శ్రీ రామ నామామృత జీవనుడు
కవి పొందే తాదాత్య్మతే కవిత్వానికి మూలం. “అపారే కావ్య సంసారే కవిరేవ
ప్రజాపతి: “అంటుంది అలంకారశాస్త్రం . ఏ తాదాత్య్మంలో కదిలి వాల్మీకి ఆదికావ్యాన్ని
రచించాడో, మన పోతన్న ఏ భక్తి పారవశ్యానికి లోనై రామభద్రుని చేత భాగవతాన్ని
పలికించుకున్నాడో, ఏ ఆవేశ ఆవేదనలకు
గురై కంచర్ల గోపన్న ప్రజాధనాన్ని రామునికి
నివేదన చేశాడో, ఆ ఆవేశమే ఈ గోపన్నను నడిపించింది.కదిలితే పద్యం, మెదిలితే శ్లోకం ,
కల మెత్తితే రామ నామం, గళ మెత్తితే రామగానం గా జీవించిన భక్త కవి తమ్మర గోపన్న.
నల్గొండ జిల్లా కోదాడ మండలం లోని తమ్మర గ్రామం ఈ కవి జన్మస్ధలం. ఆ గ్రామం లోని సువిశాలమైన రామాలయ ప్రాంగణం లో నిండైన రూపం తో,ఊర్ధ్వపుండ్రధారియై, కౌపీనాన్నిమాత్రము ధరించి, నెరిసిన పొడవైన గడ్డము,,జడలు కట్టిన శిరోజాలతో సంచరించిన మూర్తి ఈ గోపన్న. రామ నామము వింటే గాద్గద్యమైన గొంతు ఆదికవి ని స్మరించి,శ్రీమద్రామాయణ శ్లోకాలను మధురంగా గానం చేస్తుంది. ఆ వెంటనే ఆ సందర్భం లోని ఆంద్ర వాల్మీకి వాసుదాసు పద్యాలను అలవోకగా ఆలాపిస్తుంది. సమయానుగుణంగా గోవిన్ద రాజీయ వ్యాఖ్యాన పాఠాలు ఆ గొంతు లో మృదువు గా ధ్వనించేవి. అమ్మ సీతమ్మ రాఘవుని తో కలసి సంచరించిన పంచవటీ ఘట్టాలు పులకితదేహులై గానం చేస్తారు. వీరు రచించిన గ్రంధాలు డెభ్భైకి పైగా ఉన్నాయి.
వీరి గ్రంధాలన్నీ రామాంకితాలే. రామ భక్తి పరమైన వీరి కావ్యాలలో రాముడు, కృష్ణుడు, నారసింహుడు , ఎవరైనా వీరి దృష్టి లో రామునకు మారు రూపులే. ఈ కావ్యాలలో మొదటి మూడు పద్యాలు శ్రీ -రా -మ అనే అక్షరాలే మొదటిఅక్షరాలు గా కలిగి ఉంటాయి. ఇది వీరి కావ్యాల ప్రత్యేకత. వారి కావ్యాలలో ఎక్కువ గా నలభై పాదాలు,లేక ఏభై పాదాలు కలిగిన ఉత్పలమాలిక గాని, చంపక మాలిక గాని ఉండటం ఒక విశేషం . స్తుతి శతకాలు, ప్రార్ధనలు,నక్షత్ర మాలికలు, రామాయణేతివృత్త కావ్యాలు, గుణరత్న కోశము వంటి సంస్కృత కావ్యాలకు అనువాదాలు, భావతరంగిణి పేరు తో నిత్యజీవితం లో తనలో కలిగే భావ సంచలనాలకు అక్షరాకృతులు పన్నెండు భాగాలు. ఇలా ఎన్నో, ఎన్నెన్నో వీరి కావ్యాలు.
ఈ భక్తకవి ముద్రించిన
ప్రతి పుస్తకము అమూల్యమే. ధర ఉండదు. నలభై కావ్యాలు ముద్రితాలు కాగా, ముఫ్ఫై కి పైగా
కావ్యాలు వ్రాతప్రతులు గా మిగిలి పోయాయి.
ముద్రితములైనవన్నీ కవిమిత్ర బాంధవులచేత ముద్రించబడి,అమూల్యములై సాహితీ
మిత్రులకు అందజేయ బడ్డాయి. ఆ రామచంద్రుని
అనుగ్రహం చేత వెలుగు చూచిన పుస్తకాలకు” సర్వాధి కారి” గా రామునే చేసి” సర్వస్వామ్యములు” ఆయనకే అర్పించిన అదృష్ట
శాలి ఈయన.
