Saturday, 22 June 2013

పైడిలేడి-అపవాదము (రెండవ భాగము)

              

                        పైడిలేడి- అపవాదము      
                                              (రెండవభాగము)
                                   




                                     పైడిలేడి- అపవాదము అనే కావ్యంలో రెండవభాగము అపవాదము. జానకీ రామచంద్రుల  రెండవది,కడపటి ది  అయిన ఎడబాటు కు కారణమైన  అపవాదాన్ని కారణం చేసుకొని శ్రీ రామచంద్రుడు సీతమ్మను ఆవిడకు చెప్పకుండా లక్ష్మణుని ద్వారా ఆమెను అడవి  లో వదిలి పెట్టించిన వృత్తాంతం ఉత్తర రామాయణం లోనిది .
                           సంస్కృత భాష లో మహాకవి భవభూతి వ్రాసిన ఉత్తరరామచరితమ్ నాటకం ఆ ఇతివృత్త విషయం లో ఎందరో తెలుగు కవులకు ఉపాదేయమైంది.సీతమ్మ కష్టాలను కరుణ రస ప్లావితంగా కనుల ముందు ప్రదర్శించిన మహోత్కృష్ట నాటక రాజం గా  కొనియాడబడిన నాటకం  ఉత్తర రామచరిత్ర. కరుణ ఏవ రస: అన్నంతగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన  గొప్పనాటకమది.  ఆ నాటకమే తెలుగులో కరుణరస నిర్భరేతివృత్తంగా ఉత్తరరామచరిత్ర  కావ్యంగా వ్రాయడానికి కంకంటి పాపరాజు కు   ఆధారమైంది.  అందులోని కొన్ని పద్యాలే లవకుశ సినిమాలో పొందికగా చేరి, అమర గాయకుని గొంతులో ఆర్ధ్రంగా పల్లవించి, సన్నివేశాన్ని పండించి,  చలన చిత్రానికి శాశ్వతత్వాన్ని కలిగించాయి. ఒక్కమాట లో చెప్పాలంటే  ఉత్తర రామచరిత్ర  కు  నామాంతరమే లవకుశ సినిమా.         
                            నిండు గర్భిణియై,  ఇక్ష్వాకువంశమణులకు  జన్మనివ్వబోతున్న  సీతారమణిని లోకాపవాద భీతితో రాముడు అడవికి పంపించాడు. అన్నమాట జవదాటని లక్ష్మణుడే ఈ కార్యానికి నియోగించబడ్డాడు . కర్కశము, కంటకావృతము నైన అరణ్య మార్గంలో నడుస్తూ, క్రూర మృగాలే  కాని మున్యాశ్రమాలు కన్పించవేమని అమాయకం గా ప్రశ్నిస్తూ, అలసట తో ఆగి పోయిన  భూజాత  లక్ష్మణుని ముఖం చూసి గతుక్కుమంది. చిన్న పోయిన అతని ముఖంపై అలముకున్న చీకటి తెరలకు కారణం అర్థం కాక ప్రశ్నించింది.
                          ఏమి లక్ష్మణ! నేడు నీమోము జూడ
                          విన్ననై యున్నదేటికి చెన్నుదరిగి
                         అన్నదమ్ములు కుశలురై యున్నవారె

  అంటూ అందరి క్షేమాన్ని ఆర్తి తో అడుగుటయే కాక—
                         
                              అడవులను తొల్లి ఇడుముల గుడుచునాడు  
                          శత్రు నివహంబుతో నాజి సలుపునాడు
                          కూళ రావణు శక్తి చే కూల్చునాడు  
                         బన్నమొందవు నేడేల విన్నదనము

           “అన్న!యనేక దీనదశ లానిన వేళ నైన  నీవు మున్నెన్నడు నింత వంత వహియింపవు అన్న మాటలు కంకంటి వారి సీతమ్మవి. అనేక దీనదశలు అన్న కవిమాటకు విశ్లేషణే  ఈ నాలుగు పాదాలు. సీతాసాద్వి  ఈ విధంగా ప్రశ్నిస్తుంటే -  పలుక మాటరాని లక్ష్మణుడు భోరున ఏడ్చేశాడు.
                         
                          ఏమి చెప్పుదు నమ్మరో నట్టి వార్త
                          నుడువు కంటెను ప్రాణంబు విడుట మేలు
                          విమలమగు నీదు పాదాంబుజముల చెంత
                          నిదిగొ వాలితి నన్ను శపియింపుమమ్మ

     అంటూనే సీతమ్మ  పాదాలచెంత శిరసు వాల్చాడు లక్ష్మణుడు.
                          
