శతకసౌరభాలు-7
శేషప్పకవి-నరసింహశతకము -2
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి
ఇలలోన
నే జన్మమెత్తినప్పటి నుండి –బహు గడించితినయ్య పాతకములు
తెలిసిజేసితి కొన్ని,
తెలియఁజాలక చేసి- బాధ నొందితినయ్య పద్మనాభ
అనుభవించెడు నప్పు
డతిప్రయాసంబంచుఁ-బ్రజలు చెప్పగఁ జాల భయముఁగలిగె
నెగిరిపోవుటకునై యే
యుపాయంబైనఁ- జేసిచూతమటన్నఁ జేతకాదు
సూర్యశశి నేత్ర! నీచాటు జొచ్చినాడ-కలుషములు ద్రుంచి నన్నేలు
కష్టమనక
భూషణవికాస శ్రీధర్మపుర
నివాస! –దుష్టసంహార
!నరసింహ!
దురితదూర! (24)
వివిధములైన ఆభరణముల చే ప్రకాశించెడి శ్రీ ధర్మపుర నివాసా! మా పాపాలను దూరం చేసి, దుష్టులను శిక్షించే ఓ నారసింహా! ఈ భూమి మీద పడినప్పటినుండి నేను
చాలా సంపాదించానయ్యా పాపాలను. తెలిసి కొన్ని , తెలియక కొన్ని పాపాలను చేసి చాల
వేదన పొందుతున్నాను. చేసిన పాపాలకు పై లోకం లో శిక్ష లనుభవించేటప్పుడు అవి
దుస్సహాలని ప్రజలు చెప్పుకొంటుంటే విని భయమేస్తోంది. తప్పించుకొని దూరంగా ఎగిరిపోవడానికి
ఏదైనా ఉపాయం ఉందా అంటే అదేమీ కన్పించడం లేదు. సూర్య చంద్రులు నేత్రములుగా గల ఓ పద్మనాభా!నీవే దిక్కని
నీ మాటుకు చేరాను. కష్టమనుకోకుండా నా పాపాలను
పోగొట్టి నన్ను కాపాడు దేవా!నారసింహా!
అడవి పక్షుల కెవ్వడాహార మిచ్చెను- మృగజాతి కెవ్వడు మేత
పెట్టె
వనచరాదులకు భోజనమెవ్వ
డిప్పించెఁ-జెట్ల కెవ్వడు నీరు చేఁదిపోసె
స్త్రీల గర్భంబున
శిశువు నెవ్వడు పెంచె- ఫణుల కెవ్వడు పోసె బఁరగ పాలు
మధుపాళి కెవ్వడు
మకరంద మొనరించె- పసుల కెవ్వఁ డొసగెఁ బచ్చిపూరి
జీవకోట్లను బోషింప
నీవెకాని - వేఱె యొక దాత లేఁడయ్య వెదకి చూడ
భూషణవికాస శ్రీ ధర్మపుర
నివాస –దుష్టసంహార నరసింహ దురితదూర. (26)
స్వామీ!నారసింహా ! ఈ ఙీవరాశులను పోషించడానికి నీవే కాని ఎంత
వెదకినా ఇంకొక దాత కన్పడడు. ఈ కడుపు
నింపుకోవడానికి ఎవరెవరినో దేవురించడం ఎందుకు..అడవిలో పక్షులకు ఎవడు ఆహారం వేస్తున్నాడో ,మృగాలకు ఎవడు మేత పెడుతున్నాడో, వనచరులకెవ్వడు
భోజనమందిస్తున్నాడో, చెట్లకెవ్వడు నీరు తోడి పోస్త్తున్నాడో,తుమ్మెదల కెవ్వడు
మకరందాన్ని అందిస్తున్నాడో,పశువుల కెవ్వడు పచ్చికను మొలిపిస్తున్నాడో ఆ దేవదేవుడే
నన్ను కూడ ఆదుకుంటాడనే నమ్మకం నాది. అటువంటి పరమాత్మను నిన్ను విడిచి భుక్తి కై
నేను ఇతరులను ప్రార్ధించను నారసింహా ప్రభూ!
పుట్టించినవాడు పోషించక మానడు గదా.
