Saturday, 29 December 2012

శ్రీ రామ కావ్యామృతం ---3


                        శ్రీ రామ  కావ్యామృతం ---3
                  
                శ్రీ రామ నామాలు శతకోటి అన్నట్లు – శ్రీ రామ నామ ధ్యానం తో జీవితాన్ని పండించుకొని, కావ్యనిర్మాణం చేసిన భక్త కవులు ఎందరో. అటువంటి వారిలో  శ్రీమాన్ గుదిమెళ్ల రామానుజాచార్య ఒకరు. వీరు రామాయణ ఇతివృత్తమే ప్రధానంగా  ఎన్నో లఘు కావ్యాలు వ్రాశారు.ఆ కావ్యాల లో కొన్ని  ఆణిముత్యాల లాంటి పద్యాలు   రామ కావ్యాభిమానుల కోసం.

                   
                            సీతారాములను గురించి చెప్పేటప్పుడు, వ్రాసేటప్పుడు, సీతారాములు, జానకీ రాములు అనే పిలుస్తారు గానీ,రామ సీతలు, రామ జానకిలు అని ఎందుకు పిలవరు అని ప్రశ్నవేసి,    శబరి కావ్యం లో—ఈ విషయాన్ని ఎలా చమత్కరించారో ఈ భక్త కవి చూడండి.
                    
                        సీత, తనంత తా నెడమ చే నవలీలగ నెత్తు కార్ముకం
                       బాతరి నీవు లేచి కుడి హస్తము తో నది యెత్త గల్గి తీ
                       చేతుల జంటలో నెడమ చేతితో నెత్తుట గొప్పగాన,వి
                      ఖ్యాతిని గూర్చినారు జనకాత్మజకే ఋషులెల్ల రాఘవా.
             
               సీతాదేవి ఎడమ చేతితో తీసి ప్రక్కన పెట్టిన  శివధనస్సును, రామచంద్రుడు  నిండు సభ లో  కుడి చేతి  తో ఎత్తడం చూసి,   కుడి చేతి తో కంటే ఎడమ చేతితో ఎత్తడం  గొప్ప కాబట్టి  ఋషులందరు సీత పేరును ముందు చేర్చి ఆమె కే గౌరవాన్ని చేకూర్చారంటుంది  వీరి కావ్యం లో శబరి పాత్ర  రామచంద్రునితో.  అల్పాక్షరం పూర్వం అన్న  వ్యాకరణ  సూత్రాన్ని కాసేపు మర్చిపోతే, ఈ భావన అతిరమ్యంగా  సీతాధిక్యాన్ని సమర్ధిస్తుంది.
                  
        మరొకటి...... వీరి ఊర్మిళ కావ్యం నుండి   ----
              

                రాముని ఆజ్ఞానుసారం తనవారి  అనుమతి తీసుకోవడానికి, లక్ష్మణుడు అంతపురానికి వస్తాడు. దాసి  వెళ్లి ఆ వార్తను ఊర్మిళ కు చెప్పింది.
                      
                      పచ్చని మేని తో, నుబికి వచ్చెడి ప్రాయపు బాలపొంగు తో,
                       విచ్చిన తమ్మిపూల వలె వేడుక గొల్పెడు కన్నుదోయి తో
                
                   చక్కని ముక్కు , శ్రీ లొలుకు సన్నని మేను,గులాబి శోభలన్
                 బుక్కిలిపట్టు చెక్కిలియు, పుష్పశరండుల జైత్ర యాత్ర కై
                  యెక్కు రథమ్మువోలె గడు నింపుగ నున్న  నితంబము,
                
                  పచ్చని శరీరము, పాలపొంగు లాంటి ప్రాయము,విచ్చిన తమ్మిపూల వంటి కన్నుదోయి, చక్కని ముక్కు, శ్రీ లొలుకు సన్నని శరీరము, గులాబీల కాంతిని పుక్కిలి పట్టినట్లున్న చెక్కిళ్ళు, మన్మథుడు జైత్రయాత్ర కు బయలుదేరు రధము వంటి నితంబము,   ---------      ఇది  ఊర్మిళాదేవి మనోజ్ఞమైన వర్ణన లో ఒక భాగం మాత్రమే.
                         భర్త వచ్చిన విషయం దాసి చెప్ప గా, మేడ దిగి వస్తున్న ఊర్మిళా దేవిని కవి వర్ణించిన తీరు చూడండి.   ........
                 
