శతకసౌరభాలు -9
కాసుల పురుషోత్తమ కవి
ఆంథ్రనాయక
శతకము- 4
ఆలు నిర్వాహకురాలు భూదేవి యై
యఖిలభారకుఁ
డనునాఖ్యఁ దెచ్చె
నిష్టసంపన్నురా లిందిర భార్యయై
నిష్టసంపన్నురా లిందిర భార్యయై
కామితార్థదుఁ డన్న ఘనతఁ దెచ్చెఁ
గమలగర్భుఁడు సృష్టికర్త తనూజుఁడై
గమలగర్భుఁడు సృష్టికర్త తనూజుఁడై
బహుకుటుంబకుఁడన్న బలిమి దెచ్చెఁ
గలుషవిధ్వంసిని గంగ కుమారి యై
గలుషవిధ్వంసిని గంగ కుమారి యై
బతితపావనుఁ డన్న ప్రతిభఁ దెచ్చె
నాండ్రు బిడ్డలు దెచ్చుప్రఖ్యాతి గాని
మొదటినుండియు నీవు దామోదరుఁడవె
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ! 26
ఆంథ్రదేవా ! సమస్త భూభారాన్ని వహించే భూదేవి నీకు ఇల్లాలు కావడం తో నీవు అఖిల భారకుడవనే కీర్తిని పొందావు. సమస్త సంపదలకు నెలవైన
మహాలక్ష్మీ దేవి భార్య అవడం వలన కామితార్ధ
ప్రదుడవనే బిరుదు దక్కింది.సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కుమారడవడం వలన బహు
కుటుంబీకుడవు , పెద్దసంసారివనే పేరు దక్కింది. సమస్త పాపములను పోగొట్టే పరమ
పావనయైన గంగ మాత నీకు కుమర్తె కావడం తో పతితపావనుడవనే ప్రతిభ ను సొంతం
చేసుకున్నావు. ఏ విధంగా చూసినా నీకున్న పేరు ప్రతిష్టలన్నీ ఆలు బిడ్డలు సంపాదించి పెట్టినవే కాని ఆది నుండి నీవు దామోదరుడవే కదా ! .
కడలి
రాయని ముద్దుకన్నియఁ బెండ్లాడి
యూఁచఁగా నిల్లట ముండు టేమి
సహజ నొక్కర్తెను షండ పాండవునకుఁ
సహజ నొక్కర్తెను షండ పాండవునకుఁ
బెండ్లిఁ జేసితి నీవు పెద్ద వేమి
చిర రతిప్రౌఢను జిన్నబిడ్డని కీవు
చిర రతిప్రౌఢను జిన్నబిడ్డని కీవు
గూర్చితి వారీతి గూడు నేమి
యుగములనాటి పెన్మగువను ముసలన్న
యుగములనాటి పెన్మగువను ముసలన్న
కొగిఁ జేసితివి తగుం దగు మఱేమి
తెలియ నవ్యక్తుఁడవు గావు తెలిసికొన్న
నిట్టివాఁ డని తెలియలే దెవ్వరికిని
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! 27
దేవా ! నువ్వు చేసిన
పనులైనా నీ గౌరవాన్ని పెంచేవిగా ఉన్నాయా స్వామీ ఆలోచించు. సముద్ర రాజ తనయైన
మహాలక్ష్మీదేవి ని పెండ్లాడి , మొత్తం గా
పాలసముద్రంలోనే కాపురం పెట్టి ఇల్లరికం ఉండిపోయావు . ఒక్కగా నొక్క చెల్లెలు సుభద్ర ను
పేడి యైన అర్జునునకిచ్చి పెళ్లి చేశావు. రతికళ లో ఎంతో నేర్పరియైన రతీదేవిని చిన్నవాడైన ప్రద్యుమ్నుని
కిచ్చి వివాహం చేశావు. వయసు లో పెద్దదైన
రేవతీ దేవి ని నీ ముసలి అన్న కు ఇచ్చి
కట్ట పెట్టావు. తెలుసుకోవడానికి సాధ్యం కానివాడవు. తెలుసుకున్న
ఇటువంటివాడవని ఎవరికీ తెలియని వాడవు
కదయ్యా నువ్వు స్వామీ !.
