Tuesday, 2 October 2012

రామాయణము - రమణీయకథనాలు -7 - భరతుడు

                
                    
                     భ ర తు డు 
      
          

                      శ్రీ మద్రామాయణం లో రామచంద్రుని  కీర్తి చంద్రికలను ఒరుసుకొని నిలబడగల్గిన గుణభద్రుడు కైకేయీపుత్రుడు భరతుడు. ఏ అధికారం కోసం  ,రాజ్యభోగాలకోసం భారతం లో రక్తపుటేరులు పారాయో, దేనికోసం వాలి సుగ్రీవులు , రావణాదులు తమలో తాము సంఘర్షించుకున్నారో అటువంటి రాజ్యలక్ష్మి కోరి వచ్చినా వలదని తృణీకరించాడు.           

                           భ్రాతృసేవాపరాయణుడై, దాసాను దాసుడుగా మారి, సభామథ్యంలో “రాజ్యం  చాహం చ రామస్య” అంటూ దోసిలి యొగ్గి,రామచంద్రుని తీసుకొనిరావడం కోసం చిత్రకూటానికి వెళ్లి, ఆయన మాటలను త్రోసిపుచ్చలేక, పాదుకలతో మరలి, రాముని పేరనే పదునాలుగేండ్లు నిష్కాముడై రామప్రతినిథిగా రాజ్యమేలిన సుగుణోదాత్తుడు, రాజయోగిగా,యోగిరాజుగా కీర్తి శిఖరాలనథిష్టించిన ఉదాత్తగుణోపేతుడు  భరతుడు.

                         పదునాలుగేండ్లు రాజ్యాన్ని పాలించి అన్నరామచంద్రుని  రాక ఆలస్యమైతే అగ్నిప్రవేశానికి సిద్ధపడిన నిష్కాముడితడు.” ఈ మహనీయుని కన్నతల్లి కైకేయి   ఏదైనా పాపం చేసి ఉంటే --   అది ఈ పుత్రుని పుణ్యవారాశి లో  ప్రక్షాళనం గావించబడి పవిత్రీకృతమైంది. భరతుని దృఢభక్తి , తృష్ణాపరాఙ్ముఖత మాతృమూర్తి కల్మషాన్ని సైతం కడిగివేసింది.” అన్నాడు మహాకవి కాళిదాసు.    

                                                                                                          
                            “ దృఢభక్తి రితి జ్యేష్టే రాజ్యతృష్ణా పరాఙ్ముఖ:
                              మాతు: పాపస్య భరత: ప్రాయశ్చిత్త మివాకరోత్ “

                భ్రాతృ ప్రేమలో రామభరతులిద్దరూ పోటీపడతారు.చిత్రకూటానికి వస్తున్న భరతుణ్ణి చూసి. యుద్దానికొస్తున్నాడని సందేహించి క్రోధించిన లక్ష్మణునితో శ్రీరాముడు  --
  
  “ వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్య మస్మై ప్రదీయతామ్ “{ వాల్మీకం-అరణ్య-97-17]
అంటాడు.” నీకు రాజ్యం కావాలంటే భరతునిక్ చెప్పి యిప్పిస్తా”నన్న రామునితో రామానుజుడు ఇంకేమనగలడు. రాజ్యభోగాల్ని భార్యా బంధువుల్ని వదలి అన్నవెంట అడవులకొచ్చిన తమ్మునికి అప్పుడర్థమైంది భరతుని ఔన్నత్యం.

               భరత లక్ష్మణులకు రామునియందున్న ప్రేమ అపూర్వమే.ఇరువురకు రాముడంటే ప్రాణం. ఇరువురు రాముని సుఖాన్నే గాఢంగా కాంక్షించారు.రాముని సేవనే వాంఛించారు.కాని ప్రవృత్తి లో తేడా ఉంది. లక్ష్మణునకు రాముని చెంతనే ఉండి ఆయన్ని దర్శించు కుంటూ సేవించుకోవడమే కోరిక. ధర్మాధర్మ విచక్షణ అతనికి అవసరం లేదు. రామచంద్రునికి సుఖం కల్గించడానికి ఎవరిని సంహరించడాని కైనా వెనుకాడని తత్త్వం అతనిది . లక్ష్మణునికి రామచంద్రుని యొక్క సుఖ సంతోషాలే ముఖ్యం
.
                 కాని భరతునకు  రాముని చెంత లేకపోయినా రాముని కొఱకు , ధర్మ బద్ధమయిన ఆతని ఆజ్ఞ కొఱకు శిర సొగ్గటం --  తాను ధర్మమని తలచిన దానిని రాముడు చెప్పినా అంగీకరించని స్థైర్య సంపద అతని కున్నాయి. రాజ్య స్వీకార నిరాకరణమే అందుకు ప్రబల  నిదర్శనం.తల్లికోరికలు , తండ్రివాగ్దానాలు అంగీకరించబడలేదు. జ్యేష్టుడే రాజు కావాలన్న   క్షత్రియధర్మం ప్రబలమైందక్కడ. అందుకే తాను రాముణ్ణి అంగీకరింపజేశాడు. రామ ప్రతినిథి గా మాత్రమే అయోథ్యను పరిపాలిస్తానన్నాడు. అదే చేసి చూపాడు. 
      