                   గబ గబ మేడ మెట్లు దిగి కాంచి నితంబము నుండి వ్రేలగా
                    గుబ గుబ పొంగ దియ్యనగు కొన్ని తలంపులు, రాజహంసకున్
                    సొబగులు  నేర్పునట్టి గతి శోభలతో నెదురేగుదెంచె, లో
                    నుబికిన ప్రేమవాహిని మహోర్ముల నూర్మిళ నూపు చుండగన్ .
           
       
                 "మైథిలి అనే కావ్యం లో   బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రాజర్షియైన జనకుని తో ప్రస్తావనా వశం గా రాముని గూర్చి చెపుతూ  ........
        
         “ ఆగమమన్న మాకు నిజమైనది రాముని యాగమమ్మె, మా
           యోగమటన్న వీడుదరి నుండుటె యోగము, దర్శనమ్మనన్
          బాగుగ వాడు మేమిటుల పార్ధివ చూచుటె  దర్శనమ్ము, మా
          కాగమయోగదర్శనము లన్నియు రాముడె చాలు – ధన్యుడన్.
  
 అంటాడు.
             
                     ఈ మాటలు విశ్వామిత్రుని లో పరకాయప్రవేశం చేసిన  భక్తకవి గుదిమెళ్ల వేనేమో అనిపిస్తుంది. ఆగమ ,యోగ, దర్శనాలన్నీ రామునిలోనే  దర్శించిన భాగ్యశాలి గుదిమెళ్ల. అహంవేద్మి మహాత్మానాం రామం సత్య పరాక్రమం అన్న  విశ్వా మిత్రుని తో కవి ఈ పల్కులు పల్కించడం ఎంతో సహజసుందరంగా ఉంది.

శ్రీ సీతారామ కళ్యాణాన్ని  కవి  వర్ణించిన  తీరు  మిక్కిలి  రమణీయం. 
           
                    పువ్వులు రాల—దుందుభులు మ్రోయ, నభస్ధలి నోరచూపులన్
                       రువ్వుచు నుండ,-గన్యలు పురోహితుడా శిషమీయ,గడ్డమున్
                        దువ్వగ మౌని-దశరధుండెన లేని ముదంబు నొంద, లే
                       నవ్వుల మోము తోడ రఘునాథుడు పెండిలి యాడె మైథిలిన్ 

చంపకోత్పలాలతో గుణాభరణాంచిత కావ్యకన్యకను రఘురామునికి సమర్పించిన ధన్యాత్ములు శ్రీ రామానుజాచార్యుల వారు.





**********************************************************

Wednesday, 26 December 2012

శబరీ వృత్తాన్తం ఉపాఖ్యానమా?


              శబరీ  వృత్తాన్తం  ఉపాఖ్యానమా?
      
