Thursday, 18 April 2013

శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి


                      

                         శ్రీ   సీతారాముల కళ్యాణం చూతము  రారండి
                   
                      
                                     శ్రీ సీతారాముల కళ్యాణం  సర్వ జగత్కళ్యాణం.   శ్రీరామనవమి కి ఆంధ్ర దేశం లో వీథి వీథి న  చలువ పందిళ్ళు వేసి, శ్రీ సీతారాములకు కళ్యాణం చేసి,వడపప్పు, పానకాలను  కొసరి కొసరి పంచుకొని ఊరంతా సంబరం చేసుకోవడం  ఏనాటినుండో వస్తున్న ఆచారం.” దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే “అనే సామెత ఇక్కడి నుండే వచ్చింది.  శ్రీరాముడు లోకాభిరాముడైనా , భద్రాద్రి పై వెలసి , తెలుగువారికి  అయినవాడయ్యాడు.  “ సీతమ్మ మా అమ్మ రామయ్య మా తండ్రి “ అని సమస్త ఆంధ్ర జాతి మురిపెంగా చెప్పుకుంటుంది.
                       

                
                          విశ్వామిత్రుని అనుసరించి వచ్చిన రామలక్ష్మణులు మిథిలానగరం లో ప్రవేశించారు. విశ్వామిత్రుని చే అనుజ్ఞాతుడైన జనకుడు,  శివధనుస్సును తీసుకురావలసిందిగా తన మంత్రులను ఆజ్ఞాపిస్తాడు వాల్మీకం లో. ఎనిమిది చక్రాల బండి మీద ధనుస్సును పెట్టి, అయిదువేలమంది దృఢకాయులైన పురుషులు అతికష్టం మీద నెట్టుకొస్తారు. విశామిత్రుని ఆజ్ఞ తో రామచంద్రుడు పేటికను తెరచి, ధనుస్సు నెక్కుపెట్టాడు.  ఎక్కుపెట్టిన సమయం  ఎంతో తెలియదు కానీ, విరిగిన శబ్దం  మాత్రం రాజు, విశ్వామిత్రుడు, జానకి తో పాటు రామలక్ష్మణులు  మాత్రమే వినగలిగారట. మిగిలిన వారందరు మూర్ఛపోయారు.  “ వర్జ యిత్వా మునివరం రాజానం తౌచ రాఘవా:”(  వా.బా.67-18 ) అంటాడు వాల్మీకి .” వీర్య శుల్క” గా సీతమ్మ  రామ చంద్రుని చేరింది. ఇది వాల్మీకం.
                      
                వాల్మీకం లో  సీతా స్వయంవర ప్రస్తావన లేదు. ఎందరో రాజులు కోరారని, వారందరు గుంపులు కట్టుకొని మిథిలకు వచ్చి ధనస్సును ఎక్కుపెట్టలేక పడిపోయారని జనకుడు చెప్పిన మాటలే (వా.బాల. 67-18 )    అనంతర  కావ్యాల్లో సీతా స్వయంవరాన్ని ప్రకటింప చేశాయి.
                  
                           సీతా స్వయంవరానికి రావణుని రప్పించిన ఖ్యాతి కూడ అనంతర కవులదే. ఆనంద రామాయణం లో స్వయంవరమందు పరాభూతుడై తిరిగి వెళతాడు రావణుడు.

                    సీతా రాముల పరిణయానికి ముందే పుష్పవాటిక లో  జానకీ రాముల ఆకస్మిక సందర్శనాన్ని కల్పించి , పులకించిన మహాకవి  తులసీదాసు.” 

                        తొరవె  అనే “కన్నడ రామాయణం లో రావణుడు సీతా స్వయంవరానికి వచ్చి, ధనుస్సును ఎత్త లేక ముందుకు పడి, ఆ ధనుస్సు ను మీద వేసుకుంటే, అతని అనుచరులే ఏదో విధంగా అతన్ని బయటకు లాగి లంకకు తీసుకుపోతారు.(కన్నడం లో రామకథ. పు.14). 

                 



                ఇటువంటి కథలే తెలుగు లోనికి కూడ ప్రవేశించి సీతా స్వయంవర ఘట్టాలకు తెఱ లేపాయి. 
        
                     శ్రీ సీతా కళ్యాణాన్ని కమనీయమైన కావ్యరీతిలో రమణీయమైన లఘుకావ్యాలు గా అందించిన తెలుగుకవులలో  శ్రీ కరుణశ్రీ  ఒకరు. సీతా స్వయంవరానికి రంగాన్ని ఇలా  సిద్ధం చేశారు కవి.
                     
                     “ అది మహా సభ – సీతా స్వయంవరార్ధ
                       మచట గూడెను, తళతళలాడు భూష
                       ణాలతో ఖండఖండాంతరాల దొరలు
                      శివధనుర్భంగమునకు  విచ్చేసినారు “

                   ----- అంటూ ప్రారంభించారు ధనుర్భంగ ఘట్టాన్ని. బారులు తీరి భూపతులు బంగరు గద్దెల మీద కూర్చుండ, ఎదురుగ పెద్దవిల్లు,  ఆ వైపున శృంగార మధూక మాలికను పట్టుకొని తండ్రి చాటున నిలిచిన జానకి ,  ఇటు వైపు రాజఠీవి తొణికిసలాడ, వీర రసము మూర్తీభవించినట్లు, మునిరాజు వెన్క,  తమ్మునితో కలసి  నాజూకుగా నిల్చిన రఘువీరుడు.ఇదీ దృశ్యం.
                  