     రామునికి   భరతుని పైనున్న ప్రేమాధిక్యత ఎన్నోపర్యాయాలు వేరువేరు ప్రదేశాల్లో ప్రస్పుటమౌతుంది.దోహదక్రియలచే పెంచబడిన ఉద్యానలత వలె లక్ష్మణుని ప్రేమ రాముని చెంత రమణీయంగా పెరిగితే – భరతుని ప్రేమ  ప్రకృతిలో పెంపారు అరణ్యలతిక వలె గుబాళించినది. అడవిపూల పరిమళాలు వనలత లకు చెందవు కదా. అందుకే గుహుడు భరతునితో   ---   “ అయత్నా దాగతం రాజ్యం యత్త్యక్తు మిహేచ్చసి
      
     “  ధన్య స్త్వం న త్వయా తుల్యం పశ్యామి జగతీ తలే “ { వాల్మీకం-2-85-21}

లోకంలో నీవంటి వారిని చూడలేదన్న” గుహుని పల్కులు అక్షర సత్యాలు. భరతుని    పాత్ర బారతీయ సాహిత్యానికి మణిమకుటం. కాని రామచంద్రుని పాదాల చెంత శిరసు వాల్చిన ఆ మహాభక్తుని తన కాంతిలో లీనం చేసుకున్న శ్రీరాముడు – ఏకరూపుడుగా విరాజిల్లాడని   పిస్తుంది.          
                  అయాచితంగా వస్తున్న రాజ్యాన్ని వదిలి వేసి, భూశయనం ,జటావల్కల థారణం వ్రతంగా స్వీకరించి, పాదుకాపూజలో పథ్నాగేళ్లు గడిపిన రామభక్తుడు  భరతుడు . కర్మిష్ఠి. రాజయోగి. అందుకే వేదాంత దేశికులు –“తన యుపజ్ఞామహిమచే సమస్త భూమియందును రామపాదుకా ప్రభావాన్ని సమారూఢ మొనర్చిన భక్తవరులలో భరతుడు ప్రధాను” డంటారు.

         “ భరతాయ పరం నమో2స్తు నిత్యం ప్రధమోదాహరణాయ
          భక్తిభాజాం యదుపజ్ఞ మశేషత: పృధివ్యాం ప్రథితో రామపాదుక ప్రభావ:
                 





                               వేదనతో క్రుంగేటప్పుడు ,ఆనందంతో పొంగేటప్పుడు శ్రీరామునకు భరతుడే 
గుర్తుకొచ్చేవాడు. వారి ప్రేమ అటువంటిది.  ఆనందంలోను ,వేదనలోను, అయినవారే కదా మనకు గుర్తు   కొచ్చేది. భరతుని లోని భ్రాతృభక్తి  కన్నా” త్యాగభావనే” అతను రాముని వద్దకు చేరడానికి తోడ్పడింది.అతని విశుద్ధ ప్రేమ వర్తనం మానవ ప్రపంచంలో భ్రాతృప్రేమకొక పవిత్రోదాహరణ గా నిలిచిపోయింది.   
        
               “ న సర్వే భ్రాతరస్తాతే భవంతి భరతోపమా:” {వా.6-14,15 } అన్న రాముని పల్కుల్లోనే భరతుని ఔత్కృష్ట్యం విరాడ్రూపంగా భాసిస్తుంది.” అహమేవ నివత్స్యామి చతుర్ధశ వనే సమా:” అని అరణ్యం లో పిత్రాజ్ఞ కు లోబడి  పథ్నాలుగు సంవత్సరాలు నిలుస్తానని భరతుడు సిద్ధపడితే –“ జానామి భరతం క్షాంతం గురు సత్కార కారణమ్”  అని మెచ్చుకొని –
             “ అనేన ధర్మశీలేన వ్రతాత్ ప్రత్యాగత: పున:
              భ్రాత్రాసహ భవిష్యామి పృధివ్యా: పతిరుత్తమ:”       {వా.2-62-12}

      తమ్ముని    ప్రార్థనను మన్నించి, పథ్నాలుగేళ్ల తర్వాత అతనితో కలిసి రాజ్యాన్ని పంచుకుంటానంటాడు జ్యేష్టుడు. రాముని చెంతనుండి రామసేవలో ఆనందాన్నిపొందిన తమ్ముడు లక్ష్మణుడు కాగా, అన్నగారికై అయోథ్య నే అరణ్యంగా భావించి జీవించిన మహనీయుడు భరతుడు.ఒక్కమాటలో చెప్పాలంటే---ఇంతటి త్యాగమూర్తి ,ఋజువర్తి ,భ్రాతృవత్సలుడు, ప్రజాశ్రేయ కాముడు నిష్కామకర్ముడైన ఉత్తమపాత్ర  నాన్యతోదర్శనీయం.
                