                 రామాయణ పాత్ర  ల్లో శబరి పాత్ర పొంది నంతటి ప్రాచుర్యాన్ని మరే  ఇతర పాత్ర పొంద లేదంటే అతిశయోక్తి కాదు.  శబరి పాత్ర గానే కాక ఒక నదీమతల్లి గా   సైతం తెలుగు వారికి దగ్గరైన పుణ్యశీల. ఆదికవి శబరి ని  మనకు అందించిన విధానమే ఆ పాత్ర పై ఒక ప్రత్యేక అబిమానం ఏర్పడటానికి కూడ కారణం అయ్యింది.ఎందుకంటే రామాయణం లోకానికి ఆదికావ్యమే అయినా  శబరి మాత్రం తెలుగువారి కే స్వంతం. ఇది తెలుగువారి ప్రత్యేకత.
                                రామకథ లో  శబరి పాత్ర లేకపోయినా రామాయణ  కథా గమనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్రతి పాత్ర కు పేరు పెట్టడం దగ్గర నుండి ఎంతో   నేర్పు తో, గొప్పగా కావ్యనిర్మాణం చేసిన మహాకవి వాల్మీకి శబరి పాత్ర ద్వారా మనకు అందించ దలచిన సందేశ మేమిటి. ఇదీ ప్రశ్న.?   
          మహాభారతం లో ఉపాఖ్యానాలున్నాయి కాని రామాయణం లో ఉపాఖ్యానమేమిటి.?    అంటే మరి శబరీ వృత్తాంతాన్ని ఏ విధంగా చూడాలి.? ఇదీ ప్రశ్నే.?
            
                                         శబరి రామచంద్రుని కొఱకు ఎదురు చూచి, ఎదురు చూచి  వృధ్దురాలైపోయింది.  శ్రీ రాముడు వస్తాడని గురుదేవులు చెప్పిన మాటలు విశ్వసించి, రాముని కోసం అడవి లోని  కందమూల ఫలాలను సేకరించి భద్రపరిచింది . రామ లక్ష్మణులు కనపడగానే వారికి ఎదురేగి పాదాభివందనం చేసి , అర్ఘ్య పాద్య ఆచమనీయాల నిచ్చి అతిథి  సత్కారం చేసింది.    ఇక్కడ శబరి ని  శ్రమణీ “   “ధర్మచారిణీ” అని వాల్మీకి పరిచయం చేస్తాడు. 
                 
                  తనకు అతిథి సేవలు చేసిన ఆ తపస్విని ని     కుశల ప్రశ్నల తో పల్కరించాడు శ్రీరామచంద్రుడు.  
               
               కశ్చిత్తే నిర్జితా విఘ్నా: కశ్చిత్తే వర్ధ తే తప:
                    కశ్చిత్తే నియత: కోప ఆహరశ్చ తపోధనే!!   (అ.74- 8)
                కశ్చిత్తే నియమా: ప్రాప్తా:  కశ్చిత్తే మనస: సుఖమ్
                  కశ్చిత్తే గురు శుశ్రూషా సఫలా చారుభాషిణీ !!          (అ.74-9) 

          “ తపోధనే,”” చారుభాషిణీ, ఇవి శబరిని గూర్చి శ్రీ రాముని సంబోధనలు.
          
     ఓ తపోధనురాలా! విఘ్నాలు లేకుండా తపస్సు కొన సాగుతోందా.? కోపం, అహంకారం అదుపు  ఉంటున్నాయా.? ఓ చారుభాషిణీ ! నియమ వ్రతాలు నిర్విఘ్నం గా  సాగుతున్నాయా.? మనశ్శాంతి లభిస్తోందా.? గురు సేవా ఫలాన్ని  పొందగలిగావా?    “  అని  పరామర్శించాడు శ్రీ రామచంద్రుడు.
           
                సిధ్ధురాలు , సిధ్దసమ్మత, అయిన ఆ తాపసి శ్రీరాముని తో  ఓ పురుషర్షభ ! నీ సందర్శనం వల్లనే నా తప: ఫలం , గురు శుశ్రూషా ఫలం కూడ దక్కాయని నీ అనుజ్ఞ అయితే  గురుదేవుని మార్గం లోనే అక్షయమైన లోకాని కి వెళ్లగలనని కోరింది.నీవు చిత్ర కూటానికి వచ్చినప్పటి నుంచి నీ రాకకు ఎదురు చూస్తూ నే ఈ పంపా తీరమందలి అడవి ఫలాలను మూలాలను సంపాదించి ఉంచానని , అంటూ,  అభిమానం గా కందమూలాలను సమర్పించింది .
       అవి స్వీకరించిన రఘురాముడు --------
              
                 ఏవముక్త : స ధర్మాత్మా శబర్యా శబరీమిదమ్
               రాఘవ: ప్రాహ విజ్ఞానే తాం నిత్యమబహిష్కృతామ్.!!”  (అ.74.19)


           అన్నాడు. పరమాత్మ జ్ఞానాన్ని పొందిన  ఈ శబరి  విజ్ఞానము చే    అబహిష్కృతురాలు. అని  ఆ శ్వాసించాడు.
            
