Tuesday, 28 February 2017

మూడవ ప్రకరణం -2 వెలుగుచూసిన తెలుగు శిల్పాలు, ద్వారక గుడి

మూడవ ప్రకరణం -2



  
     వెలుగుచూసిన తెలుగు శిల్పాలు



ద్వారక గుడి :-
                              పది పదహేను కిలోమీటర్ల పరిథి లో వ్యాపించిన ఈ గుడిమెట్ట నగర పరిథి లో మసీదు దిబ్బ నుండి  తూర్పు గా కొండ కొన మీద కన్పించే గుడి నే ద్వారక గుడి అని స్ధానికులు పిలుస్తున్నారు. చిత్రము. 23. ఈ ప్రదేశం లో నది నీటిమట్టం వేసవి లో కూడ 30 అడుగులకు తగ్గకుండా ఉండటం  ఈ ప్రదేశ ప్రత్యేకత. నది వెడల్పు ఇక్కడ తక్కువగా ఉండి, రెండు కొండల మధ్య కృష్ణమ్మ మెల్లగా ప్రవహిస్తూ ఉంటుంది. నదికి రెండువైపుల ఉన్న రెండు కొండల కొనకొమ్మల మీద రెండు ఆలయాలు నిర్మించబడ్డాయి. కృష్ణానది ముక్త్యాల  నుండి ఉత్తరవాహిని గా ప్రవహిస్తూ, ఈ ప్రాంతానికి రాగానే ఈ రెండు కొండల నడుమ హఠాత్తుగా తూర్పువైపు నకు మలుపు తీసుకొంటుంది. కాబట్టే ఈ ప్రాంతం లో ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి, ఈ రెండు కొండల పైన రెండు ఎత్తైన శిఖరాలతో రెండు ఆలయాలను నిర్మించారు అలనాటి రాజులు.  మొత్తం నల్లరాయి తో నిర్మించబడిన కాకతీయుల శిల్పకౌశలం ఈ ఆలయ ప్రత్యేకం. దేవాలయ ప్రధాన ద్వారబంధం అత్యద్భుత శిల్పసముపేతం. చిత్రం .26. వెలుపలి గోడలపైనా అద్భుత మైన కళాఖండాలుతీర్చబడ్డాయి.  


                                                   -55-

            అతి విలువైన శిల్పసంపద ఇది. వేరువేరు  రాళ్ళ పై చెక్కిన వివిధ కళాఖండాలను ఒక్కటి గా పేర్చి కనువిందు చేసిన కమనీయ శిల్పమిది. వానిలో ఓరుగల్లు ద్వారం వెలుపలి గోడలపై మూడువైపులా స్పష్టం గా  తీర్చి దిద్దబడింది. వాని నడుమ కుడివైపు వెలుపలి గోడపై చెన్నకేశవుడు , వెనుక వైపు గోడపై శ్రీవేంకటేశ్వరుడు , ఎడమవైపు గోడ పై గోపికాకృష్ణుడు కొలువు తీరారు.  ఈ ఆలయం లోని మూలవిరాట్టు వేంకటేశ్వరుడు.గర్భాలయం లోని విగ్రహం, సోమసూత్రం మరికొన్ని పెద్దపెద్ద బండరాళ్ళ తో కలిపి అంత్రాలయం లోకి  విసిరివేయబడ్డాయి. గర్భాలయం లోని బండలు మొత్తం త్రవ్వి వేయబడి అక్కడ పెద్ద అగాథం ఏర్పడింది. అంటే గుప్తనిథుల కోసం ఎంతమంది కలిసి ఎంత పెద్ద ప్రయత్నం చేసుంటారో మనం అర్థం చేసుకోవచ్చు.  అంత ఎత్తున ఉన్న కొండ పైకి అంతంత పెద్ద బండలు ఎక్కడ నుంచి ఎలా మోయించుకొచ్చారో , ఆలోచిస్తే ఆశ్చర్యం వేయక మానదు.
                          