నేను రామాయణము మీద పరిశోధన చేసే రోజుల్లో ఈ మహాను భావుని తో కొన్ని రోజులు గడిపే అవకాశం నాకు లభించింది . ఈయనకు జానకీ ధవుని పేరు చెపితే ఫ్రేమాను రాగాలు పెల్లుబికి కంఠం గద్గదమై కన్నులు అశ్రుపూరితాలౌ తాయి. సీతమ్మ పడిన కష్టాలను గురించి, రామయ్య సత్యపరాక్రమాన్ని గురించి ఆయన చెప్పుకు పోతుంటే ఎన్నోరాత్రులు అలానే గడిచి పోయి, సూర్యోదయమై పోయిన రోజులు నేను ఎప్పటికీ మరచిపోలేను. మన ఇంట్లో ఒక స్వంత వ్యక్తి కి కష్టం వచ్చినట్లు ఆ మహాను భావుడు సీతా రాములను గూర్చి , వారి కొచ్చిన కష్టాలను గురించి ఆవేదన, ఆవేశాల తో చెపుతుంటే, పరిశోధనా వ్యాపకం లో ఉన్న నాకు ఆనాడు అది విచిత్రంగా అనిపించేది . కాని పదిహేనేళ్ల తర్వాత ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆయన లోని ఆ ఆవేశానికి అర్ధం తెలిసి, ఆయన ఎంత అదృష్ట వంతుడా ! అని పిస్తోంది.
శతావధాని ముడుంబి సింగరాచార్యుల వారి అంతేవాసులు ఈ కవి. ఆశుకవితాధురీణులు. సంస్కృతాంధ్రాల లో సమానం గా కవిత్వం చెప్పగల్గిన ప్రజ్ఞాశాలి. సాహితీ మిత్రుల తోను, అబిమానుల తోను ఉత్తర ప్రత్యుత్తరాలను పద్యాలలోనే నిర్వహించే వారంటే వీరికి పద్యవిద్య పై నున్న పట్టు ను, అభి మానాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు
. ఈ కవి వ్రాసిన స్తుతి శతకాలు,” జానకీవర”!, జానకీ నాయక,! జానకీ,! భార్గవ,! శ్రీకృష్ణ,! నారాయణ,! లక్ష్మీనృసింహ,! విఖనసార్య! వంటి మకుటాలతో విలసిల్లుతుంటే, సంస్కృతమున పరాశరభట్టర్ వ్రాసిన “గుణరత్నకోశము,” “క్షమాషోడశి,” “రంగ రాజ స్తవము “వంటి కావ్యాలకు భావాను వాదాలు వీరి పాండిత్యానికి దర్పణాలై నిలిచి, పండిత కవుల ప్రశంసలకు పాత్రమైనాయి.” ముకుందమాల” అనువాదము అత్యంత రమణీయము.” శ్రీరంగ రాజ ప్రియా!” అనే మకుటం తో తమిళం లోని తిరుప్పావై పాశురాలకు చేసిన అనువాదము వైష్ణవులకు ఎంతో ప్రీతి పాత్రమైనది. వీరి కావ్యము” అమృతసిద్ధి “క్షీరసాగర మథన వృత్తాంతము కాగా,” పరవానస్మి” లక్ష్మణ పాత్ర ప్రధానమైన రామాయణేతి వృత్త కావ్యము.
అప్పకవి ,వాసుదాసాదుల ప్రభావానికి లోనైన ఈ కవి 1949 ప్రాంతం లో పుష్పమాలికా బంధాది బంధ కవిత్వాలను, గర్భస్రగ్విణీ వృత్తాది గర్బకవిత్వాలను,కూడ వ్రాసి విద్వత్కవుల సరసన తన స్ధానాన్ని పదిల పరచుకున్నారు.
“ భవభవనా వవా! విభవభద్ర భవామర వారతారకా
సువిధ విభా విభాసశుభ శుభ్ర శుభాస్పదమోదసాదరా!
యవన వధా వధ స్మయ మయ ప్రయ తారసు శూర మారకార
సవన వరా వనాఢ్య శరశస్త శరాస నదీన మానసా!
