శేషప్పకవి-నరసింహశతకము - 1
తెలుగు నాట బహుళ ప్రాచుర్యం
పొందిన భక్తి శతకాలలో శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకం ఒకటి. ఇది సీసపద్య
శతకం. భక్తి శతకాలలో కన్పించే ఆర్తి ,
ఆత్మనివేదనం , అలగడం , మథ్య మథ్య లో స్వామివారి మీద అభిమానం పెరిగిపోయి
నిందాస్తుతికి పాల్పడటం , మళ్లీ క్షమించమని ప్రాథేయపడటం వంటి వన్నీ ఈ శతకం లో కూడ
కన్పడతాయి. ఈ శతకం చదువుతుంటే భక్త కవి
పోతన భాగవతం , ధూర్జటి కాళహస్తీశ్వర శతకము
, కంచెర్ల గోపన్న దాశరథీ శతకము మనకు మాటి మాటి కీ గుర్తుకొచ్చి పల్కరిస్తాయి.
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
అనేది ఈ శతక మకుటం. తనకు గణ యతి ప్రాస
లక్షణాలు తెలియవు. పంచకావ్యాలను
పఠించలేదు. అమరమనే సంస్కృత నిఘంటువును
చూడనేలేదు. శాస్త్రీయ గ్రంథాలను చదువనే లేదు. కాని నీ అనుగ్రహం వలన నేను ఈ
శతకాన్ని రచిస్తున్నాను. అని చెపుతూనే తప్పు
లున్నంత మాత్రాన భక్తికి లోటు ఏర్పడదు గదా. వంకరగా ఉన్నంతమాత్రాన చెఱుకు గడ లో మాధుర్యం
తగ్గుతుందా అంటూ ఎదురు ప్రశ్న వేస్తాడు కవి (2వ. ప ) .భక్తి కి ఛందోబంధాలెందుకు అనేది కవి
వాదన. ఈ శతకం లోని కవిత్వం కూడ అదే రీతి లో కొనసాగినట్టు గుర్తించవచ్చు.
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహుని దివ్యరూపం
శ్రీ శేషప్ప
కవి 1730 – 1820 మథ్య కాలం లో జీవించి
ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కవి నైజాం ప్రాంతం వాడయి ఉంటాడని విమర్శకులు భావిస్తున్నారు. నరసింహుని సేవలోనే
తన జీవితాన్ని కడదేర్చుకున్న కర్మయోగిగా
ఈతను కన్పిస్తున్నాడు. కేవలం భగవద్భక్తి మాత్రమే ఈ కవి చేత ఈ శతకాన్ని వ్రాయించింది. ఇతడు
నిరుపేదయై, యాయవార వృత్తి తో , భగవదారాధన లో నే జీవితాన్ని గడిపాడని భావించవచ్చు.కరీంనగర్ జిల్లా లోని
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
ముందు రెండు ప్రధాన ప్రవేశ
ద్వారాలకు నడుమ ఈ భక్త కవి విగ్రహం ఒకటి
నెలకొల్పబడింది. మెడలో వ్రేలాడుతున్న
తంబుర ,చేతిలో చిడతలు , నెత్తిన అక్షయపాత్ర
(భిక్షాపాత్ర) తో ఆ విగ్రహం కన్పిస్తోంది.1976.సం.పు
పదవతరగతి మిత్రబృందం ఈ సామాజిక సేవాకార్యాన్ని నిర్వహించారు . వారికి
అభినందనలు తెలపాలి మనమందరం.
ఒక్క విషయం ఇక్కడ
చెప్పుకోవాలి. తెలుగు నాట ఇదే విధమైన సీసపద్య శతకం మరొకటి
శ్ర్రీకాకుళ ఆంథ్ర మహావిష్ణువు మీద
శ్రీ కాసుల పురుషోత్తమకవి రచించిన ఆంథ్ర నాయక శతకం. “చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!హతవిమత జీవ!
శ్రీకాకుళాంథ్రదేవ!” అనునది దీని మకుటం. ఈ శతకం అధిక్షేపణ శతకాలలో అగ్రభాగం లో నిలుస్తోంది.
భక్తి భావన లో ముందు వరుసలో ఉంటుంది.
‘ పోతన భాగవతం వ్రాయకపోయినా పురుషోత్తమ కవి వ్రాసేవాడని ’ తిరుపతి వెంకటకవులే ప్రశంసించారంటే ఈ శతకం గొప్పతనాన్ని మనం ఊహించవచ్చు.