                         .........................దైత్యుచే బడిన సీతను గ్రమ్మఱ నేలుచున్నవా
                                  డెంత విమోహి రాముడని యెగ్గులు వల్కిన నాలకించి భూ
                                  కాంతుడు  నిందచెంది నిను గానల లోపల డించి రమ్మనెన్


   అన్న కంకంటి వారి పద్యమే –
                                         దానవుని చేత చిక్కిన చాన తెచ్చి
                                         ఏలుచున్నాడు రాఘవు డెంత వెడగొ
                                         అంచు జనులాడు నింద సైరించలేక
                                        వనుల నిను డించి రమ్మనె జనవిభుండు

                 అనే నాళం వారి పద్యంలోకి పరకాయప్రవేశం చేసింది. పవిత్రమైన నీ చరిత్ర తెలిసియు లోకాపవాద భీతి తో నిన్ను అడవిలో విడిచి రమ్మని ఆజ్ఞాపించాడని పల్కడమే కాక హరుని కోదండాన్ని విరిచి,వాలిని సంహరించి, సముద్రాన్ని బంధించి,రావణుని ద్రుంచి వివిధమైన సాహసాలు చేసింది  నీ కోసమే గదమ్మ అంటూ సీత ను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు.
                                
                                 అడవులం బడి యగచాట్ల నంది యంది
                                   క్రూర దైత్యుని బాధల కుంది కుంది
                                   చిచ్చులో జొచ్చి వల్లభు జెందినావు
                                    కడకు కడ తేఱదయ్యె  నీ కాపురంబు
    
            అంటూ ఇక్కడ కన్నీరు కార్చింది సీతమ్మ ను తమ ఆడపడుచు గా ఆరాథించుకొనే  తెలుగు హృదయమే కాని  వేరుకాదు. ఈ ఆర్తి  రామాయణ కవులైన తెలుగువారిలో ఎంతోమంది లో కన్పిస్తోంది.
                            
                                  “ అలరు తోటల విహరింప వలయు నీవు
                              ఘోర వనముల నే రీతి గ్రుమ్మరిలెదు
                              కొదమ చిలుకల పలుకుల బెదరు నీవు
                            పులుల బొబ్బల నే రీతి  నిలువగలవు?’’

           అంటూ ఆవేదన చెందుతాడు ఆథునిక కవి లక్ష్మణుడు.తన దురదృష్టాన్ని నిందించుకొంది. సహనం వహించింది భూజాత.
                        అడల నేటికి లక్ష్మణా! అన్నయాన
                        దాటవచ్చునె నీకు? విథాత నన్ను
                        అడవులం బడి యిడుముల బడయుమంచు
                        వ్రాసియుండగ తప్పింప వశమె తండ్రి
    
              అంటూ లక్ష్మణుని ఓదార్చింది కాని తన లోని ఆవేదనను  అణచుకోలేక –
                          
                             “పిడుగు కంటెను గటకటా!  బెడిదమైన
                          పలుకువినియును గుండియ పగులదయ్యె
                          పాడు బొందిని ప్రాణంబు బాయదయ్యె            
                          ఎట్లు వేగింతునో కాల మింక మీద
         
                పెద్ద కష్టం పిడుగు లాగ మీద పడ్డప్పుడు  తెలుగువాడు అనుకొనే మాట ఇది.  ఇక మీద కాలం ఎలా గడుస్తుందో ‘’.  గడవబోయే కాలాన్ని గూర్చి భయపడిన సీతమ్మ గొంతుకలో సుళ్ళు తిరిగిన ఈ వేదన-
                       
                           “ కటకట లక్ష్మణా పిడుగుకంటెను  బెట్టిదమైన మాట నే
                        డిట వినియుండియున్  పగులదింతలు నింతలు గాదు గుండె  ----
      
              అన్న కంకంటి వారి సీతమ్మ దే. కంకంటి పాపరాజు తెలుగు భవభూతి. కాకపోతే  ఈ ఘట్టం లో ఇంత బరువైన పద్యాలు తెలుగు వారికి లభించేవి కావేమో. నిజంగా కంకంటి రామాయణం తెలుగువారికి లభించిన అపురూప ఆస్తి.
              
