Wednesday, 29 June 2016

శతకసౌరభాలు -9 కాసుల పురుషోత్తమ కవి- ఆంథ్రనాయక శతకము- 3

శతకసౌరభాలు -9


కాసుల పురుషోత్తమ కవి
   

  ఆంథ్రనాయక శతకము- 3
      
                             

                                     శ్రీకాకుళాంథ్ర నాయకుడే ఆంథ్ర మహావిష్ణువు . ఇతడే ప్రథమాంథ్ర చక్రవర్తి గా ప్రఖ్యాతి గాంచిన చారిత్రక పురుషుడు. నిశుంభుడనే లోకకంటకుని తన బల పరాక్రమాలతో హతమార్చి, ఆంథ్రజాతికి ఆరాధనీయుడయ్యాడు.  ఈ మహా వీరుడు మరణించగానే ప్రజలు ఆయనను  దైవంగా భావించి,   ఆగమ శాస్త్ర ప్రకారం ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించడం మొదలు పెట్టారు.   ఇలా పూజించబడే అవతారాల్నే     అర్చావతారాలంటారు. ఇట్టి అర్చావతార నామాలు కూడ విష్ణు నామాలతో అభేదంగా ఉంటాయి.  విష్ణు సహస్ర నామం లో ఆంధ్ర నిషూదనుడని (88 వ శ్లో), శ్రీ విష్ణోరష్టోత్తర శత దివ్యదేశ స్తోత్రం లో  కాకుళేత్వాంధ్ర నాయకమ్ ( స్తోత్రరత్నాకరం-29 వ పే )     అని కన్పిస్తోంది.
           

                     పాశ్చాత్య చరిత్ర కారుడు    ప్రొ. విల్సన్ శ్రీకాకుళం లో పూజించబడే విష్ణువు ఆంధ్ర మథుసూదనుడనే  పేరు గల సుప్రసిద్ధాంధ్ర చక్రవర్తి తో అభిన్నుడని పేర్కొన్నాడు.( A Short History Of   Sree Kakuleswara Swamy Temple –pp. 6)


                          చెల్లింపఁ దగునె వ్రేపల్లెలోఁ గల వెఱ్ఱి
గొల్లయిల్లాండ్రను గొల్లగొనఁగ?

మెక్కంగఁ దగునె ము న్పెక్కిండ్లలో నుట్ల
కెక్కి పాల్వెన్నలు డొక్క నిండ?

మ్రుచ్చిలఁ దగునె మళ్ళుచ్చి జలక మ్మాడు
మచ్చెకంటుల కోక లిచ్చకముగ?

మ్రొక్కంగఁ దగునె ముం దొక్కపువ్వునకుఁ దాఁ
గక్కసించినయాలి కక్కజముగ

నిట్టీ నగుబాటుపనులు నీ వెన్ని కలుగఁ
జేసినాఁడవు మంచిప్రసిద్ధకుఁడవె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ! 17

                                            
                               శ్రీకాకుళాంథ్రదేవా ! రేపల్లెలో అమాయకులైన గొల్ల వనితలను లొంగదీసుకున్నావన్న అపప్రథ ను ఏ విథంగా సమర్థించుకుంటావయ్యా స్వామీ ? పరాయివాళ్ల ఇళ్ళ ల్లో దూరి దొంగచాటుగా ఉట్లలోని  పాలు వెన్నలను దొంగిలించడం ఎంతవరకు న్యాయమంటావు ? బట్టలను గట్టు మీద పెట్టుకొని కొలను లో స్నానమాడుతున్న ఆడవారి బట్టలను ఎత్తుకెళ్ళడం ఎంతవరకు సబబు ? పారిజాత పుష్పం కోసం అలిగి పడుకున్న ఇల్లాలి పాదాలకు నమస్కరించడం మర్యాదైన పనేనా ? ఇటువంటి నగుబాటు పనులు  ఎన్నెన్నో చేశావు. అవునులే ! మంచి పేరు, ప్రసిద్ధి ఉన్నవాడవు కదా నీవు.
                                            

                               అబ్బుకో గలవొ కాయక్లేశ మొనరించుఁ
దేవాసురు లటుండ దివ్యరమను

దోచుకోఁ గలవొ చే సాచి లోకము లాచి
బలిమహాదాత వైభవము లెల్ల

రాఁ దీయఁగలవొ సత్రాజిత్తుఁ డీకున్న
మణిశమంతక మొక మమతఁ గొల్పి

నాటించఁ గలవొ సన్న కసన్ననె వనంబు
పెట్టు మ్రాన్పెకలించి పెరటిలోనఁ

దెచ్చుకొన వేమి వస్త్రాన్నదీపధూప
గంధ తాంబూలములకైన గడన దెలిసె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!   18

                                ఆంథ్రదేవా ? ఆనాడు దేవదానవులు కష్టపడి పాలసముద్రాన్ని మధించక పోతే  నీవు లక్ష్మీదేవి ని పొందగలిగేవడివేనా ? దేహీ యని చేయి చాచి బలిచక్రవర్తి ని  యాచించక పోతే  భూమ్యాకాశాలను ఆక్రమించే అవకాశం నీకుండేదా స్వామీ ? సత్రాజిత్తు  ప్రేమతో సత్యభామ తో పాటు శ్యమంతకమణిని ఇవ్వకపోతే నీవు దానిని పొందగలిగే వాడివేనా ? ఆనాడు ఇంద్రుడు ఇవ్వకపోతే నందనవనం లో ఉండవలసిన పారిజాత వృక్షాన్ని నీ పెరటిలో నాటించుకొన గలిగేవాడివా ప్రభూ ! ఇవన్నీ ఎవరెవరినో అడిగి తెచ్చుకొన్నవే కదా !  వీని వల్లే నీ సంపాదనా సామర్ధ్యం  తెలుస్తోంది. మరి ఇప్పుడు నీకు కావలసిన వస్త్ర, అన్న , దీప ,ధూప ,గంధ ,తాంబూలాల నిమిత్తం సంపాదించి తెచ్చుకో స్వామీ. .
                    