సరే. ఈ శతకాన్ని గూర్చి త్వరలో
మాట్లాడుకుందాం. ఈ సమయం లో ఇటువంటి భక్తి శతక కవులకు మరోమారు శతసహస్ర ప్రణామాలు.
శ్రీ శేషప్ప కవి
జీవిత విశేషాలకోసం వెతుకులాట కొన
సాగుతోంది.. లభిస్తే ఈ క్రమం లోనే
అందించగలను.
శ్రీ మనోహర !సురార్చిత సింధుగంభీర!
భక్తవత్సల! కోటి
భానుతేజ!
కంజనేత్ర!
హిరణ్యకశిపునాశక! శూర!
సాధురక్షణ!
శంఖచక్రహస్త!
ప్రహ్లాదవరద ! పాపధ్వంస! సర్వేశ !
క్షీరసాగరశయన! కృష్ణవర్ణ!
పక్షివాహన!
లసద్భ్రమర కుంతల జాల!
పల్లవారుణపాదపధ్మయుగళ!
చారు శ్రీ చందనాగరు చర్చితాంగ!
కుందకుట్మలదంత! వైకుంఠధామ!
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ ! దురితదూర
! (1వ. ప )
శ్రీ ధర్మపురి లో వెలసిన నారసింహా! శ్రీ లక్ష్మీనాథా! దేవతలచే పూజింపబడు వాడా! సముద్రము వలే గంభీరమైన వాడా!
భక్తవత్సలా! కోటిసూర్య సమప్రభా! తామరపూవుల వంటి నేత్రములు గలవాడా! హిరణ్యకశ్యపుని సంహరించిన వాడా! వీరుడా!సాధువులను రక్షించడమే వ్రతము గా
గలవాడా! శంఖచక్రధరా! ప్రహ్లాదవరదా! పాపములను పోగొట్టువాడా ! సర్వలోకములకు ప్రభువైన
వాడా! పాలసముద్రమున పవళించు వాడా!
నీలవర్ణ రూపా! గరుడవాహనా!కదలాడే
తుమ్మెద గుంపులవంటి అందమైన శిరోజములు
కలవాడా ! ఎఱ్ఱదామర వంటి సుందరమైన పాదములు కలవాడా !
శ్రేష్టమైన శ్రీ గంథము, అగరు అలదిన శరీరము
కలవాడా! మల్లెమొగ్గల వంటి పంటివరుసులు కలవాడా !వివిథములైన ఆభరణము లచే ప్రకాశించెడి ఓ వైకుంఠధామా!
పాపములను దూరము గా తొలగ ద్రోచి పాపులను సంహరించు వాడా! ఓ
నారసింహా !శరణు !
ఇది ఈ శతకం లోని తొలి
పద్యం అవడం తో కవి శేషప్ప
ధర్మపురి నరసింహుని లోని భక్త పరాధీనత్వాన్ని ప్రత్యేకం గా వర్ణిస్తూ ఆ
స్వామి గొప్పతనాన్ని, అలాగే ఆ స్వామి ఆభరణ అలంకార వైశిష్ట్యాన్ని కన్నార చూస్తూ నోరార
కీర్తిస్తున్నాడు.
నరసింహ! నీదివ్యనామమంత్రము చేత
దురిత
జాలము లెల్ల దోలవచ్చు
నరసింహ!
నీదివ్యనామమంత్రము చేత
బలువైన రోగముల్ బాపవచ్చు
నరసింహ!
నీదివ్యనామమంత్రము చేత
రిపుసంఘముల సంహరింప వచ్చు
నరసింహ!
నీదివ్యనామమంత్రము చేత
దండహస్తుని బంట్ల దఱుమవచ్చు
భళిర! నేనీ
మహామంత్ర బలము చేత
దివ్యవైకుంఠపదవి సాధింపవచ్చు!
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ ! దురితదూర
! (3వ.ప)
ఓ నారసింహా ! నీ దివ్యమైన నామ మంత్రాన్ని
పారాయణ చేయడం వల్ల సమస్తమైన పాపసమూహాలను పారద్రోలవచ్చు. ఓ నారసింహా! నీయొక్క దివ్యమైన “ ఓం నమో నారసింహాయ” యనెడి దివ్యమంత్రాన్ని
పలుమార్లు ధ్యానించడం వల్ల భయంకరమైన
రోగాలను పోగొట్టవచ్చు. నీ దివ్యనామ సంస్మరణ చేత శత్రు మూకలను పారద్రోలవచ్చు. నీ
దివ్య నామ మహిమ చే యమభటులను దూరము గా తరిమి వేయవచ్చు. ఓహో. నీ నామమంత్ర
మాహాత్మ్యము చే దివ్యమైన వైకుంఠ పదము నే సాధించవచ్చు. నీ నామ మహిమ ఏమని చెప్పవచ్చు
ప్రభూ. !