నారుపోసినవాడే నీరు పోస్తాడు. అని
సామెత. ఈ జన్మ నిచ్చిన ప్రభువువు నీవై
ఉండగా బ్రతకడానికి పలు మార్గాలు గా పలువురిని యాచించడం ఎందుకు. నిన్ను నమ్మిన
నన్ను పోషించే భారం నీది కాదా. అని కవి తాను నమ్మిన తన దైవాన్ని విశ్వాసం తో నిలేస్తున్నాడు. ఆకలేసిన బిడ్డ అమ్మానాన్నలను అడగుతాడు కాని
ఎదురింటి వాళ్ళను అడగడు కదా అంటాడు ఒక భక్తకవి.
పచ్చి
చర్మపుఁదిత్తి పసలేదు దేహంబు-లోపల నంత రోయరోత
నరముల శల్యముల్ నవరంధ్రములు రక్త- మాంసముల్ కండలు మైలతిత్తి
బలువైన యెండవానల కోర్వదెంతైనఁ-దాళలే దాకలి దాహములకు
సకల రోగములకు సంస్ధానమయియుండు- నిలువ దస్థిరమైన నీటిబుగ్గ
బొందిలో నుండి ప్రాణముల్ పోయినంతఁ –
కాటికే గాని కొఱగాడు గవ్వకైన
భూషణవికాస శ్రీధర్మపుర నివాస –దుష్టసంహార
నరసింహ దురితదూర. (28)
ఓ నారసింహా ! ఈ శరీరంలో నుండి ప్రాణాలు పోయిన తర్వాత
ఆ కట్టె శ్మశానానికే గాని ఇంకెందుకు పనికిరాదు.ఈ దేహము పచ్చితోలు సంచి వంటిది .లోపల అంతా అసహ్యం గా మాంసము ,నరాలు
ఎముకలతో కూడి మలమూత్రాలతో నిండిన మైలతిత్తి. ఎండావానలకు తట్టుకోలేదు .
ఆకలి దాహాలకు ఆగలేదు. సర్వరోగాలకు నిలయమైన ఈ శరీరము నీటిబుడగ వలె
అస్ధిరమైనది. కావున హే ప్రభూ! బ్రతికున్నంత వరకు నీ సేవ
చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు స్వామీ.
నరసింహ! నాతండ్రి నన్నేలు నన్నేలు
కామితార్ధము లిచ్చి కావు కావు
దైత్యసంహార! చాల దయయుంచు దయయుంచు
దీనపోషక! నీవె దిక్కు దిక్కు
రత్న భూషిత వక్ష! రక్షించు రక్షించు,
భువనరక్షక! నన్ను
బ్రోవు బ్రోవు
మారకోటిసురూప! మన్నించు మన్నించు
పద్మలోచన! చేయి పట్టుఁ
బట్టు
సురవినుత! నీచాటు
జొచ్చినాను
నా మొఱాలించి కడతేర్చు నాగశయన!
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార !నరసింహ! దురితదూర! (29)
ధర్మపురి నరసింహా ! నన్ను కాపాడెడి నా తండ్రీ!
నా కోరికలు తీర్చి నన్ను రక్షించు ప్రభూ !
దైత్యాంతకా! నామీద దయ ఉంచి పాలించు ప్రభూ.!
నరకాంతక! నీవె నాకు
దిక్కు. రత్న భూషిత వక్ష! నన్ను రక్షించి కాపాడు. భువన రక్షక! నన్ను ఆదుకోవయ్యా. కోటి మన్మధాకర! నాతప్పుల క్షమించు. పద్మ
లోచన! నా చేతిని
విడిచిపెట్టకయ్యా. దేవతల చేత ప్రార్ధించబడెడు
ఓ నారసింహా! నేను నీవే దిక్కని ని నీ మఱుగు జొచ్చినాను. నా మొరాలించి
నన్ను కడతేర్చుభారము నీదే నాగేంద్ర శయన . నన్ను ఆదుకొని
ఏలుకొనే భారం నీదే స్వామీ !నన్ను మఱచి పోవద్దు.