           “  రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరం  “అన్న దశరథుని పల్కుల్లోను ,”దిష్ట్యాన చలితో ధర్మాదాత్మతే శుభలక్షణ “ అని కౌసల్య --- “ సత్యసంధే మహాత్మని” --- “ అనేన ధర్మశీలేన భరత: ఖలు ధర్మాత్మా” “ భరత స్సత్యవిక్రమ:” అన్న సముదాత్త ప్రశంసలు వాల్మీకివి . వాల్మీకి  రామునివి.{ వా. రా.2-61,62,}

                  వాల్మీకంలో చిత్రకూట సమాగమం అత్యంత కరుణరససంభరితమైన సన్నివేశం కాగా రామచరితమానస్ లో భరతుని పాత్ర మరింత రమ్యత
నాపాదించు కొంది.చిత్రకూట వాతావరణమంతా ఆ సౌభ్రాత్ర సౌరభం తో నిండిపోతుంది.ఈ ఘట్టం వేయి ప్రయాగల కన్నా పవిత్రమైనదని  రామాయణ విమర్శకులు భావించారు.
      
                  భరతుడు చిత్రకూటానికి తరలి వస్తున్నాడనితెలిసి , ఉత్తేజితుడైన లక్ష్మణునితో రాముడు ఇలా అంటాడు.
      “ కహేతాత్ తుమ్హసీతి సుహా ఈ  …………………….
         ……………………….               భారసింథు బినసాఇ “{ రా.మానస్-అ.దో.230.-3,4}
           “  నాయనా లక్ష్మణా నీవు చక్కని నీతి వాక్యాన్ని  చెప్పావయ్యా  నిజమే రాజ్యధికారం వల్ల కలిగే అహంకారం అన్నింటికన్నా ప్రమాదభూయిష్టమైంది. కాని భరతుని వంటి వ్యక్తి ఈ బ్రహ్మ సృష్ఠిలో ఉన్నాడని వినలేదు .కంటితో చూడలేదు.బ్రహ్మ విష్ణు మహేశ్వర పదవులు లభించినా భరతునకు అహంకారం కలుగదు. ఈ అయోథ్య ఒక లెక్కా. ఒక గంజి బొట్టు పడినందు వల్ల క్షీరసాగరం మలినమవుతుందా.? “ ఈ ఒక్క ఉదాహరణ చాలు. రామభక్తులకు భరతుని పై నున్న  ప్రతిపత్తి ఎటువంటిదో తెలుసుకోవడానికి . 
     
           ఈ సందర్భంగా ఒక  తెలుగు కావ్యం లోని చక్కని సన్నివేశం గుర్తుకొస్తోంది.రామ పరిష్వంగ భాగ్యాన్ని పొందిన అదృష్టశాలి మన పవనసుతుడు. ఇతనికే భరతుని కౌగిలి కూడ లభిస్తే ఇక  ఆనందానికి అవధులుండవు కదా. అదే ఇక్కడ జరిగింది.

                రావణ వథానంతరం అయోథ్య బయలుదేరిన రాముడు వాయుసుతుని పిల్చి ముందుగా అయోథ్య కు వెళ్లి  భరతుని చూచి  క్షేమసమాచారాలు అందించి,వివరాలు తెలుసుకొని రావలసిందిగా పంపిస్తాడు. అయోథ్య కు వెళ్లి జడలు కట్టిన శిరోజాలతో, చిక్కిన శరీరంతో , మునివృత్తిలో  ఉన్న వాణ్ణి ,కటికనేల మీద పడుకోవడం వలన కాయలు కాసిన వెన్ను ,ప్రక్క  భాగాలు కల్గిన  భరతుని దర్శించి, అతని మనోభావాలు తెలుసుకొని, తిరిగివచ్చి, భరద్వాజాశ్రమంలో ఉన్న రామునకు విన్నవించుకున్నాడు.

