Tuesday, 2 August 2016

శతకసౌరభాలు -9 పురుషోత్తమ కవి - ఆంథ్రనాయక శతకము- 5

శతకసౌరభాలు -9


కాసుల పురుషోత్తమ కవి
   

  ఆంథ్రనాయక శతకము- 5
                    






నాఁగలి రోఁక లన్నకు నిచ్చి శంఖాది
పంచాయుధము లీవు పట్టినావు
తాటి టెక్కెంబు కోల్తల పెద్ద కెత్తించి
గరుడధ్వజం బీవు గట్టినావు
వెలరాని కఱవోని వలువ జ్యేష్ఠున కిచ్చి
కనకాంబరం బీవు గట్టినావు
మద్య మగ్రజునకు మత్తిలఁ దావించి
జున్ను బాల్‌ పెరుఁ గీవు జుఱ్ఱినావు
తగువరివె యన్నదమ్ముల ధర్మ మీవె
తీర్చవలెఁ గాని మఱియొండు తీర్పఁగలఁడె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!     36

                  శ్రీకాకుళాంధ్రదేవ! అన్నదమ్ముల తగవులాటలో తీర్పరి గా నిన్నే ఎంచుకోవాలయ్యా  స్వామీ. ఎందుకంటే  నాగలిని రోకలిని అన్నయైన బలరాముడి కి చ్చి శంఖము , చక్రము మొదలైన పంచాయుధాలను నీవు ధరించావు. యుద్ధభూమి లో   తాళధ్వజాన్ని అన్నకు ఇచ్చి గరుడధ్వజాన్ని నువ్వు తీసుకున్నావు. విలువలేని నల్లని వస్త్రాన్ని అన్నయైన బలరాముని కిచ్చి  ఖరీదైన కనకాంబరాన్ని నీవు కట్టుకొన్నావు. అన్న కు  మత్తు కల్గేటట్లు మద్యాన్ని త్రాగించి  జున్నుపాలు ,పెరుగు లను నువ్వు జుఱ్ఱుకున్నావు. అన్నదమ్ములకు భాగాల పంపిణి లో నీకంటే నిష్పక్షపాతంగా చేసేవాడు ఇంకా ఎక్కడుంటాడయ్యా. అన్నదమ్ముల తగవు లో నీవే మంచి తీర్పరివి.




                                          అప్పనంబులు గొను నఖిలదిఙ్మండలే
                                                                 శ్వరులచేవేంకటాచలనివాసుఁ
                                          డరుదుగా నరువదా ఱగురసంబులు మహా
భోగంబుఁ గొను నీలభూధ్రవరుఁడు
పానకం బాని సాఁబాలు భక్తుల కిచ్చి
మెసఁగును మంగళాద్రీశ్వరుండు
పుట్టకొలంది మైపూఁతఁగాఁ గొను మంచి
గంధంబు సింహనగ ప్రభుండు
సాటి సాముల రీతి నిచ్చోట నీవు
మూర్తిమంతంబుఁ జూపక కీర్తి గలదె?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!             37

                               ఆంధ్రదేవా ! ఏడుకొండల మీద కొలువుదీరిన వేంకటేశ్వరుడు  సమస్త దిక్పాలుర నుండి కానుకలను  అందుకుంటున్నాడు. నీలాచలం మీద కొలువు దీరిన జగన్నాథుడు అరవై ఆరు రుచులతో  మహాభోగాలను రుచి చూస్తున్నాడు. ( జగన్నాధుని వంటశాల ప్రపంచం లోనే అతి పెద్ద వంటశాల గా ప్రసిద్ధి కెక్కింది ) మంగళాద్రి పై కొలువు దీరిన  పానకాల నారసింహుడు భక్తులు సమర్పించు పానకం లో సగం తీసుకొని మిగిలిన సగం  తిరిగి  భక్తులకే ఇచ్చేస్తున్నాడు. సింహగిరి మీద కొలువు దీరిన వరాహనారసింహుడు పుట్ల కొలది మంచి గంధాన్ని మై పూతగా పూసుకొని, భక్తుల  సేవలందుకుంటున్నాడు. ఇటువంటి సమయం లో  నీ తోటి వారందఱి తో సమానంగా నీవు కూడ నీ ఔన్నత్యాన్ని ప్రదర్శించక పోతే నీ కీర్తి ప్రతిష్టలకు భంగం కదా స్వామీ !


                                    బొచ్చెచేఁపకు నైన మచ్చరం బున్నది
తాఁబేటి కైన సత్త్వంబు గలదు
ఢీకొన్న నడవిపందికిఁ గల్గు రోసంబు
తెరనోటినరుఁడైనఁ దెగువ సేయుఁ
బొట్టివానికి నైన దిట్టతనం బుండు
బాపని కైన దర్పంబు గలదు
చుంచురాజున కైన శూరత్వ మున్నది
ముసలికి నైనఁ జేపుష్టి గలదు
సిద్ధ మాభీరుఁడవు నీవె బుద్ధి నెంచఁ
గలికి వై యేమి సేయఁ గలవొ కాని
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ  ! శ్రీకాకుళాంధ్రదేవ!    38

                                      శ్రీకాకుళాంధ్రదేవ!     మత్స్యావతారం లో రోషాన్ని  ప్రదర్శించి వేదాలను సంరక్షించావు. కూర్మావతారం లో  నీ బలాన్ని చక్కగా ప్రదర్శించావు. వరాహావతారం లో  ప్రతాపాన్ని ప్రదర్శించి భూదేవిని కాపాడావు. నరసింహావతారం లో తెగువ ను చూపి ప్రహ్లాదుని రక్షించావు. వామనుడవై పొట్టివాడవైనా గట్టివాడనిపించావు. పరశురామావతారం లో క్షత్రియ సంహారం చేసి దర్పాన్ని ప్రదర్శించావు. శ్రీరామావతారం లో మహావీరుడుగా కీర్తి గడించావు. బలరాముడి గా నీ చేతి బలాన్ని చూపించావు  కాని ఇప్పుడు నీవు గోపాలకుని అవతారం లో ఉన్న పిరికివాడవు. ఇక  కలికి అవతారం ఎత్తి ఏమి సాధించగలవో  చూద్దాం.


