Friday, 30 November 2012

ఓ అపురూపచిత్రం - శ్రీ కలిసంతరణవేంకటరమణ మూర్తి


            ఓ అపురూప చిత్రం   -  శ్రీ  కలి సంతరణ వేంకటరమణమూర్తి
                         
                     “ నా నృషి: కురుతే కావ్య మ్”  .ఋషి కాని వాడు కవి కాలేడన్నది ఋషివాక్యం. ద్రష్ట యైన కవి తన మనోనేత్రం తో దర్శించిన దానిని జనావళి  ఆనందం కోసం కావ్యరూపం లో అందిస్తాడు. అందుకే “కవిరేవ ప్రజాపతి: “ అన్నది శాస్త్రోక్తి.” రవి  కాననిచో కవి కాంచునే గదా.! “అన్నది ఆర్యోక్తి.” కవయ: క్రాంతదర్శిన:”. అన్నది ఆలంకారికోక్తి. సమాజంలోని అశాంతిని,అసమానతలను చూచి చలించని వాడు  మహాకవి కాలేడు.               
                    మహాకవి తిక్కన  సోమయాజి  యై కూడ ఆనాటి సమాజ దుస్థితి ని చూచి చలించి పోయాడు.ఆనాటి సమాజాన్ని శైవ,వైష్ణవ మత విద్వేషాలనుండి రక్షించాలనే తపన,ఆలోచన, ఆవేదనలు అన్నివేళలా ఆయనను వెంటాడాయి.    సుషుప్తావస్ధ  లోను  అదే ఆలోచనతో ఉన్న  ఆయనకు స్వప్నంలో  హరిహరనాథుడు  సాక్షాత్కరించాడు.

                                హరిహర నాథుడు

                      “ కరుణారసము వొంగి తొరగెడు చాడ్పున
                                     శశిరేఖ నమృతంబు జాలువాఱ
                     -----------------------------                                                
                 బ్రధమాద్రి  దోతెంచు భానుబింబము నా ను
                                        రమ్మున గౌస్తుభ రత్నమొప్ప”
             
              అలా  ప్రత్యక్షమైన హరిహరనాథునకు పంచమ వేదం పదిహేను పర్వాలను అంకితమిచ్చి తన ఋణం తీర్చుకున్నాడు సోమయాజి. దానితో ఆనాటి సమాజం  తేరుకోవడానికి  ఒక అవకాశం ఏర్పడినట్లైంది.
                 
              అలాగే    కళింగ జైత్రయాత్ర లో  భాగంగా విజయవాటిక లో  విడిది చేశాడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకాకుళ ఆంథ్రమహావిష్ణువు ను గూర్చి విన్నాడు. హరివాసరోపవాసాన్ని శ్రీకాకుళం లో చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఉపవాసధీక్ష లో నున్న సాహితీ సమరాంగణ సార్వభౌమునకు ఆంథ్రమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆముక్తమాల్యద  ను  రచించమని ఆజ్ఞాపించాడు.
                     


                                           శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు
          
                
               “ నీలమేఘము డాలు డీలు సేయగ జాలు
                                     మెఱుగుఁ జామన చాయ  మేనితోడ
                     నరవిందములకచ్చు  లడగించు జిగి హెచ్చు
                                   నాయతంబగు కనుదోయి తోడ”
      

                         ప్రత్యక్షమైన  ఆంథ్రనాయకుని ఆజ్ఞను శిరసావహించి “అప్పిన్నది రంగమందయిన పెండిలిని” గూర్చి  కావ్యం నిర్మించాడు శ్రీ కృష్ణరాయలు.
                      
                
                       అదే విధంగా కలియుగ దైవమైన వేంకటేశ్వరుడు రామ కృష్ణుల అవతారమనే  విశ్వాసం పద్మనాభాచార్యుల  వారిది.”హరేరామ హరేరామ రామరామ హరే హరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరే హరే” అనేకలిసంతరణోపనిషత్తు ఉపాసన లో ఉన్న ఆయనకు శార్వరి నామ సంవత్సరం కార్తీక శుద్ధ అష్టమి గురువారం       ది .27-10-60 రాత్రి స్వప్నం లో కలిసంతరణవెంకటరమణమూర్తి  స్వప్నం లో దర్శనమిచ్చాడు. మనసు లో ఉన్న భావాలే స్వప్నంలో సాక్షాత్కరిస్తాయంటారు కదా!