                         జనకుడు స్వాగత వచనాలు పలికాడు. శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరుణ్ణి నా కుమార్తె వరిస్తుందని  ప్రకటించాడు. ప్రకటన పూర్తయ్యింది. కరతాళ ధ్వనులతో సభాంగణం  మారు మ్రోగింది.. నతముఖి యైన సీత ముఖపద్మము వైపు నరేంద్ర కుమారుల చూపులు పరుగులెత్తాయి. కొమ్ము టేనుగుల వంటి రాచవస్తాదులు శృంగభంగం కాగా వెనుదిరిగారు. పితృవాక్య పరిపాలకుడు, గురుజన విథేయుడు, అయిన రామచంద్రుడు మాత్రం కదలలేదు. గురుదేవుల వైపు భక్తి వినమ్రంగా చూశాడు రాముడు. శిష్యవాత్సల్యం తో రఘువీరుని చూశారు గురుదేవులు. ఆ చూపులోనే ఆజ్ఞ  పొందు బడింది. ఆశీశ్శతం అందించబడింది.
             
                   తమ్మునకు ధనుస్సునిచ్చి, రఘుముఖ్యుడు జానకీదేవి  నోరకంటి తో  చూస్తూ,
 " సింహకిశోరమట్లు” ముందున కరుదెంచె నచ్చెరువుతో నృపతుల్ తలలెత్తి చూడగన్.” ఆశ్చర్యం తో  రామచంద్రుని చూస్తున్నారు  రాకుమారులు.
                            
                     వాళ్ళు ఆశ్చర్యం నుండి తేరుకోక ముందే “ఫెళ్ళున” శబ్దం వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకొనే వీలులేదు. ఆశ్చర్యం లోనే గుండె గుభిల్లుమనగా సిగ్గుతో తలలు వంచేశారు రాజులు.  ఆ సన్నివేశాన్ని కవిమాటల్లో –
                             “ ఫెళ్లు మనె విల్లు, గంటలు ఘల్లు మనియె, 
                         గుభిల్లు మనె గుండె నృపులకు, ఝల్లుమనియె                    
                         జానకీ దేహ మొక నిమేషమ్మునందె. 
                          నయము జయమును భయము విస్మయము గదుర”
         
                    ఒక్క నిమేషం  లో “ ఫెళ్ళు,ఘల్లు, గుభిల్లు, ఝల్లు” మనే థ్వన్యనుకరణ శబ్దాలతో   కవి నిర్వహించిన మహోత్కృష్ట కార్యం   సీతారామ కళ్యాణం. “ఝల్లున” కలిగిన పులకింత  జానకీ దేవి లో విస్మయాన్ని కల్గిస్తే,” గుభిల్లు “మన్న శబ్దం  నృపుల గుండెల్లో భయాన్ని రేకెత్తించింది.” ఘల్లు” మన్న గంటల  శబ్దం విజయానికి  ప్రతీక.
              
                  “ఎడుత్తడు కండనర్ యిట్రదు కేట్టార్ “  రాముడు వింటిని పైకెత్తాడు. చూసారు. అది విరుగుట విన్నారు " అన్న కంబమహాకవి మాటలు ఎంత గంభీరం గా  ఆ రమణీయ దృశ్యాన్ని  వర్ణించాడో అంతకన్న గంభీర రమణీయం గా కరుణశ్రీ దర్శించారు.
                   
                   “ సిగ్గు బరువున శిరసు వంచినది ఒక్క 
                   సీత యే కాదు – సభ లోని క్షితి పతులును”
                              
                    అంటారు కవి. సిగ్గుల మొగ్గయై, పెళ్లి కూతురౌనున్న జానకి సిగ్గుతో తలవంచుకోవడం  రమ్యం.” ఒక్క సీతయే కాదు – సభలోని క్షితిపతులును”,  “లును” అంటూ సముచ్చయాన్ని వాడి సిగ్గు నింకా పొడిగించారు కవి. తలవంచుకున్న జానకి లో పెళ్లికళ కనబడితే  తలవంచిన రాజుల తెల్లని మొగాల్లో ప్రేతకళ కన్పించింది.
               
                “ చెల్లరే విల్లు విరచునే నల్లవాడు
                 పది పదారేండ్ల యెలరాచ పడుచు వాడు
                 సిగ్గు సిగ్గంచు లేచి గర్జించినారు
                 కనులు కుట్టిన తెల్లమొగాల వారు”
       
              “నల్లవాని “  లో కన్పించిన శౌర్యం తెల్లమొగాలను ఇంకా తెల్లబడ చేసింది.” లక్ష్మి వంటి సీతామహాలక్ష్మి” “ విజయలక్ష్మి” తో శ్యామలాంగునకు “గృహలక్ష్మి” అయింది. భరత జనయిత్రి ప్రేమ భాష్పాలలోన  సీతమ్మ పెండ్లి అతి వైభవం గా జరిగింది. 
                                
