Sunday, 14 September 2014

శతకసౌరభాలు -4 వేమనశతకము - 3

             
శతకసౌరభాలు  - 4

                                వేమన శతకము - 3





కల్లలాడువాని   గ్రామకర్త  యెఱుగు
సత్యమాడువాని స్వామి యెఱుగు
పెక్కు తిండిబోతుఁ బెండ్లామెఱుంగురా
విశ్వదాభిరామ వినురవేమ !

                       ఓ వేమా ! అబద్దాలు చెప్పేవాణ్ణి గ్రామాధికారి గుర్తిస్తాడు. నిజం పలికేవాణ్ణి యజమాని గుర్తిస్తాడు.తిండిపోతు సంగతి భార్యకు బాగా తెలుసు. ఇది లోకరీతి.

    సాధన

అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తియ్య నగును
సాధనమున పనులు  సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ !
        
               ఓ వేమా ! పాడగా పాడగా రాగం రక్తి కడుతుంది. రోజూ తింటుంటే వేపాకు కూడ తియ్యగా అనిపిస్తుంది. అదేవిధంగా ఏ పనినైనా సాధన చేయడం వలన ఆ పని సత్ఫలితాన్ని  ఇస్తుంది.

       తప్పులు

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనుల కెల్ల  నుండు  తప్పు
తప్పులెన్నువారు తమ తప్పు లె ఱుగరు
విశ్వదాభిరామ వినురవేమ !
            
                ఓ వేమా ! ఈలోకం లో తప్పులు పట్టుకునే వారు చాలమంది ఉంటారు. కాని ఈ భూమిమీద తప్పు చేయని వాడు ఒక్కడు ఉండడు. కాని ఆ విషయాన్నిమనసారా అంగీకరించేవాళ్ళు ఎందరుంటారు.  తప్పులెత్తి చూపే వారు తమ తప్పుల్నిమాత్రం తెలుసుకోలేరు.

తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా
ఓగు నోగులెంచు నొరుల గాంచి
చక్కిలంబుఁ గాంచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ వినురవేమ !
        
                           ఓ వేమా !  దుర్మార్గుడు ఎన్ని తప్పులు చేసినా వాటిని మర్చిపోయి, చిన్నకంతలున్న చక్కిలాన్ని చూసి పెద్ద పెద్ద కంతలున్న జంతిక ఎగతాళి చేసినట్లు ఎదుటివారి తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉంటారు. ఇది దుర్మార్గుల నైజం.


ఇనుము  విఱిగెనేని యినుమారు ముమ్మారు
కాల్చి యతుకవచ్చుఁ గ్రమము గాను
మనసు విఱిగెనేని మఱి యంట నేర్చునా
విశ్వదాభిరామ వినురవేమ !
          
                   ఓ వేమా ! ఇనుప ముక్క విరిగితే ఒకటికి రెండుసార్లైనా  కాల్చి అతికించవచ్చు. కాని మనసు విరిగి పోతే మళ్లీ అంటించడం సాథ్యం కాదు. అందుకే ఎదుటివారి హృదయం గాయపడేటట్లు మాట్లాడదగదంటున్నాడు మహాకవి వేమన.

ఒకనిఁ జెఱిచెదమని యుల్లమందెంతురు
తమదు చేటెఱుగరు ధరణి నరులు
తమ్ముఁ జూచు (చెరచు ) వాడు దైవంబు లేడొకో
విశ్వదాభిరామ వినురవేమ !

             ఓవేమా ! కొందఱు దుర్మార్గులు  ఇతరులను చెడగొడదామని  ప్రయత్నించి ఆనంద పడు తుంటారు. కాని తమకు కూడ కాలం వస్తుందన్న సంగతి వారు తెలుసుకోలేరు. తమను దైవం చూస్తున్నాడనే విషయాన్ని వారు  గుర్తుంచుకోవాలి.
                       ఇక్కడ మూడో పాదం లో “ తమ్ముఁ జెరచువాడు దైవంబు లేడొకో ” అని ఉంది ముద్రణ లో. కాని దైవమని చెపుతూ చెరచుట అని ప్రయోగించడం  మూలం లో  ఉండదేమో నని “చూచు వాడు” అని మార్చాను. సహృదయులు గమనించగలరు.

చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ !
            
