Wednesday, 31 October 2012

రామాయణము-రమణీయకథనాలు-10 అశోకవని లో దు:ఖయోగిని


2                                
                                          అశోకవని  లో  దు:ఖయోగిని
                                                    


                   లోకంలో బాధ అనేది రాక పూర్వం భరించడం అతి భయంకరంగా ఉంటుంది. కాని అనుభవింపక  తప్ప నప్పుడది ఆశాభావంతో  అతి తేలిగ్గా భరించబడుతుంది. ఇదిలోకరీతి.  అశోకవనం  లోని శింశుపా వృక్షం క్రింద  రాశీభూత దు:ఖయై కూర్చున్న భూజాత ను దు:ఖయోగిని గా దర్శించిన ద్రష్ట శ్రీ సుప్రసన్న.  సీతాదేవి అగ్నిప్రవేశాన్నిఅనుభూతి దృక్పధంతో ఆవిష్కరించిన కావ్యమిది.    
      
                                    ఋతువులు మారుతున్నా  అక్కడ శిశిరఋతువే రాజ్యమేలుతోంది. సముద్రుడు భయంకరంగా ఘోషిస్తున్నాడు. అణచుకోలేని బాధతో సుళ్లు తిరుగుతున్నట్లుగా బారలు చాస్తూ లంకను తనలో కలుపుకోవాలని యత్నిస్తున్నాడు. కన్నకూతురు  దు:ఖాన్ని చూడలేక  గుండెలు లవిసేలా రోదిస్తున్న  కన్నతండ్రి రోదనధ్వని అది.

                         కారు చీకటిలో సైతం కాంతిమయంగా,  తమో సరస్సున హిమపటల పరీత శ్వేత పుండరీకం వలె, మంచున తడిసిన మల్లెమొగ్గల మాలగా శింశుపా వృక్షం క్రింద       “క్షీరాబ్థికన్యక దర్శనమిస్తోంది. తమస్సు అజ్ఞానానికి ప్రతీక కాగా తేజస్సు జ్ఞానానికి ప్రతీక. ఆంతరంగిక లోకమే కాని బాహ్యజగత్తు లేని యోగిని ఆమె. మహా దు;ఖమందున తప్తమయిన యట్టి జీవియె యోగిత నందుకొనును అంటారు కవి. తప్త కాంచనం కాంతిని పొందినట్లు  దు;ఖాగ్ని తప్తమైన జీవి               ” యోగిత నందు కొంటుంది .

                        ఆమె యీ లంక యన్నది అసలె యెరుగ
                        దిక అయోథ్యయు మిథిలయు నెపుడొ మరచె
                         ఆమె కిపుడు దేశము , లోకమంచు,  చేత
                        మందు, ఊహయందును, కోర్కెయందు లేదు. “               27.వ.ప 
                                  
             కోరికలు లేని యోగినియై రామరూప థ్యానమగ్నయైన జానకికి  రావణాసురుడు  --- తమశ్శుద్ధ రూపిణులైన రాక్షసస్ర్తీలను  కాపలాగా నియోగించాడు. వీరు ఎప్పుడు నిద్రపోతారో ,ఎప్పుడుమేల్కొంటారో తెలియదు. తామసా కృష్ట లైన రాక్షసకాంతలు సీతమ్మ సౌందర్యాన్ని చూసి ఈర్ష్యతో                              అమ్మవారి లాగున్నదే అంటూ  గుసగుసలు పోతూనే నిద్రలోకి జారి పోయారు. వాళ్లకి మళ్లీ మెలకువ వచ్చేసరికి అది విభీషణ రాజ్యమటంచు తెలిసె అంటూ రాక్షసనిద్ర అంటే ఏమిటో  చమత్కారంగా తెలియజేశారు కవి.

              



                                    సీతమ్మ కూర్చున్నట్టు గా చెప్పబడుతున్న తిన్నె - శ్రీలంక

                                                                                       (Google సౌజన్యం తో )
                       ఎదలో తొట్రుపాటు
,నడకలే తడబాటు, కన్నులలో వెడబాటు సంచలిస్తుంటే- రాక్షసకాంతలు భయంతో ప్రక్కకు తప్పుకుంటుంటే రామచంద్రుని చెంత నుండి విభీషణుడు  సీతామాత సమీపానికి వచ్చాడు.  సీతమ్మ ముంగిలిలో దోసిలొగ్గి రావణుని మరణాన్ని , రామచంద్రప్రభు  విజయపురస్సరంగా ప్రకటించాడు.
                 