                                             తలను బించెపుదండ ధరియించవలె గాని
మణికిరీటము బెట్ట మనుజపతివె?

గళమున వనమాలికలు పూనవలెఁ గాని
హారము న్వేయ దేశాధిపతివె?

కరమున మురళి చక్కఁగఁ బూనవలెఁ గాని
శాతాసిఁ బూనంగ క్షత్రియుఁడవె?

తనువు గోక్షీరవాసన గుప్పవలెఁ గాని
చందనం బలఁద రాజవె తలంప?

నెల్లలోక మెఱింగిన గొల్లవాఁడ
వేది కుల మింత రాజస మేమి నీకు
చిత్ర చిత్ర ప్రభావ !దాక్షిణ్యభావ!
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!  19


                                        ఆంథ్రదేవా !   నీవు తలపైన నెమలిపింఛాన్ని ధరించాలి కాని మణిమయకిరీటాన్ని ధరించడానికి నీవేమైనా మహారాజువా ఏమిటి ? మెడలో పూలమాలలు థరించాలి గాని దేశాధిపతి వలే హారాలు ధరించావేమిటి ? చేతిలో అందంగా పిల్లనగ్రోవిని పట్టవలసినవాడివి క్షత్రియ వీరుని వలే ఖడ్గాన్ని పట్టావేమిటి ? గొల్లవాడవైన నీశరీరం  ఆవుపాల వాసన రావాలి కాని మహారాజు వలే మంచిగంధపు వాసన వస్తోందేమిటి ? లోకాలకంతటికీ తెలిసిన గొల్లవాడివి నీవు. నీకులమేమిటి ?ఈ రాజస ప్రవృత్తి ఏమిటి ?  చిత్ర చిత్ర ప్రభావాలు కల్గిన వాడివి కదా !  శ్రీకాకుళ నివాసా !.
                                                 

కన్నవారల మున్ను గారాగృహంబున
విడిచి పాఱితివి నీ కడిమి యేమి?

పగవాఁడు పురిటిలోఁ బట్టి నెత్తుకపోవఁ
దమకించుచున్న నీ ధైర్య మేమి?

ముద్దుమన్మని గోప్యముగ నొండు బంధింపఁ
                   దెలియన ట్లున్న నీ తెగువ యేమి?

వైరిధాటికి నోడి వనధి మధ్యమునందు
                        నిలు గట్టుకొన్న నీ బలిమి యేమి?

విఱిగి తిరి గెన్నఁడెన్నఁడో తఱి యెఱింగి
        యొరుల నడఁచితి వది యేమి భరము నీకు?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
                హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!    20


                          శ్రీకాకుళాంథ్రదేవా!   ఆనాడు అమ్మా నాన్నల్ని  చెఱసాల లో వదిలేసి పాఱిపోయిన నీ పరాక్రమాన్ని గూర్చి ఏమని చెప్పుకోవాలి.  శంబరాసురుడనే రాక్షసుడు  పురిటికందయిన నీకుమారుడు ప్రద్యుమ్నుని ఎత్తుకుపోయినపుడు నీవు చూపించిన తెగువ ఎంత గొప్పదో కదా. ముద్దుల మనుమడైన అనిరుద్ధుని బాణాసురుడు  బంధించినప్పుడు ఏమీ జరగనట్టున్న నీ ధైర్యం ఏమిటి. జరాసంధుని దాడికి తట్టుకోలేక మధుర ను విడిచి పారిపోయి సముద్రం మధ్య లో ఇల్లు కట్టుకున్న అబ్బో నీ బలాన్ని గూర్చి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది కదా ! తప్పించుకొని తిరిగి తిరిగి ఎప్పుడో సమయం  దొరికినపుడు శతృవులను సంహరించెడి  నీ పరాక్రమము ఏమి పరాక్రమమయ్యా ! నీ లీలలన్నీ చిత్ర విచిత్రాలే కదయ్యా స్వామీఏమో గాని ముందు ఈ శతృవులను సంహరించి మమ్మల్ని రక్షించు.


                          
                                                       ఆంధ్రమహావిష్ణువు


                                      భిల్లాంగనాదంతపీడిత ఫలభుక్తి
                                           హేయంబు దోఁచలే దింత నీకు
                                 
                                              సంక్రందనాత్మజ స్యందన సారథ్య
                                                  మెరుసుగాఁ దోఁచలే దింత నీకు
                                        
                                                        గోపాలకానేక గోవత్సపాలనం
                                                        బెగ్గుగాఁ దోఁచలే దింత నీకు
                                          

                                                  వ్రజబాలికా ముక్తవస్త్రాపహరణము
హీనమై తోఁచలే దింత నీకు

నుచ్చనీచంబు లెఱుఁగక యిచ్చఁ జేయు
చేష్ట లివి భక్తహితమతిఁ జేసి తండ్రు
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
                          హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!                   21

                      శ్రీకాకుళాంథ్ర దేవా ! ఆనాడు   శబరి కాంత కొఱికి  ఇచ్చిన ఎంగిలి పండ్లు తినేటప్పుడు అది నీకు హేయంగా అనిపించలేదు. అర్జునుని రధానికి సారథ్యం వహించేటప్పుడు కూడా  అది నీకు చిన్నతనం గా అన్పించలేదు. ఆవులను తోలుకంటూ అడవుల్లో తిరగడము నీకు సిగ్గుగా అనిపించలేదు. గోపకాంతలు విడిచి ఒడ్డున పెట్టుకున్న బట్టలను ఎత్తుకెళ్ళడమూ హీనమైన చర్య గా నీకు అనిపించలేదు.ఉచ్ఛ నీచాలు పాటించకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసే ఈ పనులు ఏమన్నా బాగున్నాయా ? ఏమన్నా అంటే నీవు ఇవన్నీ భక్తుల మేలు కోరి చేశావని కొందరు సమర్ధిస్తున్నారు.
ఏమిటయ్యా? నీ చేష్టలు చిత్రవిచిత్రంగా ఉంటాయి కదయ్యా  !