                          
                   ఈ ఆలయ సింహద్వారం పై కన్పించే ద్వారపాలకులతో కూడిన తోరణ శిల్పవిన్యాసం మనోహరం గా ఉంటుంది. చిత్రం . 26. సింహద్వారం పై రామపట్టాభిషేకం ,దానికి ఇరువైపులా లతలతో అలంకరించబడింది.  దేవాలయ నిర్మాణానికి వాడిన నల్లరాయి ఈ పరిసరాల్లో లభించేది కాదు. 5” ,4” 3 ½ ” 2”  ఈ రకంగా పలురకాల సైజుల పొడవు తో, 1” , 1 ½ మందంతో 2” ,3” వెడల్పు నుండి  7” ,9”   వెడల్పు వరకు కప్పుకు పనికొచ్చే రాళ్ళ ను సైతం  అంత ఎత్తుకు చేర్చగల్గడం సామాన్య విషయం కాదు. కృష్ణానది నీటిమట్టం నుండి సుమారు 40 అడుగుల ఎత్తున నిర్మించిన కట్టడమది. ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణం లోనేఒక ప్రత్యేకత కన్పిస్తుంది. అందుకే నాటి పాలకులు ఎన్నోవ్యయ ప్రయాసలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అదేమిటంటే ------
                       



              సాధారణం గా దేవాలయాల్లో గర్భగుడి పై భాగం గోపురాకారం గా శిఖరం వరకు లోపలి వైపు ఖాళీగా నిర్మించబడుతుంది. దీనినే ఆగమ శాస్త్రం లో విమానం అంటారు. లోపలి నుంచి పైకి చూస్తే చీకటి గా ఖాళీ ప్రదేశమే కనిపిస్తుంది. కానిఈ ఆలయం లో మాత్రం గర్భాలయం పై కప్పు పెద్దపెద్ద బండలో కప్పబడి, దేవునికి కుడివైపు  పై భాగంలో మనిషి వెళ్లగలిగినంత ఖాళీ ప్రదేశం

                                                -56-

 వదిలి పెట్టబడింది.  ఆ పైన ఒక ఇరవై మంది వరకు విశ్రాంతి గా కూర్చోవడానికి అవకాశం ఉందంటే అతిసయోక్తి కాదు.ఇది పూర్వకాలపు  పెంకుటిళ్ల ల్లో కట్టుకునే అటక మాదిరి నిర్మాణం గా ఊహించుకోవచ్చు. ఒక నిచ్చెన వంటి సాధనం ద్వారా పైకి చేరుకోవచ్చు. ఇంత నిర్మాణం ఎందుకో హఠాత్తు గా చూస్తే అర్ధం కాదు. కొంచెం ప్రత్యేకదృష్టి తో ఆలోచిస్తే ఇది దీపాల దిన్నె”  లేకదీపాల గృహం గా మనం భావించవచ్చు. ఆనాడు నౌకాయానం చేసేవారికి ఇది మార్గనిర్దేశం కోసం నిర్మించ బడింది. దీన్నే మనం ఈనాడు Light House గా వ్యవహరిస్తున్నాం. 


   