       
                 
                                 సీతమ్మపెండ్లి ని మంజరీ ద్విపద  లో  గానం చేసిన రచయిత్రి శ్రీమతి మదమంచి అనంతమ్మ. ఇది తెలుగు లోగిళ్ళ లో వివాహ సమయంలో ముత్తైదువులు పాడే పెళ్లి పాట గా ప్రసిద్ధి.                                                         
      
       “  తెల్లని డేరాలు దింపికట్టారు          పాగాల మొనగాళ్ళు బయలుదేరారు
        కళ్ళజోళ్ళ వాళ్ళు కదలివచ్చారు  “    ---- అంటూ ‘ కళ్ళజోళ్ల వాళ్ళని,”   “బారుచొక్కాల వాళ్ళని”       


                      సీతమ్మ  పెండ్లి కి తీసుకొచ్చింది ఈమె. అంతేకాదు “బొణుకు బొణుకు న పునక పేర్లు” మ్రోగుతుండగా  రావణుడు కూడ సీతాస్వయంవరానికి వచ్చాడు.పదితలల గదలించి, పరకాయించి చూచి  విల్లందుకున్నాడు. ఎక్కుపెట్టలేక ముందుకు పడ్డాడు. “పరిషదాలయము” పకపక నవ్వేసరికి “మన్నుమేసిన తల ల్మరి యెత్తకుండ        చుర చుర నిప్పులు కురియ గా “చూశాడట రావణుడు.
                 
               ఆనంద రామాయణం లో సీతా స్వయంవరానికి రావణుడు  వచ్చినట్లు వ్రాయబడితే మహా రామాయణం లో రావణుడు  జనకుని తో ప్రగల్భాలు పలకడం విశదం గా వర్ణించబడింది. కాని ఇందులోమాత్రం రచయిత్రి  “ మన్నుమేసిన తలలు మరి యెత్తకుండ “ రావణుడు— “పాశు పతంబు పరమ దైవతము  విరువంగ  పాపమో వెంగళులారా “ అంటూ సభాభవనం నుండి తప్పుకున్నాడు.
                 
                    అనంతరం  నూనూగుమాసాల నూత్న యౌవనుడు ,పుంసాం మోహనరూపుడు నైన  శ్రీ రాముడు ప్రత్యాలీఢ పాదుడై ధనుస్సు నెక్కుపెట్టాడు.
            
                       “   వరదగూడువలె వంచి పట్టాడు  >     బాణము సంథించి  పట్టువదిలాడు
                           దిర్దిర తిరిగి భూదేవి కంపిల్లి     >       దిగ్గజంబులెల్ల  మ్రొగ్గ బడిపోయె
                            పవనుడును కాసేపు బంధించి పోయె  …………………………….
           
                ప్రకృతి చలించింది. భూమి కంపించింది. దిగ్గజాలు మొగ్గలు వేశాయి. గాలి స్థంభించి పోయింది. విల్లు విరిగి , రెండు వల్లల పడిపోయింది.పుష్ప వృష్టి కురిసింది.
              
             “ సర్థారు దశరథస్వామి  కొడుకనిరి    >     వీని గన్నతల్లి వీరమాతనిరి
               బంగారు బొజ్జ యీ పాపాయి దనిరి    >  సీతకు తగినట్టి చిన్నవాడనిరి”
                     
             అనేకవిథాలుగా పొగడుతూ  వెళ్ళిన  ప్రజలు ఊళ్లోకి వెళ్లి ఊదేశారు. మిథిలానగరమంతా మిలమిల లాడి పోయింది.
         
            “ రత్నతోరణముల రచియించినారు    >   బంగారుటరదులు బాతించినారు
           నీలంపుటరుగులు నిర్మించినారు     >  కస్తూరి కలయంపి కలయంగ జల్లి
           ముత్యాల పొడితోడ  ముగ్గులిడినారు...........”

             జానకి “ముస్తాబు “ పూర్తయిన వెనుక, యాజ్ఞవల్క్యమహర్షి యాజమాన్యం లో,ముందుగ కత్తికి కంకణం కట్టి,తరువాత శుభలగ్నంలో మాంగల్యథారణ పూర్తి చేయించారు .
         
                  “ ముత్యాల తలబ్రాలు ముగుద వోసినది. >   రామయ్య వోశాడు రతనాల బ్రాలు
                  జగతి లో చూడమీ సంబరం బనగ    >  చేసినారలు నాడు సీతమ్మ పెండ్లి “
         
                 పెళ్లి ముచ్చట తీరాక వథూవరులు  పొన్నవాహనమంత పల్లకీ లో ఊరేగింపుకు బయలుదేరితే మిథిలాపురమంతా మేడలెక్కి చూసింది. చూసిన వారంతా   “ తగిన మగడే దొరకె థర్మదేవతకు,  రతనాలజీబు మా రామయ్య బాబు”  అని మెచ్చుకున్నారట. మామగారు జనకుడు కొన్నిజాంగలాల ను  అల్లుడికి చదివించారు.  జానకికి ఏడువారాల  సొమ్ములిచ్చి, పసుపుకుంకుమ క్రింద కొన్ని పట్టణాలనిచ్చి సాగ నంపారట. తెలుగునాట సంప్రదాయాలను రచయిత్రి ఇక్కడ గొప్పగా పాటిస్తుంది. 
              