                           శ్రీ కలిసంతరణ వేంకటరమణ మూర్తి

                   ఆ  వేంకటేశ్వరుని రూపం ఆయనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని,ఆ పైన సందేహాన్ని కల్గించింది. వేంకటేశ్వరుడు అలా  సాక్షాత్కరించడానికి   గల  కారణాలకు గ్రంథ ఆధారాలను   అన్వేషించడం మొదలుపెట్టారు ఆయన. ఆ అన్వేషణ  కార్తీక బహుళ చతుర్ధశి గురువారం   అనగా ది.17.11.60 వ ఫలించింది.  త్రేతా,ద్వాపర యుగాల్లోని రామ కృష్ణు లే కలి యుగం లో వేంకటేశ్వరుని గా వచ్చి వేంకటాచలం మీద వెలసినట్లు భవిష్యోత్తరపురాణం లోని శ్రీవేంకటాచలమాహాత్మ్యం లో  వ్రాయబడిన విషయాన్ని చూచి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే  తన గ్రంథం “మూలికా చిత్రగుణప్రకాశిక” లో “ముఖచిత్రవివరణము” అనే శీర్షిక తో వ్రాసుకున్నారు. ఆ గ్రంథం లోని శ్లోకాలు ఇవి.
         
          “ కౌసల్యా కీటకగృహం తింత్రిణీ దశ దిగ్రధ:
           గిరిరూపో 2నుజస్సాక్షాదయోధ్యా భూదధిత్యకా.  !
            ఇత్థం రామావతారేణ సమాం క్రీడా మకల్పయత్ .  !   18 శ్లో
         
           వల్మీకం దేవకీ సాక్షాద్వసు దేవో 2ధతింత్రిణీ
           బలభద్ర శ్శేషశైలో మధురాభూ దధిత్యకా . 

                ఏవం శ్రీకృష్ణ రూపేణ క్రీడతో వేంకటాచలే  !!  “
20                                              

            భవిష్యోత్తర పురాణాంతర్గత శ్రీవేంకటాచల మాహాత్మ్యే చతుర్ధో అధ్యాయ:
                  
        స్వప్నం నుండి  మేల్కొన్న వెంటనే తాను దర్శించిన రూపాన్ని తనకున్న  నైపుణ్యంతో   చిత్రంగా  గీశారు.   దాన్ని తరువాత రోజుల్లో కొద్దిగా దిద్దించి కోరుకున్న భక్తులకు అందించారు. ఆ చిత్రం ఇదే.

                రామ కృష్ణుల తో గూడిన శ్రీ వేంకటేశ్వరుని దివ్యమంగళవిగ్రహం.
   
                ఇంతకీ ఆయన ఎవరు.?    అంటే  .......            ఆయుర్వేద విద్యాపారంగత ,మంత్రశాస్త్ర విశారద  ఇత్యాది బిరుదులంది,ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మహామండలి ప్రధాన కార్యదర్శి గా పనిచేసి, మూలికా చిత్రగుణ ప్రకాశిక, మూలికా యోగ మాలిక, వంటి ఆయుర్వేద గ్రంథాలను, భారతసావిత్రి, విభూతి యోగ విశేషములు ,పంచసంస్కారభాస్కరమ్, విష్ణువంటే?, రాముడేడి? ,చెన్నకేశవ శతకం, వేంకటేశ్వర శతకం,  స్ర్తీలకు స్వాతంత్ర్యము లేదా? వంటి  పుస్తకాలను వ్రాసిన వారు శ్రీ ముత్తేవి అనంత పద్మనాభాచార్యులు గారు. ఈయన స్వతహాగా రామ భక్తులు.  విజయవాడ,దేవరపల్లి , రొయ్యూరు ,కురుమద్దాలి గ్రామాల్లో జీవనయాత్ర సాగించారు.
                                     