దనుజ సంహార! చక్రధర! నీకు దండంబు;
లిందిరాధిప నీకు వందనంబు,
పతితపావన! నీకు
బహు నమస్కారముల్;
నీరజాతదళాక్ష! నీకు శరణు,
వాసవార్చిత! మేఘవర్ణ! నీకు శుభంబు;
మందరధర! నీకు
మంగళంబు;
కంబుకంధర!
శార్జ్ఞకర! నీకు భద్రంబు;
దీనరక్షక! నీకు
దిగ్విజయము;
సకలవైభవములు నీకు సార్వభౌమ!
నిత్యకళ్యాణములు నగు నీకు నెపుడు;
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ !
దురితదూర ! (4)
శ్రీ నారసింహప్రభూ! రాక్షస సంహారా!చక్రధారీ! నీకు నమస్కారము. ఇందిరానాథా! నీకు వందనము. పతితపావనా! నీకు సహస్రాధిక కైమోడ్పులు. పద్మపత్ర దళాక్షా !నీవే నాకు రక్ష. ఇంద్రుని చేత పూజింపబడువాడా ! నీలమేఘము
వంటి శరీరము కలవాడా! నీకు శుభము.మందరపర్వత ధరా! నీకు మంగళము. శంఖము వంటి సొబగైన కంఠము కలవాడా! శార్జ్ఞము అనెడి విల్లును ధరించిన వాడా! నీకు జయమగు గాక!
దీనజన సంరక్షకా! నీకు భద్రము. సకలలోక సార్వభౌమ! నీకు
సకలవైభవములు చేకూరుగాక! నిత్యకళ్యాణములగు నీకు
నీరజాక్ష!
శ్రీ స్వామివారి కి జయము
చెప్పడాన్నే స్తుతి అని ప్రపత్తి అని జోహారని అంటుంటాము. అంతే కాని ఆయనకు మంచి
జరగాలని మనం కోరుకోవడమేమిటని అనుకోకూడదు.
అదే కవి ఇక్కడ మనసారా నరహరి ని ప్రార్థిస్తున్నాడు.
ఇహలోక సౌఖ్యమ్ము లిచ్చగించెదమన్న-దేహమెప్పటికిఁ దా స్ధిరత నొంద,
దాయుష్యమున్నపర్యంతంబు పటుతయు-నొక్కతీరున నుండ దుర్విలోన;
బాల్య యౌవన సుదుర్బల వార్ధకములను-మూఁటిలో మునిగెడి ముఱికి కొంప;
భ్రాంతి తో దీనిగాపాడుదమను కొన్నఁ-గాలమృత్యువు చేతఁ గోలుపోవు;
నమ్మరాదయ్య! ఇది మాయనాటకంబు-జన్మమిక నొల్ల నన్నేలు జలజనాభ!
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!దుష్టసంహార! నరసింహ ! దురితదూర ! (5)
శ్రీ
నారసింహ ప్రభూ! ఇహలోక
సుఖాలను కోరుకుందామంటే ఈ శరీరము అశాశ్వతమైనది. ఆయుర్ధాయమున్నంతవరకైనా శరీరం లో
పటుత్వం ఒక రీతి స్ధిరంగా ఉండదు. ఈ దేహమనేది బాల్యము ,యౌవనము , వార్ధక్యమనే
మూడింటి లో మునిగిపోయే ముఱికి కొంప. పోనీ ఈ
శరీరం పై భ్రాంతి తో కాపాడుకుందామంటే కాలమనే మృత్యువు లోకి ఎప్పుడో చెప్పకుండా జారిపోతుంది. దీనిని
నమ్మకూడదు. ఈ జీవితమంతా ఒక మహా మాయా నాటకము.అందువలన
ఓపంకజనాభా!
పుట్టుక అనేది నాకు వద్దు. మోక్షలక్ష్మిని ప్రసాదించు తండ్రీ !
ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు;
ద్రవ్యమిమ్మని వెంటఁ దగులలేదు;
కనక మిమ్మని చాలఁ గష్టపెట్టగ లేదు;
పల్లకిమ్మని నోటఁ బలుక లేదు;
సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు
భూము లిమ్మని పేరు పొగడ లేదు;
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు
పసుల నిమ్మని పట్టుఁ బట్టలేదు ;
నేను గోరిన దొక్కటే నీలవర్ణ!
చయ్యనను మోక్షమిచ్చినఁ జాలునాకు,
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ !
దురితదూర ! . (8వ )
శ్రీ
లక్ష్మీనాథా!! ధర్మపురి నారసింహ ప్రభూ! నేను సంపదల కోసం నీ వెంట పడ్డం లేదు. డబ్బు
లివ్వమని నేనెప్పుడూ నిన్ను అడగలేదు. బంగార మిమ్మని నేనేనాడు నిన్ను ఇబ్బంది
పెట్టలేదు. పల్లకీలు ,వాహనాలు ఇవ్వమని నేను ఏనాడు నిన్ను ప్రాధేయపడలేదు.భూములకోసమో , సొమ్ములకోసమో నేను
నిన్ను సేవించడం లేదు. పశువుల మందలనో, సేవకాజనన్నో కుప్పలు తెప్పలుగా ఇవ్వమని నేను
ఏనాడు నిన్ను బ్రతిమలాడలేదు. కాని ఓ నీలవర్ణా! నేను నిన్ను
ఒక్కటే వేడుకుంటున్నాను. నాకు మోక్షాన్నిమాత్రం
ప్రసాదించు స్వామీ !
కవికి పెద్దగా కోరికలేమీ లేవు .
మోక్షమిస్తే చాలట. ఎంత చమత్కారమో చూడండి.
గౌతమీ
స్నానానఁ గడతేరుద మటన్న
మొనసి చన్నీళ్ళ లో మునుగలేను;
దీర్ధయాత్రలచేఁ గృతార్ధుఁడౌద మటన్న
బడలి నేమంబు లే
నడపలేను;
దానధర్మముల సద్గతి జెందుదమన్న
ఘనముగా నాయొద్ద
ధనము లేదు;
తపమాచరించి సార్థకము నొందుదమన్న
నిమిషమైన మనస్సు నిలపలేను;
కష్ఠముల కోర్వ నాచేత గాదు;నిన్ను
స్మరణఁ జేసెద నా యథాశక్తి కొలది
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ ! దురితదూర ! . (14 )
నా తండ్రీ!నారసింహా! నీ చెంత నున్న గోదావరి లో స్నానం చేసి పునీతుడ నౌదామంటే నాకు చన్నీళ్ళ స్నానం
పడదు.తీర్థయాత్రల చేత కృతార్థుడనౌదామంటే ఆ నియమ నిష్టలను నేను
పాటించలేను.దానధర్మాలు చేసైనా పుణ్యం సంపాదించుకుందామంటే అంత గొప్పగా డబ్బు కూడ నా దగ్గర లేదు.తపస్సు
చేసి నిన్ను మెప్పిద్దామనుకుంటే నిమిషమైనా మనస్సు నిలకడగా ఉండదు. కష్టాలను సహించే
శక్తి నాకు లేదు. కావున భక్తవరదుడవైన నిన్ను నా వోపినంత ప్రార్ధన చేస్తాను.నన్ను
కరుణించు స్వామీ!
పాంచభౌతికము దుర్భరమైన కాయం బి
దెప్పుడో విడుచుట యెఱుక లేదు,
శతవర్షముల దాక మితముఁ జెప్పిరి కాని
నమ్మరా దామాట నెమ్మనమున;
బాల్యమందో
మంచిప్రాయమందో, లేక
ముదిమి యందో లేక ముసలి యందో,
యూరనో , యడవినో, యుదక మథ్యమముననో,
యెప్పుడో
యేవేళ నేక్షణంబొ
మరణమే నిశ్చయము; బుద్ధిమంతుడైన
దేహమున్నంతలో మిమ్ముఁ దెలియవలయు;
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ ! దురితదూర ! ( 15 వ )
శ్రీ నరసింహా! పంచభూతాత్మకమై,
కశ్మలదూషితమైన ఈ శరీరము ఎప్పుడు కూలుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ భూమిమీద మానవుని ఆయష్షు వంద సంవత్సరాలని చెపుతున్నారు కాని ఆ
మాట నమ్మదగింది కాదు.ఎందుకంటే చిన్నతనం
లోనో, మథ్యవయస్సులోనో, ముదిమి యందో, ముసలి తనం లోనో, ఊరిలోనో , అడవి లోనో, నీటి
మథ్య నో, ఎప్పుడో, ఎక్కడో ఏదో ఒక రూపంలో మరణం తప్పదు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు
ఈ బొందిలో ప్రాణమున్నప్పుడే నిన్ను సేవించి
తరించాలి ప్రభూ!