నిగమగోచర ! నేను
నీకు మెప్పగునట్లు-లెస్సగా బూజింపలేను సుమ్మీ
నాకుఁదోచిన భూషణములు పెట్టెదనన్నఁ-గౌస్తుభమణి నీకు గలదు
ముందె
భక్ష్య భోజ్యములు నర్పణము జేసెదనన్న- నీవు పెట్టితి సుధ
నిర్జరులకు
కలిమి కొద్దిగఁగాను కల దొసంగెదనన్న- భార్గవీదేవి నీ భార్య
యయ్యె
అన్ని గలవాడ వఖిల లోకాధిపతివి-నీకు భూషాదులను బెట్ట నే
నెంతవాడ
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! –దుష్టసంహార
!నరసింహ!
దురితదూర!. (32)
వేదములచే కీర్తించబడినవాడా! రత్నాభరణ భూషిత వక్షస్ధలా! శ్రీ లక్ష్మీ నరసింహప్రభో! నువ్వు మెచ్చుకొనేటట్లు
గా నేను నీకు పూజలూ చేయలేను. ఏదో నాకు తోచినరీతిలో ఆభరణాలను నీకు
సమర్పిద్దామనుకుంటే అంతకు ముందే కౌస్తుభమణి నీ మెడను అలంకరించుకొని ఉంది. పోనీ
!భక్ష్యభోజ్యాలను అర్పించి నిన్ను సంతృప్తి పరుద్దామనుకుంటే దేవతలకే
నీవు అమృతాన్నిచ్చిన ఘనుడవయ్యే. నాకున్న కొద్ది ఆస్తిని నీకిద్దామంటే సంపదల తల్లి
లక్ష్మీదేవే నీ భార్య కదా ! అన్నీ ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ
నాయకుడవైన నీకు ఆభరణాలను పెట్టగా నేనెంతటి వాడిని తండ్రీ !
అన్నీ ఉన్న నీకు నేనేమి ఇవ్వగలను తండ్రీ! అంటూ చేతులు జోడించి తనకు మాత్రం
మోక్షం ఇవ్వమని అడిగే భక్తుణ్ణి చూసి ఆ భగవానుడు చిరునవ్వులు చిందిస్తాడు. అందుకే
ఈ క్రింది పద్యం లో నరసింహుని కవి ఇలా ప్రశ్నిస్తున్నాడు.
అందఱేమైన నిన్నడుగ వచ్చెదరంచు
క్షీరసాగరమందు
చేరినావు
నీ చుట్టు సేవకుల్ నిలువకుండుటకునై
భయద సర్పముమీదఁ బండినావు
భక్తబృదము వెంటఁబడి చరించెదరంచు
నెగసి పోయెడి
పక్షి నెక్కినావు
మౌనులు నీ ద్వార మాసింప కుంటకు
మంచి యోధుల కావలి యుంచినావు
లావుగలవాడవైతి యేలాగు నేను
నిన్నుఁ జూతును. నాతండ్రి నీరజాక్ష
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర.! (34)
తండ్రీ! ధర్మపురి నరసింహా! భక్తులు తమ కోరికలు
విన్నవించుకోవడానికి నీ దగ్గరకు వస్తారేమోనని వెళ్లి వెళ్ళి పాల సముద్రం లో
చేరావు. నీ చుట్టు సేవకులు చేరి
ఏకాంతానికి భంగం కల్గించి విసిగిస్తారేమో నని భయంకర సర్పం మీద పవ్వళించావు. భక్త
సమూహాలు వెంటబడతారేమో నని పైన ఎగిరే పక్షి
నెక్కి విహరిస్తున్నావు. మునులు నీ ద్వార సమీపానికి కూడ రాకుండా మంచి జమాజట్టీలైన
యోధులను వాకిలికి కాపలా పెట్టుకున్నావు. స్వామీ! అన్ని విధాల
అందని ఎత్తులో ఉన్న నిన్ను ఏ విధంగా నేను సేవింతును తండ్రీ !