           “   రామ  వార్తను చెప్పితి రమ్యచరిత   నీ ఋణమ్మును చెల్లింప నేర ననుచు 
   అలముకొనె నన్ను- అదియేమి యద్భుతమ్మొ నీ పరీరంభ గతి నిల్చె నెమ్మనమున”
                                                {  భారతం-  రా.వసునందన్ -608.612 ప}
           రామచంద్రుని ఆగమన వార్తను  తెల్పిన ఆంజనేయునకు  నీ ఋణం
 నేను తీర్చలేనంటూనే  “కౌగిలి “ని కానుకగా ఇచ్చాడు భరతుడు. భరతుని కౌగిలి లో     "రాముని కౌగిలి” అనుభూతి ని పొందానని చెపుతున్నాడు ఆంజనేయుడు.” మరువలేని అనుభూతి మైథిలీ నాథుని పరిష్వంగమని” రామ భక్తులను ఊరిస్తున్నాడు. ఇక్కడ రామ భరత అభేద ప్రతిపాదనే కవి లక్ష్యం . ఇటువంటి ఘట్టాలు రామ కావ్యాల్లో కొల్లలు గా కన్పిస్తాయి.
                 కైకేయి దుశ్చర్య వల్ల ఛిన్నాభిన్నం కాబోతున్న ఉమ్మడి కుటుంబవ్యవస్థ ను,దాని గౌరవ మర్యాదల్నికాపాడటమే కాకుండా ఉమ్మడి కుటుంబం లో జ్యేష్టుని కివ్వాల్సిన  స్ధానమేమిటో ప్రపంచానికి తెలియపర్చిన మహోన్నత పాత్ర భరతుడు .లేకపోతే 10,000 సంవత్సరాలకు పూర్వమే భారత జాతి గర్వంగా చెప్పుకుంటున్న ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ      మటుమాయమై పోయేది.  ఆంజనేయుని తర్వాత రామభక్తులు పూజించే భక్తాగ్రగణ్యుడు భరతుడే ! రామ పాదుకాశ్రిత భక్త శేఖరుడు  భరతుడు. అందుకే భరతునికి గుడికట్టి పూజలు  కూడ చేస్తున్నారు రామభక్తులు.                                                                                  

                    The Koodalmanikyam Temple in the state of Kerala is the only temple of Bharata in India.                  {wiki pedia –bharata]



**************** శ్రీ రామ రామ భరతాగ్రజ  రామ రామ  *********9441056609**


























                                      

Saturday, 29 September 2012

రామాయణము- రమణీయకథనాలు -6 మా నిషాద



         మా నిషాద  -హే లక్ష్మీనివాస

        విశ్వ సాహితీ విపంచిక  పై రామకథ ను పలికించి భారతజాతి ఆదర్శాలను, ఔన్నత్యాన్ని, ప్రపంచానికి ప్రదర్శించిన వాల్మీకి రామాయణ మహాకావ్యానికి నాందీగీతం               ఈ   “మానిషాద శ్లోకం.

                          మా నిషాద ప్రతిష్ఠాంత మగమ శ్శాశ్వతీస్సమా:
                            యత్క్రౌంచ మిథునా దేక మవథీ: కామమోహితం !!

           క్రౌంచ హనన సందర్భ సంజనిత శోకమే శ్లోకమై ఋషి కవిగా మారిన కళ్యాణఘడియ లో  శోకార్తుడైన   వాల్మీకి ముఖ వినిర్గత  శ్లోకమే    ” మానిషాద” .

             కావ్యావిర్భావ ప్రథమదశలో కవిలో చెలరేగే వివిధమైన అనుభూతులకు  ప్రత్యక్షోదాహరణం మానిషాద శ్లోకావిర్భావ సన్నివేశము.

             విశ్వశ్రేయస్సుని కాంక్షించే కవి లోకం కోసం తపించి  బహిర్జగత్తులో ఆత్మైక్యం పొందుతాడని, అటువంటి తాదాత్మం నుండే కవిత్వ మావిర్భవిస్తుందని లౌకిక జగత్తుకి తెలియజెప్పిన ఆదికవి కృత ప్రథమకవిత్వం “ మానిషాద” .

       కవిలో కలిగిన ఆవేదన ఆవేశాలు అనుభూతికి దగ్గరగా అక్షరాకృతిని దాలిస్తే అది కవిత్వమౌతుందన్న ప్రాచ్య,పాశ్చాత్య కవిత్వ నిర్వచనాలకు ప్రాణం –ప్రేరణ  "మానిషాద”.

       “Poetry is the spontaneous over flow of powerful feelings”—words worth                           “The thought of in which emotion spontaneously embodies it self-“ john stuart   mill                              
“ Poetry is a vent for over charged feeling “–john kebel        
       “  “Poetry Is  responsible for mankind –Even for animals”–కవిసేన మానిఫెస్టో పుట -202

           నారదమహర్షి చెప్పి వెళ్లిన రామచంద్రుని గాథను మననం చేసుకుంటూ  స్నానార్ధం తమసానదీ తీరానికి చేరుకున్నారు వాల్మీకి. ఇంతలో ఒక బోయవాడు  ప్రణయపారవశ్యం తో విహరిస్తున్న క్రౌంచపక్షి జంటలో మగపక్షిని నేలకూల్చాడు. మనోహరమైన రామకథను భావించు  కుంటూ తన్మయుడై యున్న మహర్షికి   భర్తను కోల్పోయిన  ఆడపక్షి శోకం రామ చంద్రునికి దూరమై రావణునిచే బంధించబడి విలపిస్తున్న సీతమ్మ శోకం వలె థ్వనించింది.
   