                                 విమత భూపతు లెట్లు విముఖులై పాఱిరో
రాజపీఠం బెక్కరాని నీకు

కుంభినీధవు లెట్లు కూఁతుండ్ర నిచ్చిరో
కుల మొల్లకయె నీకు గోపకునకు

సుందరీమణు లెట్లు చూచి మోహించిరో
క ప్పగు మైచాయ గలుగునీకు

దాసజనం బెట్లు దాస్యంబు సలిపిరో
తిరియువానిని మారు తిరియు నీకు


మమత నీ లీల లటు సూచి బ్రమసి రేమె
తగుదువే యిట్టి ఘనతకు దంభ భూప
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!   22

                         ఆంథ్రమహావిష్ణూ! లీలానాటక సూత్రధారీ ! క్షత్రియుడవు కాని నిన్ను చూసి శత్రురాజులు వెన్నుచూపి ఎలా పారిపోయారో కదాఆవులను కాచుకొనే నీకు రాజులు తమ కుమార్తెలనిచ్చి ఎలా వివాహం చేశారయ్యా? నల్లని రూపం గలిగిన నిన్ను  చూచి సుందరీమణులు లా మోహించారయ్యా మహానుభావా? యాచించి జీవించే వారినే యాచించి జీవించే నీకు భక్తజనులు ఏ విధంగా సేవ చేశారో అర్ధం కావడం లేదు. బహూశా నీ మీద ప్రేమతో నీ లీలలను చూసి మోసపోయి ఉంటారు కాని నిజంగా ఆలోచిస్తే నీవు ఇటువంటి మర్యాదలకు అర్హుడవు కాదు గదా !.

                            ఈ పద్యం లో    తిరియువానిని మారు తిరియు నీకుఅనే విశేషణం ఒక ప్రత్యేక విశేషం గానే కన్పిస్తోంది. అడుక్కు తినే వాడిని గీక్కుతినే వాడొకడు అని తెలుగులో ఒక సామెత ఉంది. పురుషోత్తమ కవి ఇక్కడ సాధారణ ధోరణి లో వ్యాజస్తుతి గానే ఈ ప్రయోగం చేశాడని భావిద్దాం.  నీ ఆలయ నిర్వహణ కు, ధూప,దీప, నైవేద్యాల కోసం మేమే అక్కడక్కడా అడుక్కొచ్చి నీకు పెడుతుంటే తిని కూర్చుంటున్న నీవు అడుక్కుతినేవాడి దగ్గర లాక్కు తినేవాడివే కదా కవి భావన.

                              కాని కొంచె లోతుకు వెడితే-   శంకరుడు శ్రీమహావిష్ణువు ను మనసులో నిలుపుకొని ధ్యానిస్తూ ఉంటాడని , అలాగే శ్రీమహావిష్ణువు  మహాదేవుని పూజిస్తాడని శివకేశవాభేదాన్ని పాటించేవారు  చెపుతూ ఉంటారు.  శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవేఅని కదా ప్రార్ధిస్తూ ఉంటారు.  కాబట్టి దీన్ని మనసు లో పెట్టుకొని పురుషోత్తమ కవి  అడుక్కునే వాణ్ణే అడుక్కునే వాడవు నీవు అని ఆంథ్రమహావిష్ణువు ను నిందాస్తుతి లో ఆరాథించాడని భావిస్తే   బాగుంటుదేమో.
                          
                        అంతే కాదు. ఈ శ్రీకాకుళ క్షేత్రానికి మల్లిఖార్జునుడు క్షేత్రపాలకుడు. ఈయననే ఏకరాత్రి ప్రసన్న మల్లిఖార్జున స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయం ఆంథ్రనాయకస్వామి ఆలయానికి ప్రక్కనే ఉంటుంది.
               
                     
                           ఈ స్వామి  ఒక్కరాత్రి భక్తితో తన్నుపాశించిన వారికి ప్రసన్నుడై  వారి కోర్కెలు తీరుస్తాడని, అందువల్లనే ఏకరాత్రి ప్రసన్న మల్లిఖార్జునుడని   పేరు వచ్చిందని చెపుతారు. క్షేత్రపాలకుడైన ఆదిభిక్షువు రక్షణ లో నీవున్నావని చెప్పడానికే  పురుషోత్తమ కవి   తివియు వానిని మారు తివియు నీకు అని ఉంటాడు ఆంథ్రనాయకుణ్ణి.


                                                        
                                                            కుడ్యస్ధిత  హనుమానుడు



                                              విక్రమాక్రమిత భూచక్రుఁ డౌ హేమాక్షు
పొంగణంచుటలు కోణంగితనము

కరగతామృతకుంభ గర్వితాసురకోటిఁ
దూలఁగొట్టుటలు గయ్యాళితనము

కుచపూర్ణ విషదుగ్ధకుటిల యౌ పూతన
పేరు మాయించుట పిల్లతనము

కంసపురీ ద్వారగమనావరోధి యౌ
మదకరి నీడ్చుట మకురుతనము

వడిగలతనంబులా యివి? గడన యేమి
కొద్దిపను లివి నీ కిది పెద్దతనమె?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
                                హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!                       23