అధిక్షేపణ
స్తుతి భక్త కవులలో కనిపించే సాధారణ లక్షణం. దీనినే నిందాస్తుతి అని కూడ
అంటారు. పలుకే బంగార మాయెనా...... అంటూ
ఆర్తి తో ఆ శ్రీ రామచంద్రుని అర్థిస్తున్న
భక్త రామదాసు ఆ డబ్బుకు లెక్కలు చెపుతూ ,సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకము
రామచంద్రా. .... అంటూనే ఆ సొమ్మంతా ఎక్కడిదనుకున్నావు ? నీయబ్బ సొమ్మను కొంటివా
రామచంద్రా. . కాకపోతే..... నీ మామ జనకమహరాజు చేయించెనా.. అంటూ రోదిస్తున్న ఆ మహా
భక్తుని నోటివెంట వస్తున్న మాటలు ఈటెలై రామభక్తుల్ని కదిలించి కన్నీరు
పెట్టించాయి. ఇది రామభక్తులందరికీ అనుభవైక వేద్యం.
ప్రహ్లాదుఁ డేపాటిపైడి కానుకలిచ్చె
మదగజం
బెన్నిచ్చె మౌక్తికములు
నారదు డెన్నిచ్చె నగలు రత్నంబు ల
అహల్య నీకే
యగ్రహారమిచ్చె
నుడుత నీకేపాటి యూడిగంబులు చేసె
ఘన విభీషణుడేమి కట్న మిచ్చె
పంచపాడవులేమి లంచమిచ్చిరి నీకు
ద్రౌపది నీకెంత ద్రవ్య మిచ్చె
నీకు వీరందఱయినట్లు నేను గాన
యందుకని నన్ను రక్షింప విందువదన
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! (39)
ఏమయ్యా స్వామీ! నీ భక్తులందరి లాటి వాడిని
కానానేను. నీవు పొదివి ఎత్తుకున్నఆ ప్రహ్లాదుడు నీకు ఏ మాత్రం బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు. నీవు
కాపాడిన ఆ గజరాజు ఎన్ని ముత్యాలను నీకు కానుకగా ఇచ్చింది. ఆ నారదుడు ఎన్ని
రత్నహారాలను నీకు అందించాడు. అహల్య నీకు ఏ అగ్రహారమిచ్చిందని ఆమె నంతగా ఆదరించావు.
ఉడుత నీకు ఎంత మాత్రం సేవలు చేసింది.
విభీషణుడు నీకు ఎటువంటి బహుమానమిచ్చాడు. పంచపాండవులు నీకు ఏమి లంచమిచ్చారు.ద్రౌపది
ఎంత ద్రవ్యమిచ్చిందని ఆమె ను దయ చూచి రక్షించావు. వీళ్ళందరూ అయినట్లు నేను నీ
భక్తుడను కానా!నన్ను ఎందుకు రక్షించవు తండ్రీ!
ఈ పద్యం వలన
ముందుగా ఆనాటికే సమాజం లో లంచమనేది చాలా బలంగా ఉన్నట్లు మనకి తెలుస్తోంది. తళ్ళికోటయుద్ధం
లోనే ఈ లంచం కరాళనృత్యం చేసి తెలుగు సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసినట్లు చరిత్ర చెపుతోంది. అది 1550
ప్రాతం. ఈ కవికాలం 1730 ప్రాంతం. ఇప్పటి కింకా అది విస్తరించి ఉంటుంది. పేదవాడి కోపం పెదవికి చేటు అని కదా సామెత.
పేదవాడైన కవి ఆక్రోశం కట్టలు తెంచుకుని
పరమ భక్తుల
భక్తిని గుర్తుచేసుకుంటూ, అధిక్షేపణ గా మారింది.
మందుడనని నన్ను నింద
జేసిననేమి-నాదీనతను జూచి నవ్వనేమి
దూరభావము లేక తూలనాడిన నేమి-ప్రీతి సేయక వంక బెట్టనేమి
కక్కసంబులు పల్కి వెక్కిరించిననేమి- తీవ్రకోపము చేత
దిట్టనేమి
హెచ్చుమాటల చేత నెమ్మెలాడిన నేమి- చేరి దాపట గేలి సేయనేమి
కల్పవృక్షంబులె నీవు కల్గనింక- బ్రజల లక్ష్యంబు నాకేల
పద్మనాభ!