              ఈ కావ్య రచయిత  శ్రీ నాళం కృష్ణారావు గారికి కంకంటి మీద ఉన్న గాఢాభిమానమే ఈ విధమైన  అనుకరణ కు కారణమైందని భావించవచ్చు. అంతేకాకుండా ఈ విథంగా మరొక్కసారి  కంకంటి వారిని గుర్తుచేసుకొని, వారి కావ్యాన్నిఇంకొక్కసారి  చదివేటట్లు చేయడం కూడ కవి ఆశయం కావచ్చు.

              తాను అయోనిజ గా ఆవిర్భవించిన విషయం ,అనసూయ అంగరాగాదుల నిచ్చిన విషయం, తుదకు అగ్నిప్రవేశం చేసిన విషయం సైతం మర్చిపోయాడా!’’ అంటూ ప్రశ్నించిన నాళం వారి సీత.

                       అంత యేటికి వనముల కనుచునాడు
                       పొలుపుమై తాను నన్నెంతొ బుజ్జగించి
                       ఎన్ని నయగారములు పల్కె ఎన్ని వగలు 
                        చేసె అన్నియు నిజమంచు మోసపోతి

అంటుంది. అంతేకాదు అడవులకు పంపిస్తే పంపిచాడు కాని ఆ మాట నాతోనే చెప్పవచ్చు కదా!’’ అంటూ ప్రశ్నిస్తుంది ఈ కావ్యం లో సీత. శ్రీరాముడు చూపించిన నయగారాలకు, వగలకు మోసపోయా నన్న సీత ఆథునిక కవి సృష్టి. ఆ మాటలు రామునిపై కోపాన్ని ప్రదర్శిస్తున్నాయి.
                         
                                 “లోకనిందను సైరించలేక విభుడు
                            వనములకు నన్ను బనిచిన పనుచుగాక
                            నాడె యామాట నాతోడ నాడరాదె
                             అకట యీరీతి కపటనాటక మిదేల
   
                  అని వాల్మీకి సీతమ్మ అనజాలదు. రామయ్య మీద అపారమైన భక్తి, గౌరవాలున్నప్పటికీ, ఆయన మా తల్లి సీతమ్మ ను అడవులకు పంపిచాడనే ఉక్రోషం  అప్పుడప్పుడ  కొందరు భక్త కవుల చేత ఇలా పలికిస్తూ ఉంటుందేమో.                
                         
                              “ అంకమున  జేర్చి బాళి నన్నదిమి కొనుట
                          అకట అనురాగమున కది యవధి యేమొ
                          మోము మోమున గదియించి  ముద్దు లిడుట
                           చెలిమి కయ్యది కడసారి చీటి యేమొ
             
                     “మోము మోము న గదియించి ముద్దులిచ్చింది  ఆథునిక కవి రామచంద్రుడే.
                 
                  రాముడు లేని జీవితం  తనకు లేదని, ఇంతకు ముందు  లంకానగరము నందయితే నాథుడు వస్తాడనే ఆశ తో జీవించాను.ఇప్పడు ఆ ఆశ కూడ లేదని నాదు మేనున్నది, చెంత గంగ మడుగున్నది అంటున్న సీతమ్మ గంగమ్మను పాఠకుల హృదయాల్లోకి ప్రవహింపచేస్తుందంటే అతిశయోక్తి కాదు.
       
                        అడుగడుగునా కంకంటి వారి మార్గం లో కరుణ రసాన్ని కావ్యం లో నింపి, తెలుగు పలుకుబడులతో  క్రొత్త అందాలను చూపించి, తన దైన శైలిలో మెప్పించారు పైడిలేడి- అపవాదము కావ్యం  లో  శ్రీ నాళం వారు.

*********************************************************************** *******                                                                                  
                            


                                         

Saturday, 15 June 2013

పైడిలేడి- అపవాదము(మొదటిభాగము)

         

              పైడిలేడి అపవాదము
                                                                                                          (మొదటి భాగము)
                              
                                 రామాయణ మహాకావ్యంలో సీతారాముల వియోగానికి కారణమైన రెండు సన్నివేశాలను తీసుకొని కావ్యంగా మలచిన మథురకవి శ్రీ నాళం కృష్ణారావు గారు. ఇది రెండు భాగాలు గా విభజించబడిన  చిరుకావ్యం.
                             