                           కీ.శే. ముత్తేవి అనంత పద్మనాభా చార్యులు గారు
                
                ఈ స్వప్నం తరువాత కలలో కన్పించిన వేంకటరమణుని మీద ప్రార్థనా శ్లోకాన్ని రచించి ఆ చిత్రంతో ముద్రించారు. ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని పెద్దది చేయించి పదిపైసలకు అందించేవారని ఆ తరంలో మిగిలి ఉన్న వారు చెపుతున్నారు.
         
        ప్రార్ధనాశ్లోకం యిది.
       
          “ శంఖం చక్రం చ చాపం  వరద కటి కరౌ బాణ వేణూ కరాబ్జై:
         బిభ్రాణం శేషశైలే  రఘుకుల యదురాడ్రూప శ్రీ వేంకటేశం
         శ్రీ సాలగ్రామమాలా లసిత దురుగళం  దివ్య నవ్యాంగ రాగం
          వందే లక్ష్మీ విశిష్టం కలితరణ శ్రుతేశ్శీర్ష  మత్యక్త మూర్తిం .!!”
            
              ఈ శ్లోకాన్ని మూలం నుండి యథాతథం గా ఇవ్వడం జరిగింది. అక్షర స్కాలిత్యాలు ముద్రాపకులవి మాత్రమే. ఈయన 1975 ప్రాంతం లో  మరణించారు.   ఈయన వ్రాసిన  అన్ని పుస్తకాలమీద ఈ చిత్రమే ముఖచిత్రం గా ఉంది..
      
            దీనితో పాటు  వీరు వ్రాసిన కలి సంతరణ వెేంకటరమణ మంగళాశాసనం కూడ  వీరి పుస్తకం విభూతి యోగ విశేషములు అనే దాంట్లో  ముద్రించబడింది.. ఇవి నా దగ్గర కొచ్చి చాలకాలమైనా   వెలుగు లోకి రావడానికి ఇంతకాలం పట్టింది. దేనికైనా కాలం రావాలి కదా.!
           
         శ్రీ  కలిసంతరణ వేంకట రమణ మంగళాశాసనమ్.
    
    శ్రీ వేంకటరామ కృష్ణాయ శ్రియాధిష్టి త వక్షసే
    చక్రాబ్జ వరకట్యాత్త చతుర్హస్తాయ మంగళమ్             1  
        శ్రీ రామకృష్ణ రూపాయ వేంకటేశాయ మంగళమ్.!     2
         
        కీటగేహామ్ల జాతాయ చాప బాణ ధరాయ చ
        రామచంద్ర స్వరూపాయ వేంకటేశాయ మంగళమ్.!    3
        
         వల్మీక తింత్రిణీరూప దేవకీ వసుదేవయో:
         జాతాయ వేణు యుక్తాయ శ్రీనివాసాయ మంగళమ్.!     4
        
          హరే శ్రీ రామ కృష్ణాయ హతకిల్పిష రాశినే
         పాపాద్రి పవినే లోక పాలినే తేస్తు మంగళమ్.!               5
       
          వైఖానస ముని శ్రేష్ట వంది తాంఘ్రి యుగాయ తే
          వారిదాంభోజ వర్ణాయ వైకుంఠాయాస్తు మంగళమ్.!           6
        
          కాకాసుర మహాఖర్వ గర్వపర్వత భేదినే
         జానకీ జానయే తే2స్తు మంగళం జయ మంగళమ్.!           7
        
          నాగరాజ శిరోదేశ నర్తి తాంఘ్రి యుగాయ చ
          వల్లవీ జనతా ప్రాణ వల్లభా యాస్తు మంగళమ్.!!                   8       

             శిథిలాలలో   నశించి పోతున్న ఒక అపురూప చిత్రాన్ని అర్హులైన వారికి అందించడానికి చేసిన   చిన్న ప్రయత్నమిది. ఇలా వెలుగులోకి రాకుండా  మిగిలిపోతున్న ఎందరో భక్త కవులకు ఇది హృదయపూర్వక నివాళి.