నీ
జ్యేష్ఠపుత్త్రుఁ డెన్నికకు రాని యశాశ్వ
తపుఁ బను ల్సేయు సంతతము జగతి
వేరొక ముద్దుకుమారుఁడందఱిమోహ
వేరొక ముద్దుకుమారుఁడందఱిమోహ
లతల స్త్రీపురుషుల లంకెఁ బెట్టు
నీతలోదరి లోకమాత పక్షాపక్ష
నీతలోదరి లోకమాత పక్షాపక్ష
దృష్టిఁ జంచలవృత్తిఁ దిరుగుచుండు
నీ వనన్యకృతాది నిబిడమాయావిధా
నీ వనన్యకృతాది నిబిడమాయావిధా
నుల జేయు దెవ్వరిఁ దొలఁగనీక
నొకరికంటె గుణాధికు లొకరు మీరు
ఇంతచక్కన దెలిసె మీయింటివరుస
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
28
శ్రీకాకుళాంథ్రదేవా ! నీ పెద్దకొడుకైన బ్రహ్మదేవుడు
ఈ లోకం లో అన్నీ అశాశ్వతపు పనులే చేస్తూ ఉంటాడు. నీ మరొక ముద్దుల కొడుకైన
మన్మధుడు స్త్రీ పురుషుల మధ్య వికారాలను
రేకెత్తించి, మోహలతల చేత బంధిస్తూ ఉంటాడు. నీ ఇల్లాలు లక్ష్మీదేవి ద్వంద్వ మనస్సు
తో చంచల స్వభావు రాలై సంచరిస్తూ ఉంటుంది.
ఇక నీవు సమస్త లోకాన్ని మాయా మోహం లో
ముంచి వేయడం లో దిట్టవు. ఆహా ! ఏమి కుటుంబమయ్యా మీది! . ఒకరిని మించిన వారు మరొకరు .
సకలంబు
నీవ యై యొక మఱ్ఱియాకుపై
నిచ్చఁ బరుండునాఁ డెంత గలవొ!
తన బిడ్డఁ డని యశోదాదేవి పొత్తుల
తన బిడ్డఁ డని యశోదాదేవి పొత్తుల
నిడుక ముద్దాడునాఁ డెంత గలవొ!
తక్కులమారత్త దక్కించుకొనఁగ ని
తక్కులమారత్త దక్కించుకొనఁగ ని
న్నెత్తుక పెంచునాఁ డెంత గలవొ!
భయలేశ మెఱుఁగక బల్పాముపడగపై
భయలేశ మెఱుఁగక బల్పాముపడగపై
గంతులు వైచునాఁ డెంత గలవొ!
పరువు గలవాఁడ వేమి ప్రాఁబల్కు లంచు
దెలియ వరిముక్కు ముల్లంత కలవొ! లేవొ!
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ
శ్రీకాకుళాంధ్రదేవ! 29
దేవా ! ప్రళయం సంభవించి సమస్త లోకములు నశించినప్పుడు మఱ్ఱియాకు పై
వటపత్ర శాయివైనప్పుడు ఎంత ఉన్నావో, నందుని
ఇల్లాలు యశోద తన పొత్తిళ్ళ లో నిన్ను ఎత్తుకొని ముద్దాడేటప్పుడు ఎంత ఉన్నావో, నీ
మేనత్త చంక నెత్తుకొని లాలించేటప్పుడు ఎంత ఉన్నావో, కాళింది మడుగు లో కాళీయుని పడగ లపై నర్తించే టప్పుడు ఎంత
పసివాడివో, వేదములలో కూడ వరిముక్కుముల్లంత
సూక్ష్మరూపుడుగానే వర్ణించబడ్డావు. నీవు చాలగొప్పవాడవు సుమా! .