               రాముని కోరిక మేరకు మతంగముని ఆశ్రమమంతా తిరిగి చూపించిన  శబరి  రామానుగ్రహాన్ని పొంది,యోగాగ్నిని  ప్రజ్వలింప జేసుకొని  అందులో ప్రవేశించి దివ్యాంబర ధారియై,  దివ్యాభరణాలు, దివ్యమాలావిభూషిత యై శబరి ఆమెకు అభీష్టమైన ,మహర్షులు నివసించే ఆనందమయ  లోకాలకు వెళ్లి పోయింది. తత్ పుణ్యం శబరీ స్థానం  జగామ ఆత్మసమాథినా. 

             ఇది వాల్మీకి చెప్పిన శబరీ వృత్తాంతము.
                    

                భక్తపాలన కళాసంరంభుడైన భగవంతుడు తన కోసం ఎదురు చూసే భక్తుల కోసం తానే నడిచి వస్తాడు. వారిని తరింప చేస్తాడు. అందుకే                రాముడు తారక రాముడయ్యాడు. అందుకే   కబంధుడు చెప్పాడని శ్రీ రాముడు శబరిని వెతుక్కుంటూ మతంగాశ్రమానికి వచ్చాడు.
         
              కబంధుడే  ఋష్యమూకాన్ని గూర్చి,సుగ్రీవుని సమాగమ ప్రయోజనాన్నిగూర్చి,ప్రస్తావించి అక్కడకు వెళ్లమని చెప్పాడు. అతడే మతంగాశ్రమ ఫ్రస్తావన తీసుకొచ్చి, శబరి ని చూచి వెళ్లమని  కూడ చెప్పాడు .
     
                 శబరీ ,రామచంద్రుల సమాగమ ,సంభాషణలు  పైన చదివాము వీనిలో ఎక్కడా కూడ  రామచంద్రుని కొచ్చిన  కష్టాన్నిగూర్చిగాని, జానకీ అపహరణ ను గూర్చి గాని ఎటువంటి ప్రస్తావనా రాలేదు. తననుగూర్చి,గురుదేవుల గూర్చి తుదకు తన ఊర్ద్య లోక ప్రయాణాన్ని  ప్రస్తావించి, రాముని అనుగ్రహం తో ఆనందమయ లోకానికి వెళ్లిపోయింది శబరి.  
                     
                       అంటే శబరి వృత్తాంతం  ద్వారా మనకు ఆదికవి అందించదలచిన సందేశం ఏదో ఉంది. అదేమిటి.?
                    
                 “తాపసీ, తపోధన, సిద్ధ, సిద్ధసమ్మత, శ్రమణీ ఇవి శబరిని గూర్చిన  సంబోధనలు. ఆడవారికి  ఆశ్రమాధికారం, సిద్ధసమ్మతత్వ్తం,  యోగాగ్ని ప్రజ్వల నాధికారం ఉందని, మహర్షులు పొందే పుణ్య లోకాన్నిపొందడానికి స్త్రీలకు  కూడ అర్హత ఉంటుందని , జ్ఞానసముపార్జనమే  బహిష్కృతులను, అబహిష్కృతులను ,ఉత్తములను నిర్ణయిస్తుందని   ఈ వృత్తాంతం స్పష్టం చేస్తోంది.
                 
                   భగవంతుడు తనను నమ్మిన వారి కోసం తాను వెతుకుతూ  వెడతాడని చెప్పడం మహర్షి ఉద్దేశ్యం.
    