                                        మును నందగోవత్సములఁ గాయునప్పుడు
ననునయించిరె కంజజాది సురలు?
విట చోరచేష్టల వ్రేపల్లెఁ దిరుగు నీ
దగుమ్రోల నచ్చర లాడినారె?
నరరథాశ్వముల సంగరవీథిఁ దోలునాఁ
డెంచి దిక్పతులు భావించినారె?
మగధేశుదాడికి మథుర వీడిననాఁడు
దేవర్షు లెల్లఁ గీర్తించినారె?
యల్పునిగ నెంచినారె లోకైకనాథ
నాథునిఁగ నెంచినారె ము న్ధరణిఁ? జెపుమ
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                               హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                                39

                             శ్రీకాకుళాంధ్రదేవ!  ఇంతకు పూర్వం నీవు నందగో కులం లో ఆవులను కాసేటప్పుడు బ్రహ్మాది దేవతలు ఎవరైనా వచ్చి నిన్ను అనునయించారా ? చెడుతిరుగుళ్ళ తో , దొంగతనాలతో రేపల్లె లో తిరుగాడేటప్పుడు అప్సరస స్త్రీలు నీ ముందు నృత్యాలు చేశారా? లేదు కదా. పాండవ మథ్యముడైన అర్జునుని రధాన్ని యుద్ధభూమి లో నువ్వు తోలే టప్పుడు దిక్పతులు వచ్చి నిన్ను  సంభావించారా ? జరాసంధుని దెబ్బ కు నీవు మథుర ను  వదిలి పెట్టి పాఱిపోయే రోజున   దేవర్షులు వచ్చి నిన్ను కీర్తించారా ? అంటే భూమి పై జన్మించిన నిన్ను దేవతాగణమంతా అల్పుని గా భావించింది కాని లోకైక నాథుని గా నిన్ను గుర్తించలేదు.    దేవదేవుని గా నిన్ను గుర్తిస్తే  నిన్ను గొప్పగా గౌరవించెడి వారు కదా. !                            

                         బాలకృష్ణుని బాల్యక్రీడల్లో ఆయన చేసి సాహసకృత్యాలను మెచ్చి సుర దుందుభులు  మ్రోగినట్లు,  దేవతలు పూలవానలు కురపించినట్లు భాగవతం లో చెపుతోంది.  కాని ఈ కవి స్వామిని సాథించి తన పనిని సాధించుకోవాలని చూస్తున్నాడు కాబట్టి అటువంటి విషయాలు తెలిసి కూడ  తెలియనట్లు గా ఉంటాడు. ఇది ఈ కవి నైజం.  ఈ విషయాన్ని ఇంకా వివరంగా 42 వ పద్యం లో చూద్దాం.

                                                పూతనా కుచ కుంభపూర్ణ విషస్తన్య
పాయివై బ్రదికిన భాగ్య మేమి?
కాళియాశీవిషగ్రసన ప్రమాదంబు
గడచి జీవించిన ఘనత యేమి?
చాణూరమల్లదో: స్తంభ ఘట్టన కోర్చి
లబ్ధజయుఁడ వైన లాభ మేమి?
సాళ్వరాజామోఘ శక్తి ప్రయోగంబు
మరలించుకొనిన సామర్ధ్యమేమి?
బడుగు దాసరివలె నన్నవస్త్రములకుఁ
బరుల కాశింతు విచట నీపంత మేమి?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!    40

                            శ్రీకాకుళాంధ్రదేవ!     నీ చిన్నప్పుడు  పూతన  అనే రాక్షసి  తన చనుబాల లో విషాన్ని నింపి  నిన్ను చంపడానికి  ప్రయత్నించినప్పుడు నీవు ఆమెను చంపి బ్రతికిబయటపడ్డావు కాని ఫలితం ఏముంది ? కాళీయుడనే సర్పరాజు  విషం నుంచి బతికిబయటపడిన గొప్పతనం ఏమైంది ? చాణూరుడనే మహా మల్లయోధుని ముష్టిఘాతాలనుండి  తప్పించుకొని జయాన్ని పొందిన లాభమేమి ? సాళ్వరాజు ప్రయోగించిన అమోఘమైన శక్తి అనే ఆయుధాన్ని తిప్పి అతనిమీదకే ప్రయోగించిన నీ ప్రతిభా నైపుణ్యం ఎంతటిది ?  ఇన్ని ఘనకార్యాలను చేసిన నీవు ఇప్పుడు ఒక పేద దాసరి వలే అన్నవస్త్రాలకు  ఇతరులను  ఆశ్రయిస్తున్నావు. నీకు ఈ మొండి తనం ఎందుకు. నీ చేష్టలన్నీ విచిత్రాలు గానే ఉన్నాయయ్యా.

          ఈ సందర్భం లో   కంసుని పంపు తో రేపల్లె వాడకు వచ్చిన పూతనను ఆంధ్రమహాభాగవతం లో పోతన  వర్ణంచిన రీతి కడు రమణీయం గా ఉంటుంది.  ఆమె సౌందర్యాన్ని చూసిన గోపకాంతలు మమ్మల్ని అందరినీ సంతోషపరచడానికి లక్ష్మీదేవి శృంగార వేషం తో వచ్చిందేమో నని  భ్రాతి పడి తదేకం గా పూతనను చూస్తూ ఉండిపోయారట. పూతన వర్ణన చూడండి.