“లోకంబులు లోకేశులు
లోకస్ధులుఁ దెగిన తుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వండేకాకృతి
వెలుగు నతని నే సేవింతున్” (8-75)
అంటుంది ఆంధ్రమహాభాగవతం.
“నీవారశూకవత్తన్వీ
పీతాభా స్తస్యనోపమా” అని
వేదం. నీవారశూకవత్ అన్న
వేద వచనమే వరిముక్కుముల్లంత గా పద్యం లో చోటు చేసుకుంది.
కల్లరు ల్గాని వ్రేపల్లెవా రందఱు
హర్షింప నచట నీయాట సాగె
మధురాపురీవరమనుజు లామోదించి
మధురాపురీవరమనుజు లామోదించి
మన్నింప నచట నీయాట సాగె
ద్వారకాపట్టణధన్యులు నినుఁ గోరి
ద్వారకాపట్టణధన్యులు నినుఁ గోరి
కొల్వఁగా నచట నీకొల్వు సాగెఁ
గరిపుర ధర్మజుం డురురాజసభ నిన్ను
గరిపుర ధర్మజుం డురురాజసభ నిన్ను
భూషింప నచట నీముర్వు సాగె
నెరుక మాలినవారుఁ నీపరువు
దలఁతు
రేమి నీపొంకములు సాగు నేమి
యచట?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! 30
దేవా ! ఆనాడు
రేపల్లె లో ఉన్నవారందరూ అమాయకులై ,
మోసగాళ్లు కాకపోవడం తో అక్కడ నీ ఆటలు సాగాయి.మధురానగరం లో ప్రజలు నిన్ను ఆమోదించి
గౌరవించడం చేత నీ మాట చెల్లింది. పుణ్యాత్ములైన ద్వారకా నగరప్రజలు నిన్ను కోరి
సేవించడం మూలంగా అక్కడ నీ పాలన సాగింది.
హస్తినాపురం లో ధర్మరాజు నిండుసభ లో
నిన్ను సత్కరించడం వలన నీ కోర్కె తీరింది. అజ్ఞానులు నిన్ను లెక్కపెట్టరు. వారి వద్ద నీ డాంబికాలు సాగవు కదా !.
అంటే యెఱుక (జ్ఞానం) కల్గిన వారికే
భగవదనుగ్రహం ప్రాప్తిస్తుంది. అజ్ఞానులకు ఆయన అందడని సూటిగా చెపుతున్నాడు కవి.
దూడలలోఁ
బెరదూడ మేయఁగఁజూచి
యట్టె పట్టుక చావఁగొట్టవలెనె
పొడవ రా వేగ నాబోఁతుకొమ్ములు పట్టి
పొడవ రా వేగ నాబోఁతుకొమ్ములు పట్టి
విడువక దానిపే రుడుపవలెనె
ముక్కుతోఁ జెనకిన కొక్కెరాయనిఁ బట్టి
ముక్కుతోఁ జెనకిన కొక్కెరాయనిఁ బట్టి
వెర వొప్పఁగా మెడ విఱువవలెనె
తన్నుఁ బో తని మృగాధమ మంచు నెంచక
తన్నుఁ బో తని మృగాధమ మంచు నెంచక
తొడరి గార్ధభమును ద్రుంపవలెనె
మేమి ఘనకార్యములు చేసి తిద్ధరిత్రి
నెన్నటికి నీ వొనర్చిన విట్టిపనులె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! 31
దేవా ! నీవు ఈ లోకం లో ఎన్నెన్ని ఘనకార్యాలు చేశావో !.
వేరొక దూడ నీమంద లో మేస్తుంటే దాన్ని
పట్టి కొట్టి చంపావు కదా. (వత్సాసుర వథ.) పొడవడానికి పైపైకి వస్తున్న ఆబోతు
ను కొమ్ములు పట్టుకొని విరిచి చంపివేయాలా?. ( వృషభాసుర వథ.) ముక్కు తో పొడిచిన ఒక కొంగను మెడ విఱిచి మరీ చంపెయ్యాలా
?. (బకాసుర వథ) కాలితో తంతుందని తెలిసి కూడ నీచమైన ఒక గాడిద ను
పట్టుకొని చంపాలా ?. (థేనుకాసుర వథ). ఈ విథం గా ఒక దూడను ,
ఆబోతు ను ,కొంగను , గాడిద ను చంపడం గొప్ప
సాహస కృత్యాలా.. ఇటువంటివే కదా నువ్వు చేసిన పన్లన్నీ స్వామీ !.
