి ప
            ద్మాసను డాత్మజుండు , కమలాలయ నీ ప్రియురాలు నీదు సిం
            హాసన మీ ధరిత్రి ,గొడుగాకస ,మక్షులు చంద్ర భాస్కరుల్ ,
            నీ సుమతల్ప మాది ఫణి  నీవె సమస్తమునఁ గొల్చునట్టి నీ
            దాసుని భాగ్యమెట్టిదయ దాశరథీ ! కరుణాపయోనిధీ.!

             శ్రీరామా  !నీ సహజలక్షణము సాత్వికము . నీనివాసము పాలసముద్రము. బ్రహ్మదేవుడు నీ కుమారుడు. శ్రీ మహాలక్ష్మీ దేవి నీ ఇల్లాలు . ఈ భూమండలము నీ సింహాసనము. ఆకాశము గొడుగు . సూర్యచంద్రులు నేత్రములు . ఆది శేషుడే నీకు పూలపాన్పు. నీవే సమస్తమునకు అధినాథుడవు  అటువంటి నిన్న్ను సేవించెడి ఈ దాసుని అదృష్టము సామాన్యమైనదా స్వామీ ?

            చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్కవింత ,సు
       స్ధిరము గ నీటిపా గిరులు తేలిన దొక్కటి వింత ,గాని నీ
       స్మరణఁ దనర్చు మానవులు సద్గతి జెందుట యెంత వింత యీ
       ధరను ధరాత్మజా రమణ ! దాశరథీ ! కరుణాపయోనిధీ.!

         శ్రీరామా  ! సీతాపతీ!. మీ పాదములు సోకి ఱాయి స్త్రీ  గా మారడం ఒక వింతైతే , కొండలు నీటిపై తేలడం మరొక వింత.  అయితే అన్నిటి కంటే  ఈ భూమి పైన వింత ఏమిటీ అంటే నీ నామస్మరణ చేసిన మానవులు ఎంత పాపాత్ములైనా మోక్షాన్ని పొందుతున్నారు ఇది గొప్ప వింత కదా  రామా !                  

                                     చదువుతూ ఉండండి. మరి కొన్ని అందిస్తాను .





*********************************************************************************