    ప్రశాంత మైన హృదయం లో చెలరేగిన  బాథ కోపమై ప్రభవించింది. కోపం శాప మై వెలువడింది. శోకమే  శ్లోకమైంది. “శోకార్తస్య ప్రవృత్తోమే శ్లోకోభవతు నాన్యథా “అని మహర్షి ఉవాచ. లౌకిక జగత్తు కి అనుష్టుప్ ఛందం లబించింది.  మహర్షి శోకము శ్లోకమై సుశ్లోకార్హమైంది .

                  ఈ శ్లోకం కథాపరంగా చూస్తే బోయవానికి “ ఓ నిషాదుడా! నీవు కామమోహితమైన క్రౌంచ మిథునములోని  ఒక దానిని  కొట్టితివి కావున నీవు ప్రతిష్ఠను పొందకుందువు గాక “అని  వాల్మీకి యిచ్చిన శాపం గా కన్పిస్తున్నప్పటికి, ఇది చతుర్ముఖ వరప్రసాదితుడైన  వాల్మీకి ముఖము నుండి వెలువడిన ప్రథమ శ్లోకం కాబట్టి  ఇది శాప మో శోకమో కాదని ఇది రామాయణ మహాకావ్యానికి నాందీశ్లోకం వంటి దని భావించిన   రామాయణ వ్యాఖ్యాతలు ఈశ్లోకంలో క్రొత్త అందాలను దర్శించారు.

         “ అర్థతశ్శబ్ధతోవా2పి  మనాక్కావ్యార్ధసూచనం “అన్నఆలంకారికోక్తి ననుసరించి “మానిషాద “ శ్లోకంలో” పౌలస్త్య వథ” { “ కామమోహిత మవధీ రిత్యనేన – పౌలస్త్యవథ మిత్యేవేతి విరోథి రావణ నిర్థేశ:”  శ్రీ.మద్రా. గోవిందరా.వ్యాఖ్య-137 }నిరూపించబడిందని, రామాయణ గాథ యావత్తూ దీనిలో ప్రస్తావించబడిందని వ్యాఖ్యానకర్తలు వివరిం చారు. 
                                                                               
                               “ .....దేవర్షిగణం.... అవసాదయతీతి పీడయతీతి నిషాద తస్య సంబుద్ది: హే నిషాద ! రావణ – యద్యస్మాత్ క్రౌంచమిథునాత్ ..... క్రౌంచం- రాజ్యక్షయ వనవాసాది దుఖేన పరమకార్శం గతం  యన్మిథునం సీతారామ  రూపం  తస్మాదేకం సీతా రూపం....”.ఈవిధంగా  మహేశ్వరతీర్థుల వ్యాఖ్యానం కన్పిస్తోంది. దేవతలను, ,ఋషులను పీడించిన రావణుడే నిషాదుడు  కాగా భర్తృవియోగాన్ని పొంది విలపిస్తున్న  క్రౌంచిని సీతాదేవి గా భావించి రామకథను సమన్వయించారు మహేశ్వర తీర్థులు. 
                                                                                “                                   “మానిషాద” శ్లోకంలోని ప్రతిపదాన్ని రామాయణంలోని కథ తోను , కాండల పరంగాను విభజించి వ్యాఖ్యానకారులు చేసిన సమన్వయాన్ని  చూస్తే ఆ మహానుభావులకు మరొక్కసారి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.

                        “మా నిషాద” –  ఇత్యనేన  సీతాపరిణయ పర్యవసానే బాలకాండ కథా   ---- ఇచ్చట” మా” అనే మాటకు “ వద్దు” ,”కూడదు” , అనే నిషేధార్ధం కాకుండా “ మా” అంటే “లక్ష్మీ”అనే అర్ధం తో సమన్వయం సాధించారు.” ఇందిరా లోకమాతా మా “అని అమరకోశం .                
         
          “ మా  లక్ష్మీ  : తస్యా: నిషాద : మానిషాద:   శ్రీనివాస: తత్రసంబుద్ధి  హే     శ్రీనివాస ! అని గోవిందరాజీయం. “  లక్ష్మీ –నివాస” ఇతి” మా లక్ష్మీ నిషీదత్యస్మిన్నితి మా నిషాద తత్సంబోధనం హే మా నిషాద  విష్ణో: “ అని తత్త్వ దీపికా వ్యాఖ్యానం.  