“కీర్తి నిందగ
వర్ణించి గేలి పఱతు” నని కవి చేసిన
ప్రతిజ్ఞ ను ఇలా తీర్చుకుంటున్నాడన్నామాట.అందుకే శ్రీకృష్ణుని బాల్యక్రీడలను, సాహసాలను గుర్తుచేస్తూనే , ఆ! అవేమి గొప్పా ! అని హేళన చేస్తున్నాడు. అదే
నిందాస్తుతి.
కవ్వడి
కెంత చక్కఁగ బోధ చేసిన
నితరహింసాకర్మ మిష్టపఱుప
రాయబారం బెంత రసికత నడిపిన
రాయబారం బెంత రసికత నడిపిన
ననికి భారతుల నాయత్త పఱుప
విశ్వరూపం బెంత విమలతఁ జూపిన
విశ్వరూపం బెంత విమలతఁ జూపిన
నోర్వని కురురాజు నులుకు పఱుప
విలుఁ బట్ట నని యెంతొ చెలిమిగఁ బలికిన
విలుఁ బట్ట నని యెంతొ చెలిమిగఁ బలికిన
నవల సుయోధను నాసపఱుప
పోరు చంపక చుట్టముల్ పోర నీల్గఁ
జూచుచుంటివి యేనాఁటి చుట్ట మీవు?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
32
దేవా
! అర్జునునకు చక్కగా
భగవద్గీతను బోధించావు కాని తుదకు హింసనే
నీవు ప్రేరేపించి యుద్ధానికి అర్జునుని సిద్ధం చేశావు కదా !.
రాయబారాన్ని ఎంత అందం గా నడిపినా కౌరవ
పాండవుల మధ్య యుద్ధం జరగడానికే దాన్ని ఉపయోగించుకున్నావు. విశ్వరూపాన్ని ఎంత
చక్కగా ప్రదర్శించినను దాని
పరమార్ధం మాత్రం దుర్యోధనుని భయపెట్టడమే
కదా ?. ఆయుధం
పట్టనని ఎంతో స్నేహం గా చెప్పడం
సుయోధనుని నమ్మించి యుద్ధం లోకి
దించడానికే గదా ?. యుద్ధం ప్రారంభమై ఆ వైపు ఈ వైపు బంధువు
లందరూ నేల కూలుతుంటే చూస్తూ ఊరుకున్నావు. నీవేమి చుట్టానివయ్యా ?. నిజమైన బంధువు వైతే ఆ విధం గా
చుట్టాలు మరణిస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా?.
మహాభారతం లో శ్రీకృష్ణుని పాత్ర ను ఆథునిక విమర్శకుల దృష్టి తో
విశ్లేషిస్తున్నాడు కవి.
శ్రీమద్వికుంఠపురీ వరేశుఁడ వయ్యు
గొల్లపల్లెల నుండఁ గోరు టేమి ?
యక్షీణలక్ష్మీ కటాక్షవీక్షుఁడ వయ్యుఁ
యక్షీణలక్ష్మీ కటాక్షవీక్షుఁడ వయ్యుఁ
ద్రోవ లే కింటింటఁ దోఁచ నేమి?
భూరి చతుర్దశ భువనావనుఁడ వయ్యుఁ
భూరి చతుర్దశ భువనావనుఁడ వయ్యుఁ
గడువేడ్కఁ దొఱ్ఱులఁ గాయ నేమి?
సన్మునిదేవతా సంభావితుఁడ వయ్యు
సన్మునిదేవతా సంభావితుఁడ వయ్యు
నాల గాపరులతో నాడ నేమి?