             
                        **** నాస్తి తేషాం యశ: కాయే జరామరణజం భయమ్*

Sunday, 25 November 2012

శ్రీరామ కావ్యామృతం--2



                   
                  
                   శ్రీ రామ  కావ్యామృతం ----2


       
                              తెలుగు లో ఎందరో భక్త కవులు  రామకధను కావ్యాలుగా, తమకు నచ్చిన మెచ్చిన వచ్చిన రీతిలో  గానం చేసి, శ్రీరామ నామా మృత పానంతో ధన్యజీవుయ్యారు.   లఘు కావ్యాల లో అమృత గుళికల వంటి  కొన్నిపద్యాలను, వ్యాఖ్యానం ఆశించని వాటిని  రసజ్ఞులైన రామభక్తులతో  కలసి పంచు కోవడమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశ్యం. . 
  
      “  రాముని కంటె నన్యము పరాత్పరు డొక్కడు లేడు ,సర్వశో
    భామయమైన ప్రాకృతిక భాగ్యమునుండి యనంత దైవిక
    శ్రీ మిళితంబునై రఘువరేణ్యుని మూర్తియు శక్తినొప్పు, న
    మ్మా! మఱి రామ నామ జపమంగళ గీతము  లాలపింపుమా!

         “ యోగులయందునన్ పరమయోగి, మహర్షులలో మహర్షియున్
            భోగుల యందునన్  బరమభోగి,యఖండతపస్వి. సర్వశా
          స్త్రాగమ వేద్యుడున్ ,రఘువరాన్వయ దివ్యమణి ప్రదీపమున్”

“ రాముడె దిక్కు నీకు! రఘురాముడె నీకు విముక్తి నిచ్చు,శ్రీ
 రాముడె జన్మ కర్మల పరంపర లన్  దెమలించు,  జానకీ
 రాముడె సర్వధర్మ చయ రాజిత సాధుపవిత్ర మూర్తి”

          “ రాముని దివ్యనీల రుచిరమ్ములె సుందరవారిదమ్ములై
           స్వామి సుమిత్ర సూతి తను సాంద్ర కళారుచులే తటిత్తులై
           ప్రేమను వారి భాషణము లే కలితమ్ములు మేఘగర్జలై
           ఆమని వర్షముల్ కురియు నట్లుగతోచె, -  నతండు రాముడే”.

“ రాముని కంటి కోసల విరాజిలు కాంతులె శారదీయ పూ
ర్ణామల చంద్రికా నిభములై, యనుజన్ముని కంటి వెల్గులే
శ్రీమహితారుణారుణ మరీచి వితానములై, పవ్త్ర సం
          ధ్యా మధుమాధురీ శబలితమ్ములు తోచె – నతండు రాముడే”.
        
          “రాముని దివ్యమంగళ విరాజిత రూపము దగ్గఱింపగా
           నామెకు గుండెయెల్ల దడయై జడయై – ధృఢమై – నితాంత ని
             ష్కామనమై – శరీర మవశమ్మయి వ్రాలగ జేతులెత్తి శ్రీ
             రామ! నమో! నమో!  యనుచు వ్రాలె పదంబుల భక్తిమూర్తియై.”
                         
                       “వాలి పోవు కనుఱెప్పలన్ పైకి తెరచి
                     చూపుతోడనె రఘుపతిం జుఱ్ఱునట్లు
                           తనివి  తీరని చూడ్కులన్ దడవి కొనుచు
                          నిలిచిపోయెను ముదుసలి – నిముసమట్లె.”

    “తండ్రి సగ భాగమైన సీతమ్మ లేని
       కడమ యర్ధమె యింతటి కాంతులీన
         రెండు నొకటిగ నున్న భరింపగలమె.”
                     
                 “చలన మెఱుగని భక్తియే చాలు గాని
                       తనువులెంతటి దూరమో మనసులంత
                        దగ్గరగ నుండి యొండొంటి తారసిలును.” 