                   ఆంథ్రదేవా !    భూమిని చాపచుట్ట గా చుట్టి సముద్రం లో పారవేసిన హిరణ్యాక్షుని  అహంకారాన్ని నీవు వరాహరూపం తో అణచి వేసి, అతనిని సంహరించిన కార్యం  పెద్ద గొప్పదేమీ కాదు. అమృతభాండము అసురుల పాలు కాకుండా మోహినీ రూపధారివై రాక్షసులనందరినీ పారద్రోలుట నీ గయ్యాళి తనానికి ప్రతీక. కుచముల నిండా విషాన్ని నింపుకొని,చిన్నతనం లో నిన్ను చంపడానికి  వచ్చిన పూతన ను  సంహరించుట పిల్లచేష్ట కదా? కంస పురి యైన మధురా నగరం లోకి నిన్ను రానీయకుండా అడ్డుకుంటున్న మదపు టేనుగు ను సంహరించడం  మొండితనమే కదా.  ఇవన్నీ నీకు చాలా చిన్నపనులు .  ఇవేవీ  కూడ నీవు చేసిన గొప్పపనులని నేను భావించడం లేదు.




కెరలి కంసుఁడు నిన్ను నఱకఁ గాచినవాని
బారి సోదరిఁ ద్రోచి పాఱినావు

సరిపోర నరకు నొంచఁగ లేక చేతివి
ల్లాలిచే నిడి దండ నలరినావు

తెగడి బంధువు లాజిఁ దిట్టి కొట్టఁగ నోర్చి
వైదర్భిఁ జేపట్టి వచ్చినావు

దర్పకోద్ధతి కెంతొ తత్తరపడి నిజ
స్త్రీ పదాబ్జములఁ జే మోపినావు

నీ పరాక్రమ మిట్టిది నిఖిలజగము
లాజ్ఞ మీఱక నిల్చుట యద్భుతంబు
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ!
                       హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ !           24


                              ఆంథ్రదేవా ! ఆనాడు నీవు ఎప్పుడు పుడతావా చంపుదామని కాసుక్కూర్చున్న కంసుని హింసను ముందుగానే గుర్తించి, నీవు తప్పుకొని నీ సోదరియైన యోగమాయను  ముందుకు  నెట్టి నీవు పారిపోయావు. యుద్ధం లో నరకాసురునితో తలపడి పోరాడలేక విల్లును ఇల్లాలైన సత్యభామ కు ఇచ్చి, నీవు చేష్టలుడిగి  ఉండిపోయావు.  రుక్మణీదేవిని చేపట్టే సమయం లో కూడ  ఆమె బంధువు లందరూ వెంటబడి తిట్టి తరిమికొట్టినా సహించావు.  మన్మధ తాపాన్ని తాళలేక   అనుగ్రహించమని భార్య పాదాలను పట్టుకున్నావు.  ఇదీ నీ పరాక్రమం . మరి  ఈ లోకమంతా ఇటువంటి  నీ ఆజ్ఞ కు లోబడి ఉంటోందంటే చాలా విచిత్రం గా ఉంది కదా !




వ్రేపల్లెలో గొల్లవెలఁదులు గొట్ట రా
దొడిదొడి యిల్లిల్లుఁ దూఱలేదొ

రాసకేళికయందు రమణులా యెందఱో
చుట్టి పట్టినఁ బాఱఁ జూడలేదొ

పదియాఱు వేల గోపకుమారికలు తేరి
పాఱఁ జూచిన మతి బ్రమయలేదొ

ప్రణయవాదంబున భార్య లా యెనమండ్రు
గసరివేసినఁ గూర్మిఁ గొసరలేదొ

తలిరుబోఁ డుల యెదుటఁ దత్తరము గలుగ
నీవు పరరాజముఖమున నిలువ గలవె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ!
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!   25

                              శ్రీకాకుళాంథ్రదేవా ! ఆనాడు రేపల్లె లో నీవు చేసే అల్లరిపనులకు తాళలేక గోపవనితలు నిన్ను కొట్టడానికి వెంటపడగా యిల్లిల్లు దూరి దాక్కున్నసంగతి మాకు తెలియదనుకున్నావా ? రాసక్రీడ లో ఎందరో స్త్రీలు నిన్ను చుట్టుముట్టి బంధించగా తప్పించుకోవడానికి  నీవు ప్రయత్నించలేదా ? పదహాఱువేలమంది గోపభామినులు నిన్ను తేఱిపాఱ చూడగా నీ మనసు గతి తప్పలేదో ?  నీ ఎనిమిది మంది భార్యలు ప్రణయకలహం లో నిన్ను కసరుకుంటుంటే వారి ప్రేమకోసం నీవు వారిని  కొసరి కొసరి వేడుకున్నమాట నిజంకాదా?  ఈ విధం గా ఆడవారిముందే నిలువలేక కంగారుపడిన నీవు  శత్రురాజుల ముందు నిలబడగలవా ? ఏమో నాకు అనుమానమే   సుమా !.
                                                             

                                                                                     నాల్గవ భాగం  త్వరలో  ----------


***********************************************



                              



Tuesday, 21 June 2016

శతకసౌరభాలు -9 కాసుల పురుషోత్తమ కవి- ఆంథ్రనాయక శతకము- 2

శతకసౌరభాలు -9


కాసుల పురుషోత్తమ కవి
                      శ్రీకాకుళ
    ఆంథ్రనాయక శతకము- 2


                                         

                                             ఆంథ్రమహావిష్ణుని దివ్యమంగళ రూపము




                                       

                                                వరమిచ్చినట్టి శంకరుని కెగ్గు దలంచు
                      భస్మాసురుని పేరుఁ బాపినావు ,