భూషణవికాస! శ్రీధర్మపుర
నివాస! –దుష్టసంహార! నరసింహ! దురితదూర! (40)
ధర్మపురి
లక్ష్మీనరసింహస్వామీ . ! నేను నిన్ను ఆశ్రయించి సేవించుట చూసి ప్రజలు నన్ను మూర్ఖుడనని నిందించినా, నా దీనత్వాన్ని చూచి వాళ్ళు నన్ను
హేళన చేసినా నేను లక్ష్య పెట్టను. మంచి
చెడుల విచక్షణ మరచిపోయి ఈ ప్రజలు నన్ను నిందించినా, ప్రేమతో పల్కరించక ,సూటిపోటి
మాటలతో వెక్కిరించినా, కోపముతో తిట్టినా సరే నేను వారిని లెక్కకట్టను. నాపై చాటున
కొండెములు చెప్పుకొని నన్ను అవహేళన చేసినా
నాకేమిటి స్వామీ. కల్పవృక్షం లాంటి నీవు నాకు అండగా ఉండగా ఈ ప్రజలతో నాకు లెక్కేమిటి?
కవికి ఆనాటి సమాజం లో ఎదురైన ఛీత్కార. అవమానాలు ఈ పద్య పాదాల్లో
కన్పిస్తున్నాయేమో నన్పిస్తోంది.
తల్లి గర్బము నుండి ధనముఁదేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుగు బంగారంబు
మ్రింగబోడు
విత్తమార్జనఁ జేసి విఱ్ఱవీగుటె కకాని
కూడఁ బెట్టిన
సొమ్ము గుడువఁబోడు
పొందుగా మెఱుగైన భూమి లోపలఁ బెట్టి
దానధర్మము లేక దాఁచి దాచి
తుదకు దొంగల కిత్తురో. దొరల కవునో
తేనె జుంటీఁగ లియ్యవా తెరువరులకు
భూషణవికాస !శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర.! (41)
స్వామీ! ధర్మపురి వాసా! ఈలోకం లో ఎవ్వడూ కూడ తల్లి గర్భం
నుండి డబ్బు తో బయటకు రాడు. అలాగే
పోయేటప్పుడు కట్టలు కట్టుకొని తన వెంట తీసుకొనీ
పోలేడు.ఎన్ని కోట్లకు అధిపతియైనా ఉప్పు
,అన్నం మెతుకులే కాని మేలిమి బంగారాన్ని బిస్కట్లు గా మింగలేడు. నేనింత
సంపాదించానని విఱ్ఱవీగటమే కాని కూడ పెట్టిన సొమ్మును తినే యోగ్యత ఎవ్వరికీ
ఉండదు. దానధర్మాలు చేయకుండా మూలమూలల
గుంటలు తవ్వి పాతి పెట్టిన సొమ్ము దొంగల
పాలో లేక ప్రభుత్వం పాలో అవుతుంది కాని
అనుభవించడానికి ఉండదు. ఎలాగంటే ఎంతో శ్రమకోర్చి తేనెటీగలు బొట్టుబొట్టు కూడ
బెట్టిన తేనె బాటసారుల తీసుకెళ్ళడం చూస్తూనే ఉన్నాం కదా!
ఈపద్యం లోని “లక్షాధికారైన లవణ మన్నమె కాని మేఱుగు బంగారంబు మ్రింగ బోడు.” అన్న పాదం తెలుగునాట సామెత గా ప్రజల నాలుకల మీద నిలిచిపోయింది. ఇక్కడ దొరలు అనే మాటకు
పాలకులు అనే అర్ధం తీసుకుంటే ఆదాయపు పన్ను
ఆ రోజుల్లో ఉండేదేమో . లేకపోతే సంతు లేని వారి ఆస్థిని ప్రభుత్వ లాక్కోవడం కూడ
కావచ్చు.