 కవి. పెమ్మరాజు వేణుగోపాలకృష్ణమూర్తి     కావ్యం. శబరి .                               తల్లిదండ్రులు  వరలక్ష్మమ్మ, సూర్యప్రకాశరావు.        జన్మస్ధలం. చిట్యాల,            జననతేది.       23.10 1912                  తిరువూరు తాలూకా




***************************శ్రీరామ జయమ్********************  
                       

Saturday, 17 November 2012

శ్రీరామ కావ్యామృతం- --1


                   
                      శ్రీ రామ  కావ్యామృతం  -1

         

            శ్రీ రామచంద్రుని కధే ఒక గొప్ప కావ్యం. అది వ్రాయడానికి ప్రయత్నించిన ప్రతి  కవి మహాకవి అయిపోవడం లో ఆశ్చర్య మేముంది! అంటాడు హిందీకవి మైథిలీ.
         
            తెలుగు లో ఎందరో రామనామ మర్మజ్ఞులైన భక్త కవులు ఎందరో రామకధను  మహాకావ్యాలుగా,లఘుకావ్యాలుగా ఖండకావ్యాలు గా తమకు నచ్చిన మెచ్చిన వచ్చిన రీతిలో  గానం చేసి, శ్రీరామ నామా మృత పానంతో ధన్యాత్ములయ్యారు.  వానిలో లఘుకావ్యాలలో అమృత గుళికల వంటి  కొన్నిపద్యాలను, వ్యాఖ్యానం ఆశించని వాటిని  రసజ్ఞులైన రామభక్తులతో  కలసి పంచు కోవడమే ఈ శీర్షిక లక్ష్యం .
  
        రారా! రాఘవరామా!
           రారా! సురవినుత నామ రాక్షసభీమా!
           రారా !రవికుల సోమా!
            రారా !  సాకేతధామ!  రారా! రామా!
                                                              
                                            రామా! రామా ! రామా!
                                                        రామా !శ్రీరామ రామ రామా!   రామా!
                                                          రామా! రామా! రామా!                                                                                                                    రామా! శ్రీరామ రామ రామా! యనుచున్.                                                                                  
          
               నల్లవాడ నాదు  యుల్లంబు లోనికి
              మెల్లగాను వచ్చి యెల్లకాల
             ముల్లసిల్లుమయ్య.కల్లగాదిది వేగఁ
              జల్లనైన కృపను జల్లుమయ్య.

                                 వచ్చుచున్నాను దేవరా! వచ్చుచుంటి
                                  నాదు వెంటనె నిన్వీడి నిముసమైన
                                  బ్రతకజాలను రాఘవా! బ్రతకజాల
                                   నన్ను నీలోన చేర్చుకో నల్లనయ్య.
    రామా! ఘననీరద వ
   త్శ్యామా!  రఘురామ ! భక్తసన్నుత ధామా !
   నీ మాయ తెలియవశమా!
   కామారి స్తుత్యనామ! ఘనతర ధామా !                             
                                 రామ నామంబు పేరిట రత్నమెపుడు
                                  చీర కొంగున ముడివైచి, చేరనీకు
                                  నెవరినింగాని ప్రక్కకు నెపుడు కూడ
                                   దాని జూపింపకమ్మ యందరకు  నీవు.
 మనము నిర్మలమయినంత మమతలుడుగు
 గలుగు నేకాగ్ర బుద్ధియు, గాంచెదీవు  ,జ్ఞానరత్నంబు.......
                          



               కావ్యము:--- శబరి.                          ముద్రణ:--          1956                            రచయిత్రి :---       శ్రీమతి భోగరాజు చిట్టెమ్మ                             తల్లిదండ్రులు :-         లక్ష్మీదేవి,లక్ష్మీనరసింహం                    జన్మస్ధలం:---               పూళ్ల . ప.గో జిల్లా  .             జననతేది :-           18.10.1919.               *****************.********************************

Thursday, 15 November 2012

శ్రీరామునకు శబరి ఎంగిలి విందు వాల్మీకమేనా?


             శ్రీరామునకు శబరి ఎంగిలి విందు వాల్మీకమేనా?