                 
                      దీనిలోని మొదటి భాగం జానకీ రామచంద్రుల   తొలి వియోగానికి కారణమైన మాయలేడి వృత్తాంతం  కాగా రెండవభాగం  నిండుగర్భిణియైన సీతామహాసాధ్విని అడవిలో వదిలి వేయడానిక కారణమైన జనాపవాదానికి సంబంధించినది. అయితే ఈ రెండింటిలోను గల సమాన లక్షణం ఇచ్చట కన్పించేవి  రెండే పాత్రలు కావడం- ఆ  రెండు పాత్రలు సీతాలక్ష్మణులు కావడం,- అందునా రెండు ఘట్టాల్లోను నష్టపోయినది సీతమ్మే కావడం గమనించదగ్గ విషయం. ఈ  సమాన లక్షణాలే కవిని ఈ కావ్య నిర్మాణానికి ప్రోత్సహించి ఉండవచ్చు. ఆకారం లో చిరుకావ్యం గా కన్పించినా   విశ్లేషణ లో మిన్నగా  గోచరిస్తుందీ కావ్యం.
                            
                               బంగారులేడి వేషం లో రాముని గికురించి దూరం గా  తీసుకుపోయాడు మారీచుడు. కోపించిన రాముడు రామబాణాన్ని సంధించాడు. మరణిస్తూ  కూడ ప్రభుభక్తి ని ప్రదర్శించుకున్నాడు మారీచుడు. పర్ణశాలలో ఉన్న సీతాలక్ష్మణులు  రాముని గొంతుకతో విన్పించిన ఆర్తనాదాన్ని విన్నారు. భర్త కంఠస్వరం విన్న సీతాదేవి రామునకు  ఏమైనా ప్రమాదం జరిగిందేమో నని   శంకించి, లక్ష్మణుని రామునకు సహాయం గా వెళ్లమని కోరడంతో  కావ్యం ప్రారంభమౌతుంది.
                            
                         ఆర్తస్వరం తు తం భర్తు ర్విజ్ఞాయ సదృశం వనే ( వాల్మీ. రా. అ. 42-1)

                  అనే  వాల్మీకాన్ని ఆధారం చేసుకొని --
                                   
                             “ అదిగో సౌమిత్రి వింటివే యార్తరవము’’
   
                       అంటూ ప్రారంభిస్తారు నాళం వారు తన కావ్యాన్ని .
                           
                      “ పెనగి మృత్యువుపైకొన్న వేళగాని కలుగదెన్నడునట్టి యాక్రందరవము అని భీతిల్లిన సీత రామునికి సహాయంగా లక్ష్మణుని వెళ్లమంటుంది.అయితే రాక్షసుల మాయలు ,రామచంద్రుని పరాక్రమము తెలిసిన లక్ష్మణుడు కదలకుండా అలాగే ఉండిపోయాడు.భయపడింది. అనుమానించింది సీత. మీ అన్న మీద కన్న నామీద ఎక్కువ గౌరవం చూపించే వాడివి. ఇప్పడేమయింది. పిలిచినా పలుకని  స్థితిలో ఉన్నావు.
                      
                    “ మున్ను నా పాదముల భక్తి మ్రొక్కి గాని అన్న మొగమైన చూడవు కన్నులెత్తి  అంటూ ఇంతకు పూర్వము లక్ష్మణునిలో ఉన్న భక్తి ప్రపత్తుల్ని గుర్తుచేసి, తుదకు లక్ష్మణుడు వెళ్లకపోతే తన భర్తను కాపాడుకోవడానికి తానే వెడతానని బయలుదేరుతుంది  సీతాదేవి.
                                   
                                               భ్రాత కాపాడ నీకంత భీతియున్న
                                   నిలిచియుండుము నీవిట నేనెపోయి
                                  శత్రువుల నెల్ల నొకపెట్టి జక్కడించి
                                   స్వామి గొను వత్తు తలపువ్వు వాడకుండ   
                 
                 -  అనడంలో శతకంఠ. సహస్రకంఠ రామాయణాల్లో దర్శనమిచ్చే   శక్తి స్వరూపిణి యైన సీతామాత ను  దర్శింప చేస్తారు కవి. తల పువ్వు వాడకుండ స్వామి గొనువత్తు నన్న  సీత నాళం వారి వీరవనిత. ఇక్కడ చక్కని తెలుగు నుడికారం పరిమళించింది.
                   ‘’  మేక వన్నె పులిలాగ ఇంతకాలం రాముని వెంటతిరిగావు. నీతత్త్వం ఇప్పుడు నా కవగతమైంది. ఎంత కుటిలాత్ముడ ‘’వంటూ నిందించడమే కాకుండా కర్ణకఠోరంగా  -
                                   వాడు చచ్చిన తోడ నా పీడ వదులు
                                  వాని భార్యను చేపట్టి వైభవంబు
                                  మించ నేలెద గాకంచు నెంచితేమొ
                                  నిలువు నీఱయి కూలవె తులువ యిపుడ
         
                     ---  అన్న మాటలు వాల్మీకి సీతమ్మవే.
                               