లోకమందెవడైన లోభి మానవుడున్న-భిక్షమర్ధికిఁ జేత బెట్టలేడు
తాను బెట్టకయున్నఁ దగవు పుట్టదు గాని- యొరులు పెట్టఁగజూచి యోర్వలేడు
దాత దగ్గరఁ జేరి దన ముల్లె చెడినట్లు-జిహ్వతోఁ జాడీలు
చెప్పుచుండు
ఫలము విఘ్నంబైనఁ బలు సంతసము నందు-మేలు కల్గినఁ జాల మిణుఁకు
చుండు
శ్రీ రమానాథ! యిటువంటి క్రూరునకను- భిక్షకుల శత్రువని పేరుఁబెట్టవచ్చు
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర! (42)
శ్రీ నరసింహ ప్రభూ !ఈ లోకం లో ఉన్న పిసినారి యాచకునికి ఒక గింజ కూడ విదిలించడు సరి కదా
దానమిచ్చేవాడిని చూసి కూడ ఓర్వలేడు. తాను వేయక పోయినా పెద్ద ప్రమాదమేమీ లేదు గాని
దాన గుణం గల వాని చెంతకు చేరి తన డబ్బు మూటేదో తరిగి పోతున్నట్లు దానం చేయకుండా, ఆ
దాతకు కూడ లేనిపోని చాడీలు చెప్పి, దానం
చేయకుండా చూస్తాడు. తను చెప్పిన చెప్పుడు మాటలతో ఆ దాత దానం చెయ్యడం మానేస్తే
మహానందపడిపోతాడు. ఒకవేళ వీడి మాట వినక ఆ
దాత తన ధర్మగుణాన్ని ప్రకటించుకొని ధర్మం చేస్తే కుమిలి కుమిలి ఏడుస్తాడు. అందువలన
ఓ లక్ష్మీనాథా! ఇటువంటి దుర్మార్గునికి భిక్షుకుల శత్రువు
అనే పేరు పెడితే బాగుంటుంది కదా!
కవి యాయవారవృత్తి తో జీవించి, లక్ష్మీకటాక్షానికి దూరమైవ వాడుగా కన్పిస్తున్నాడు.ఎంతసేపు రోజు గడవడానికి
ఇబ్బంది పడిన పరిస్ధితులలోనే కవి జీవితం గడిచిందేమో. అందుకే దాతలను దానమివ్వకుండా
అడ్డుపడేవారంటే కవికి అంత కోపం. అలా
అడ్డుపడే వారికి భిక్షకుల శత్రువు అనే పెద్ద బిరుదు నొకదానిని ప్రకటించాలన్నంత కోపం కవి లో ఉంది. ఏమైనా కవి జీవిత వివరాలు
తెలిస్తే మనకు కొంత స్పష్టత రావచ్చు. లోభి అనగానే మనకు ప్రజాకవి వేమన పద్యం గుర్తు
కొస్తుంది. లోభిని అడుక్కోవడమంటే గొడ్డుటావు చెంతకు పాలతీయడం కోసం కుండపట్టుకొని వెళ్ళడమే నన్నాడుగా మన వేమన్న.
గొడ్డుటావుఁ బితుక కుండ గొంపోయిన
బండ్ల నూడదన్ను బాల నీదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.
తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ-మఱదులన్నలు
మేనమామగారు
ఘనముగా బంధువుల్ కల్గినప్పటికైన-దాను దర్లగ వెంటఁ దరలిరారు
యముని దూతలు ప్రాణ మపహరించుక పోగ మమతతో పోరాడి మాన్ప లేరు
బలగమందఱు దు:ఖపడుట మాత్రమె కాని యించుక నాయుష్య మీయలేరు
చుట్టముల మీది భ్రమ దీసి చూర జెక్కి-సంతతము మిమ్ము నమ్ముట
సార్ధకంబు
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర. ! (43)
శ్రీ నరసింహా!నాపాలిటదైవమా! అమ్మానాన్నలు,భార్యాపిల్లలు,
ఆప్తులు, అన్నలు,బావమఱదులు, మేన మామలు, గొప్పగా బంధువర్గము ఉండి కూడ పోయేటప్పుడు
ఏఒక్కరూ వెంటరారు.యమభటులు ప్రాణం తీసుకుపోతుంటే అనురాగం తో అడ్డంపడి పోట్లాడి ఎవరూ ఆపలేరు.ఎంతమంది బలగమున్నా
ఏడవడానికే కాని ఇంచుక కూడ ఆయుష్యుని పోయలేరు. అందువలన చుట్టపక్కాల మీద భ్రమ ను
తీసి లుంగచుట్టి చూరులో తోసి బ్రతికనంతకాలం మీ సేవ చేయడమే ఉత్తమ మార్గము ప్రభూ !