                         ఆమె నా స్వామి సన్నిథి కానయింప
                         వేగ తావచ్చుటయు విన్నవించినాడు                      45.ప
      కాని సీతాసాధ్విలో కదలిక లేదు. ఏమి చేయాలో  పాలుపోలేదు లంకేశ్వరునికి.---

                       కదలికయు కాంచక , ఏమిచేయ
                        రాక, తద్గత దృష్టి మరల్చ లేక
                       అట్టులే ఒక్క క్షణకాల మచట నిలిచె                 46 .ప
                                 
                    విభీషణుని హృదయం లో కదలికలు అతిశయించి, ఆత్మ నంటుతున్నాయి. మూసిన కన్నుల్లో సైతం ఆమె మూర్తియే ప్రత్యక్షమౌతోంది. సర్వఋషి భావితాత్మ విద్యా రహస్య మగుచు వాక్కుల కందని కాంతి కనుల ముందు కదలాడసాగింది.

                  పూర్వదిశాభాగం ఎరుపురంగు ను సంతరించుకొంది. ఆ సుప్రభాతం మొట్టమొదటి సారిగా   స్వాతంత్య్రాన్ని పొందినట్లుగా ఉదయిస్తోంది .చెట్లకొమ్మల చివర్లో కన్పించే ఎఱ్ఱని కాంతులు సున్నితమైన గోళ్ల చివర పండిన గోరింటాకు వలె ప్రకాశిస్తున్నాయి. తాడి ఎత్తున లేచిన తరంగాల చివర తురిమిన మందారపూల వలె  సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి.

                     రాఘవాన్వయుని హృదయంలో ఆలోచనలు చిగురులు సాగుతున్నాయి. సాగరుని లోతు, సూర్యుని తీవ్రత గల్గిన ఆ భావాల్లో జన్మజన్మలుగా వీడజాలనట్టి శ్రీదేవి ఆలోచనలే సంచలిస్తున్నాయి.

                                  గలగలమటంచు నొక్కచిక్కని తరంగ
                                 మమల హేలా నిధానమై  అరుగుదెంచి
                                  కాళ్ళు కడిగెను తనకు ,బంగారు టందె
                                  లను ధరించిన సీతవచ్చిన విధాన         3వ.స-9వ.ప
                                   
                            అలల సవ్వడులు బంగారపు టందెల పాదధ్వనితో కాళ్ళు కడిగిన సీత గుర్తుకు వస్తుంటే -  ఇసుకతో ఆడుకుంటున్న గాలి  మైథిలి వచ్చి తన చెవిలో ఏదో ఊసులు చెపుతున్న తీయని భావనను కల్గిస్తుంటే, ఇంత జరిగింది ఎవరి కోసమనే ప్రశ్న  ఉదయించింది రామచంద్రుని మనస్సులో.
                                 
                                 ఇంత టింతటి  సంగ్రామమెవరి కొరకు
                                   ఇంత  ఇంత రక్తప్లుతి  ఎవరికొరకు
                                  స్వాత్మకొరకయి,జీవమృత్స్నాకరండ
                                  వర్తికయి, ఒక మహాదివ్యమూర్తి కయి                         11.వ.ప
                                             
                          ఒకమహోన్నత మూర్తి కోసం ఈ పోరాటం , రక్తపాతం  జరిగింది. సీతమ్మ కోసం వెళ్లిన విభీషణుడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ  రావడం చూసింది  వానరసేన. అంగదుడు లేచి నిలబడ్డాడు. లక్ష్మణుడు అన్న ముఖంలోకి చూశాడు.  విభీషణుని కన్నుల్లో ఏదో దివ్యానుభూతి  వేదనతో మిళితమౌతోంది. రాముని చూపులు ప్రశ్నావశమ్ములై పౌలస్త్యుని ముఖంమీద నిలిచాయి. ప్రశ్నించాలన్న ప్రయత్నం అందరికీ పెదవుల మీదకు చేరి ఆగిపోయింది.