క్రాలుకన్నులు గుబ్బచన్నులుఁ గందువొందని చందురుం
బోలు మోమును గల్గు లేదన బుద్ది దూఱని  కౌను, హే
రాళమైన పిఱుందుఁ  బల్లవరాగ పాదకరంబులుం
                                    జాల దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహన మూర్తితోన్.   (ఆం.మ.భా.10 పూ.-213 )

                                         “ ప్రకాశవంతమైన నేత్రాలు, పొంకమైన వక్షోజాలు ,మచ్చలేని చందమామ వంటి మోము, ఉన్నదా లేదా  అనే అనుమానానికి తావిచ్చే నడుము , విశాలమైన జఘనము ,  చిగురాకుల వంటి కాళ్లు చేతులు , ఒత్తైన కొప్పుముడి తో సర్వమోహనమూర్తి” గా నందుని ఇంటికెళ్ళింది పూతన.


                                    పట్టి గొల్లది రోఁట గట్ట నోపిన నీకుఁ
రోసంబు లే దన్న నీసు గలదె?
జార చోరాది చేష్టలఁ బ్రవర్తిల్లు నీ
కపకీర్తి యన్న భయంబు గలదె?
భార్యచేఁ దన్నులుఁ బడ్డవానికి నీకు
లజ్జ లే దని యన్న లాఘవంబె?
కుండంటు లే దని కొసరి మెక్కిన నీకు
హీనత లెంచిన న్యూన మగునె?
కోరి దాసులు ని న్నెంత దూరుచున్నఁ
బంత మున్నదె నీ కిసుమంత యైన?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
                                      హత విమతజీవ !శ్రీకాకుళాంధ్రదేవ!                                  41

                               శ్రీకాకుళాంధ్రమహావిష్ణూ!   ఒక గొల్లభామయైన యశోద  నిన్ను రోటికి కట్టేస్తే   సహించిన నీకు ఏమాత్రం రోషం లేదంటే పౌరుషం పొడుచుకొచ్చిందా ? జారచోరాది చేష్టల్లో  సంచరించే నీకు అపకీర్తి అంటే భయముందా. పెళ్లాం  కాలితో తన్నించుకొన్న   నీకు సిగ్గు లేదంటే తప్పులేదు కదా.  కుండంటు లేదంటూ పరుల ఇళ్లల్లో దూరి  పాలు పెరుగులు మెక్కిన  నిన్ను ఎంత అల్పుని గా లెక్కించిన అది తక్కువే అవుతుంది గదా ! అందుకనే నీ భక్తులు నిన్ను ఎంతగా నిందిస్తున్నా నీలో  మాత్రం  ఇసుమంతైనా పౌరుషం కాన రావడం లేదు.                            

                తాను నిందాస్తుతి లో స్వామి ని ఎందుకు రెచ్చగొడుతున్నాడో కవి ఈ పద్యం లో ప్రస్తావించి , లోలోపల బాధపడుతున్నట్టున్నాడు. అతి ప్రేమ ఉన్నచోటే కోపం గా కూడ ఉంటుందంటారు . అదే ఈ విధమైన రచనకు కారణమౌతోంది. తన ప్రభువు నిత్యసేవలకు దూరమై , బికారి గా ఉంటున్నాడనే బాధ కవిలోని వేదనకు కారణ మైంది.


                                         కడు దొంగతనమునఁ గని తల్లి వైచినఁ
దనబిడ్డనిగ బెంచె నిను యశోద
జనని గర్భము దించుకొనిన వేఱొకతల్లి-
కడుపుఁ జేసికొనంగ గలిగెనన్న
తండ్రి వివాహయత్నము సేయ నొల్లక
తగులుక వచ్చె నీ ధర్మపత్ని
యన్న రారాజు కీనున్న నీ సోదరి
యింటికి జోగిరా నంటుకొనియె
నిట్టి నీ సంప్రదాయంబు గుట్టు బెట్టు
రట్టు సేయుదుఁ గనుము నా భట్టుతనము
చిత్ర చిత్ర ప్రభావ!  దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!     42

                      శ్రీకాకుళాంధ్రదేవ!     కన్నతల్లి  దేవకీదేవి నిన్ను చాటుమాటు గా కని పారవేస్తే యశోదాదేవి నిన్ను కన్నబిడ్డ గా పెంచి పెద్ద చేసింది. నీ తల్లి ఏడవ గర్భం పోగా మరొక తల్లి రోహిణి తన గర్భాన మోసి నీ అన్నను కన్నది **. నీ ధర్మపత్ని రుక్మిణి ఆమె  తండ్రి వివాహప్రయత్నాలు చేస్తుంటే  కాదని పుట్టింటిని వదిలి, నిన్ను తగులుకొని వచ్చేసింది. నీ అన్న బలరాముడు  దుర్యోధనునికి ఇచ్చి వివాహం చేయదలబెట్టిన నీ సోదరి సుభద్ర, ఇంటికి సన్యాసి వేషం లో వచ్చిన  పాండవ మథ్యముడైన అర్జునుని జంట కుదుర్చుకుంది. ఇదేగా నీ కుటుంబ సంప్రదాయము.  ఇదేవిధంగా నీ రహస్యాలను బట్టబయలు చేస్తాను . నా బట్టుతనపు  ప్రతిభా విశేషాలేమిటో తెలియ చేస్తాను.చూస్తూండు స్వామీ.