                  ఆనాడే కాదు సీతారాముల కళ్యాణాన్ని ఏ నాడైనా సంబరంగానే చేస్తారు తెలుగువారు. కోలాటాలు, చెక్కభజనలతో ఊరూరా సంబరాలు  అంబరాన్నంటుతాయి. ఈ లోకానికే మాతాపితరులు సీతారాములు.  మరి వారి కళ్యాణం లోక కళ్యాణమే కదా . లోకాస్సమస్తా స్సుఖినో భవంతు. అందుకే ..
                    
                     “మైథిల్యా నగరే వివాహసమయే కళ్యాణ వేద్యాంతరే
                      సామోదే విమలేందు రత్నఖచితే పీఠే వసంతం శుభే
                      శ్రుణ్వంతౌ నిగమాంత తత్త్వవిదుషాం ఆశీర్గిర స్సాదరం
                      పాయా స్తం సు వధూవరౌ రఘుపతి శ్శ్రీ జానకీజాని2నిశం”       
          
                   ----  అంటోంది  శ్రీరామ కర్ణామృతం.





Thursday, 21 March 2013

భద్రగిరిపై వెలసిన రాముడు రామచంద్రుడా ? రామనారాయణుడా?


      భద్రగిరి పై వెలసిన రాముడు
                           
                      రామచంద్రుడా?   రామనారాయణుడా ?
                                      
                      భద్రగిరి పై సీతా లక్ష్మణ సమేతుడై వెలసిన శ్రీ రామచంద్రమూర్తి తన అస్తిత్వాన్ని నిరూపించు కోవాల్సిన అవసరం ఏర్పడిందా అనే సందేహం  భక్తులకు కలుగు తోంది. ఎందుకంటే ఈ మధ్య ఒక తెలుగు టీ.వీ ఛానల్లో  ఈ ఫై శీర్షికతో  ఒక చర్చ జరిగింది . దానిలో మాట్లాడిన పండిత ప్రకాండులు తమతమ అభిప్రాయాలను ప్రకటించారు. సంతోషమే.
                ఇంతకీ సారాంశ మేమిటంటే  ఈ రాముడు దశరథ నందనుడు, సీతామనోభిరాముడు, రావణ సంహారుడు, భక్తజన మందారుడు, రామాయణ కథానాయకుడు నైన అయోథ్యారాముడు కాదట.! భద్రుని కోరిక మేరకు వైకుంఠము నుండి దిగి వచ్చిన చతుర్భుజుడైన రామ నారాయణుడట.!  అందుకే” శ్రీ రామనారాయణ వరాయ” అని సంకల్పం చెపుతున్నారట. సరే. !”చక్రి సర్వోపగతుండ”న్నాడు కదా ప్రహ్లాదుడు. కాబట్టి రామచంద్రుడైనా, రామ నారాయణు డైనా ఒకటే అనుకుందాము. కాని ఆ మాట ఒప్పుకోవాల్సింది మనం కాదు. ఆనాటి శబరి ఒప్పుకోవాలి.ఎన్నో బాధలు పడి, చెరసాలలో శిక్షలననుభవించి, శ్రీ రామునకు ఆలయాన్నికట్టించి, ఆభరణాలను చేయించిన భక్త శిఖామణి భక్తరామదాసుఅంగీకరించాలి.
                భండన బీముడు,ఆర్తజనబాంధవుడు, ఉజ్వలబాణతూణకోదండ కళాప్రచండుడునైన తారకరాముణ్ణే రామభక్తులు కొలుస్తున్నారు. సేవిస్తున్నారు. ప్రార్థిస్తున్నారు.తరిస్తున్నారు.
              
                “   పండితరక్షకుడు, అఖిల పాప విమోచనుడు,అబ్జసంభవాఖండల పూజితుడు, దశకంఠ విలుంఠన చండ కాండ కోదండ కళాప్రవీణుడైన మహావీరుడు మన శ్రీరాముడు. ఘోరపాతకవిరాముడు,సద్గుణకల్పవల్లి కారాముడు, షడ్వికారజయ రాముడు, సాధుజనావనవ్రతో ద్దాముడు, అవనిజ కన్నుదోయి వెలిగెడి సోముడు మన  సీతానాథుడు.  ఆయన  సత్య,ధర్మ పరాక్రమాన్ని జాతి యావత్తూ కథలుగా చెప్పుకుంటోంది.శ్రీ రాముని వంటి భర్త, శ్రీ కృష్ణుని వంటి సోదరుడు కావాలని ఫ్రతి కన్నెపిల్ల కోరుకుంటుంది. శ్రీ రాముని సంచారమే ఆయన పాత్రకు వన్నెతెచ్చింది  కాని పేరు కాదు కదా.!
                                 ప్రపంచం మొత్తం మీద శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం చేసే మహద్భాగ్యం మన తెలుగు గడ్డ కే దక్కిందని ఎక్కడో చదివినట్లు గుర్తు. భద్రాద్రి రాముని కళ్యాణోత్సవాలు తెలుగువారి ఆస్తి. అటువంటి పవిత్ర ఆలయం లో ఇటువంటి వివాదాన్ని తీసుకురావడం జాతి మొత్తానికే నష్టాన్ని కలిగించవచ్చు . ఆంథ్రుల ఆరాథ్యదైవం  శ్రీ సీతారాముని గూర్చి ఇటువంటి చర్చ రావడం  ఒక తెలుగువాడి గా జీర్ణించుకోలేక ఈ రెండు మాటలు వ్రాస్తున్నాను.   రామాయణ కథానాయకుడే శబరికి కన్పించిన శ్రీ రామచంద్రుడు.ఆయనే కంచర్ల గోపన్న ను భక్త రామదాసుని చేసి, ఆయన  చేతగుడి కట్టించుకున్నాడు.  ఆయనే తమ్ముడితో   కలిసి తానీషా కు ప్రత్యక్షమై రామదాసుని ఋణ విముక్తుని, బంధవిముక్తుని చేశాడు. 
       