                  విన్నపము సేసె నెల్ల విభీషణుండు
                   పది నెలల నుండి తల్లి కన్పడిన తీరు
                    తాను చూచిన దెల్లను తాను ననుభ
                    వించినది ఎల్ల వాక్కుల యంచు లందు.             21.వ.ప
               
                     యోగీశ్వరేశ్వరి యైన సీతారూపాన్ని వారి ముందు రూపు కట్టించాడు మాటలలోనే విభీషణుడు.  తన మనసులో సీతా మాత రూపాన్ని ధ్యానించి కనులు మూసుకున్న లక్ష్మణునకు   ------

                             అతని ఊహలు చూపులై ,అతని మేథ
                               అద్దమై ఊర్మిళ ను గూర్చిఅవగతించె           23.   ప  
                                                                                  
                                                                                   
                            ఊర్మిళా రమ్య మృదు విలాస హేలా స్మృతి పరంపరలు కదిలాయి లక్ష్మణునిలో. వసంతర్తులు, గ్రీష్మతేజాలు, ఇంద్రధనస్సులు ,శరశ్చంద్రికలు వెల్లివిరిశాయి. ఆనాడు అయోధ్యలో తాను విడిచి వచ్చిన నాడు  ఉన్న ఊర్మిళ  రూపే  ఈనాడు కన్పిస్తోంది. ఇదెలాసాధ్యం. సందేహనివృత్తి చేసుకుంటూ  -
                           
                                  ఇంతదూరమ్ము తనదాక నేగుదెంచు
                                 నామె లో చూపుల వెలుంగు లటుల కాద
                                  యేని ఆమెను తా జూచు టెటులిపుడు
                                 వెల్గులేనిదే ఎట్లు కన్పించుటగును ?             35ప
                                                                                                          
               అనుకుంటాడు  లక్ష్మణుడు.  ఆనాటి మల్లెలు సైతం వాడని స్ధితిలో ఉన్న ఊర్మిళను దర్శించగల్గిన ప్రభావం ఊర్మిళదే. అతని యాత్మయే తనయాత్మ యగుట కొరకు నొందు యోగ  సమాధియె ఊర్మిళ  సాథించింది. ఊర్మిళా మహత్వం లక్ష్మణుని అనుసరించి ,రామసేవలో  తరించింది. సీతోర్మిళలు ఒకే యోగానికి   రెండుప్రక్కల వారుగా, విదేహ రాజర్షి తపో విభూతి ని సమపాళ్ళుగా పంచుకొన్నవాళ్లుగా దర్శనమిస్తున్నారు.
                   
             ఆలోచనాముద్రితులై భావనా పథం లో తమ దేవేరులను వీక్షిస్తున్న అన్నదమ్ములైన రామలక్ష్మణులను ఆశ్చర్యంతో చూశాడు ఆంజనేయుడు.

                                 తరణి యొక్కడె వారలిద్దరుగ నైన
                                  ఒకడు కాంతి యగును మరియొకడు వేడి        45.వ.ప
                                     
                           సీత ,ఊర్మిళలు  యోగానికి రెండువైపు లైతే  రామలక్ష్మణులు సూర్యునికి రెండువైపుల్లా దర్శనమిచ్చారు ఒకరు కాంతి యైతే మరొకరు వేడి అనుకొన్నాడట ఆంజనేయుడు..
                        
                            తన ఆత్మను దర్శించడానికి బయలుదేరాడు  రామచంద్రుడు. అత్యంతోత్సుకత తో అనుసరించారు వానరులు. అమ్మ ను చూస్తామన్న  ఆనందం వారందరి ముఖాల్లోను కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ముందు నడుస్తున్నాడు విభీషణుడు. వెనుక నడుస్తున్న అందరిలోను ఆలోచనల్లో తేడా ఉండవచ్చు గాని గమ్యంమాత్రం ఒక్కటే. అందుకే  ---
                              ఊహ లందున భిన్నత ఉండవచ్చు
                              గమ్యమొకటియే జీవ జగమ్ము నందు  
                                                                                        48.వ.ప
            “ మార్గాలు వేరుగాని గమ్యం మాత్రంఒక్కటే అనేది వేదాంత సారం. పరిసరాలను వీక్షిస్తూ, శింశుపా వృక్ష సమీపానికి చేరాడు రఘువీరుడు.