బ్రతికినన్నాళ్ళు
నీ భజన తప్పను గాని
మరణ కాలమందు మఱతునేమొ
యా వేళ యమదూత లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫవాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ
గంప ముద్భవమంది, కష్టపడుచు
నా జిహ్వ తో నిన్ను నారాయణా యంచు
బిలుతునో శ్రమఁ జేరఁ బిలువలేనొ
నాటి కిప్పుడు చేసెద నామభజన
దలచెదను జేరి వినవయ్య ధైర్యముగను
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర
! (48)
ధర్మపురి నారసింహా ! బ్రతికినంతకాలం నీ నామస్మరణ ఏమరక చేస్తాను కాని మరణ కాలం సమీపించినప్పుడు మరచి పోతానేమో.
యమభటులు ఆగ్రహం తో వచ్చి ప్రాణాలు లాక్కుపోయేటప్పుడు, కఫ వాత పైత్యాలు కమ్ముకొని
కష్టపెట్టేటప్పుడు నారాయణా అంటూ నిన్ను
పిలవ గలుగుతానో లేదో నని సందేహం కలుగుతోంది. కాబట్టి నాటి కిప్పుడే
ధైర్యంగా నీ నామ స్మరణ చేస్తాను స్వామీ.
“ముప్పున గాలకింకరులు ముంగిటి
కొచ్చిన వేళ” అనే దాశరధీ శతక పద్యం ఇక్కడ గుర్తుకొస్తోంది. ఆ
పద్యం లో కఫము కుత్తుక నిండిన వేళ -- మీ స్మరణ గల్గునొ కల్గదొ...నాటి కిప్పుడే
తప్పక చేతు మీ భజన అన్నాడు కదా మన కంచర్లగోపన్న.
ముప్పున
గాలకింకరులు ముంగిటకొచ్చినవేళ రోగముల్
గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ , బాంధవుల్
గప్పినవేళ ,మీ స్మరణ గల్గునొ కల్గదొ నాటి కిప్పుడే
తప్పక చేతు మీ భజన దాశరథీ ! కరుణాపయోనిథీ !
నిజమే.ఆపదలు కమ్ముకున్న ఒక్కో సమయం
లో భక్తునికి ఆ ఆపద్భాంధవుడైన భగవంతుడు
స్మరణకు రాకపోవడం కూడ ఒక శాపమే. అటువంటి దురదృష్టవంతులు కొందరు నాకు తెలుసు.నోరు
కట్టేసినట్టయిపోయి, మెదడు మొద్దుబారిపోయి ఆ దైవాన్ని ప్రార్థించడం, వేడుకోవడం కూడ ఆ సమయం లో మర్చిపోతారు. ఆ సమయం లో ఆయనను
వేడుకోకపోయావా, ముడుపు కట్టకపోయావా అని తరువాత కాలం లో మనం ఆ అభాగ్యుణ్ణి ప్రశ్నిస్తే అతను బిక్కమొహం పెట్టి “ఆ స్వామి నాకు ఆ సమయం లో గుర్తుకురాలేదు” అంటాడు. చూడండి ఎంత విచిత్రమో. అంటే అది కూడ కర్మఫలమే నన్నమాట.
అనుభవించాల్సి ఉన్నప్పుడు కులదైవం కూడ ముఖం చాటేస్తాడన్నమాట. ఎంతవాడికైనా ఆ కర్మఫలం
అనుభవించక తప్పదు. అందుకే కొంతమందికి దేవుడు ఎప్పటికీ గుర్తుకు రాడు. మరికొందరికి
భాగవతం లోని గజేంద్రునికి వలే ---
కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణములపాలన్
కలడందురన్నిదిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో ?
అనే
విచికిత్సకు లోనై తుదకు
కర్మఫలం పండి ....
నీవే తప్ప నిత:పరం బెరుగ మన్నింపదగున్ దీనునిన్
రావే! ఈశ్వర
కావవే! వరద సంరక్షింపు భద్రాత్మకా!
అనే దశకు చేరతాడు.
ఇదంతా పరీక్ష కు , పీడనకు
గురైన భక్తుని మానసిక స్థితి.
మూడవభాగం త్వరలో.............
*************************************************************************