                              అందుకే  నోరున్నవాడికి ఊరప్పజెప్పమని సామెత వచ్చింది. బట్టుకవి పొగడటం మానేసి తెగడడం మొదలు పెట్టాడంటే  శ్రీమన్నారాయణుడంతటి వాడు కూడా భయపడిపోయే రీతి లో చెలరేగి పోతున్నాడు పురుషోత్తమ కవి.  సాధారణమైన విషయమైనా చెప్పేరీతిని బట్టి పరమ రంకు కథ లాగా దాన్ని చిత్రీకరించడం  వాక్చమత్కారం. అందుకే గయ్యాళి నోటికి దూరం గా ఉండమంటుంటారు జానపదులు.

              ** బలరాముడు రోహిణీ వసుదేవుల కుమారుడు. శ్రీమహావిష్ణువు కృష్ణావతారం ధరించేటప్పుడు ఆదిశేషుడు భూలోకమున అవతరించుటకై దేవకీదేవి సప్తమ గర్భము న పెరుగుచుండెను.  కాని కంసుడు దేవకీ పుత్రులనందఱిని సంహరించదలచి యుండుటచే ఈ పిండమును దీసి రోహిణీ గర్భమునందుంచుమని హరి యోగమాయ  ను ఆజ్ఞాపించెను. యోగమాయ అట్లు చేయుట వలన రోహిణి యందు ఆది శేషుడే బలరాముడు గా జన్మించెను. గదుడ ,సారణుడు ,దుర్మదుడు, విపులుడు అనే వారు ఇతని తమ్ములు.
                                        


                                     పక్షంబు గల దండ్రు పాండుపుత్రులయందు
పాండవుల్‌ పడినట్టి పాటులేమి!
పూర్వజన్మమునందుఁ బూజించె గజ మండ్రు
గజరాజు పొందిన గాసి యేమి!
యల కుచేలునకు బాల్యస్నేహితుఁడ వండ్రు
నెఱిఁ గుచేలుఁడు పడ్డనెవ్వ లేమి!
ప్రహ్లాదుఁ డాజన్మభక్తియుక్తుం డండ్రు
ప్రహ్లాదుఁ డొందిన బాధ లేమి!
యెంతయాలస్యమున వారి నేలినాఁడ
విట్టిదే నీ దయారసం బెంచి చూడ
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                       హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                43

                       ఆంధ్రదేవా ! నీవు పాండవ పక్షపాతి వంటారు మరి పాండవులు అన్ని కష్టాలు పడ్డారేమిటి  ప్రభూ ? పూర్వజన్మలో గజరాజు చాల పుణ్యంచేసిందంటారు మరి ఆ గజేంద్రుడు పొందిన కష్టమెలాంటిదో ఎవరికి తెలీదు ?.. కుచేలుడు నీ బాల్యస్నేహితుడని చెప్పుకుంటారే కాని ఆతను పడ్డ బాధలెన్ని ? ప్రహ్లాదుడు ఆజన్మ భక్తి యుక్తుడంటారే ఆ పరమభక్తుడు ఎన్నిబాధలనుభవించాడు. ? నీవు దీనదయాళుడవని ,ఆర్తత్రాణపరాయణుడవని చెప్పుకుంటారు కాని ఎంత ఆలస్యం గా భక్తులను  నీవు కాపాడుతావో, భక్తుల యెడ నీకెంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్ధమౌతోంది .
                                            

                                          అనఘ మౌ విప్రసత్రాన్న మెంగిలిఁ జేసి
తీవె మున్‌ క్రతుభోక్త నేనే యనుచు
సవతి కొమాళ్ళ సమయించి తందఱిఁ
దరుగని రాక్షసాంతకుఁడ ననుచు
బంధువు లన్యోన్య వైరానుహతులుగా
నడచితి భూభారహారి ననుచు
బలిమి నన్య స్త్రీలఁ బట్టితి వెందఱి
నస్ఖలద్బ్రహ్మచర్యమతి ననుచు
లోకమున నడ్డ మెవ్వరు లేక యునికి
హద్దు లే కిట్లు నడచితి వళుకు మాలి
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                 హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                      44

                  శ్రీకాకుళాంధ్రదేవ!    నేనే క్రతుభోక్త నని పవిత్ర విప్రయజ్ఞ  హవిర్భాగాన్ని ఎంగిలి చేశావు.  రాక్షస సంహారకుడనని పేరుపెట్టుకొని సవతితల్లి యైన దితి సంతానాన్ని నిర్విశేషం గా వధించావు. బంధువులు యుద్ధం లో ఒకరినొకరు చంపుకొని మరణించగా భూభారం తగ్గించానని ప్రకటించుకున్నావు. అస్ఖలిత బ్రహ్మచారినని చెప్పుకుంటూనేబలవంతంగా అనేకమంది పరస్త్రీలను వశపర్చుకున్నావు.    లోకం లో నీ కెవరు ఎదురులేకపోవడం మూలం గా భయం వదిలి  ఈవిధం గా హద్దు పద్దు లేకుండా   ప్రవర్తించావు.       

అది యోగ్యంతరం గాలానబంధంబు
వదలించుకొన నీకు వశము గాదొ!
వేదాంత సకృద చుంబితల మంత్రావర్ణ
నల గుహలుండి రా నలవి గాదొ!
నిమి షార్ధ నిమిషాది నిత్యవేళాచక్ర
గతి నిరోధించి రాఁ గ్రమము గాదొ!
వక్రకంటక పంకవత్క్రూరజనమనః
కాపథంబులను గా ల్మోపరాదొ!
యేమి యాలస్య మిది నీకు నేల సకల
జంతుసంతాన రక్షావిచక్షణునకు
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
                                   హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!                        45