                        ఇచ్ఛసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణ మత్కృతే
                 లోభన్మమ కృతే నూనం నానుగచ్ఛసి రాఘవం          (వాల్మీ.రా. అ 45-64).
                   
                        భావాలు మూలానుసరణమే అయినా తేటతెనుగు మాటల్లో  రూపుదిద్దుకున్న పై పద్యం  కాఠిన్యతను సంతరించుకొని ,చటుక్కున  గుండెకు గుచ్చుకుంటుంది. వినశ్యంతం రామం అన్న పదాలకు వాడు చచ్చినతోడ అని ప్రారభించి, ఆ పీడ వదలు అంటూ పలికి లోభాన్మమ అన్నపదాన్ని ఆథారం చేసుకొని వానిభార్యను చేపట్టి వైభవము మించ నేలెద గాక అంటూ పలకడం, నిలువు నీఱయి కూలవె తులువ అన్న  చోట నిలువునా బూడిదై పోతావు అన్న తెలుగువారి తిట్టును గుర్తుచేస్తూ గాంభీర్యాన్ని సంతరించుకొంది.          
                          
                           తమ్ముడొక్కండు రాజ్యంబు తస్కరించె
                         బలిమి నొక్కడు భార్యఁ జేపట్టనెంచె
              
                      రాముని తమ్ముళ్ల లో ఒకడు రాజ్యాన్ని కాజేస్తే,వేరొకడు భార్యనే కాజేద్దామని కూర్చున్నాడు. ఏమి కావింప నుండెనో యింకనొకడు.”?           ఇక మూడో వాడు ఏమి చేయబోతాడో అంటూ మంచితమ్ముల కూర్చెరా  . బ్రహ్మ అనేస్తుంది నాళం వారి సీత.
              
                           పిడుగులు కురిపిస్తున్న   జానకి పలుకులు వినలేక పోయాడు లక్ష్ణణుడు హరిహరీ! తల్లీ ! ఎంతమాటాడినావు అంటూ గిజగిజ లాడిపోయాడు.శాంత హృదయయైన సీత ఇంత నిష్టూరంగా మాట్లాడటం మంచు ముద్దనుండి ప్రచండాగ్ని పుట్టినంత ఆశ్చర్యాన్ని కల్గించింది లక్ష్మణునికి. కలత చెందాడు .
           
                     రాక్షస మాయలను భేదించడం రాముని కసాథ్యంకాదని, ముల్లోకాలెత్తి వచ్చినా రాముని కపజయం తటస్థించదని అంటాడు లక్ష్మణుడు మూలంలో .  త్రిభుర్లోకై  స్సముద్యుక్తై  సైశ్వరైరపి సామరై:’’  (వాల్మీ.అ.45-161). దీన్ని ఆథారం చేసుకొని --
                  
               “   రాముడెన్నగ నాది నారాయణుండు
                    కాని కేవల సామాన్య మానవుండె
                    అవని భారంబు హరియింప నవతరించె
                    ననుచు మౌనులు వచియింప వినవె తల్లి ‘’
        
         - అని రాముని పరమాత్మగా స్తుతించిన మునుల వాక్యాలను గుర్తుచేస్తాడు.ఎల్లలోకాలు ఎవని సహాయం లేకపోతే నిముషం కూడ నిలబడలేవో ఆమహనీయునకు నేను సహాయం గా వెళ్లడమా అంటూ ఆశ్చర్యపోయిన లక్ష్మణుడు వాల్మీకి సృష్టి కాదు. ఒంటరిగా నిన్ను వదలి వచ్చినందుకు అన్నగారు కోపించి నావంక చూస్తే ఏమి చెప్పుకోవాలి అన్న ప్రశ్న నాళం వారి లక్ష్మణునిది.
                 