గొప్పలో గొప్పవాఁడవు కొలదిలోనఁ
గొలదివాఁడవు ని న్నెట్లు గొలువ వచ్చు?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ
శ్రీకాకుళాంధ్రదేవ! 33
దేవదేవా! వైకుంఠవాసుడవయ్యు గొల్లపల్లెలో ఉండాలనే
కోరికేమిటయ్యా నీకు ?. అపార ధన రాసులకు అధిదేవతయైన ఆది
లక్ష్మీ దేవి ఇల్లాలై ఉండగా , తిండి దొరకనట్లు రేపల్లె లో ఇంటింటా తిరిగి
దొంగతనాలు ఎందుకు ?.పదునాల్గు లోకాలకు పోషకుడవై ఉండి
కూడ పాడియావులను మేపు కోవడ మెందుకు
?. సమస్త దేవతా ముని సమూహాలతో
గౌరవించబడే నీవు ఆల కాపరులతో
ఆటలేమిటి స్వామీ.?
గొప్పవారిలో గొప్పవాడివి, కొద్దివారి లో కొద్దివాడివి యైన నిన్ను ఎలా
సేవించాలి స్వామీ!
" అణో రణీయాన్ మహతో
మహీయాన్ " అని
కదా వేదం. అందుకే భగవంతుడు గొప్పవారి లో
గొప్పవాడు. కొద్దివారిలో కొద్ది వాడు గాను కన్పిస్తాడు.
దుర్యోధనుం డవధ్యుఁడ వంచు మానెఁ గా
కలుక బంధింపఁగాఁ దలఁప లేదె?
గోపాలుఁడవు పూజఁ గొందువేరా యని
గోపాలుఁడవు పూజఁ గొందువేరా యని
సభ నిన్నుఁ దిట్టఁడే చైద్యుఁ డెదిరి?
నీ లాంఛనంబులఁ బోలు చిహ్నలు దాల్చి
నీ లాంఛనంబులఁ బోలు చిహ్నలు దాల్చి
తానె నీ వనఁడె యుద్ధతినిఁ బౌండ్రుఁ?
డెవ్వరుఁ బట్టలే రేను బట్టెద నంచు
డెవ్వరుఁ బట్టలే రేను బట్టెద నంచు
యవనుండు దరుమఁడే యాహవమున
నృపులు కొందఱు వెఱచిరే నీకు మున్ను
ప్రాణముల కాసపడరేని భండనమున
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! 34
ఆంధ్రదేవా
! ఆనాడు నిండు సభ లో
దుర్యోధనుడు రాయబారిని చంపకూడదని నిన్ను వదిలివేశాడు కాని నీపై కోపం తో నిన్ను బంధించడానికి ప్రయత్నించ లేదా
? గొల్లవాడివి నీవు పూజార్హుడవు కాదని శిశుపాలుడు నిన్ను నిండుసభ లో
దుర్భాషలాడలేదా ?. పౌండ్రక వాసుదేవుడనే వాడు నీచక్రము
మొదలైన లాంఛనాలను పోలిన చిహ్నాలను తాను
కూడ ధరించి నేనే వాసుదేవుడ నని డాంబికాలు పోలేదా ?.
వాసుదేవుణ్ణి ఎవ్వరూ పట్టుకోలేరు నేను
పట్టి బంధించి తీసుకువస్తానని కాలయవనుడు
నిన్ను యుద్ధ భూమి లో తరుమ లేదా?. ప్రాణాల మీద ఆశ తో ఏదో కొంతమంది రాజులు నువ్వంటే భయపడ్డారు కాని నిన్ను
కూడ ఎదిరించిన వారు ఉన్నారు కదా.
రాజు
లెవ్వరుఁ బఙ్త్కి భోజన మిడకున్న
దాసునింట భుజించి తనియలేదొ?
బంధువు లెవ్వరు గంధ మీ కుండిన
బంధువు లెవ్వరు గంధ మీ కుండిన
మువ్వంకలది పూయ మురియలేదొ?