             

           



   శబరి మతంగమహర్షి శిష్యురాలు. సిద్ధయోగిని.శ్రీ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి నీ ఆశ్రమానికి వస్తాడు అన్న గురువు ఆదేశాన్ని తలదాల్చి మతంగముని ఆశ్రమంలోనే    రాముని కోసం ఎదురు చూస్తూ ఉండి పోయిన రామ భక్తురాలు.ఎదురు చూస్తూనే వృద్ధురాలై పోయింది. రామచంద్రుడు వచ్చాడు .కుశల ప్రశ్నల అనంతరం అర్ఘ్య పాద్య ఆచమనీయాలు సమర్పించి, ఆయన కోసం ఎంతో కాలంనుంచి సేకరిస్తున్న పండ్లు ఫలాలను అందించింది.  రాముని అనుజ్ఞ తో ,యోగాగ్ని లో ప్రవేశించి, మహా యోగులు  పొందే సాయుజ్యాన్ని పొందింది శబరి.
              
                అయోధ్య రాముడు ఆంధ్రావని కి తరలివచ్చి భద్రగిరి పై కొలువు తీరి తెలుగువారి ఇలవేల్పు యైనట్లే వాల్మీకి సృష్టించిన శబరి తెలుగింటి ఆడపడుచు  వలె  తెలుగు  వారి గుండెలకు చేరువై  తెలుగునాట చిరస్ధాయిగా నిలిచి పోయింది.కిన్నెరసాని వలె శబరి కూడ కావ్యనాయికయై రసజ్ఞుల హృదయ కేదారాలనే కాదు  తెలుగు నాట వాగుగా మారి సస్య కేదారాల సైతం సారవంతం చేస్తున్నగోదావరిఉపనది. అందుకే శబరి  పాత్ర తెలుగు వారి సొంతమై పోయింది.  ఎందుకంటే – ఇక్కడొకసంగతి  చెప్పాలి. భక్త రామదాసు పుట్టినఊరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. అక్కడ పోలీసు శాఖ లో పనిచేసి రిటైరయిన ఒకమహాను భావుడు ప్రతి సంవత్సరం శ్రీరామదాసు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తుండే వారు. ఒకసారి నన్నుఅతిథిగా పిలిస్తే వెళ్లాను.   బస్టాండు లో దిగి నేను వెళ్ల వలసిన ప్రదేశం వెతుక్కుంటూ ఉంటే  ఎదురుగా ఒకబోర్డు కన్పించింది. శబరి టీ స్టాల్ నాకు ఆశ్చర్యమేసింది. దేవుని పేర్లు, సినిమా వాళ్లపేర్లు చూశాము గాని శబరి పేరు తో  టీ స్టాల్. ఇంకొంచెం ముందుకు వెళ్లాను కోట బురుజు లాంటి  దేదో ఉంది.  దాని కెదురుగా కుడివైపున శబరి పాన్ షాపుఉంది.నాకు అనుమాన మొచ్చింది.  శబరి పుట్టినఊరు కూడ ఇదేనేమో నని. ఇది జరిగిచాలకాలమైంది  ఇప్పుడవి ఉన్నాయో లేవో తెలియదు.    శబరి తెలుగువాళ్ళకు ఎంత దగ్గరైందో చెప్పడమే నాఉద్దేశ్యం.              
                
                 తెలుగులో శబరి పేరుతో వచ్చిన కావ్యాలు కూడ ఎక్కువ భాగం గోదావరీ పరీవాహ ప్రాంతంనుంచే రావడం కూడ గమనించదగ్గ విషయం. రామభక్తులిద్దరొకచోట కలిస్తే సూర్యేదయ,సూర్యస్తమయాలు తెలియ వంటారు. శబరి మనల్ని అలాగే చేస్తున్నట్లుంది. విషయంలోకి వద్దాం. రండి.

                       రామలక్ష్మణులు వస్తున్నారని తెలిసిన శబరి వారికి ఎదురు వెళ్లి   సంప్రదాయ బద్దంగా అర్ఘ్యపాద్యాదు లందించి ,రామ లక్ష్మణులు సేద తీరిన తరువాత  మాగురువులు చెప్పినప్పటినుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇంత ఆలస్యం చేశావేమిటని చనువుగా ప్రశ్నిస్తుంది.రాముని కోసం  ఎంతో కాలం గా సంపాదించి. భద్ర పరచిన ఫల,మూలాదులను ఆయనకు అర్పించింది.