                              ఈ రామునకే ప్రపంచమంతా జేజేలు కొడుతూ,నివాళు లర్పిస్తొంది.  ఆయనే భద్రగిరిపై ఉన్నాడని పూజిస్తోంది. అంతేకాని  భద్రగిరి పై వెలసిన రాముడు వేరని, ఇతడు భద్రుని కోరిక మేరకు వెలిశాడని,  ఇతను రామనారాయణుడని,-- ఇటువంటి మాటలు చెప్పి ,రామభక్తుల గుండెలను గాయం చేయవద్దని, విశ్వాసాలను దెబ్బతీయవద్దని పండితోత్తములను  చేతులెత్తి వేడుకుంటోంది ముందుగా తెలుగు జాతి. ఆ తరువాత భారతజాతి. మనకున్న అనర్ఘరత్నం భద్రాద్రి పుణ్యక్షేత్రం . దాని పవిత్రతను, ప్రాచీనతను కాపాడవలసిన బాథ్యత ప్రతి ఒక్కరిది అనుకుంటున్నా!
    
             “ దురితలతా లవిత్రుడు,ఖరదూషణ కానన వీతిహోత్రుడు, భూభరణ కళా విచిత్రుడు, భవబంధ విమోచన సూత్రుడు, చారు విస్ఫుర దరవింద నేత్రుడు, ఘనపుణ్య చరిత్రుడు , సీతామనోభిరాముడై  -“  భద్రగిరి పై వెలసిన  దశరథరాముడే తమ  రాముడని భక్తుల విశ్వాసం. రామదాసు వేడుకొన్నది కూడ ఈ  దయాశరథి యైన దాశరథి నే కదా! దాశరథి ని కరుణాపయోనిథి  గా దర్శించిన  మహద్భాగ్యం మన రామదాసు ది.
                “ ఎంత వేడిన నీకు  సుంతైన దయ రాదు
                 పంతము సేయగ నే నెంత వాడను తండ్రి”
             అంటూ వేడుకుంటున్న ఆ పరమ భక్తుని  ఆక్రందన  ఇప్పటకీ మన చెవుల్లో మార్మోగుతూనే ఉంది. అందుకనే మన రాముడు భద్రాద్రి శ్రీ రామచంద్రుడే కాని  వైకుంఠం నుండి  దిగి వచ్చిన శ్రీ రామనారాయణుఢు కాదు.  శ్రీ రామచంద్రుడు  శ్రీ రామనారాణుడైతే--- కొంతకాలానికి శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ వేంకట నారాయణుడై పోయే ప్రమాదముందేమో నని భక్తులు భయపడుతున్నారు. సంకల్పం లో మాత్రమే ఛెపుతున్నామంటారేమో   కాని అది మాత్రం ఎందుకు అనేది సామాన్యుని ప్రశ్న. ?   
                   ఈవిధంగా నైన మరొక్కసారి శ్రీరామ నామస్మరణ చేసుకొనే మహద్భాగ్యాన్ని  కల్గించిన ప్రతి  ఒక్కరికి కృతజ్ఞతా పూర్వక వందనాలు.


******************************************************************************************

Friday, 18 January 2013

శ్రీరామ నామామృత జీవనుడు- తమ్మర గోపన్న

                                       



                                    శ్రీ రామ నామామృత జీవనుడు
                                                     
తమ్మర గోపన్న


                                                 
                  
               
       కవి పొందే తాదాత్య్మతే కవిత్వానికి మూలం. “అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి: “అంటుంది అలంకారశాస్త్రం . ఏ తాదాత్య్మంలో కదిలి వాల్మీకి ఆదికావ్యాన్ని రచించాడో, మన పోతన్న ఏ భక్తి పారవశ్యానికి లోనై రామభద్రుని చేత భాగవతాన్ని పలికించుకున్నాడో,  ఏ ఆవేశ ఆవేదనలకు గురై  కంచర్ల గోపన్న ప్రజాధనాన్ని రామునికి నివేదన చేశాడో, ఆ ఆవేశమే ఈ గోపన్నను నడిపించింది.కదిలితే పద్యం, మెదిలితే శ్లోకం , కల మెత్తితే రామ నామం, గళ మెత్తితే రామగానం గా జీవించిన భక్త కవి  తమ్మర గోపన్న.
                            