                        శ్రీకాకుళాంధ్రదేవ!    మేము ఇంతగా ప్రార్ధిస్తున్నా  నీవు రావడం లేదు ? మహర్షులు తమ యోగశక్తి తో నిన్ను తమ మనస్సు లలో బంధించుకున్నారా?   దానినుండి విడిపించుకోవడం నీకు సాథ్యం కావడం లేదా?   వేద వేదాంతములలో చెప్పబడినట్లు  రహస్యమంత్రముల  చేత  కప్పివేయబడిన గుహలనుండి వెలుపలికి వచ్చుటకు  నీకు చేతకావడం లేదా ? నిమిషము అర్ధనిమేషము మొదలైన  కాలచక్రము లోని వేళాచక్ర  గతిన నిరోధించి బయటకు వచ్చుటకు  నీకు వీలు కాకున్నదా ?  లేక వంకర తిరిగిన ముళ్ళు, బురద తో నిండిన క్రూరజనుల మనస్సులనెడి మార్గము లో  కాలు పెట్టులకు నీమనస్సంగీకరించుట లేదా.   సర్వప్రాణ సంరక్షకుడవైన నీకు మమ్మల్ని రక్షించడానికి ఇంత ఆలస్యం ఎందుకు ?          

                                                                                               ఆరవ భాగం త్వరలో-----






**********************************************************

Monday, 18 July 2016

శతకసౌరభాలు -9 పురుషోత్తమ కవి - ఆంథ్రనాయక శతకము- 4

శతకసౌరభాలు -9


కాసుల పురుషోత్తమ కవి
  

              ఆంథ్రనాయక శతకము- 4                     


                                      










                                   ఆలు నిర్వాహకురాలు భూదేవి యై
               యఖిలభారకుఁ డనునాఖ్యఁ దెచ్చె
నిష్టసంపన్నురా లిందిర భార్యయై
                                   కామితార్థదుఁ డన్న ఘనతఁ దెచ్చెఁ
గమలగర్భుఁడు సృష్టికర్త తనూజుఁడై
                                బహుకుటుంబకుఁడన్న బలిమి దెచ్చెఁ
గలుషవిధ్వంసిని గంగ కుమారి యై
                          బతితపావనుఁ డన్న ప్రతిభఁ దెచ్చె
నాండ్రు బిడ్డలు దెచ్చుప్రఖ్యాతి గాని
మొదటినుండియు నీవు దామోదరుఁడవె
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!            26


                           ఆంథ్రదేవా  ! సమస్త భూభారాన్ని వహించే భూదేవి నీకు ఇల్లాలు కావడం తో నీవు  అఖిల భారకుడవనే  కీర్తిని పొందావు. సమస్త సంపదలకు నెలవైన మహాలక్ష్మీ దేవి భార్య అవడం వలన  కామితార్ధ ప్రదుడవనే బిరుదు దక్కింది.సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కుమారడవడం వలన బహు కుటుంబీకుడవు , పెద్దసంసారివనే పేరు దక్కింది. సమస్త పాపములను పోగొట్టే పరమ పావనయైన గంగ మాత నీకు కుమర్తె కావడం తో పతితపావనుడవనే ప్రతిభ ను సొంతం చేసుకున్నావు.  ఏ విధంగా  చూసినా నీకున్న పేరు ప్రతిష్టలన్నీ   ఆలు బిడ్డలు సంపాదించి పెట్టినవే కాని  ఆది నుండి నీవు దామోదరుడవే కదా ! .



                                      కడలి రాయని ముద్దుకన్నియఁ బెండ్లాడి
యూఁచఁగా నిల్లట ముండు టేమి
సహజ నొక్కర్తెను షండ పాండవునకుఁ
బెండ్లిఁ జేసితి నీవు పెద్ద వేమి
చిర రతిప్రౌఢను జిన్నబిడ్డని కీవు
గూర్చితి వారీతి గూడు నేమి
యుగములనాటి పెన్మగువను ముసలన్న
కొగిఁ జేసితివి తగుం దగు మఱేమి
తెలియ నవ్యక్తుఁడవు గావు తెలిసికొన్న
నిట్టివాఁ డని తెలియలే దెవ్వరికిని
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
                          హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!                   27


                                      దేవా !  నువ్వు చేసిన  పనులైనా నీ గౌరవాన్ని పెంచేవిగా ఉన్నాయా స్వామీ ఆలోచించు. సముద్ర రాజ తనయైన మహాలక్ష్మీదేవి ని పెండ్లాడి ,  మొత్తం గా పాలసముద్రంలోనే కాపురం పెట్టి ఇల్లరికం ఉండిపోయావు . ఒక్కగా నొక్క చెల్లెలు  సుభద్ర ను    పేడి యైన అర్జునునకిచ్చి పెళ్లి చేశావు. రతికళ లో ఎంతో  నేర్పరియైన రతీదేవిని చిన్నవాడైన ప్రద్యుమ్నుని కిచ్చి వివాహం చేశావు. వయసు లో పెద్దదైన   రేవతీ దేవి ని నీ ముసలి అన్న కు ఇచ్చి  కట్ట పెట్టావు. తెలుసుకోవడానికి సాధ్యం కానివాడవు. తెలుసుకున్న ఇటువంటివాడవని  ఎవరికీ తెలియని వాడవు కదయ్యా నువ్వు స్వామీ !.