తనయిల్లుఁ గాచు నుగ్రుని బోరుటకుఁ బిల్చు
            బాణుచేతులు తెగఁ బఱికినావు ,

తొలుమిన్కు లజుని మ్రుచ్చిలి గొన్న సోమకుఁ
 జంపి విద్యలు ధాత కంపినావు,

బలిమి దైత్యులు సుధాకలశము న్గొన వారి
 వంచించి సురలకుఁ బంచినావు ,

 నిఖిల దైవత కార్యముల్‌ నిర్వహించు
నీకు నిజకార్యము భరంబె నిర్వహింప!
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
                          హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!             (8)
                                
                                       శ్రీ కాకుళాంథ్రదేవా !  తనకు వరమిచ్చినటువంటి శంకరునికే హాని తలబెట్ట యత్నించిన భస్మాసురుని  నాశనం చేశావు. తన ఇంటికే కాపలా ఉంచుకున్న శివుని పై యుద్ధానికి  పూనుకున్న బాణాసురుని   చేతులను  తెగ నరికిన వీరుడవు కదా నీవు. వేదాలను అపహరించిన సోమకాసురుని చంపి  వేదాలను తిరిగి బ్రహ్మదేవుని కప్పగించావు.  అమృత కలశాన్ని ఎత్తుకు పోదామని చూసిన రాక్షసులను మోసపుచ్చి, అమృతాన్ని దేవతలకు  పంచిన జగన్మోహినివి  నీవే కదా!   సమస్తమైన దైవ కార్యాలను నిర్వహించే నీకు నీ స్వంత పనులు చేసుకోవడం భారమా ఏమిటి స్వామీ ! చిత్ర విచిత్రమైన ప్రభావములు కలవాడా !   శతృమూకలను చెండాడి, మమ్మల్ని రక్షించు స్వామీ.!

   
                                            
                                                      అచట లేవని కదా యరచేతఁ జఱచెఁ గ్రు
                                      ద్ధత సభా స్తంభంబు దానవేంద్రుఁ

డచట లేవని కదా యస్త్ర రాజం బేసె
                                              గురుసుతుం డుత్తరోదరమునందు

నచట లే వని కదా యతి కోపి ననిచెఁ
                                                 బాండవు లున్నవనికిఁ గౌరవకులేంద్రుఁ

డచట లే వని కదా యాత్మీయసభను ద్రౌ
                           పది వల్వ లూడ్చె సర్పధ్వజుండు 

లేక యచ్చోటులను గల్గలేదె ముందు
కలవు కేవల మిచ్చోటఁ గల్గు టరుదె
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
                                              హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!                                        (9)
                                        

                                   ఆంథ్రదేవా! నీవు అక్కడ లేవని భావించి కదా   ఆనాడు ఆ దానవేంద్రుడైన హిరణ్య కశిపుడు కోపంతో స్థంభాన్ని బ్రద్దల కొట్టింది. నీవక్కడ లేవని కదా అశ్వత్థామ  ఆనాడు ఉత్తరాగర్భం పై పాశుపతాన్ని ప్రయోగించింది. నీవక్కడ లేవనే కదా  దుర్యోధనుడు దుర్వాసుని రెచ్చగొట్టి పాండవుల చెంతకు పంపించింది.దేవా? నీవక్కడ లేవనే కదా ఆనాడు నిండు సభ లో ద్రౌపదీవస్త్రాపహరణానికి పూనుకున్నాడు దుశ్శాసనుడు. స్వామీ! ఆయా సమయాల్లో నీవు అక్కడ లేకుండానే అక్కడ ప్రత్యక్షమయ్యావు కదా! మరి ఇక్కడ ఉండి కూడ నీవు ప్రత్యక్షమవడం లో విశేషమేముంది. కావున నీవు ప్రత్యక్షమై ఈ శతృమూకలను చెండాడి, నీవు లేవనే వారికి కనువిప్పు కల్గించి మమ్మల్ని రక్షించు ప్రభూ!

అంచితాఖండదీపారాధనలచేత
      దీపించు నెప్పుడు దేవళంబు ,
                                                          

                                                     అగరుసాంబ్రాణి ధూపార్పణంబులచేత                                              భవనం బ దెప్పుడుఁ బరిమళించు ,  

నతినృత్యగీత వాద్యస్వనంబులచేత
                            నెప్పుడుఁ గోవెల యెసక మెసఁగు

 నఖిలోపచార సమర్పణంబులచేత
 మెఱయు నెప్పుడుఁ దిరుమేను కళల ,

నిపు డొకించుక లోభిత్వ మెనసి నట్లు
దోఁచుచున్నాఁడ విట్టియద్భుతము గలదె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ  !
                                              హత విమతజీవ  !శ్రీకాకుళాంధ్రదేవ!                                   ( 10)
                                     

   శ్రీకాకుళాంథ్రదేవా ! నీ ఆలయం ఎప్పుడు  అఖండ దీపారాధన తో విరాజిల్లుతుంది. స్వామీ ? ఎప్పుడు నీ ఆలయం అగరు సాంబ్రాణి ధూప పరిమళాలతో పరిమళిస్తుంది తండ్రీ ? నృత్య గీత వాద్య విశేష ధ్వనులతో  నీ ఆలయం  ఏనాడు కళకళ లాడుతుంది స్వామీ ? షోడశోపచార సమర్పణ తో పవిత్రమైన నీ రూపము ఏనాడు ప్రకాశిస్తుంది స్వామీ ? ఎన్నెన్నో భోగాలను అనుభవించిన నీవు ఇప్పుడేదో పిసినారి తనం  పోతున్నట్టు గా కన్పిస్తున్నావు. నిజం గా ఇది ఆశ్చర్యం కల్గించే విషయమే. ఈ నాటకాలు మాని పూర్వవైభవం తో కూడిన నీ దేవళం లో మాకు కనుల పండువు గా నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు  స్వామీ !                                   
                                        


                                             భక్తి జేసిన శిలాప్రతిమ మాత్రమె  కాని
                                                              హరి యిందు గలుగునా యనెడి వారు
                                     