                            నల్గొండ జిల్లా కోదాడ మండలం లోని తమ్మర గ్రామం  ఈ కవి జన్మస్ధలం. ఆ గ్రామం లోని సువిశాలమైన రామాలయ ప్రాంగణం లో నిండైన రూపం తో,ఊర్ధ్వపుండ్రధారియై, కౌపీనాన్నిమాత్రము ధరించి, నెరిసిన పొడవైన గడ్డము,,జడలు కట్టిన శిరోజాలతో  సంచరించిన మూర్తి ఈ గోపన్న. రామ నామము వింటే గాద్గద్యమైన గొంతు ఆదికవి ని స్మరించి,శ్రీమద్రామాయణ శ్లోకాలను మధురంగా గానం చేస్తుంది. ఆ వెంటనే ఆ సందర్భం లోని ఆంద్ర వాల్మీకి  వాసుదాసు పద్యాలను అలవోకగా ఆలాపిస్తుంది. సమయానుగుణంగా గోవిన్ద రాజీయ వ్యాఖ్యాన పాఠాలు  ఆ గొంతు లో  మృదువు గా ధ్వనించేవి. అమ్మ  సీతమ్మ రాఘవుని తో కలసి సంచరించిన పంచవటీ ఘట్టాలు పులకితదేహులై గానం చేస్తారు. వీరు రచించిన గ్రంధాలు డెభ్భైకి పైగా ఉన్నాయి.  

                                                 వీరి గ్రంధాలన్నీ రామాంకితాలే. రామ భక్తి పరమైన  వీరి కావ్యాలలో రాముడు, కృష్ణుడు, నారసింహుడు ,  ఎవరైనా వీరి దృష్టి లో రామునకు మారు రూపులే.  ఈ కావ్యాలలో మొదటి మూడు పద్యాలు శ్రీ  -రా  -మ అనే అక్షరాలే మొదటిఅక్షరాలు గా కలిగి ఉంటాయి. ఇది వీరి  కావ్యాల ప్రత్యేకత.  వారి  కావ్యాలలో  ఎక్కువ గా నలభై పాదాలు,లేక  ఏభై పాదాలు కలిగిన ఉత్పలమాలిక  గాని, చంపక మాలిక గాని ఉండటం ఒక విశేషం . స్తుతి శతకాలు, ప్రార్ధనలు,నక్షత్ర మాలికలు, రామాయణేతివృత్త కావ్యాలు, గుణరత్న కోశము వంటి సంస్కృత కావ్యాలకు అనువాదాలు, భావతరంగిణి పేరు తో నిత్యజీవితం లో తనలో కలిగే భావ సంచలనాలకు అక్షరాకృతులు పన్నెండు భాగాలు.  ఇలా ఎన్నో, ఎన్నెన్నో వీరి కావ్యాలు.
                   
               ఈ భక్తకవి ముద్రించిన ప్రతి పుస్తకము అమూల్యమే. ధర ఉండదు. నలభై కావ్యాలు ముద్రితాలు కాగా, ముఫ్ఫై కి పైగా కావ్యాలు  వ్రాతప్రతులు గా మిగిలి పోయాయి. ముద్రితములైనవన్నీ కవిమిత్ర బాంధవులచేత ముద్రించబడి,అమూల్యములై సాహితీ మిత్రులకు  అందజేయ బడ్డాయి. ఆ రామచంద్రుని అనుగ్రహం చేత వెలుగు చూచిన పుస్తకాలకు” సర్వాధి కారి” గా రామునే చేసి”  సర్వస్వామ్యములు” ఆయనకే అర్పించిన అదృష్ట శాలి  ఈయన. 
              
                                  నేను  రామాయణము మీద పరిశోధన చేసే రోజుల్లో  ఈ మహాను భావుని తో  కొన్ని రోజులు గడిపే అవకాశం నాకు లభించింది .  ఈయనకు జానకీ ధవుని పేరు చెపితే ఫ్రేమాను రాగాలు పెల్లుబికి కంఠం గద్గదమై కన్నులు అశ్రుపూరితాలౌ తాయి. సీతమ్మ పడిన కష్టాలను గురించి,  రామయ్య సత్యపరాక్రమాన్ని గురించి  ఆయన చెప్పుకు పోతుంటే  ఎన్నోరాత్రులు అలానే గడిచి పోయి, సూర్యోదయమై పోయిన రోజులు నేను ఎప్పటికీ మరచిపోలేను.  మన ఇంట్లో ఒక స్వంత వ్యక్తి  కి కష్టం వచ్చినట్లు ఆ మహాను భావుడు సీతా రాములను గూర్చి , వారి కొచ్చిన కష్టాలను గురించి ఆవేదన, ఆవేశాల తో చెపుతుంటే, పరిశోధనా వ్యాపకం లో ఉన్న నాకు ఆనాడు అది విచిత్రంగా అనిపించేది . కాని పదిహేనేళ్ల తర్వాత   ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆయన లోని ఆ ఆవేశానికి అర్ధం తెలిసి, ఆయన ఎంత అదృష్ట వంతుడా ! అని పిస్తోంది.
         