                                  అదేవిదంగా    .........        “   ప్రతిష్ఠాం త్వ మగమ    “    అన్న రెండవ పదానికి     “పితృవచన పరిపాలనా ప్రతిష్ఠాభిధాయిన్యయోథ్యకాండ కథా---“ . అని పితృ వాక్యపరి పాలన  పూర్వక అయోథ్య కాండ ను,


          “ శాశ్వతీ స్సమా ----“ అన్న మూడవ పదానికి ……   “ శాశ్వతీ స్సమా ఇత్యనేన  ఋషిగణ విషమ ప్రతిజ్ఞా నిర్వహణేన ప్రతిష్ఠానువృత్తి మభిదధ త్యరణ్యకాండ కధా సూచితా  ----  అని ఋషి సంరక్షణ ప్రతిజ్ఞా పరిపూర్తి  యనెడు -అరణ్య కాండ ను ,

        “ కామమోహితం “---  అన్న  పదానికి ....... కామమోహితం సుగ్రీవ భార్యాపహర్తారం వాలిన మవధీరితి కిష్కింధకాండ కథా అభిహితా .....”.అని   సుగ్రీవుని భార్యను అపహరించిన  కాముకుడైన వాలి వధ ను పూర్తి చేసిన కిష్కంధ కాండను,

         “ క్రౌంచా...... తయోరన్యోన్య విరహ క్లేశ కృశీయశో సీతారామయోరేక మవయవం సీతా రూప మవథీ భృశం పీడితవానసీతి  సీతా విరహ వర్ణన పరా సుందర కాండ కథా స్పోరితా” .... అని సుందరి యైన సీతా విరహ వర్ణన పరంగా సుందర కాండ ను ,

   “...... క్రౌంచౌ కుటిలౌ రాక్షసాత్త న్మిథునాదేకం కామమోహితం రావణమ వథీరితి యుద్ధకాండ కథా సూచితా.....” కామమోహితుడై  మోసంతో  ఒక జంటను  విడదీసిన రావణుని వథను   చెప్పే యుద్దకాండ తోను,   ........... సమన్వయించారు. 
                                                                    
        శ్రీమద్రామాయణ మహాకావ్యానికి నాందీగీతమైన ఈ శ్లోక ప్రాథాన్యాన్ని  ఒక్కసారి విజ్ఞులతో కలిసి పంచుకొని, రామాయణ ఔన్నత్యాన్ని, దాన్ని అందించిన మహనీయుల  మహదౌన్నత్యాన్ని మరొక్కసారి గర్వంగా స్మరించుకోవడానికి  చేసిన  చిన్న ప్రయత్నం   ఇది.

 ########  జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి  #########
                                                                                                                               

Tuesday, 25 September 2012

రామాయణము-రమణీయ కధనాలు--5 అహల్య--2

               


                అ హ ల్య       
                                             రెండవ భాగము
                      
                     











                     అహల్యా శాప విమోచనానంతరం మిధిల లో ప్రవేశించిన విశ్వామిత్రుడు శతానందుని తో “ రేణుక జమదగ్నిని కలిసినట్లు నీ మాతృమూర్తి అహల్య నీ తండ్రిని కలిసింది “ అంటాడు. ఇచ్చట రేణుకా జమదగ్నుల ప్రస్తావన రాబోయే పరశురాముని ఆగమనాన్ని సూచిస్తోంది .
             
   
                                          సీతా – అహల్య ల వృత్తాంత్తాల్ని  ఏకముఖంగా పరిశీలిస్తే రెండు విషయాల్ని మనం గుర్తించవచ్చు.అహల్యా గౌతముల పున స్సమాగమం తర్వాతే  సీతారామ కళ్యాణం జరగాలన్నది ఆది కవి నిర్ధేశం. శ్రీ సీతారామ కళ్యాణానంతరం  భార్గవ రాముని ఆగమనం అనివార్యం .ఆ విషయం తెలియజేయడానికే “రేణుక జమదగ్ని ని  కలిసినట్లు అహల్య గౌతముని కలిసింది “ అని చెప్పడం జరిగింది. ఆ మాట చెప్పింది అహల్యా గౌతముల కుమారుని తో విశ్వామిత్రుడు. రేణుకా జమదగ్నుల కుమారుడు ముందు రాబోతున్నాడు. రామచంద్రుణ్ణి  శ్రీ – రామునిగా, కళ్యాణ రామునిగా , శతానందుడు చేస్తే - రానున్న భార్గవుడు రాముణ్ణి కోదండరాముణ్ణి చేస్తాడు. ఇది ఒకతరం[ అవతారం} వేరొకతరానికి అథికారాన్ని బదలాయించే  సంధియుగం .  ఇది మహర్షి భావన.
                