                     గుర్వనుగ్రహ ప్రభావం, తన ప్రియశిష్యులను గురువు అనుగ్రహిస్తే ఆ గుర్వనుగ్రహబలం వలన శిష్యులు పొందే అపూర్వ శక్తులు, ప్రియశిష్యుల యెడ గురువుల వాత్సల్యానుగ్రహాలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పడానికి కూడ ఈ వృత్తాంతం ద్వారా మహర్షి ప్రయత్నించారా. అనిపిస్తోంది.
               
                                   వాల్మీకి సంకల్పించిన కోణం లో శబరి విశుద్ధచక్రం గాను,పంపాసరోవరానికి ఆవలి తీరం లో ఉన్న ఋష్యమూక పర్వతాన్నిచేరేందుకు మైలురాయి గాను భావించాలి.కబంధ సుగ్రీవులకు మధ్య ప్రధానమైన కొలికి మాత్రమే కాక రాముడు తన ప్రయాణాన్ని అర్ధవంతం చేసుకొనేదశ లో ఒక ప్రధాన స్ధానంగా శబరి రూపొందింది. కబంధము నుండి సుగ్రీవము వరకు మానవాత్మను పవిత్రం చేయడం లో ఆమె సేతువుగ ఉపయోగపడింది. అని వ్యాఖ్యనించారు శబరీ వృత్తాంతాన్ని గూర్చి   ప్రముఖ విమర్శకులు డా.ఇలపావులూరి పాండురంగారావుగారు.     
                            
                                        ఈ శబరీ వృత్తాంతం మనకు చెప్పాల్సింది ఇంకా ఏదో ఉందని నా అభిప్రాయం. అందుకే విజ్ఞులు, విమర్శకులు, సహృదయులు అయిన మీ ముందుకు ఈ వ్యాసాన్ని పంపుతున్నాను. ఇటువంటి పాత్ర రామాయణం లో ఇంకొకటుందా?





కాలోహ్యయం నిరవథీ విపులాచ పృథ్వీ-కాలమనంతము,భూమి విశాలము
  *******************   అన్నారొక మహాకవి ********************
      

Monday, 17 December 2012

తెలుగు కావ్యాలలో శ్రీ లక్ష్మీ స్తుతి


                 
                తెలుగు  కావ్యాలలో    శ్రీ లక్ష్మీ స్తుతి
                 

                
         శ్రీ మహాలక్ష్మి నిత్యానపాయిని. నారాయణుని శ్రీ మన్నారాయణు ని  చేసిన లోకమాత.మంగళ స్వరూపిణి.  . ఈ చరాచర సృష్టి అంతయు శ్రీ లక్ష్మీనారాయణుల సంకల్పాధీనమని పెద్దలంటారు..
                    
              శుభములకే శుభములనిచ్చెడి కల్పవల్లి   శ్రీలక్ష్మి నిగూర్చి తెలుగు కవులు తమ కావ్యాలలో  చేసిన స్తుతులను ఈ వ్యాసం లో చూద్దాము.
              

       
          
                   తెలుగు కావ్యాలను పరిశీలిస్తే  ---- కేయూరబాహుచరిత్ర రచించిన మంచెన యే  కావ్యాది లో శ్రీ లక్ష్మీదేవి ని స్తుతించే సంప్రదాయాన్ని  ప్రారంభించాడు.

                శ్రీ వసియించు, గాత, ,సుఖసిద్ధివహించి........ .సర్వపుణ్యా వహమైన  గుండ సచివాగ్రణి గేహసరోవరంబునన్    అని కృతిభర్త కు ఆశీస్సు లందించాడు.
              