                                                     స్వామి యిందుండిన సత్యంబు జూపక
               యుండునే యని పల్కుచుండువారు

బుద్దావతారంబు బూనినాడఖిలంబుఁ
                గని కననట్లుండు ననెడువారు

 దేవతామహిమంబు దెలియునో యేమేని
                            నడువనున్నదో యని నుడువు వారు

నీకు నిత్యోపచారముల్ లేకయున్న
లోకులిట్లాడుకొండ్రు పరాకిదేమి
 చిత్రచిత్రప్రభావ ! దాక్షిణ్యభావ!
హతవిమతజీవ ! శ్రీకాకుళాంథ్రదేవ !    11

                                
                              శ్రీకాకుళాంథ్రదేవా! ఈ లోకం లోని జనులందరూ కూడ నిత్యార్చనలు జరగవలసిన నీ ఆలయం లో అవి జరక్కపోవడం చూసి  నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. భక్తి తో ఏర్పాటు చేసిన శిలా ప్రతిమ మాత్రమే కాని ఇందులో హరి ఎందుకుంటాడు అంటున్నారు కొందరు. దీనిలో నిజం గా దేవుడుంటే తన మహత్మ్యాన్ని చూపకుండా ఉంటారా అనే వారు కొందరు , స్వామి బుద్దావతారాన్ని దల్చాడు .లేకపోతే చూసీ చూడనట్లు ఎందుకుంటాడనే వారు కొందరు, దేవతామహిమ లు ఎవరికి తెలుసు .ముందు ముందు ఏమి జరుగపోతోందో ననే వారు కొందరు,  ఇట్లా ఎవరి కిష్టమొచ్చినట్లు వారు మాట్లాడు కుంటున్నారు. ఇంకా పరాకెందుకు ? నీ మహిమను చూపి , వారందరి అనుమానాలను పటాపంచలు చేయవయ్యా స్వామీ !


                                      ధర నూటయెనిమిది తిరుపతులందు శ్రీ
     కాకుళం బరయఁ బ్రఖ్యాతమేని,

యాంధ్రనాయకుఁడ వం చఖిలదేశంబుల
                        నిన్నుఁ గీర్తించుటే నిజమయేని

వైఖానసోక్తికి వంచన రాకుండ
                           నెరలు చూపినమాట నిజమయేని

వైకుంఠుఁడవు స్వయంవ్యక్తిగా మర్చావ
 తార మొందినమాట తథ్యమేని

 వివిధ పూజోత్సవములు నిర్విఘ్నములుగఁ
                                                     జేసికొనకున్న నీకుఁ బ్రసిద్ధి గలదె
                                                       చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
                                                        హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!        12
                       

                         ఆంథ్రదేవా ! ఈ భూమి మీద ఉన్న నూటయెనిమిది తిరుపతులలో శ్రీకాకుళము పరమపావనమైన దైతే,సమస్తదేశముల వారు ఆంథ్రనాయకుడవని నిన్ను కీర్తించడం నిజమే ఐతే , అర్చకస్వామి మాట అబద్దం కాకూడదని నీ తలపై శిరోజాలను చూపించిన మాట సత్యమైతే, వైకుంఠవాసుడవైన నీవు,   నీకు నీవు గా స్వయంవ్యక్తుడవై అర్చామూర్తి గా వెలసిన మాట నిజమైతే, వివిధ ఉత్సవాలను, నిత్యపూజలను  నిర్విఘ్నం గా నిర్వర్తించు కోలేకపోతే నీ ప్రసిద్ది కి భంగమేర్పడుతుంది కదా స్వామీ ! నీకీర్తికి భంగం కలగడం నీభక్తులమైన మాకు మాత్రం ఆనందమా స్వామీ ! నీ మహిమను ప్రదర్శించి నిత్యపూజలు యథావిధి గా జరిపించుకో స్వామీ !!
                              
                 స్వామి శిరోజాల వృత్తాంతం ఇంతకు ముందే ప్రస్తావన కొచ్చింది.   మళ్లీ     తెలుసుకోవాలనుకునేవారు divyakshetralu.blogspot.com ’ లోకి వెళ్లి,                                        శ్రీకాకుళాంథ్ర మహావిష్ణువు దర్శనమ్’   అనే వ్యాసాన్ని చూడండి.

                                     
                                       
                                       అనంతామాత్యుడు నిర్మించినట్లుగా చెపుతున్న
                                                     శ్రీకాకుళ రాజగోపురము





                                       మానితంబుగ గరుత్మద్ధ్వజారోహణం
బెప్పుడొనర్తువో చెప్పుమయ్య!

 గరిమతో నీ తిరుక్కల్యాణసంభ్రమం
బెప్పు డెప్పుడొ వేగ చెప్పు మయ్య

రమతో మహోన్నతరథ మెక్కి తిరువీథు
లెప్పు డేతెంతువో చెప్పు మయ్య!

ధరణి నభ్యాగతదాన ప్రజాబృంద
మెప్పుడు బలియునో చెప్పు మయ్య!

వత్సరోత్సవ వీక్షణవాంఛ జనుల
కెపుడు ఫలియించునో యానతీయు మయ్య!
చిత్ర చిత్ర ప్రభావ !దాక్షిణ్యభావ!
                                    హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!                  13

                      స్వామీ ! స్పష్టంగా చెప్పు. ఎప్పుడు  కళ్యాణోత్సవం లో భాగంగా  నిర్వహించే గరుడ పతాకను ధ్వజస్థంభానికి ఏరోజున ఎగురవేస్తావో చెప్పు. నీ తిరుక్కళ్యాణ మహోత్సవం ఎప్పుడో త్వరగా చెప్పవయ్యా. లక్ష్మీదేవి తో కలిసి  రథం మీద కూర్చొని తిరువీథుల్లో ఎప్పుడు ఊరేగుతావో స్పష్టత నియ్యవయ్యా. నాలుగు దిక్కుల నుండి నీ కొరకు తరలి వచ్చే భక్తుల సంఖ్య ఎప్పుడు వృద్ధి చెందుతుందో చెప్పవయ్యా స్వామీ. ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున జరిగే  నీతిరునాళ్లను చూడాలనే నీ భక్తుల కోరిక ఎప్పటికి తీరుతుందో  సెలవీయవయ్యా స్వామీ !