              యాగ సంరక్షణ లో విజయులై  విశ్వామిత్ర ద్వితీయులుగా  మిథిలానగరానికి బయలుదేరారు రామలక్ష్మణులు.

                                విశ్వామిత్రుని గాథలతోను, రామలక్ష్మణుల ప్రశ్నలతోను దారి తరిగి పోతూ కాలం కరిగి పోతూ ఉంటే మిథిలోపవన ప్రాంతానికి చేరారు ముగ్గురు. వన్నెతరిగిన బంగారంలా, మేఘావృతమైన చంద్రబింబంలా  మాసిన అద్దంలోని ప్రతిబింబం లా అణగారిన కాంతితో ప్రకాశిస్తున్న గౌతమాశ్రమాన్ని చూచి, ప్రశ్నించాడు   శ్రీరామచంద్రుడు. వెంటనే” హంత! తే కథయిష్యామి’” అంటూ నిట్టూర్పు విడిచాడు విశ్వామిత్రుడు. భక్తులకొఱకు కదలివచ్చిన కరుణాథాముడు  శ్రీరాముడు. భర్తృసాన్నిథ్యానికి దూరమై తపిస్తున్న సాథ్వీమతల్లి అహల్య.ఆమెకు శాపమోక్షాన్ని కల్గించఢాని కై రాముడు ప్రశ్నించాడు. రాముని ప్రశ్న వినగానే  
“హంత” అన్నాడు విశ్వామిత్రుడు.

                 ఆ నిట్టూర్పు లో ఎంతో ఆనందం. ---    ఒక మహర్షి దంపతులను ఏకం చేసే శుభసమయం  ఆసన్నమైందనే ఆనందం. ఆ ఆనందానికి తాను ఆథారమౌతున్నాననే ఉద్వేగం.  ఎంతోకాలంగా కొనసాగుతున్న అహల్యాదేవి తపస్సు  సఫలీకృతం కాబోతోందన్న  ఉత్సాహం విశ్వామిత్రుని చేత “హంత”అనిపించింది.  ఎంతో బరువు  దిగిపోయినప్పుడు మనలో నుండి వచ్చే దీర్ఘ నిశ్వాసకు ప్రతిపదమే  ఈ “హంత “ అనేది.

             శ్రీ రాముని పాదథూళి సోకి, అదృశ్య , నిరాహారయై తపిస్తున్న అహల్యకు అసలు రూపం వచ్చింది . గౌతమాశ్రమం లో కలకూజితాలు థ్వనించాయి.   ఫలవృక్షాలు చిగిర్చి పుష్పించి , ఫలవంతాలు కాగా            పూ బాలలు  శిరసు లూపి అతిథులను ఆహ్వానిస్తున్నాయి.     ఉగ్ర తేజ స్సంపన్నుడైన గౌతమ మహర్షి ఆశ్రమం లోకి ప్రవేశించాడు.        ఆపుణ్యదంపతులకు పాదాభివందనం చేసి , వారి ఆశీస్సులను పొంది, మిథిలకు ప్రయాణమయ్యారు కుశికసుత దాశరథులు.

                               మిథిలలో ప్రవేశించిన రాముడు    శ్రీ రాముడై     కళ్యాణ రాముడైనాడు. గౌతమాశ్రమంలో  దంపతీ పూజ చేయించి పెళ్లికొడుకుగా రాముని మిథిలానగరంలోకి  ప్రవేశింపజేశారు వాల్మీకి.    ఇది ధర్మయుత ఆర్షసంస్కృతికి చిహ్నంగా భాసించింది. ....... తన తల్లిని తండ్రితో కలిపిన  పరంథాముడగు    శ్రీ రాముని పూజించాడు శతానందుడు . సీతను రామున కిచ్చునట్లుగా ఏర్పరచి దైవఋణం తీర్చుకున్నాడు. రఘురాముడు సీతారాముడు    కాగా లక్ష్మణు   డు ఊర్మిళో పేతుడైనాడు . ఆ యదృష్టం అహల్యా గౌతముల  ఆశీ: ప్రభావమే నని భావించవచ్చు. ఇది వాల్మీకి మహర్షి కల్పన.