                                శతావధాని ముడుంబి సింగరాచార్యుల వారి అంతేవాసులు ఈ కవి. ఆశుకవితాధురీణులు. సంస్కృతాంధ్రాల లో సమానం గా కవిత్వం చెప్పగల్గిన ప్రజ్ఞాశాలి. సాహితీ మిత్రుల తోను, అబిమానుల తోను ఉత్తర ప్రత్యుత్తరాలను  పద్యాలలోనే నిర్వహించే వారంటే వీరికి పద్యవిద్య పై నున్న పట్టు ను, అభి మానాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు
                    
                      . ఈ కవి వ్రాసిన స్తుతి శతకాలు,” జానకీవర”!, జానకీ నాయక,! జానకీ,! భార్గవ,! శ్రీకృష్ణ,! నారాయణ,! లక్ష్మీనృసింహ,! విఖనసార్య! వంటి మకుటాలతో విలసిల్లుతుంటే, సంస్కృతమున పరాశరభట్టర్   వ్రాసిన “గుణరత్నకోశము,” “క్షమాషోడశి,” “రంగ రాజ స్తవము “వంటి   కావ్యాలకు భావాను వాదాలు  వీరి పాండిత్యానికి  దర్పణాలై నిలిచి, పండిత కవుల ప్రశంసలకు పాత్రమైనాయి.” ముకుందమాల” అనువాదము అత్యంత రమణీయము.” శ్రీరంగ రాజ ప్రియా!”  అనే మకుటం తో తమిళం లోని తిరుప్పావై  పాశురాలకు  చేసిన అనువాదము వైష్ణవులకు ఎంతో ప్రీతి పాత్రమైనది. వీరి కావ్యము” అమృతసిద్ధి “క్షీరసాగర మథన వృత్తాంతము  కాగా,” పరవానస్మి” లక్ష్మణ పాత్ర ప్రధానమైన రామాయణేతి వృత్త కావ్యము.
                       
                                         అప్పకవి ,వాసుదాసాదుల ప్రభావానికి లోనైన ఈ కవి 1949 ప్రాంతం లో పుష్పమాలికా బంధాది బంధ కవిత్వాలను, గర్భస్రగ్విణీ వృత్తాది గర్బకవిత్వాలను,కూడ వ్రాసి విద్వత్కవుల సరసన తన స్ధానాన్ని పదిల పరచుకున్నారు.
          
               “ భవభవనా వవా! విభవభద్ర భవామర వారతారకా
             సువిధ విభా విభాసశుభ శుభ్ర శుభాస్పదమోదసాదరా!
             యవన వధా వధ స్మయ మయ ప్రయ తారసు శూర మారకార
             సవన వరా వనాఢ్య శరశస్త శరాస నదీన మానసా!
             
                ఇది పుష్పమాలికా బంధము. “ఈ గృహ మొక సత్రమందలి సఖీ సఖబంధు సుతాదులెల్లరు న్గృహమున కొచ్చి పోవగల పాంథులని “నమ్మిన కవి ఈ గోపన్న.
          
            “ కవి యొక మాలికుండతని గ్రంథ చయంబు మనోజ్ఞ
             మాలికా నివహ యలంక్రియా వితతి నిర్మల సౌరభమెల్ల        పద్దెముల్ “                                            


అని కవి మాలికా కారుడై, గ్రంథ సమూహము లనెడి పూమాలలను పద్యములనెడి పరిమళ భరిత కుసుమాల తో గ్రుచ్చి,సమాజానికందించగా, భృంగరాజములవంటి పండితశ్రేష్టులు “తన్నవ కవితా సుధారసమునం బ్రియ మందెదురని “ భావించి సుగంధ భరిత పద్య రాశి చే కావ్యరచన సాగించారు.
                
                “  నీతో ముచ్చట లచ్చటల్ ప్రణతులున్ నీతోడ సల్లాపముల్
                   నీతో నవ్వులు బువ్వులున్ బ్రణయముల్ నాతో పరీ హాసముల్
                  నీతో విన్నపముల్ వివాదములునున్ నీతోడనే  సర్వమున్”

      ----- అని రామునే సర్వము గా భావించి, రామనామము చేత  పవిత్రీకృత గాత్రుడై, ఆయనే ఒక రామనామ క్షేత్రం గా మారిపోయాడు.
               
                  సీతారామ కళ్యాణం జగత్కళ్యాణ కారకము. తెలుగు గడ్డ మీద భద్రాద్రి  రామన్న   పెళ్లయితే గాని తమ బిడ్డలకు పెళ్లి లగ్నాలు పెట్టుకోని  ఆచారం ఉంది. అటువంటి రామచంద్రుడు సీతా మనోభిరాముడయ్యే మనోజ్ఞ  కళ్యాణ దృశ్యాన్ని  మధుర మనోహరం గా వర్ణించారు కవి.
                
                 “ పరిణయవేళ సీత తలబ్రాలిడు నప్డు తదీయ బాహు మూ
                   ల రుచుల పైన, దన్ముఖవిలాసము పైన,చిరత్న ర్తన భా
                  స్వర గళలగ్నహారములపైన నటించు కటాక్షము -----“
                
            మాపై కూడ చూపమని కోరిన ఈ కవి –    “ ఆదిన్ శ్రీ సతి కొప్పుపై, తనువు పై,  పాదాబ్జంబుల పై, కపోల తటి పై, పాలిండ్ల పై , నూత్న మర్యాదం చెందు  కరంబు “అని వ్రాసిన  పోతన మధుర భక్తి ని  గుర్తుకు  తెచ్చి  రసిక హృదయాలను రంజింప జేస్తారు.
                            