                                ఆ మహాయాజ్ఞి ముందర హైమకాంతి
                                   విచ్చుచుండెడి యజ్ఞాగ్ని విధము, జనక
                                  రాజకన్యక, వీక్షించు రామచంద్రు
                                     కనులలో కోటివెల్గులు పెనలువడియె          3.23
                                       
                                ఇల్లాలిని  చూచిన రామచంద్రుని కన్నులలో  కోటికాంతులు పెనవేసుకున్నాయి. సౌమిత్రి కన్నుల్లో దివ్యతేజస్సు, వానరుల నేత్రాలలో మహానంద స్రోతస్సు - ఎవరి మనస్సు ఏ స్థాయిలో స్పందించిందో  ఆ స్థాయిలోనే  అనుభూతులు పల్లవించాయి.
                               
              స్వామి నడిచి నంత మేర గాలికి చల్లదన మొచ్చింది. స్వామి చూపు పారి నంత మేర తరువుల తలల్లో విరులు వికసించాయి.  వనంలో వసంతం నూత్న 
సౌందర్యం తో ప్రత్యక్షమైంది.
                      చల్లనివి, చిక్కనివి యైన స్వామి చూపు
                      లవనిజాత దేహమ్మునం దలమి కొనియె                       3.34
                                                                                        
                    చిక్కని చూపులు చల్లనై వైదేహి శరీరాన్ని తాకుతుంటే, గౌతమీ నది వలె గొంతు గాద్గద్యాన్ని పొందగా, కరుణ పొంగులు వారు చుండ గా,  “ఓసి మైథిలీ ! వైదేహీ! ఓసి జానకీ!”     అంటూ పిలిచాడు రాముడు. ఆతని పిలుపులు ఆమెయందున విరజానదీ మనోజ్ఞభంగ దివ్యరవమై “ “ శ్రీవికుంఠనగరశింజిత కాల  సూచక మనోజ్ఞ పాంచజన్యరవమై ప్రతిధ్వనించాయి.  ఆకాశగంగ లోని బంగారు  తామరపూవు వంటి ఆ యమ్మ జానకిని వొంగి నల్లని  మబ్బు బాలరేఖ ను  పట్టుకొనినట్లు  తన చేతుల్లోకి తీసుకున్నాడు దాశరథి. వహ్ని     జ్వాలలు వియోగ భవ కీలలై చెలరేగాయి

                       భగ్నమయ్యె వైశ్వానర పర్వతమ్ము
                        మబ్బులో చంచలాలత మండిపడియె
                        భవుని  ఫాల దృగ్వహ్నులు పడగలెత్తె
                        స్వామి స్పర్శచే సీతలో సర్వమందు       3.40
                             
                     చిరకాల వియోగ సంభవ స్వామి స్పర్శ తో జానకిలో జనించిన వహ్ని కీలలు  వైశ్వానర పర్వత భగ్నజ్వాలలై , భవుని ఫాల దృగ్వహ్నులై, జానకి కన్నుల్లోను, చెవుల్లోను తుదకు  -
                   
                         “ ఆమె తనువు నందు నన్నియెడల నగ్ని
                            ఉద్భవించె జీవ హోమ మట్లు                   3.42
                        
                               సీతమ్మ అగ్ని పునీత అయ్యింది . రామచంద్రుని స్పర్శతో  జనించిన వియోగ వహ్ని జ్వాలల్లో జీవహోమం జరిగినట్టు  సీత అగ్ని పునీత యైంది.  రామచంద్రుడు సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించాడని అందరూ అనుకున్నారు . కాని జరిగింది ఇది. అక్కడ చేరిన వారందరు స్మృతిని కోల్పోయి ఆశ్చర్యంలో మునిగి పోయారు. అశోకవనంలోని వృక్షాలు వెలుగుల వాన జల్లుల వలె నూత్న పల్లవాలతో పూవులను కురిపించాయి.  ఆమని నూత్న అలంకారాలతో ప్రత్యక్షమైంది. అగ్ని జ్వాలలతో చుట్టబడిన సీత  “అమృత వర్షాధ్వమందు తడిసినట్లు ప్రకాశించింది. సీతారాములు ఒక్కటైనారు.