          “ మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభే
            తవార్ధే పురుషవ్యాఘ్ర పంపాయాస్తీర సంభవమ్. “  వా.3-74.17
             
               అని మాత్రమే వాల్మీకం. దీన్ని వ్యాఖ్యానిస్తూ  గోవిందరాజీయం లో  -“ వన్య శబ్దేన ఫలమూలాదికముచ్యతే.” {వన్య శబ్దము వలన ఫలమూలాదికములు చెప్పబడు తున్నాయి} .” సంచితమిత్యనేన రామస్య చిత్రకూటాగమనాత్ప్రభృతి సంపాదిత్వం, ఆదరేణ గుప్తత్వం చ, తత్తత్ఫల జాతీయ మాధుర్యం పరీక్ష్య స్ధాపితమితి సంప్రదాయ:”.{ సంచిత అనేమాటకు రాముడు చిత్రకూటానికి వచ్చాడని తెలిసి నప్పటినుండి సంపాదించి,దాచిపెట్టి ఆయా ఫలాల జాతిని పట్టి  తీపిని పరీక్షించి ఉంచి నట్లు గ్రహించాలి}. { చతుర్వ్యాఖ్య.  పు. 1276 .}

                        దశాబ్దాల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తోంది కాబట్టి ఏజాతి పండు ఎలా ఉంటుందో, ఏచెట్టు పండు ఎటువంటిదో తెలుసుకోగల నైపుణ్యం శబరికుంది. అందుకనే మంచిపండ్లను పరీక్షించి రాముని కందించింది శబరి. ఇది వాల్మీకం. అంటే” ఎంగిలి విందు” ప్రస్తావన వాల్మీకం లో లేదు. కాని” శబరి “పేరు తో కావ్యాలు రచించిన వారందరు కూడ ఎంగిలి విందు  చేయించిన వారే కాని వాల్మీకిని అనుసరించిన వారు ఒక్కరు లేరు.
  
                 మరి ఈ ప్రస్తావన ఎక్కడనుంచి వచ్చింది.          పద్మపురాణం లో  మనకు ఈ ****  విందు ప్రస్తావన కన్పిస్తోంది.

           ” ప్రత్యుద్గమ్య ప్రణమ్యాథ నివేశ్య కుశవిష్టరే
            పాదప్రక్షాళనం కృత్వా తత్తోయం పాపనాశనం             
           ........................................................
         ఫలాని చ సుపక్వాని మూలాని మధురాని చ
         స్వయమాసాద్య మాధుర్యం పరీక్ష్య పరిభక్ష్య చ
          పశ్చాన్నివేదయామాస రాఘవాభ్యాం దృఢవ్రతా”
            
                 పద్మపురాణ భాగంలో” పరీక్ష్య, పరిభక్ష్య,పశ్చాన్నివేదయామాస” అని ఉన్న భాగాన్ని  పరిశీలిస్తే శబరి కంద మూల ఫలాల మాధుర్యాన్ని పరీక్షించి భక్షించిన అనంతరమే రాఘవునికి సమర్పించిందనేది స్పష్టమౌతోంది. కాని వాసుదాసు గారు మందరం లో ఈ విషయాన్ని  గూర్చి చర్చిస్తూ,ప్రస్తుత  ముద్రిత పద్మ పురాణ ప్రతిలో ఈభాగం లేదని క్రొత్త పాఠాన్ని చూపించారు.కాని  చతుర్వాఖ్యలో మహేశ్వర తీర్ధులవారు సైతం  పై పాఠాన్నే  ఉటంకిచారు.అంటే” పరీక్ష్య పరిభక్ష్య “ అనేదే ప్రసిద్ధపాఠం.