ఇది పుష్పమాలికా బంధము. “ఈ గృహ మొక సత్రమందలి సఖీ సఖబంధు సుతాదులెల్లరు న్గృహమున కొచ్చి పోవగల పాంథులని “నమ్మిన కవి ఈ గోపన్న.
“ కవి యొక మాలికుండతని గ్రంథ చయంబు మనోజ్ఞ
మాలికా నివహ యలంక్రియా వితతి నిర్మల సౌరభమెల్ల పద్దెముల్ “
అని కవి మాలికా కారుడై, గ్రంథ సమూహము లనెడి పూమాలలను పద్యములనెడి పరిమళ భరిత కుసుమాల తో గ్రుచ్చి,సమాజానికందించగా, భృంగరాజములవంటి పండితశ్రేష్టులు “తన్నవ కవితా సుధారసమునం బ్రియ మందెదురని “ భావించి సుగంధ భరిత పద్య రాశి చే కావ్యరచన సాగించారు.
అని కవి మాలికా కారుడై, గ్రంథ సమూహము లనెడి పూమాలలను పద్యములనెడి పరిమళ భరిత కుసుమాల తో గ్రుచ్చి,సమాజానికందించగా, భృంగరాజములవంటి పండితశ్రేష్టులు “తన్నవ కవితా సుధారసమునం బ్రియ మందెదురని “ భావించి సుగంధ భరిత పద్య రాశి చే కావ్యరచన సాగించారు.
“ నీతో ముచ్చట లచ్చటల్ ప్రణతులున్ నీతోడ సల్లాపముల్
నీతో నవ్వులు బువ్వులున్
బ్రణయముల్ నాతో పరీ హాసముల్
నీతో విన్నపముల్ వివాదములునున్
నీతోడనే సర్వమున్”
----- అని రామునే సర్వము గా భావించి, రామనామము చేత పవిత్రీకృత గాత్రుడై, ఆయనే ఒక రామనామ క్షేత్రం గా మారిపోయాడు.
సీతారామ కళ్యాణం జగత్కళ్యాణ కారకము. తెలుగు గడ్డ మీద భద్రాద్రి రామన్న పెళ్లయితే గాని తమ బిడ్డలకు పెళ్లి లగ్నాలు పెట్టుకోని ఆచారం ఉంది. అటువంటి రామచంద్రుడు సీతా మనోభిరాముడయ్యే మనోజ్ఞ కళ్యాణ దృశ్యాన్ని మధుర మనోహరం గా వర్ణించారు కవి.
“ పరిణయవేళ సీత తలబ్రాలిడు నప్డు తదీయ బాహు మూ
ల రుచుల పైన, దన్ముఖవిలాసము
పైన,చిరత్న ర్తన భా
స్వర గళలగ్నహారములపైన నటించు
కటాక్షము -----“
మాపై కూడ చూపమని కోరిన ఈ కవి – “ ఆదిన్ శ్రీ సతి కొప్పుపై, తనువు పై, పాదాబ్జంబుల పై, కపోల తటి పై, పాలిండ్ల పై , నూత్న మర్యాదం చెందు కరంబు “అని వ్రాసిన పోతన మధుర భక్తి ని గుర్తుకు తెచ్చి రసిక హృదయాలను రంజింప జేస్తారు.
రామచంద్రుని వెంట అడవికి బయలుదేరిన జానకి –కడుంగడు మోహనంగా కన్పించింది ఈ కవికి.” సుశ్యామల కోమలాంబుదము నంటి వెలుంగు తటిల్లతం బలెన్ “ ---- అని నల్లని కారుమేఘం వెనుక వెలిగిన మెరుపు తీగ వలె రాముని వెంట సీత కదిలింది. భాస్కర రామాయణ వర్ణన పాఠకుల హృదయాల్లో మెదులుతుంది. శ్రీరామ నామానికి కొత్త అర్ధాన్ని ఆవిష్కరించారు కవి. శ్రీ –యనగా సీత –అని, రా – యనగా- రామచంద్రుడని, మ –యనగా- భక్త్యాయుతుడైన లక్ష్మణుడని –కవి విశ్లేషణ.