               సర్వసృష్టికి మూలము. సర్వభావనా నిర్థిష్ట రూపంగా రాముడు, సహస్రార  చక్ర కీలాప్త వహ్ని లో ఒదిగిన మహాశక్తి గా సీత  వేరుగా కన్పించి, ఒక్కటిగా నిలిచిపోయారు.
                      
                             “ అంత వరకు ఇద్దరైన సీతారాము
                        లా క్షణమ్ము నుండి   ఆత్మభావ
                        మందునైక్య మంది , రంత కన్నను సృష్టి
                       యందు   నేకయుగళ మసలె లేదు               3 .48
                             
                             సిద్ధి పొందిన యోగిని  స్వామిలో లీనమైంది. సీతారాములను మించిన ఏకరూపులు జగతిలోనే మరొకరు లేరు అన్న విశ్వాసమే కవి  చేత ఈ కావ్యాన్ని వ్రాయించింది.

                     ఆనంద నిధాను డైన శివుడు, దుఖరూపుడు రాముడు,  సౌఖ్యరూపుడు శ్రీకృష్ణుడు మనస్సారథులుగా ఈకావ్యనికి శ్రీకారం చుట్టిన కవి తన కావ్యాన్ని  అనుభూతి విచారణాశీలక కావ్యంగా  చెప్పుకున్నారు. ఆనందమే సుఖదు:ఖరూపాలను పొందినట్లు యోగమనే తపనలో ఆనంద మావిర్భవించినట్లు దు:ఖవహ్ని తప్తమైన మనస్సులో తేజ స్సముద్రం ప్రవహించడం కవి నిరూపించదలచిన సత్యం. ఆనందమే సుఖదు:ఖరూపాలను పొందినట్లుగా , వాల్మీకియే కాళిదాస భవభూతులుగా జన్మించారని ఊహించిన ఈ కవి కి  రామకథ అంటే ఎంత ప్రపత్తి ఉందో  ధీని వలన తెలుస్తోంది .

                      ఈ గీతి నా ఆత్మ లోన కోటి
                    పుట్టువుల పూర్వమున నుండి తట్టుచుండు    అవతారిక.2.ప
                              
                         అనడంలోనే  కవిలో కలిగిన చిరకాల మధన పర్యవసానమే ఈ కావ్యామృత కలశ ఆవిర్భావమని  మనకు అర్ధమౌతోంది  .  ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య  సీతమ్మ అగ్నిప్రవేశాన్ని   అనుభూతి పరంగా ఆవిష్కరించి, దర్శించి, తరించిన రామభక్తులు.  




**********************సీతాయాశ్చరితంమహత్   ************************        
                                                      

Friday, 26 October 2012

రామాయణము-రమణీయకథనాలు-9 విశ్వనాథ వారి మాండవి


                              కవిసామ్రాట్ విశ్వనాథ వారి  మాండవి { వాసంతిక}

                మాండవి  భరత రాజేంద్రుని ఇల్లాలు. అయోధ్యానగర సార్వభౌముని  ధర్మపత్ని గా వాల్మీకిమహర్షి చేతనే కాదు అనంతర కాలికులు ఎవ్వరి చేతను దర్శించబడని సౌందర్యం ఈమెది. కుశధ్వజుని కొమార్తె గా, భరతుని పాణిని గ్రహించి , అయోధ్యా నగర రాజప్రాసాదంలోకి  అడుగుపెట్టింది. మిథిలానగరం నుండి వచ్చి  దేవతాపూజాదికాలు పూర్తిచేసుకొని అంతపురం లో అడుగు పెట్టిన ఈమె తిరిగి కనబడదు వాల్మీకంలో.
              
          మాండవి పాంచ జన్యశక్తి గా మార్కండేయ పురాణంలో చెప్పబడింది. వాసన్తిక అను కన్యతో శ్రీమహాలక్ష్మి ప్రస్తావన పరంగా....
                               అయం మమపతి శ్ర్శీమాన్ శేషేణ చ  దరేణ చ
                               సుదర్శనేన సాకేత గృహే దశరథస్య చ
                                           ****************************
             
                                      శక్తి స్తు పాంచజన్యస్య మాండవీ తి ప్రకీర్తితా            మార్కం.పు. ఉత్త. 1వ.అ

                          అని పాంచజన్యశక్తి యే   మాండవి గా  చెప్పబడింది. కవిసామ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ గారు మాండవి ని  ఉత్తమ కావ్య నాయికగా  దర్శించారు. ఈ లఘుకావ్యం వాసంతిక అనేపేరుతో కృష్ణాపత్రిక  స్వర్ణసంక్రాతి   సంచిక లో ప్రచురితమైంది. మృదుమధుర వ్యంగ్యవైఖరీ ఫ్రాభవం తో  కావ్య ప్రయోజనాన్ని  అలవోకగా సాథించారు మహాకవి   విశ్వనాథ.