                ఈ ఘట్టంలో  విశ్వామిత్రుడు  చెప్పిన వృత్తాంతంలో అహల్య దోషిగా  “దేవరాజ కుతూహలాత్” అనే పదం వలన ముద్ర  వేయబడింది. బ్రహ్మ మానస పుత్రి,  మహర్షి పత్ని  దేవరాజ కుతూహలయై జార యైంది.  ” సురకార్యార్థమిద” మని ఇంద్రుడు    తప్పించుకున్నా మగవారి రాచకార్యాలకు ఆడది గా అహల్య బలైంది. జారగా మిగిలింది. అందుకే  ఉత్తరకాండ లో   ఇంద్రుని   గౌతముని గా భావించి {–త్వద్రూపేణ దివౌకసా- } అహల్య ఏకశయ్య అయినట్లు చెప్పి, బాలకాండలోని మాలిన్యాన్ని కొంత  ప్ర క్షాళన  చేయఢానికి ప్రయత్నించినట్లు  కన్పిస్తుంది. కాని ఆడదాని మీద పడిన అపవాదు గాయం మానినా మానిపోని మచ్చలాగా శాశ్వతంగా మిగిలిపోతుంది. అహల్య విషయంలో అదే జరిగింది .         వేదాలలో    ప్రతీకాత్మకంగా    వాడిన ” అహల్యాయైజార” శబ్ధం అనంతర కాలికుల కావ్యాల్లో, కల్పనల్లో రెక్కలు విదిల్చి విహరించి తుదకు  అశ్లీలార్థ కథలకు  అలవాలమైంది.


             వాల్మీకి మహర్షి నైతికవర్తనను , ధానిపై సమాజానికున్న బాథ్యతను తెలియజెప్పడానికి థర్మ ప్రబోధాత్మకంగా అహల్యా వృత్తాంతాన్ని వ్రాశారు.  బ్రహ్మమానసపుత్రికయైనా ,మహర్షిపత్ని యైనా  తప్పుచేస్తే  శిక్ష తప్పదన్న హెచ్చరిక , థర్మ ప్రకటనం మహర్షి ఉద్దేశ్యం. అయితే పసివారికి నిప్పు కాలుతుందని తెలియజేయడానికి సెగ చూపిస్తే సరిపోతుంది కాని అంగవైకల్యం సంభవించేటంతగా కాల్చలేము గదా. అహల్య విషయంలో రెండవదే జరిగింది .అస్తిత్వానికే లోపం ఏర్పడింది. బాలకాండ – ఉత్తరకాండ కథల నడుమనున్న అంతరాన్ని పరిశీలిస్తే అహల్యా శీల  సంరక్షణకు మహర్షి చేసిన ప్రయత్నం మనకు అర్థమౌతుంది  .
      
       అహల్యాజారుడైన ఇంద్రుని శపించి, అహల్యను సైతం” వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ “  అంటూ అదృశ్యగా పెక్కేండ్లు తపించి రామచంద్రుని పాద స్పర్సచే ఫవిత్రీకృత గాత్ర కావలసిందని వాల్మీకంలో గౌతముని ఆజ్ఞ. కాని – అథ్యాత్మరామాయణం లో అహల్య రాయిగా మారినట్లు చెప్ప బడింది.

                  దుష్టే త్వం తిష్ట దుర్వృతే శిలయా2శ్రమే మమ
                 నిరాహారా దివారాత్రం తప: పరమమాస్థితా!!                  { అ.రా. బాల.5   ]

     అదేవిథంగా ఆనంద రామాయణ ,సత్యోపాఖ్యానాలయందు సైతం అహల్య కు శిలా రూపమైన శాపమే కన్పిస్తుంది. తులసీదాసు కూడ అహల్య ను శిలారూపంగానే ధర్శించారు. బ్రహ్మపురాణంలో—

                          తామప్యాహముని: కోపాత్ త్వం చ శుష్కనదీ భవ
                          నదీభూత్వా పునారూపం ప్రాప్య్ససే ప్రియ కృన్మమ!!

    అంటాడు గౌతముడు.ఎండిపోయిన నదిగా శాపం.గౌతమీనదితో కలిసి నప్పుడు విమోచనం చెప్పబడింది. పధ్మపురాణం లో ---

                 అస్థి చర్మ సమావిష్టా నిర్మాంసా నఖవర్జితా....... చిరంస్థాస్యసి--  {  ప.పురా.సృ. 158-43]

ఎముకలు చర్మము తోను మిగిలి మాంసము గోళ్లు లేని దానివై నలుగురు చూచుచుండగా చిరకాల ముండవలసినది గా శాపం అహల్య కు కన్పిస్తుంది .            

                       .” అస్యా దోషో న చైవాస్తి  దోషో2యం పాకశాసనే “ {సృ.158.38] అని పద్మపురాణం లో రామచంద్రుడు అహల్యను సమర్థించడం సైతం మనకు కన్పిస్తుంది.    ఇక    విచిత్ర రామాయణాదుల్లో కన్పించే కథలు మరీ అశ్లీల ద్యోతకాలు.  

                   ఈవిథంగా  వేదవాజ్ఞ్మయం నుండి లౌకిక వాజ్ఞ్మయం మీదుగా ఆథునిక వాజ్ఞ్మయం వరకు 
అహల్యా వృత్తాంతం  పలువిథాలుగా మనకు కన్పిస్తుంది .   




*****************************************************************************