భుజబలంబున బెద్ద పులులఁ జంపగవచ్చు-పాముకంఠముఁ జేత బట్టగ వచ్చు,
బ్రహ్మ రాక్షస కోట్లఁ బాఱఁ ద్రోలగ వచ్చు- మనుజుల రోగముల్
మాన్ప వచ్చు,
జిహ్వ కిష్టము గాని చేదు మ్రింగఁగవచ్చు- బదను ఖడ్గము చేత
నదుమ వచ్చుఁ,
గష్టమొందుచు ముండ్ల కంప లో జొరవచ్చుఁ-దిట్టుబోతుల నోళ్ళు
కట్టవచ్చుఁ
బుడమి లో దుష్టులకు జ్ఞానబోధఁ దెలిపి- సజ్జనులఁ జేయ లేడెంత చతురుడైన
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస దుష్టసంహార! నరసింహ ! దురితదూర ! (17)
శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా! ఈ లోకం లో అన్నింటి కంటే కష్టమైనపని ఉపదేశం చేత
దుర్జనులను సజ్జనులుగా మార్చడమనేది. ఈ పని ఎంత జ్ఞాని కైనా సాథ్యమయ్యేది కాదు. ఏ
విథంగా నంటే భుజబలం చేత పెద్దపులులను సంహరించవచ్చు.వాటము తెలుసుకొని మహాసర్పాన్ని
సైతం చేతితో కంఠం దగ్గర పట్టుకోవచ్చు .కోట్లాది బ్రహ్మరాక్షసులను
సైతం తెలివితో పార ద్రోలవచ్చు. మానవుల మాయ రోగాలను సైతం మందు తో మాన్పవచ్చు.
నాలుకకు ఇష్టం లేకపొయినా అతి కష్టంగానైనా చేదును మింగవచ్చు. పదునైన కత్తిని చేత్తో
అదిమి పట్టవచ్చు. కష్టమైనా నేర్పు గా ముళ్ళ
కంపలో దూకవచ్చు. కారుకూతలు కూసే వదరుబోతుల
నోళ్ళను ఏదోవిధం గా మూయించవచ్చు. కాని దుర్మార్గులను మంచి మాటలతో మాత్రం
మార్చలేము ప్రభూ!
పైన చెప్పినవన్నీ అత్యంత దుస్సాథ్యము,
కష్టసాథ్యము నైన పనులే అయినా వాటినన్నింటినీ ఏదోవిధం గా సాధించవచ్చు గాని
దుర్మార్గుని సన్మార్గుని గా మాత్రం
చేయలేమనేది కవి భావన.
భర్తృహరి
సుభాషితం మనందరికీ తెలిసిందే . ‘లభేత సికతాసు తైలమపి యత్నత పీడయన్’ అనేది సంస్కృతశ్లోకం. “తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు”
అనేది తెలుగు అనువాదం.
క్లప్తంగా ఇదిఅర్థం . కష్టపడితే ఇసుక లోనుంచి నూనెను తీయవచ్చు. తిరిగి
తిరిగిఎండమావి లో నీటినైనా త్రాగవచ్చు. వెదికితే కుందేటి కొమ్మునైనా సాథించవచ్చు.
కాని ఖలుని మనసుని మాత్రం రంజింపచేయలేము అంటాడు మహాకవి.