దొర లెవ్వరును బూలసరము లీకుండినఁ
దొర లెవ్వరును బూలసరము లీకుండినఁ
దెలిసి మాలికుఁ డీగ నలరలేదొ?
ప్రభువు లెవ్వరు వస్త్రబహుమాన మీ కున్నఁ
ప్రభువు లెవ్వరు వస్త్రబహుమాన మీ కున్నఁ
దెచ్చి యిచ్చిన చాకి మెచ్చలేదొ?
పాటి సేయంగ నేరాజు బంధుగుఁడవొ?
మున్నె నీపస దెలిసిన దెన్న నేమి?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! 35
దేవదేవా! ఆనాడు
రాయబారానికి వెళ్ళిన రోజున రాజులెవ్వరూ నిన్ను భోజనానికి పిలవక పోవడం వలనే
కాదా సేవకుడైన విదురునింట భుజించి తృప్తి
చెందావు. ఆనాడు మధురా నగర ప్రవేశ మప్పుడు చుట్టాలెవ్వరూ పిలిచి గంధమివ్వక పోవడం వలనే కదా మూడు వంకరలు తిరిగున్న కుబ్జ గంధ మలద గానే మురిసి పోయావు. రాజు లెవ్వరూ
ఎదురొచ్చి పూలమాలలు ఇవ్వక పోవడం మూలానే కదా సుదాముడనే మాలికుడు ఇచ్చిన దండలతో
తృప్తి చెందావు. ప్రభువు లెవ్వరూ వస్త్రాది బహుమానములివ్వక పోవడం తో వస్త్రాలు తెచ్చిన చాకలిని
మెచ్చుకున్నావు. అయినా నిన్ను
గౌరవించడానికి నువ్వు ఏ రాజుకైనా బంధువు వా ఏమిటి. నీ గొప్పతన మంతా ఇంతకు ముందే
తెలుసులేవయ్యా. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడమెందుకు. ?
కాని ........ మధురా నగరం లో
బలరామకృష్ణులకు వస్త్రముల నిచ్చింది సాలెవాడు కాని చాకి కాదు.
ఆంథ్ర మహాభాగవతం లో మధురానగరం లోకి ప్రవేశించిన
బలరామకృష్ణులు రజకుని చూచి “రజకాన్వయాగ్రణీ” అని సంబోధించిన కృష్ణుడు --
విందులమై నరేశ్వరుని వీటికి వచ్చితి మేము: మాకు మా
మందల
లోనఁగట్టికొన మంచిపటంబులు లేవు: నీ ముడిన్
సుందర థౌత చేలములు శోభిలు
చున్నవి తెమ్ము........
………… రాజుదెస
నల్లురమని … (ఆం.మహా.దశ.పూ.1256)
అంటూ బట్టలివ్వమని గౌరవంగానే అడిగాడు. కాని ఆ రజకుడు రోషించి –
“ఎట్టెట్ట్రా మనుజేంద్రు చేలములు నీకీ బాడియే
అంటూ...........
..................................... గొల్ల ! యేగుము తలగన్ . (1259)
అంటూ తిరస్కరించాడు కృష్ణుణ్ణి. దానితో కోపగించిన
కృష్ణుడు తన ముంజేతి తో అ రజకుని తల తెగి పడేటట్లు కొట్టాడు. ఆ తరువాత ఆ మూట లోని బట్టలను తాము కట్టుకొని కొన్ని
గోపబాలకులకు ఇచ్చి ముందుకు సాగుతుండగా , ఒక సాలెవాడు వచ్చి పలురంగుల వస్త్రాలను , ఆభరణాలను బలరామకృష్ణులకు సమర్పించాడు. సంతుష్టుడైన శ్రీకృష్ణుడు కరుణ తో
అతనికి ఐశ్వర్యాదులను అనుగ్రహించి ,సారూప్యాన్ని , సంపత్తి ని ప్రసాదించాడు.
(1264).
------------- ఐదవ భాగం త్వరలో.
*****************************************************