                      శ్రీకాకుళం తిరునాళ్ళు చాల గొప్పగా జరుతుందనడానికి క్రీడాభి రామం లోని  కొన్నిపద్యాలు ఉదాహరణలు గా లభిస్తున్నాయి. క్రీడాభిరామం 14 వ శతాబ్దం లోని గ్రంధం.
                                   
                                            దవన పున్నమఁ గాకుళాధ్యక్షుఁడైన
                                        తెలుఁగు రాయడు  దేవతాధీశ్వరుండు
                                          భువన హితముగ నుత్సవంబవధరింప
                                          నందుబోయితిమి పోయినట్టి యేఁడు.     క్రీడా. 204 ప
                                                   
                                        కారవేల్లమ తల్లికా కల్పవల్లి
                                      కడుపునిండారఁ గాంచిన కొడుకు గుఱ్ఱ ,
                                        జార చోర మహాధూర్త చక్రవర్తి
                                         దేవ వేశ్యాభుజంగుడు , తెలుగుభర్త.      205 ప

అంటాడు మంచనభట్టు.
            
                      ఈ ఆంథ్ర వల్లభుని చరిత్రనే  వల్లభాభ్యుదయమనే  పేరుతో చంపూ కావ్యం గా భట్లపెనుమర్తి కోదండరామకవి  రచించాడు. బ్రహ్మాండ పురాంణాతర్గత వృత్తాంతాన్ని  ఈ కావ్యం లో ప్రస్తావించాడు.
                       ఈ గ్రంధాన్ని అనుసరించి ఆంథ్రమహావిష్ణువు గంగా తీరం లోని అహిచ్ఛత్రపురం నుండి కృష్ణా తీరానికి వచ్చి నిశుంభుడనే రాక్షసుని సంహరించి , కాకుళ నగరాన్ని రాజథాని గా చేసుకొని చాలకాలం పరిపాలించాడు.ఆంథ్రవిష్ణువు మరణానంతరం ప్రజలు అతనిపై గల భక్తి కొలది అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించసాగారు. కొంతకాలానికి ఈ నగరం , దానితో పాటు విగ్రహం కృష్ణానది వరదల్లో కొట్టుకుపోయాయి. కాలాంతరం లో ఈ వంశానికే చెందిన సుమతి అనే చక్రవర్తి నగరాన్ని పునర్నిర్మించి , విగ్రహాన్ని పున: ప్రతిష్ఠ గావించాడు. మరికొంతకాలానికి కృష్ణానది వరదల్లో మళ్ళీ విగ్రహం కొట్టుకు పోయింది.
                                
            కాలక్రమంలో కంచిపై దండయాత్రకు వెడుతున్న అనంతభూపాలుడు శ్రీకాకుళ ప్రాంతం లో విడిది చేసి, పుర ప్రాకార ఆలయాదుల్ని పునర్నిర్మాణం  కావించాడు. ఆంథ్రనాయకుని విగ్రహం కోసం వెతుకుతుంటే అది వామన శర్మ ఇంటిలోని కాకరపాదు లో లభించింది . దాన్ని అనంతభూపాలుడు పున: ప్రతిష్ఠించాడని కోదండరామకవి  పురాణోచిత కవితా శైలి లో వివరించాడు.  ( కాసుల పురుషోత్తమకవి శతకద్వయ సౌందర్యము . కె.గిరిజాలక్ష్మి,పేజి 58 )
                        
                 అందుకే పైన ఉటంకించిన క్రీడాభిరామ కావ్యం  లో కారవేల్లమ తల్లికా కల్పవల్లి కడుపార గాంచిన కొడుకు కుఱ్ఱ అన్నాడు   కవి వల్లభరాయలు.
                        

                                         తగునట్లు తిరుమేను తా నామతింపుచు
మిన్న పీతాంబరం బున్న దనుచుఁ

గమలతోఁ బుట్టిన కౌస్తుభం బది పోవఁ
దక్కు సొమ్మది నీకు తక్కె ననుచు

లలితరత్న ద్యుతి మొలచినట్లు కిరీట
ముత్తమాంగముఁ బాయ కున్న దనుచు

మండితమాణిక్యకుండలంబులు కర్ణ
యుగళితోఁ బుట్టిన ట్లున్న వనుచు

నిండుకొన్నావు గడియించు నేరుపరివె
ప్రావలువ బ్రారువాణముల్‌ బ్రాఁతి యేమి?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హత విమతజీవ !శ్రీకాకుళాంధ్రదేవ!   14

                                       శ్రీకాకుళాంథ్రదేవా! పవిత్రమైన నీ శరీరాన్ని అలంకరించిన పీతాంబరం అలాగే ఉందిలే అనుకొని, లక్ష్మీదేవి తో పాటు లభించిన కౌస్తుభం పోయినా మిగిలిన హారాలు ఉన్నాయిలే అనుకొని , రత్నకాంతులు వెదజల్లు కిరీటమొకటి తలను వదిలిపెట్టకుండా ఉందిలే అని, మణి మాణిక్యాలతో కూడిన కుండలములు నీ చెవులను  అంటిపెట్టుకొని ఉన్నాయి లే అనుకొని ఆనందిస్తున్నావు కాని  పాతకాలపు నగలు , పాతకాలపు బట్టలను ధరిస్తున్న నీకు  కొత్తవి సంపాదించగల నైపుణ్యం  లేదా ఏమిటి స్వామీ !
                                        
                                             వంచన గాదె దివ్యక్షేత్రపతులలో
మంత్రార్థకృత్యము ల్మాని యున్న?