      అనంతరం కవిసార్వభౌముడు శ్రీనాథుడు శివరాత్రి మాహాత్మ్యం లో--                    
                 మదనుగన్నతల్లి మాధవుని ఇల్లాలు
                    బ్రతుకులెల్లఁ దాచె పట్టి చూడ
                    ముఖ్యమైన లక్ష్మి ముమ్మడి శాంతాత్ము
                    మందిరంబు నందు మసలు చుండు


                       తన తొలికావ్యాల్లో లేని  నూత్న సంప్రదాయాన్ని ఈ కావ్యం లో ప్రదర్శించాడు ఈశ్వరార్ఛన కళాశీలుడు. కనకాభిషేకాలు పొందిననాడు తెలియని ధనలక్ష్మి విలువను జీవన సంధ్యాసమయం లో గుర్తించిన  మహాకవి శ్రీనాథుడు.
                   
                     బమ్మెర పోతన భాగవత శేఖరుడు. శ్రీకైవల్యాన్ని కోరి కావ్య నిర్మాణం చేసిన కర్మయోగి. ఆయన తన భాగవతం లో కలుముల జవరాలి కి పెద్దపీటే వేశాడు.
    

       “  హరికిన్ బట్టపుదేవి,పున్నెముల ప్రోవర్ధంపు పెన్నిక్క, చం
       దురు తోబుట్టువు భారతీగిరి సుతల్ తో నాడు పూబోణి  తా
      మర లందుండెడి ముద్దరాలు,ఝగముల్ మన్నించు నిల్లాలు,భా
       సురతన్ లేములవాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కళ్యాణమున్.
                      

                   హరికి పట్టపురాణియై,చంద్రునికి తోబుట్టువై, భారతీ గిరిసుతలతో ఆటలాడెడు ముద్దరాలై, జగములనేలెడి ఇల్లాలిని లేములబాపు తల్లి గా పోతన సంప్రార్ధన.
                          

        



         ఈపద్యమే  విక్రమార్కచరిత్ర రచించిన  జక్కన కు మార్గ దర్శకమైంది.
   

       “ రాజు సహోదరుండు, రతిరాజు తనూజుడు, తండ్రి వాహినీ
      రాజవరుండు, లోకముల రాజుగ రాజితలీల నొప్పనా
        రాజమరాళ యాన సిరి................................
    .........................   రాజ్యరమారమణీయు జేయుతన్.

 ఆంటూ ప్రార్ధించాడు  జక్కన.
                     

       వరాహ పురాణం లో  నందిమల్లయ ,ఘంటసింగన లు  శృంగారపరవశయైన రమాదేవి ని  స్తుతించారు.
     
  స్మరసమరంబునం పరవశత్వమునొంది మహేంద్రనీల భా
        స్వరమగు  దానవాంతకుని వక్షముపై నొరగంటఁ జక్కగా
        నొరసిన హేమరేఖ వలెనున్న రమారమణిని ..........

                   దర్శించి ధన్యులైనారు  యీ జంట కవులు. మదన సమరం  లో అలసిపోయి మగని వక్షము మీద ఒరిగి న  లక్ష్మీకాంత ను స్మరించిన జాణ తనము వీరిది.
             
                 రామాయణ కవయిత్రి మొల్ల కామునితల్లి గా కామితవల్లి శ్రీ మహాలక్ష్మి ని స్తుతించింది మొల్ల రామాయణం  లో.......

  సామజ యుగ్మ మింపలరఁ జల్లనినీరు పసిండికుండలన్
  వే మఱు వంచి వంచి కడు వేడుక తో నభిషిక్త జేయగా
దామరపూవు గద్దియ ముదంబున నుండెడి లోకమాత మా
 కాముని తల్లి  సంపద నఖండము గా నిడు మాకు నెప్పుడున్.
   
                     మదపుటేనుగులు చల్లని నీటిని బంగారు పాత్రలతో అనేకమార్లు వంచి వంచి మిక్కిలివేడుక తో అభిషిక్తురాలిని చేయగా తామరపూల నివసించు లోకమాత గా లక్ష్మీదేవిని దర్శించింది కవయిత్రి మొల్ల.