ఈ గుడి ముఖద్వారం గుడిమెట్ట నగరం వైపు తిరిగి ఉంటుంది. ఈ గుడి పై నిలబడితే వేదాద్రి వద్ద ఉన్న పడవను సైతం స్పష్టం గా చూడవచ్చు. కృష్ణానది ఈ ప్రాంతానికి వచ్చే సరికి అంత పెద్దమలుపు తీసుకుంటుంది.చిత్రము 25 లో దూరంగా  వేదాద్రి ఆలయాన్ని చూడవచ్చు. కృష్ణానది లో వేగం గా ప్రయాణించే నౌకలు, రాత్రివేళ ల్లో వేగంగా వచ్చే పడవలు ఈ ప్రాంతానికి చేరేసరికి హఠాత్తు గా మలుపు తీసుకున్న నదీగమనం లో వేగం గా వచ్చే పడవలు మలుపులో కొండచరియను గుద్దుకునే ప్రమాదం ఉంది.  ఊహిస్తే ప్రమాదాలు జరిగి ఉంటాయి. వాటిని నివారించడానికే ఈ ఆలయం పై వెలుగుతూ ఉండే దీపం  నావికులను హెచ్చరించేది. వేగాన్ని నియంత్రించుకోవడానికి ఆ హెచ్చరిక ఉపయోగపడేది. ఈ ఆలోచన ,అవసరాలే ఈ ప్రదేశం లోని రెండు కొండల కొన కొమ్మల మీద రెండు ఆలయాలను నిర్మించి ,వాటి నిర్వహమ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయబడి ఉంటాయనడం లో  ఎటువంటి సందేహము లేదు. ఇంత పెద్ద ప్రయోజనం ఉంది కాబట్టేనది కి నలభై అడుగుల ఎత్తు లో ఈ అలయ నిర్మాణం చేపట్టారు. రెండు కొండల మీద కన్పించే దీపాల నడుమ ఈ నదిలో మెల్లగా ప్రయాణం , నదీ గమనాన్ని గుర్తించి  ప్రయాణించడం సాధ్యమయ్యేది. ఇలా కట్టిన ఈ కట్టడాన్నివిగ్రహప్రతిష్టాపన తో ఆలయం గా మార్చారు. అది మన సంస్కృతికి సంకేతం.ఈ ఆలయాన్ని కేంద్రం గా చేసుకొని నాలుగైదు కిలోమీటర్ల పరిధి లో కొండపైనే ఒక గ్రామం విలసిల్లినట్లు గా శిథిలాలు చెపుతున్నాయి. అడుగడుగునా పునాదులు ,మొండిగోడలు , పెద్దపెద్ద రాతిరోళ్లు, నల్లరాతి బండలు ఈ ప్రాంతమంతా కన్పిస్తాయి.  ఈ నిర్మాణం

                                                -57-

    



              దేవాలయరూపాన్ని సంతరించుకున్న దీపపు దిన్నెఅని చెప్పడమే సమంజసం. కాబట్టి అనంతర కాలం లో రాజులు మారినా , రాజ్యాలు కూలినా, రాజులు ఎవరొచ్చినా ఈ అవసరాన్ని గుర్తించి , దీన్ని పడగొట్టడం గాని, నష్టపరచడం గాని చేయలేదు.ఎవ్వరి కైనా  నౌకాయాన సమయం లో దీని అవసరం తప్పని సరి కాబట్టి ఈ గుడి , దీనికెదురు గా నది కి  ఆవలి ఒడ్డున ఉన్న గుడి ఇప్పటికీ అలాగే నిల్చి ఉన్నాయి. ఆనాటి నిర్మాణ దారుఢ్యం అంత గొప్పది. ఆలయం లోని మూలవిరాట్టు మాత్రం  పెకలించబడింది. ఈ నిర్మాణం లో అడుగడుగునా కాకతీయ శిల్పం ఉట్టిపడుతూ ఉంటుంది. సింహద్వారం పై కన్పించే చిత్రాలు , వెలుపలి గోడలపై కన్పించే ఓరుగల్లు ద్వారాలే ఇందుకు ప్రత్యక్షసాక్ష్యాలు. చిత్రాలు 23,  24,25,26. చూడవచ్చు. ఈ గోడలపై , శిఖరం పై  రావి ,జువ్వి, వంటి మొక్కలు పెరిగి , ఈ పురాతన కట్టడాన్ని పడవేయడానికి ప్రయత్నిస్తున్నాయి. శిథిలమౌతున్న ఇటువంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయుని పైన ఉంది.

                                                  


                                                -- తరువాయి భాగం లో  బృహత్కాంచీపురం (పెనుగంచిప్రోలు).

*****************************************************