                                      నీ జ్యేష్ఠపుత్త్రుఁ డెన్నికకు రాని యశాశ్వ
తపుఁ బను ల్సేయు సంతతము జగతి
వేరొక ముద్దుకుమారుఁడందఱిమోహ
లతల స్త్రీపురుషుల లంకెఁ బెట్టు
నీతలోదరి లోకమాత పక్షాపక్ష
దృష్టిఁ జంచలవృత్తిఁ దిరుగుచుండు
నీ వనన్యకృతాది నిబిడమాయావిధా
నుల జేయు దెవ్వరిఁ దొలఁగనీక
నొకరికంటె గుణాధికు లొకరు మీరు
ఇంతచక్కన దెలిసె మీయింటివరుస
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!      28

                       శ్రీకాకుళాంథ్రదేవా ! నీ పెద్దకొడుకైన   బ్రహ్మదేవుడు  ఈ లోకం లో అన్నీ అశాశ్వతపు పనులే చేస్తూ ఉంటాడు. నీ మరొక ముద్దుల కొడుకైన మన్మధుడు  స్త్రీ పురుషుల మధ్య వికారాలను రేకెత్తించి, మోహలతల చేత బంధిస్తూ ఉంటాడు. నీ ఇల్లాలు లక్ష్మీదేవి ద్వంద్వ మనస్సు తో  చంచల స్వభావు రాలై సంచరిస్తూ ఉంటుంది. ఇక నీవు  సమస్త లోకాన్ని మాయా మోహం లో ముంచి వేయడం లో దిట్టవు. ఆహా  ! ఏమి కుటుంబమయ్యా మీది!  . ఒకరిని మించిన వారు మరొకరు .
                                
                                              సకలంబు నీవ యై యొక మఱ్ఱియాకుపై
నిచ్చఁ బరుండునాఁ డెంత గలవొ!
తన బిడ్డఁ డని యశోదాదేవి పొత్తుల
నిడుక ముద్దాడునాఁ డెంత గలవొ!
తక్కులమారత్త దక్కించుకొనఁగ ని
న్నెత్తుక పెంచునాఁ డెంత గలవొ!
భయలేశ మెఱుఁగక బల్పాముపడగపై
గంతులు వైచునాఁ డెంత గలవొ!
పరువు గలవాఁడ వేమి ప్రాఁబల్కు లంచు
దెలియ వరిముక్కు ముల్లంత కలవొ! లేవొ!
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
                            హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!                   29

                           దేవా !   ప్రళయం సంభవించి  సమస్త లోకములు నశించినప్పుడు మఱ్ఱియాకు పై వటపత్ర శాయివైనప్పుడు ఎంత ఉన్నావో,  నందుని ఇల్లాలు యశోద తన పొత్తిళ్ళ లో నిన్ను ఎత్తుకొని ముద్దాడేటప్పుడు ఎంత ఉన్నావో, నీ మేనత్త చంక నెత్తుకొని లాలించేటప్పుడు ఎంత ఉన్నావో, కాళింది మడుగు లో  కాళీయుని పడగ లపై నర్తించే టప్పుడు ఎంత పసివాడివో, వేదములలో కూడ  వరిముక్కుముల్లంత సూక్ష్మరూపుడుగానే వర్ణించబడ్డావు. నీవు చాలగొప్పవాడవు సుమా! .

                        “లోకంబులు లోకేశులు లోకస్ధులుఁ దెగిన తుది నలోకంబగు పెం
                          జీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుగు నతని నే సేవింతున్” (8-75)
                    అంటుంది ఆంధ్రమహాభాగవతం.

                “నీవారశూకవత్తన్వీ పీతాభా స్తస్యనోపమా” అని వేదం.    నీవారశూకవత్ అన్న  వేద వచనమే వరిముక్కుముల్లంత గా పద్యం లో   చోటు చేసుకుంది.



                                


                                      కల్లరు ల్గాని వ్రేపల్లెవా రందఱు
హర్షింప నచట నీయాట సాగె
మధురాపురీవరమనుజు లామోదించి
మన్నింప నచట నీయాట సాగె
ద్వారకాపట్టణధన్యులు నినుఁ గోరి
కొల్వఁగా నచట నీకొల్వు సాగెఁ
గరిపుర  ధర్మజుం డురురాజసభ నిన్ను
భూషింప నచట నీముర్వు సాగె
నెరుక మాలినవారుఁ నీపరువు దలఁతు
రేమి నీపొంకములు సాగు నేమి యచట?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!  30
                                
                              దేవా !  ఆనాడు రేపల్లె లో ఉన్నవారందరూ  అమాయకులై , మోసగాళ్లు కాకపోవడం తో అక్కడ నీ ఆటలు సాగాయి.మధురానగరం లో ప్రజలు నిన్ను ఆమోదించి గౌరవించడం చేత నీ మాట చెల్లింది. పుణ్యాత్ములైన ద్వారకా నగరప్రజలు నిన్ను కోరి సేవించడం మూలంగా  అక్కడ నీ పాలన సాగింది. హస్తినాపురం లో ధర్మరాజు  నిండుసభ లో నిన్ను సత్కరించడం వలన నీ కోర్కె తీరింది. అజ్ఞానులు నిన్ను లెక్కపెట్టరు.  వారి వద్ద నీ డాంబికాలు సాగవు కదా !.
                           

              అంటే యెఱుక (జ్ఞానం) కల్గిన వారికే భగవదనుగ్రహం ప్రాప్తిస్తుంది. అజ్ఞానులకు ఆయన అందడని సూటిగా చెపుతున్నాడు కవి.


                                         దూడలలోఁ బెరదూడ మేయఁగఁజూచి
యట్టె పట్టుక చావఁగొట్టవలెనె
పొడవ రా వేగ నాబోఁతుకొమ్ములు పట్టి
విడువక దానిపే రుడుపవలెనె
ముక్కుతోఁ జెనకిన కొక్కెరాయనిఁ బట్టి
వెర వొప్పఁగా మెడ విఱువవలెనె
తన్నుఁ బో తని మృగాధమ మంచు నెంచక
తొడరి గార్ధభమును ద్రుంపవలెనె
మేమి ఘనకార్యములు చేసి తిద్ధరిత్రి
నెన్నటికి నీ వొనర్చిన విట్టిపనులె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!               31