                     తెల్లవారితే శ్రీ రామచంద్రుని పట్టాబిషేకం. భరతుడు  మాండవీ సిత సౌథమండలి కి బయలు దేరి   వెళ్లాడు. రంగవల్లికలు దిద్దబడిన వితర్ధిక మీద కోమలి కోసం ఎదురు చూస్తూ  కూర్చున్నాడు. ఇల్లాలు వచ్చింది. అసంస్కృత శిరోజాలతో కాషాయాంబరధారణియై వచ్చి కేలుమోడ్చి నిల్చిన ఇల్లాలిని చూచిన భరతుని ఎదలో  వేదనాజలథులు పొంగులు వారాయి.

                                  యింతి గనుగొంచు భరతుని హృదయ పద్మ
                                  కేసరంబులు విడజారె భాసురములు

                             అన్న మాటలు మహాకవి విశ్వనాథ వి.  ఎంతోకాలం  తర్వాత  ధర్మపత్ని మాండవీ మందిరానికి వచ్చిన భరతునకు ఆమెయొక్క ఆహార్యాన్ని  చూసేసరికే   మనసు లోని ఉత్సాహం ఆవిరై పోయింది. అందుకే భరతుని హృదయమనెడి పద్మమునందలి కేసరములు భాసురాలను వదిలి వేశాయి అన్నారు విశ్వనాథ. యోగిని గా నిలబడిన ఇల్లాలిని ఏదోవిధంగా పల్కరించి మాటల్లోకి దించాలన్నది రామానుజుని ఆలోచన. చెంతనే వాసంతిక  “{  మొల్లవంటి పూలతీగ} కన్పించింది. అది నాటి చాలాకాలమైంది. కానిఇంతవరకు మొగ్గ తొడగలేదు.  భార్యకు ఆ తీగ పై గల అభిమానాన్ని ఆధారం చేసుకొని సంభాషణలోనికి దిగుతాడు భరతుడు. ఇదిచూలెంతయు గాదా- అన్నపల్కులు  భరతునివి. ఆమాటలు విన్న మాండవి నెమ్మదిగా ఇలాఅంది.

                         నే నింటి లోన నెక్కడో
                          పూని మహావ్రతము,బూమొక్కలకున్
                           దానెవరు నీరువోసిరి
                           చాన యదుపు తోటమాలి శ్రద్ధయు గలదే

                        భార్ర్య్డ్య మాటలకు ఆశ్చర్యపోయాడు". ఈ మహావ్రతము ఎవరికోసమన్నా"డు భరతుడు. భర్తయొల్లని సతి ఇంతకంటె ఏంచేయగలదు. చెడిపోయిన గృహసంస్కృతులకై తానీవ్రతాన్ని అవలంబించాను కాని ఆ దైవానికి  మాత్రం అనుగ్రహం కలుగలేదు.

                                    నా భర్త యొక్కడున్నా డన్నగారితో
                                     బాటు జటాధారి పట్టణమున
                                    నతని భార్యను నేన, యపకీర్తి పాలైన
                                    యత్తగారును సుఖమఱిన నేను
                                     కుమలి పోవుచు నాదుకొంచుంటి మొక రొక
                                     రీమాత్ర వాసంతి యొదిగెనేని
                                     ఆ యత్తగారు దయాక్షీరపాదోధి
                                       శ్రీమతి యాయమ చేతి చలవ.