నపకీర్తిగాదె లోకాలోకములయందు
వత్సరోత్సవములు వదలి యున్న?

నగుబాటు గాదె యన్యమతస్థజనులలో
నిజదాసకోటి మన్నింపకున్నఁ?

బరిపాటి గాదె యల్పజ్ఞానమతులలో
దేవతామహిమంబుఁ దెలుపకున్న?

నేఁటిదా నీ ప్రతిష్ఠ వర్ణించి చూడఁ
బాడి దప్పిన బలునిందపాలు గావె?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!    15
               
                               శ్రీకాకుళాంథ్రదేవా! నీ ఆలయం లో మంత్రబద్ధంగా జరిగే నిత్యపూజలు జరక్కపోతే మిగిలిన పుణ్యక్షేత్రాలలోని దైవముల ముందు నీకు అవమానం కాదా. ప్రతిసంవత్సరము జరిగే  నీ తిరునాళ్లు, బ్రహ్మోత్సవాల వంటివి సక్రమంగా నిర్వహించకపోతే అది జనుల దృష్టి లో చిన్నతనం కాదా? నీ భృత్యులను  నీవు మన్నించక పోతే  అది అన్యమతస్థులైన జనులలో నీ భక్తులకు తలవంపు కాదా.? అవసరమైనప్పుడు నీ మహిమను ప్రదర్శించక పోతే  అల్పజ్ఞాన మతులలో నీవు తేలికై పోయి నీకు అది అవమానం కాదా ? నీ పరువు ప్రతిష్ట లు  ఈనాటివా స్వామీ!  ఆచార వ్యవహారాలు గాడి తప్పితే పలు నిందలపాలు కాక తప్పదు గదా ప్రభూ!



తిరునాళ్ళతఱి వచ్చెఁ బరిపరివిధముల
నెలమి సామగ్రిఁ జేయింప వేమి?

సేవకు లందందు సేవింప భావింప
తిరువీథుల రథంబుఁ ద్రిప్పవేమి?

వృజిన మెల్లఁ దొలంగు నిజ మంచుఁ బ్రజ లెంచు
పరమప్రసాదంబుఁ బంచవేమి?

దివ్య దేశం బిది తీర్థంబు సార్థంబు
చక్రతీర్థము కృప సలుప వేమి?

హఠము గావించి నీ యన్వయంబు లెత్తి
కీర్తి నిందఁగ వర్ణించి గేలిపఱతు
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!  16

                             శ్రీకాకుళాంథ్రదేవా!   తిరునాళ్ల సమయం వచ్చేసింది. అందుకు వలసిన వివిధ సాధన సంపత్తి ని సిద్ధం చేయించవేమిటి. నీ భక్తులు నిన్ను ఆయా కూడలి ప్రదేశాల్లో సేవించడానికి,  ధ్యానించడానికి , అనువుగా  తిరువీధు ల్లో రధాన్ని తిప్పవేమి. మా పాపాలనన్నింటిని తొలగిస్తుందని భావించి మేము సేవించే  పరమ పవిత్రమైన నీ ప్రసాదాన్ని మా అందరికీ పంచిపెట్టవేమిపవిత్ర ప్రదేశమైన ఈ దివ్యదేశము నందున్న చక్రతీర్థమనే కోనేరు ను  పవిత్రీకరించు. ఈ పనులు నీవు చేయకపోతే  నేను నీ ముందు హఠం వేసుకొని కూర్చుని , నీ గొప్పతన మంతటిని నిందారూపం గా  ఎగతాళి చేస్తాను . సిద్ధంగా ఉండు ప్రభూ.  అంటూ సవాలు విసిరాడు కవి.

                కవి తాను వ్యాజస్తుతి శతకాన్ని ఎందుకు చెపుతున్నాడో   ఈ పద్యం లో స్పష్టీకరించాడు. అన్నీ నువ్వు చేసుకో  నువ్వుచేసుకో అంటున్నాడు కవి అదెలా సాథ్యమనేది కొందరికి కలిగే సందేహం. కాని స్వామి తాను చేసుకోవడము అంటే   ఆ పనులు చేసే పుణ్యాత్ముడిని ఎవరినో   ఆ సమయానికి అక్కడికి పంపిస్తాడు. అతని ద్వారా తన పనులను చక్కబెట్టుకుంటాడు. ఇది ఎన్నోసార్లు ఎంతోమంది  భక్తవరుల విషయం లో నిరూపించబడింది. అదే ఇక్కడా జరిగింది. ఈ విధంగా హఠమెత్తిన భక్తకవి ఆంథ్రవాఙ్మయం లో మరొకడు లేడు.
                            దేవుని గుట్టంతా రట్టు చేసిన కవి బట్టుతనం వ్యర్థం కాలేదు. ఆ ప్రాంతాన్ని పాలించే దేవరకోట జమీ పాలకులుఈతని కవిత చే ప్రబోధితులై పూజలు యథావిధి గా జరిపించసాగారు. ఆంథ్రనాయక శతకం శక్తి అటువంటిది.
                               అనంతామాత్యుడు అనే కవి భోజరాజీయం అనే కావ్యం లో తన తాతగారైన  ముమ్మడి తిక్కవిభుడు
                                                  నెమ్మి ప్రత్యక్ష పరమ పదమ్మనంగ
                                                   నొప్పు శ్రీకాకుళంబున కొడయడైన
                                                    ఆంథ్రవల్లభ హరిసేవ నలరుచుండు
          -- వాడని ప్రశంసించాడు.
                                                                             మూడవభాగం త్వరలో -------
*********************************************