                      కాని దీనిలో కూడ శబరి తాను తిన్నపండునే రామున కిచ్చినట్లు ఎక్కడాలేదు. రాముడు చిత్రకూటానికి వచ్చినప్పటినుండి, రాముడు తన ఆశ్రమానికి వస్తాడనే గురువుల మాట మీద ప్రత్యయం తో అప్పటి నుండే కందమూలాలను, నిలవఉండే ఫలాలను, సంచితం-అంటే, ఏరి కోయించి సంపాదించి భద్ర పరచింది. ఇప్పుడు రాముడు వచ్చిన తరువాత వానిని బయటకు తీసి పరీక్షించి, జాతికొక దాన్ని తిని, చెడిపోలేదు అని నిర్ధారణ చేసుకొని రామునికి సమర్పించిందనేది లక్ష్యార్ధం.

                  “  “భక్షించి ”అనుటకు ఠాకా వేసి కొంచెం గిల్లి  నోటవేసుకొన్నట్లు ఎంచవలయునేగాని వేరుకాదు.” అంటారు మందరం లో శ్రీ వాసుదాసు.          

                     శ్రీరాముని శ్రియ:పతి గా నెరింగి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్న మహాతపస్విని శబరి. అట్టి మహానుభావునకు తాను అర్పించే విందులో మాధుర్యం కొఱవడితే  ఓర్వలేక, అపచార భయం చేత ,భక్త్యతి శయం చేత శబరి ప్రవర్తనలో మార్పు వచ్చి ఉండ వచ్చు.వృద్ధ, జ్ఞానవైరాగ్య సంపన్న,గురుశుశ్రూషా పరాయణ అయిన శబరి లో  పరమభక్తి పరాకాష్ఠకు చేరి , గోదాదేవి తాను ధరించిన మాలలను భగవంతునికి సమర్పించినట్లు, విదురుని విందు లో శ్రీ కృష్ణునకు అరటిపండు ఒలిచి పండు పారవేసి తొక్కుఅందించినట్లు, పండ్లను రుచి చూచి  స్వామికి సమర్పించిందని  భావించిన జానపదులు “శబరి విందు’’ను మధురాతి మధురంగా గానం చేసుకుంటున్నారు. భక్తునికి ఇష్టమైన దాన్ని ఎంతకష్టమైనా భరించడానికి  భగవంతుడు సిద్ధంగా ఉంటాడన్నవిషయం బాణాసురుని ఇంటికి కాపలా కాయడం దగ్గరనుండి  మానవుడిగా జన్మించి బాధలు పడడం వరకు ఎన్నో విషయాల్లో ఋజువవు  తూనే ఉంది..

                            శబరి శ్రీ రామచంద్రునకే విందునందించిన పరమ భక్తురాలు. కాని శబరి వాగులోకి  పండి ఒరిగిన చెట్ల ఫలాలు శబరి నీటిచే స్పృశించబడుతున్నాయి . ఆ  పండ్లను రామలక్ష్మణులు స్వీకరించారు కాబట్టి శబరిఎంగిలి చేసిన పండ్లను రాముడుతిన్నాడని  జానపదకథలుగా పాడుకుంటున్నారని  కొందరి వాదన..

      శబరి పూర్వజన్మ వృత్తాంతం కంబరామాయణం లో కన్పిస్తోంది.
   
          “ శబరి పూర్వ జన్మ లో” మాలిని” అనే గంథర్వకన్య.గందర్వరాజైన చిత్రకవకుని ఏకైకపుత్రిక. వీతిహోత్రుని పరిణయమాడింది.భర్త యజ్ఞయాగాదులలో మునిగియుండగా మె కల్మాషుడనే బోయవానితో సంబధం పెట్టుకోగా కోపించిన వీతి హోత్రుడు మెను శబరవనిత గా జన్మించమని శపించాడు. రామచంద్రుని దర్శనానంతరం ఆ మహనీయుని ఆశీస్సులతో తిరిగి  మాలిని గా మారిపోయి  భర్తతో గంధర్వ లోకాన్ని చేరింది. “ అని కంబరామాయణం శబరి   పూర్వ చరిత్ర ను ప్రస్తావించింది.[puranic  encyclopedia –p.659]. తెలుగు కవులెవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తులసీ ధాసు వాల్మీకి మార్గంలోనే పయనించాడు.


*******************శబరీ దత్త ఫలాశన రామ ***********************