                            దేవా ! నీవు ఈ లోకం లో ఎన్నెన్ని ఘనకార్యాలు చేశావో !. వేరొక దూడ నీమంద లో మేస్తుంటే  దాన్ని పట్టి కొట్టి చంపావు కదా. (వత్సాసుర వథ.) పొడవడానికి పైపైకి వస్తున్న ఆబోతు ను  కొమ్ములు పట్టుకొని విరిచి చంపివేయాలా?. ( వృషభాసుర వథ.) ముక్కు తో పొడిచిన ఒక కొంగను మెడ విఱిచి మరీ చంపెయ్యాలా ?. (బకాసుర వథ) కాలితో తంతుందని తెలిసి కూడ నీచమైన ఒక గాడిద ను పట్టుకొని చంపాలా ?. (థేనుకాసుర వథ). ఈ విథం గా ఒక దూడను , ఆబోతు ను ,కొంగను , గాడిద ను చంపడం  గొప్ప సాహస కృత్యాలా.. ఇటువంటివే కదా నువ్వు చేసిన పన్లన్నీ స్వామీ !.
                   

                        “కీర్తి నిందగ వర్ణించి గేలి పఱతు”  నని కవి చేసిన ప్రతిజ్ఞ ను ఇలా తీర్చుకుంటున్నాడన్నామాట.అందుకే శ్రీకృష్ణుని బాల్యక్రీడలను, సాహసాలను గుర్తుచేస్తూనే , ఆ! అవేమి గొప్పా  ! అని  హేళన చేస్తున్నాడు. అదే నిందాస్తుతి.



                                          కవ్వడి కెంత చక్కఁగ బోధ చేసిన
నితరహింసాకర్మ మిష్టపఱుప
రాయబారం బెంత రసికత నడిపిన
ననికి భారతుల నాయత్త పఱుప
విశ్వరూపం బెంత విమలతఁ జూపిన
నోర్వని కురురాజు నులుకు పఱుప
విలుఁ బట్ట నని యెంతొ చెలిమిగఁ బలికిన
నవల సుయోధను నాసపఱుప
పోరు చంపక చుట్టముల్‌ పోర నీల్గఁ
జూచుచుంటివి యేనాఁటి చుట్ట మీవు?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
                       హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!                    32

                                     దేవా !  అర్జునునకు చక్కగా భగవద్గీతను బోధించావు కాని  తుదకు హింసనే నీవు ప్రేరేపించి యుద్ధానికి అర్జునుని సిద్ధం చేశావు కదా !. రాయబారాన్ని ఎంత అందం గా నడిపినా  కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరగడానికే దాన్ని ఉపయోగించుకున్నావు. విశ్వరూపాన్ని  ఎంత  చక్కగా ప్రదర్శించినను  దాని పరమార్ధం మాత్రం  దుర్యోధనుని భయపెట్టడమే కదా ?.  ఆయుధం పట్టనని ఎంతో స్నేహం గా చెప్పడం  సుయోధనుని  నమ్మించి యుద్ధం లోకి దించడానికే గదా ?. యుద్ధం ప్రారంభమై ఆ వైపు ఈ వైపు బంధువు లందరూ నేల కూలుతుంటే చూస్తూ ఊరుకున్నావు. నీవేమి చుట్టానివయ్యా  ?. నిజమైన బంధువు వైతే ఆ విధం గా చుట్టాలు మరణిస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా?.

మహాభారతం లో శ్రీకృష్ణుని పాత్ర ను ఆథునిక విమర్శకుల దృష్టి తో విశ్లేషిస్తున్నాడు కవి.




శ్రీమద్వికుంఠపురీ వరేశుఁడ వయ్యు
గొల్లపల్లెల నుండఁ గోరు టేమి ?
యక్షీణలక్ష్మీ కటాక్షవీక్షుఁడ వయ్యుఁ
ద్రోవ లే కింటింటఁ దోఁచ నేమి?
భూరి చతుర్దశ భువనావనుఁడ వయ్యుఁ
గడువేడ్కఁ దొఱ్ఱులఁ గాయ నేమి?
సన్మునిదేవతా సంభావితుఁడ వయ్యు
నాల గాపరులతో నాడ నేమి?
గొప్పలో గొప్పవాఁడవు కొలదిలోనఁ
గొలదివాఁడవు ని న్నెట్లు గొలువ వచ్చు?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
                               హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!                     33

                         దేవదేవా! వైకుంఠవాసుడవయ్యు గొల్లపల్లెలో ఉండాలనే కోరికేమిటయ్యా నీకు ?. అపార ధన రాసులకు అధిదేవతయైన ఆది లక్ష్మీ దేవి ఇల్లాలై ఉండగా , తిండి దొరకనట్లు రేపల్లె లో ఇంటింటా తిరిగి దొంగతనాలు ఎందుకు ?.పదునాల్గు లోకాలకు పోషకుడవై ఉండి కూడ  పాడియావులను మేపు కోవడ మెందుకు ?. సమస్త దేవతా ముని సమూహాలతో  గౌరవించబడే నీవు  ఆల కాపరులతో ఆటలేమిటి స్వామీ.?  గొప్పవారిలో గొప్పవాడివి, కొద్దివారి లో కొద్దివాడివి యైన నిన్ను ఎలా సేవించాలి స్వామీ!

                         " అణో రణీయాన్ మహతో మహీయాన్ " అని కదా వేదం. అందుకే  భగవంతుడు గొప్పవారి లో గొప్పవాడు. కొద్దివారిలో కొద్ది వాడు గాను కన్పిస్తాడు.          