మండుటెండలో రాఘవుని అనుసరించే సీతమ్మను కవి చూడలేక పోయాడు. రవి కిరణాళి కందిన సీత ను చెట్టునీడన నిలబెట్టాడు. ఆ చెట్టు గొడుగు లాంటి కొమ్మల తో ఆవిడకు నీడ నిచ్చింది. దానికి కారణం ------
“ అవనిజముల్ కడుం గొడుగు లట్టులు శాఖల బట్టుచున్నవి
య్యవనిజ కిట్టులుండ వలదా నిజసోదర సాదర క్రియల్ ....”
చెల్లెలు వస్తుంటే ఆప్యాయంగా చేతులు చాచి అబిమానించి ఆదరిస్తాడు అన్న. అది సోదర సోదరీ ప్రేమ. సీత అవనిజ. వృక్షాలు అవనిజ లు. అనగా వీరు సహోదరులు. కాబట్టే చెట్లు కొమ్మల వంటి చేతులు చాచి సీతకు నీడనిచ్చాయి. చెల్లెలు వచ్చిందని అన్నలు చూపిన ఆదరణ అది. ఇటువంటి భావాలు పండిత జన ప్రమోదాలు . రసిక హృదయ రంజకాలు అనడం లో అతిశయోక్తి లేదు.
అరణ్య వాసానికి బయలు దేరిన రామ – సీత - లక్ష్మణుల లో ప్రణవమైన ఓంకారమే గోచరించింది కవికి. “ రాఘవుండు ముందుగ వెన్కను సీత లక్ష్మణుండే యెడ వీడిపోక వొకరే యనగా జని రా – ఉమా -క్ష రాలే యెడ వీడకుండి యొకటి యగు సత్ప్రణవాక్షరంబనన్ ---“ అని – ఆ+ ఉ +అమ్ అన్న ( ఓం ) అక్షరాల్లోనే రామ – సీత- లక్ష్మణులను దర్శించిన ధన్యజీవి తమ్మర పోతన్న. ఆచార్య దివాకర్ల వెంకటావధాని వీరి కవిత్వాన్ని గూర్చి వ్రాస్తూ “ వీరు భక్తి కవితా సంపద లతో పోతనకు థీటైన వారు. వారైహిక ధనలాభమునకు గాని, కీర్తిని గాని వాంఛింపరు “ అన్నారు.
వేకువ జామున కాకులు” కావు కావు” మని అరవడం సైతం రాముని” కావుమని” ప్రార్ధించినట్లే ఈ కవి కి
విన్పిస్తోంది. “ --- కాకులు గూడ వేకువన కావు హరే మము
గావు మంచేక ముఖంబుగా నఱచు చెంతయు నిన్ను నుతించు చుండ గా మందులమై మేము వేకువ నిద్ర లేచి నీనామము చేయలేక కాకుల కంటె నీచులమని” పల్కిన కవి మాటలు
కొందరికి ఎద లోతులలో ఎక్కడో
గ్రుచ్చుకొని బాధని కలిగించవచ్చు. కాని
కవి మాటలు మాత్రం నిజం. ఇక్కడ “ప్రాత: కాలపు వాయసంబు పణినా పత్యోక్త శాస్రంబు లో” కాకుల చేత పాణిని వ్యాకరణాన్ని ప్రస్తావింప జేసి, కోకిలల చేత సమాధాన మిప్పించిన శ్రీనాథుడు మన కవి హృదయం లోకి ప్రవేశించాడనిపిస్తుంది . ఆ
కవి సార్వభౌముడు ఉద్ధండ పండితుడు కాగా, మన గోపన్న భక్తి కవితా నిర్మగ్నుడు.
అందుకే కాకులు “కావుకావు “మని రామచంద్రుని తెలుగు లో
వేడుకున్నాయి.
“ గీతగీచి నిన్ను గీతలోపల నిల్పి
ప్రీతి చేత నీకు జోత సల్పి ......”.
అని గీతలలో రామకోటి రాయడాన్ని రమ్యం గా చమత్కరిస్తాడు ఈ కవి.
రామచంద్రుని “గీతగీసి తన మానసపంజరం లో
నిలుపు కున్న ఈ కవి చంద్రుని
పూర్తిపేరు నరహరి గోపాలా చార్యులు. “బొమ్మకు పెళ్లియా “యని నవ్వు వారలకు” బ్రహ్మ” కు వికృతి” బొమ్మ” యని, మాధవ కళ్యాణమే మానవ కళ్యాణము కాగలదని సున్నితంగా సూచించిన ఈ కవి సాహిత్యము శాశ్వతమై
విలసిల్లుగాక !
**************************************************************************************