భువనరక్షక నిన్ను బొగడ
నేరని నోరు –ప్రజ కగోచరమైన పాడుబొంద
సురవరార్చిత నిన్నుఁ జూడగోరని కనుల్-జలములోపలి నెల్లి
సరపుగుండ్లు
శ్రీ రమాధిప నీకు సేవఁ జేయని మేను –
కూలి కమ్ముడు వోని కొలిమి తిత్తి
వేడ్కతో నీ కథల్ వినని కర్ణములైన-గఠిన శిలాదులఁ గలుగు
తొలులు
పద్మలోచన నీమీద భక్తి లేని- మానవుడు రెండు పాదాల మహిషమయ్య
భూషణవికాస! శ్రీ
ధర్మపురి నివాస దుష్టసంహార! నరసింహ ! దురితదూర ! (19)
లోకరక్షకుడవైన
శ్రీధర్మపురి లక్ష్మీ నరసింహా! నిన్ను కీర్తించలేని నోరు
ప్రజలకగుపించని పాడుబడ్డ బావి వంటిది. నిన్ను
చూడగోరని కన్నులు నీటి బుడగల వంటివి. ఓ లక్ష్మీనాథా. నిన్ను సేవించని ఈ శరీరము
పనికి రాని తోలుతిత్తి వంటిదే కదా. నీ కథలు వినలేని ఈ చెవులు గండ్రశిలలకు ఏర్పడిన
రంద్రముల వంటివే. ఓ కమలాక్షా! నీయెడ భక్తి లేని మానవుడు
రెండుకాళ్ల దున్నపోతే కదా!
మనం ఈ కవి పరిచయం లోనే
చెప్పుకున్నాము. భక్తకవి పోతన భాగవతప్రభావం ఈ కవి మీద ఎక్కువగా ఉందని. ఈ పద్యం చదువు తుంటే ప్రహ్లాదచరిత్ర లోని-
కంజాక్షునకుఁగాని కాయంబు కాయమే పవనగుంఫిత చర్మభస్త్రి గాక !
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వని తోడి ఢక్క
గాక !
హరి పూజనము లేని హస్తంబుహస్తమే తరుశాఖ నిర్మిత దర్వి గాక!
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములు గాక!
చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల బుద్బుదంబు గాక !
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే పాదయుగము తోడి పశువు
గాక ! (పో.భా. 7-170)
ఈ పద్యం
వచ్చి ప్రక్కన నిలబడినట్లుంటుంది.భక్త కవుల మీద భాగవత ప్రభావం అటువంటిది.భాగవతం
లోని చర్మభస్త్రి- శతకం లో కొలిమి తిత్తి గా మారింది. ‘తనుకుడ్యజాల రంధ్రములు ’- శతకం లో ‘కఠిన శిలాదులఁ గలుగు
తొలులు’ గా
మారినాయి. చివరగా మహాకవి పోతన “ విష్ణుభక్తి లేని
విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువు గాక” అంటే - శేషప్ప ఒక అడుగు ముందు కేసి ‘ నీ మీద
భక్తిలేని మానవుడు రెండు పాదాల మహిషమయ్య’ అని భక్తి లేని మానవుడు ద్విపాద పశువే కాదు
రెండు కాళ్ల దున్నపోతే నని స్పష్టం చేస్తాడు.
ధరణి
లో వెయ్యేండ్లు తనువు నిల్వగ బోదు,
ధనమెప్పటికి శాశ్వతంబు గాదు,
దార సుతాదులు తన వెంట రాలేరు,
భృత్యులు మృతిని దప్పింప లేరు,
బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేరు,
బలపరాక్రమమేమి పనికిరాదు,
ఘనమైన సకల భాగ్యం బెంత గల్గియు
గోచిపాత్రంబైన గొంచుఁ బోడు,
వెఱ్రి కుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజన
జేసె వారికి బరమ సుఖము;
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ !
దురితదూర ! (20 వ )
శ్రీ స్వామీ నారసింహ
ప్రభూ! ఈ భూమి ఉన్నంత కాలం వేల
సంవత్సరాలు ఈ శరీరం ఉండదు కదా.! డబ్బు అనేది శాశ్వతం కాదు.
మరణించేటప్పుడు భార్య, పిల్లలు వెంట రారు. సేవకులు చావును తప్పించలేరు. భృత్యుడు అంటేనే భృతి (జీతం ) తీసుకొని పని చేసేవాడని
అర్థం. బంధువులు ఎవ్వరు మరణమాసన్నమైనపుడు మనలను బ్రతికించలేరు. మరణకాలం లో మనకున్న
బలపరాక్రమాలు ఎందుకు పనికి రావు. ఎంత సంపాదించినా పోయేటప్పుడు గోచీముక్క కూడ వెంట
తీసుకెళ్లలేడు. అందు వలన ఈ పనికి మాలిన
భ్రమలనన్నింటినీ వదలి పెట్టి నిన్ను సేవించడమే పరమ సౌఖ్యప్రదము.
రెండవ భాగం త్వరలో ------
******************************************************j*********************