                                             దుర్యోధనుం డవధ్యుఁడ వంచు మానెఁ గా
కలుక బంధింపఁగాఁ దలఁప లేదె?
గోపాలుఁడవు పూజఁ గొందువేరా యని
సభ నిన్నుఁ దిట్టఁడే చైద్యుఁ డెదిరి?
నీ లాంఛనంబులఁ బోలు చిహ్నలు దాల్చి
తానె నీ వనఁడె యుద్ధతినిఁ బౌండ్రుఁ?
డెవ్వరుఁ బట్టలే రేను బట్టెద నంచు
యవనుండు దరుమఁడే యాహవమున
నృపులు కొందఱు వెఱచిరే నీకు మున్ను
ప్రాణముల కాసపడరేని భండనమున
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!   34
                            


                      ఆంధ్రదేవా ! ఆనాడు నిండు సభ లో  దుర్యోధనుడు రాయబారిని చంపకూడదని నిన్ను వదిలివేశాడు కాని నీపై  కోపం తో నిన్ను బంధించడానికి ప్రయత్నించ లేదా ? గొల్లవాడివి నీవు పూజార్హుడవు కాదని శిశుపాలుడు నిన్ను నిండుసభ లో దుర్భాషలాడలేదా ?. పౌండ్రక వాసుదేవుడనే వాడు నీచక్రము మొదలైన  లాంఛనాలను పోలిన చిహ్నాలను తాను కూడ ధరించి నేనే వాసుదేవుడ నని డాంబికాలు పోలేదా ?. వాసుదేవుణ్ణి ఎవ్వరూ  పట్టుకోలేరు నేను పట్టి బంధించి తీసుకువస్తానని కాలయవనుడు  నిన్ను  యుద్ధ భూమి లో తరుమ లేదా?. ప్రాణాల మీద ఆశ తో ఏదో కొంతమంది రాజులు నువ్వంటే భయపడ్డారు కాని నిన్ను కూడ ఎదిరించిన వారు ఉన్నారు కదా.




                                        రాజు లెవ్వరుఁ బఙ్త్కి భోజన మిడకున్న
దాసునింట భుజించి తనియలేదొ?
బంధువు లెవ్వరు గంధ మీ కుండిన
మువ్వంకలది పూయ మురియలేదొ?
దొర లెవ్వరును బూలసరము లీకుండినఁ
దెలిసి మాలికుఁ డీగ నలరలేదొ?
ప్రభువు లెవ్వరు వస్త్రబహుమాన మీ కున్నఁ
దెచ్చి యిచ్చిన చాకి మెచ్చలేదొ?
పాటి సేయంగ నేరాజు బంధుగుఁడవొ?
మున్నె నీపస దెలిసిన దెన్న నేమి?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
                  హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!                        35

                          దేవదేవా! ఆనాడు  రాయబారానికి వెళ్ళిన రోజున రాజులెవ్వరూ నిన్ను భోజనానికి పిలవక పోవడం వలనే కాదా  సేవకుడైన విదురునింట భుజించి తృప్తి చెందావు. ఆనాడు మధురా నగర ప్రవేశ మప్పుడు చుట్టాలెవ్వరూ  పిలిచి గంధమివ్వక పోవడం వలనే కదా  మూడు వంకరలు తిరిగున్న కుబ్జ  గంధ మలద గానే మురిసి పోయావు. రాజు లెవ్వరూ ఎదురొచ్చి పూలమాలలు ఇవ్వక పోవడం మూలానే కదా సుదాముడనే మాలికుడు ఇచ్చిన దండలతో తృప్తి చెందావు. ప్రభువు లెవ్వరూ వస్త్రాది బహుమానములివ్వక పోవడం తో  వస్త్రాలు తెచ్చిన చాకలిని మెచ్చుకున్నావు.  అయినా నిన్ను గౌరవించడానికి నువ్వు ఏ రాజుకైనా బంధువు వా ఏమిటి. నీ గొప్పతన మంతా ఇంతకు ముందే తెలుసులేవయ్యా. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడమెందుకు. ?

   కాని ........  మధురా నగరం లో బలరామకృష్ణులకు వస్త్రముల నిచ్చింది సాలెవాడు కాని చాకి కాదు.
      
            ఆంథ్ర మహాభాగవతం లో    మధురానగరం లోకి ప్రవేశించిన బలరామకృష్ణులు   రజకుని చూచి “రజకాన్వయాగ్రణీ” అని సంబోధించిన కృష్ణుడు  --
విందులమై నరేశ్వరుని వీటికి వచ్చితి మేము:  మాకు  మా
                                 మందల లోనఁగట్టికొన మంచిపటంబులు లేవు: నీ ముడిన్
                                 సుందర థౌత చేలములు శోభిలు చున్నవి  తెమ్ము........
                                   …………                 రాజుదెస నల్లురమని  … (ఆం.మహా.దశ.పూ.1256)

 అంటూ  బట్టలివ్వమని గౌరవంగానే  అడిగాడు. కాని ఆ రజకుడు రోషించి –
                              “ఎట్టెట్ట్రా మనుజేంద్రు చేలములు నీకీ బాడియే అంటూ...........

            .....................................                                      గొల్ల ! యేగుము తలగన్ . (1259)

 అంటూ   తిరస్కరించాడు కృష్ణుణ్ణి. దానితో కోపగించిన కృష్ణుడు తన ముంజేతి తో అ రజకుని తల తెగి పడేటట్లు కొట్టాడు. ఆ తరువాత  ఆ మూట లోని బట్టలను తాము కట్టుకొని కొన్ని గోపబాలకులకు ఇచ్చి ముందుకు సాగుతుండగా , ఒక సాలెవాడు వచ్చి  పలురంగుల వస్త్రాలను , ఆభరణాలను బలరామకృష్ణులకు  సమర్పించాడు. సంతుష్టుడైన శ్రీకృష్ణుడు కరుణ తో అతనికి ఐశ్వర్యాదులను అనుగ్రహించి ,సారూప్యాన్ని , సంపత్తి ని ప్రసాదించాడు. (1264).

-------------          ఐదవ భాగం త్వరలో.



*****************************************************