                        రామచంద్రుని వెంట అడవికి బయలుదేరిన జానకి –కడుంగడు  మోహనంగా కన్పించింది ఈ కవికి.” సుశ్యామల కోమలాంబుదము నంటి వెలుంగు తటిల్లతం బలెన్ “ ---- అని నల్లని కారుమేఘం వెనుక వెలిగిన మెరుపు తీగ వలె  రాముని వెంట సీత కదిలింది. భాస్కర రామాయణ వర్ణన పాఠకుల హృదయాల్లో మెదులుతుంది. శ్రీరామ నామానికి కొత్త అర్ధాన్ని ఆవిష్కరించారు కవి. శ్రీ –యనగా సీత –అని,  రా – యనగా- రామచంద్రుడని, మ –యనగా- భక్త్యాయుతుడైన లక్ష్మణుడని –కవి విశ్లేషణ.
     
           మండుటెండలో రాఘవుని అనుసరించే సీతమ్మను  కవి చూడలేక పోయాడు. రవి కిరణాళి కందిన సీత ను చెట్టునీడన నిలబెట్టాడు. ఆ చెట్టు గొడుగు లాంటి  కొమ్మల తో ఆవిడకు నీడ నిచ్చింది. దానికి కారణం ------
         
            “ అవనిజముల్  కడుం గొడుగు లట్టులు శాఖల బట్టుచున్నవి
           య్యవనిజ కిట్టులుండ వలదా నిజసోదర సాదర క్రియల్ ....”
     

               చెల్లెలు వస్తుంటే  ఆప్యాయంగా చేతులు చాచి అబిమానించి ఆదరిస్తాడు అన్న. అది సోదర సోదరీ ప్రేమ. సీత   అవనిజ. వృక్షాలు అవనిజ లు. అనగా వీరు సహోదరులు. కాబట్టే  చెట్లు కొమ్మల వంటి చేతులు చాచి  సీతకు నీడనిచ్చాయి. చెల్లెలు వచ్చిందని  అన్నలు చూపిన ఆదరణ అది.  ఇటువంటి భావాలు పండిత జన ప్రమోదాలు  . రసిక హృదయ రంజకాలు అనడం లో  అతిశయోక్తి లేదు.
    
              అరణ్య వాసానికి బయలు దేరిన    రామ – సీత - లక్ష్మణుల లో ప్రణవమైన ఓంకారమే గోచరించింది కవికి. “ రాఘవుండు ముందుగ వెన్కను సీత లక్ష్మణుండే యెడ వీడిపోక వొకరే యనగా జని రా – ఉమా -క్ష రాలే యెడ వీడకుండి యొకటి యగు సత్ప్రణవాక్షరంబనన్ ---“ అని – ఆ+ ఉ +అమ్  అన్న ( ఓం )  అక్షరాల్లోనే రామ – సీత- లక్ష్మణులను దర్శించిన ధన్యజీవి  తమ్మర పోతన్న. ఆచార్య దివాకర్ల వెంకటావధాని వీరి కవిత్వాన్ని గూర్చి వ్రాస్తూ “ వీరు భక్తి కవితా సంపద లతో పోతనకు థీటైన వారు. వారైహిక ధనలాభమునకు  గాని, కీర్తిని గాని వాంఛింపరు “ అన్నారు.
              
          
                         వేకువ జామున కాకులు” కావు కావు” మని అరవడం సైతం   రాముని” కావుమని” ప్రార్ధించినట్లే  ఈ కవి కి విన్పిస్తోంది.  “ --- కాకులు  గూడ వేకువన కావు హరే మము గావు మంచేక ముఖంబుగా నఱచు చెంతయు నిన్ను నుతించు చుండ గా మందులమై మేము  వేకువ నిద్ర లేచి నీనామము చేయలేక కాకుల  కంటె నీచులమని” పల్కిన కవి మాటలు కొందరికి  ఎద లోతులలో ఎక్కడో గ్రుచ్చుకొని  బాధని కలిగించవచ్చు. కాని కవి మాటలు మాత్రం నిజం. ఇక్కడ “ప్రాత: కాలపు వాయసంబు పణినా పత్యోక్త శాస్రంబు లో” కాకుల చేత పాణిని  వ్యాకరణాన్ని ప్రస్తావింప జేసి,  కోకిలల చేత సమాధాన మిప్పించిన శ్రీనాథుడు  మన కవి హృదయం లోకి ప్రవేశించాడనిపిస్తుంది . ఆ కవి సార్వభౌముడు ఉద్ధండ పండితుడు కాగా, మన గోపన్న భక్తి కవితా నిర్మగ్నుడు. అందుకే   కాకులు  “కావుకావు “మని  రామచంద్రుని తెలుగు లో వేడుకున్నాయి.
         
            “     గీతగీచి నిన్ను గీతలోపల నిల్పి
                   ప్రీతి చేత నీకు జోత సల్పి ......”.

  అని గీతలలో రామకోటి రాయడాన్ని రమ్యం గా చమత్కరిస్తాడు ఈ కవి.

  

                            రామచంద్రుని “గీతగీసి తన మానసపంజరం లో నిలుపు కున్న  ఈ కవి చంద్రుని పూర్తిపేరు  నరహరి గోపాలా చార్యులు. “బొమ్మకు పెళ్లియా “యని నవ్వు వారలకు” బ్రహ్మ” కు వికృతి” బొమ్మ” యని, మాధవ కళ్యాణమే మానవ కళ్యాణము కాగలదని సున్నితంగా  సూచించిన ఈ కవి సాహిత్యము శాశ్వతమై విలసిల్లుగాక !




 **************************************************************************************