                       మాండవి మాటల్లో భర్త తో చెప్పలేని , చెప్పాలనుకున్న ఎన్నో భావాలు సుళ్లు తిరిగాయి . కళ్లముందు కమ్ముకొన్న  మంచుపొరలు తొలగిపోయాయి భరతునికి. శ్రీరామ కీర్తి పతాకాభిరామ యష్టి మూర్తియైన  మాతృ మూర్తి కన్నులముందు కన్పట్టింది భరతునికి. వాసంతి ఈ మాత్రం నిలిచిందంటే దానికి కారణం...... దయా క్షీరపాదోధి”   యైన అత్తగారి చలువ అన్న మాండవి మాటల్లో విన్పించిన ధ్వని భరతుని లోని విజ్ఞతను మేల్కొలిపింది. వెంటనే రక్షోరాట్పరోక్షారి  సత్పదముల్ ఝారి క్షమింప వేడెదన యీవాసంతియున్ విచ్చునే కద తానప్పటికంచు లేచాడు. చేసిన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి వెంటనే దిద్దుకొవాలనే తపన భరతునిది.  ఎంతోకాలంగా మదిలో గూడుకట్టుకొన్న వేదన తీరే రోజు ఆసన్నమైంది. ఇన్నేళ్లుగా కన్నతల్లికి దూరంగా ఉంటూ, ఆమెను నిందిస్తూ  ఆమె ప్రవర్తనను  దూషించాడు.


                       కాని తన కన్నతల్లి కైకేయి పై తాను పెంచుకున్న ఏహ్యభావం తప్పని , ఆమె యే  శ్రీ రామ చంద్రుని  కీర్తి పతాకకు  ఆధారపు కొయ్య వంటిదని, ఆవిడ దయా క్షీర పాదోధి అని , రావణసంహారము, ఇంత రాక్షససంహారం జరగటానికి  ఫరోక్షంగా కైకయే కారణమనే విషయం  మాండవి మాటల్లో ధ్వనించింది భరతునికి.  ఆమె రక్షోరాట్పరోక్షారి. అంటే  కైకేయి  రాక్షసరాజైన రావణునకు పరోక్షశత్రువట. ఎంత అద్భుతమైన  ఫ్రయోగమో మహాకవిది.  మరొక్కసారి ఆ మహనీయుని  కవితా సరస్వతి కి వేవేల వందనాలు.

                  ఒక్క సారిగా  భరతుని లో తల్లి కైకయి పై నున్నకోప. వ్యతిరేక, ఏహ్య భావాల స్థానంలో  గౌరవము , ప్రేమ , అంతకు మించి   ఆమెకు బిడ్డయై నందుకు  తొలిసారిగా గర్వము చోటుచేసుకున్నాయి. వేగంగా  కైకేయీ భవనానికి చేరుకున్నాడు భరతుడు.. తనపాపాన్ని ప్రక్షాళన చేసుకోని కాంతిచంద్రుడై మరలి మాండవీ మందిరానికి వచ్చాడు.

                         ఆ సాయంతటి కైకేయీ పద సపర్యా ధుర్యు డై వచ్చుచున్     
                        వాసంతీ లత చిన్నిపూవిదులు శోభం గాంచె  రామానుజుం
                        సీమంత మధూళికా రచిత నూత్నారుణ్య కాశ్మీర రే
                        ఖా సంపన్నిధి మాండవీ ముఖ  లసత్కంజాత సంజాతమున్.


          మాండవీ ముఖవినిర్గత దరహాస చంద్రికలు భరత రాజేంద్రునిపై ప్రతిఫలించి, పులకించాయి. వాసంతిక   చిరునవ్వు చిందించింది.


               మాండవి భరతుని లో కరడుగట్టిన మాతృవైముఖ్యాన్ని కరిగించి వేసింది. శ్రీరాముని కీర్తి పతాకకు ఆధారపు కొయ్య గా కైకమ్మను నినదించిందిమాండవి. ఉపదేశికయై కావ్యంలో  తన పాత్రను శాశ్వతీకరించుకొంది   కాంత గా మాండవి. ఇది విశ్వ నాథవారి అపూర్వ సృష్ఠి. కాంతా సమ్మితమైన కావ్యంలో    కావ్య ప్రయోజనాలలో ఒకటైన ఉపదేశాన్ని నాయకునకు  నాయిక చేత నే  ధ్వన్యాత్మకంగా ఇప్పించి, కావ్యానికి , కావ్యనాయికకు కూడ ఉన్నత గౌరవాన్ని  కల్పించిన  మహాస్రష్ట  శ్రమద్రామాయణ కల్పవృక్ష సృష్టికర్తలు . 
  

  ********   కాలోహ్యయం నిరవధీ     విపులాచ పృధ్వీ******************