             
               
                   నందితిమ్మన తన పారిజాతాపహరణం లో,  తాను వ్రాయ బూనిన  పారిజాతాపహరణ కావ్యేతివృత్తం లోని సత్యభామ అలక – శ్రీకృష్ణుఢు అలక తీర్చడం అనే అంశాలు ధ్వనించేటట్లుగా ----  అలక తీరి పులకాంకిత  యౌతున్న  ఇందిరను  దర్శింపజేశాడు.

       సరసపుటల్క దీర్చు తఱి  శార్జ్ఞ సుదర్శన నందకాబ్జ సం
   భరణ గుణాప్తి నెన్నడుము పై,  గటి పై,  జడ పై  గళంబు పై
    హరి నలుగేలు బైకొన సుఖాంబుధి నిచ్చలు నోలలాడు నిం
   దిర కృపజూచు గాత నరదేవ శిఖామణి కృష్ణరాయనిన్.
        
              తెనాలి రామలింగడు గా ఉద్భటారాధ్య చరిత్ర ను రచించినా, అందులో కలశాంభోనిధి యాడుబిడ్డ, శశికిన్ గారము తోబుట్టు ...... ఇత్యాది గా లక్ష్మీదేవిని స్తుతించి, తెనాలి రామకృష్ణునిగా పాండురంగమాహాత్మ్యాన్ని అందించిన మహానుభావుడు – రామకృష్ణకవి.
            

             అవతారమందె నే యఖిలైక జనయిత్రి
                                   కలశ రత్నాకర  గర్భసీమ
                దోబుట్టువయ్యె నే యతులిత కాంచనవర్ణ వెలది
                               వెన్నెల గాయు వేల్పునకును
                బాయకయుండు నే పరమ పావనమూర్తి
                               చక్రి బాహా మధ్య సౌధసీమ
                 నభిషేకమాడు నే నభివర్ణితా చార
                                       దిగ్గజానీతమౌ  తేటనీట
             నవనిధానంబు లే దేవి జవణి సరకు
           లమ్మహాదేవి   శ్రీదేవి    యాదిలక్ష్మి


                   అంటాడు పాండురంగవిభుడు." అతులిత కాంచన వర్ణ వెలది  శ్రీమహాలక్ష్మి.---  "అనంతమైన బంగారు వన్నె గల స్త్రీమూర్తి ఆమె. ఆమె వెన్నెల కాయు వేల్పునకు తోబుట్టువట. ఎంతచక్కని భావనో చూడండి .  అందుకే "పాండరంగవిభుని పదగుంఫనలు" అని తెలుగు జాతి ఆయన కవితాకన్య కు నివాళులర్పిస్తోంది.చక్రి బాహామధ్య సౌథ వీథి  బాయకయుండు పరమ పావనమూర్తి యని న  ఆ మహానుభావుని అభిభాషణ మిక్కిలి రమణీయముగా నున్నది. విష్ణో :పరాం ప్రేయసీం,తద్వక్ష స్ధల నిత్యవాస రసికాం అని కదా ఆ తల్లిని భక్తులు ప్రార్ధించేది.కావుననే రామకృష్ణుని లక్ష్మీస్తుతి ఆవిధంగా సాగింది.
              
                 కలుముల జవరాలికి గడుసుదనాన్ని సంతరించి రమ్యరూప గా దర్శిస్తాడు నిరంకుశోపాఖ్యానం లో కందుకూరి రుద్రకవి..
                  
                “ కొమ్ముపై సవతి గైకొని నిల్చెనని నాథు
                                ఱొమ్ము పై నిల్చె నారూఢి మహిమ
                నఖిల లోకాథీశుడగు నాయకునిఁదెచ్చి
                                 యిల్లటం బిచ్చి పుట్టింట నిలిపె  
                    దనపేరు మున్నుగా ననిమిషాదుల చేత
                                 బ్రణుతింపగా జేసె బ్రాణవిభుని
                .......................................................
                                     .........................................
                          చక్కదనమునఁ నేరేడు జగములందు
                        సవతు గాంచని సుతుగాంచె ధవుని కరుణ
                         దలపజెల్లదె గుణధన్యఁ  గలుషశూన్య
                          సాధుమాన్యఁ గృపానన్య జలథికన్య.
            