                   నిన్ను కాపాడమని యన్న నిలిపె నన్ను
                   అన్న కాపాడ బొమ్మని యనిపెదీవు
                    ఏది కర్తవ్యమో నిర్ణయింప జాల
                   ముందు జన నూయి వెనుక గోయి’’
          
                  - ఎవరి ఆజ్ఞను పాటించాలో తెలియని డోలాయమాన స్థితి లో లక్ష్మణుడు కర్ణ కఠోరమైన సీతమ్మ మాటలు వినుటకంటె  అన్న కోపాగ్ని కి ఆహుతి అగుటయే మేలు  అని నిర్ణయించుకొని  వెళ్లపోతానంటాడు.  ఈ సందర్భం లో లక్ష్మణుడు ఆడవారి  ప్రవర్తనను వివరిస్తూ,--
                       
                          వాక్యమప్రతిరూపంతు నచిత్ర స్త్రీషు మైథిలీ
                         స్వభావస్త్వేషు నారీణా మేవం లోకేషు దృశ్యతే
               విముక్త ధర్మా శ్చపలా  స్తీక్ష్ణా భేదకరా స్త్రియ: ‘( వా.రా.అ 45- 284-294)
   
                        అంటాడు .ఈ మూలాన్ని ఆధారం చేసుకొని,
                       
                      తమ హితము తామెఱుగరు తమ హితంబు
                          గోరి యొరులాడు పల్కుల చేరి గొనరు
                          తాము చెప్పన మాటలె తథ్యమనుచు
                          పెనగెదరు చాన లెంత వెడగులౌర !”
                      
                 -  అన్న మాటలు ఆథునిక లక్ష్మణునివి. ఆడవారి కోపం వలన వచ్చే అనర్థాలు, వానిని అవగాహన చేసుకోగలిగిన పరిపక్వత ఈ లక్ష్మణుని లో కన్పిస్తాయి. సీత ఆజ్ఞను శిరసావహించి, అన్న కోసం  వెడుతున్న లక్ష్మణుడు వాల్మీకం లో-
          
                 ‘'  స్వస్తి తే2స్తు వరాననే ,రక్షంతు త్వాం విశాలక్షి  సమగ్రా వనదేవతా: ‘’(వా.రా.అ.45-331)
   
                                     “తల్లీ! నీకు శుభమగు గాక,! వనదేవతలు నిన్ను రక్షింతురుగాక!” అంటూ ప్రార్థిస్తాడు లక్ష్మణుడు.
                           
                                 ప్రభుని తోడ్కొని మగుడ నేవచ్చుదాక
                                ఎవ్వడైనను నిను ముట్టెనేని , తోన
                          పుడమి పై గూలు గావుత బూది యగుచు
                        
          -అని శాపం పెట్టి వెళ్లాడు నాళం వారి లక్ష్మణుడు. లక్ష్మణుడు అటు వెళ్లగానే  సీతమ్మకు దు:ఖం  పెల్లుబికింది. అనేక దుశ్శకునాలు  గోచరించాయి. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో నని భయ పడుతూనే, ఎన్ని ఇబ్బందులొచ్చినా భయపడను కాని  -
                     
                             ‘’ చారుగుణ శీలు, సన్నుతాచారలోలు,
                                    మఱది తిట్టితి, దానికి మ్రగ్గుదాన’’   
                                    
                           - అని మఱది ని తిట్టినందుకు పశ్చాత్తాపపడిన జానకి తెలుగుకవి సృష్టి. వాల్మీకి సీతలో ఈ విధమైన పశ్చాత్తాపం  రావణాపహరణం తరువాత కన్పిస్తుంది. కానీ ఈ కావ్యంలో ఈ ప్రదేశం లోనే  తన మాటల్లోని  తొందరపాటు ను వెంటనే సీత గుర్తించినట్లు వ్రాయడం  మైథిలీ పాత్రకు మరింత ఉన్నతిని కల్గిస్తుందని  కవి భావించి ఉండవచ్చు.
                          
                ఆత్మ సుఖము ను వర్జించి యన్న కొఱకు
                    అడవులం బడి ఇడుముల గడుచుచున్న
                    దురిత దూఱుని లక్ష్మణు దూఱి యుంటి
                   కట్టి కుడుపక యున్నే యీ కర్మఫలము.’’
                          
                     -    అని విచారిస్తున్న సీతమ్మ పల్కులు    భవిష్య సూచకాలు గా  థ్వనిస్తాయి.    రామాయణ కథ అందరికీ తెలిసిందే అయినా తెలుగు సామెతలు, జాతీయాలు అందంగా రచనలో చోటుచేసుకొని కావ్యానికి స్వతంత్రపత్తిని కల్గించాయి.
                              
                                    ఇక ఈ కావ్యం లో రెండవభాగం  అపవాదము. 
                                                                                                                                   
                                                                  (తరువాయి భాగంలో)


                

******************************************************************************************