             ఆదివరాహ రూపం లో తన సవతియైన భూదేవిని కొమ్ము పై ధరించాడని, తాను పతి ఱొమ్ము పై కొలువు తీరిన ఆది గర్భేశ్వరి యట ఈమె. సమస్త లోకాథి నాథుని తన నాథుని చేసుకొని  ఇల్లరికం తెచ్చుకొన్న జాణ ఈమె. బ్రహ్మాది దేవతల చేత తన నాథుని స్తుతింప జేయు  సమయంలో తన పేరునే ముందుగా చేర్చి  నాథుని పిలుచునట్లు గా  చేసిన నైపుణ్యం ఈమెది. అందుకే ఆయన శ్రీ -మన్నారాయణుడు – శ్రీ –నివాసుడు యైనాడు. అంతే కాదు అట్టి శ్రీమన్నారాయణుని కరుణ తో పదునాలుగు లోకాలలోను తన కుమారుని తో పోల్చగల అందగాడు లేనంత సుందరూపుని పుత్రునిగా పొందిన మాతృమూర్తి. గుణధన్య,  కలుషశూన్య,సాధుమాన్య, గా జలథికన్య ను స్తుతించాడు రుద్రకవి.
                          

                 వసుచరిత్ర కారుడు రామరాజభూషణుడు లక్ష్మీస్వరూపమే ఆమె తండ్రి, ,తనయుడు, సోదరుడు ,నాథుడు ఎవరో తెలియజేస్తోందని చమత్కరిస్తాడు.  జగదంబ,బద్మఁ గీర్తించెదన్ అంటూ  బైచరాజు పంచతంత్రం లో చేతులు జోడించాడు.

              కకుత్థవిజయాన్ని వ్రాసిన మట్ల అనంతభూపతి   ----- తన కావ్యం లో
                  
                   మగని ఱొమ్మెక్కి నేకొమ్మ మనుచు వేడ్క
                     నమ్మహాదేవి వాగ్దేవి  యత్తగారు
                     మధుర శీతల సురభి వాజ్ఞ్మయ తరంగ
                     తతుల మజ్ఝిహ్వఁ బ్రవహింప  దలచుగాత !”.
             
  లక్ష్మీదేవి ని వాగ్దేవి కి అత్తగారు గా ప్రార్ధించి, ఆమెనుండి   వాగ్వరాన్ని ఆశించాడు.
                    

        ఈ విధంగా ఆంధ్ర కవుల లక్ష్మీస్తుతి ని పరిశీలిస్తే, శ్రీ శబ్దాన్నే లక్ష్మీరూపానికి పర్యాయపదం గా చాలామంది ఉపయోగించారు.  15 వ శతాబ్దంలో నే లక్ష్మీస్తుతి ప్రత్యేకంగా కావ్యాది స్తోత్రాల్లో చోటు చేసుకున్నట్టు కన్పిస్తోంది.16,17  శతాబ్దాల్లో ఈ సంప్రదాయం అలానే కొనసాగినట్టు కన్పిస్తోంది
           
              సకల సంపత్స్వరూపిణి యైన  అ శ్రీ లక్ష్మిని సుత్తించి,తమ కృతిభర్త ఇంట్లో సదా నివసించాలని,ఆహవ జయశ్రీ లనందించాలని, ఇష్టార్ధసిద్ది కలిగించాలనీ, నిత్యకళ్యాణాల్ని, రాజ్యరమారమణత్వాన్ని సమకూర్చాలని వీరందరు సిరులిచ్చే తల్లిని చేతులెత్తి ప్రార్ధించారు.




............. దేవీం బాలార్కవర్ణాం సురముని వరదాం విష్ణుపత్నీం నమామి .........