                             ఓ వేమా !  చంపదగినంత అపకారం చేసిన శత్రువైనా  యుద్ధరంగం లో చేతికి చిక్కితే అతనిని చంపకుండా వదిలి వేయడమే అతనికి శిక్ష. అతనికి చేతనైనంత సహాయం చేసి మరీ పంపించమంటాడు యోగివేమన. ఇది మన  సంస్కృతి.
 
 అప్పు ఇవ్వడం

కాని వాని చేతఁ గాసు వీసం బిచ్చి
వెంటఁ దిరుగు వాడె వెఱ్ఱి వాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ !
       
    ఓ వేమా  ! తెలియని వాడికి , లేక ఒక  హీనునికి డబ్బును అప్పుగా ఇచ్చి , తిరిగి ఆ డబ్బును రాబట్టుకోవడానికి  వాని వెంట  తిరిగేవాడిని వెఱ్ఱివాడు నే అనాలి. ఎందుకంటే పిల్లి  గుట్టు చప్పుడు కాకుండా తిన్న కోడిని పెద్దగా పిలిస్తే మాత్రం వస్తుందా. అలాగే  ఒక హీనుడైన వ్యక్తి చేతిలోకి పోయిన సొమ్ము తిరిగిరాదు సరికదా. దాని ఉనికి కూడ తెలియదు.  

మాటలాడ నేర్చి మనసు రంజిలఁ జేసి
పరగఁ  బ్రియము చెప్పి బడలకున్న
నొకరి చేతి సొమ్ము లూరక వచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ !

                  ఓ వేమా ! మనసు మెచ్చే టట్లు మాటలు చెప్పగలగాలి. వారి కిష్టమైన ఊసుల్ని చక్కగా సాగదీయాలి. అప్పుడే ఎదుటివారి జేబులో డబ్బు మన చేతిలో కొస్తుంది. కాని ఊరకనే  ఒకరి చేతి లోని సొమ్ము  మనకు రమ్మంటే వస్తుందా ? అందుకే అప్పుచేయడం కూడ ఒక కళే అన్నాడు ఒక మహానుభావుడు

వాన  కురియ కున్న వచ్చును క్షామంబు
వాన గురిసెనేని వరద పాఱు
వరద కఱువు రెండు వరుస తో నెఱుగుడి
విశ్వదాభిరామ వినురవేమ !

                      ఓ వేమా ! వానలు పడకపోతే కరువు తాండవిస్తుంది. వర్షాలు పడితే  వరద లొస్తాయి. వరద ,కరువు ఒక దాని వెంట మరొకటి వస్తాయనే ప్రకృతి సత్యాన్ని మనం   గ్రహించాలి.

      ప్రాణము

పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
బట్టునా జగంబు  పట్ట దెపుడు
యముని లెక్క రీతి నరుగుచు నుందురు
విశ్వదాభిరామ వినురవేమ !
 
                         ఓ వేమా ! పుట్టిన వాళ్ళందరు ఈ భూమి మీదే ఉంటే ఈ భూలోకం సరిపోతుందా  ? చాలదు గదా !    అందుమూలంగానే ఆ యమధర్మరాజు లెక్కప్రకారం ప్రతివారు వారి కాలం రాగానే వెడుతూ ఉంటారు. ఈ ఇల లో శాశ్వతం గా ఎవరూ ఉండరు .

వాన రాకడయును బ్రాణంబు పోకడ
కానబడ దదెంత ఘనుని కైన
గానఁబడిన మీద గలి యెట్లు నడచురా
విశ్వదాభిరామ వినురవేమ !
                          
                       ఓ వేమా !. వాన రావడం ప్రాణం పోవడం ఎంత గొప్పవాడికైన  తెలియదు.  అది తెలిస్తే కలికాలం నడవదు కదా ! అందుమూలంగా ఈ కలియుగం లో  జీవుడు ప్రతిక్షణం మృత్యువు వస్తుందని  భావిస్తూ, ఉన్న కొద్ది సమయం లోనే ధర్మకార్య తత్పరుడై జీవించాలి.

ప్రాప్తం

చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటబడ్డ చినుకు నీటగలిసె
ప్రాప్తి గల్గుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ !
             
                      ఓ వేమా ! స్వాతి చినుకు  ముత్యపు చిప్పలో పడితే  ముత్యమౌతుంది. అదే చినుకు నీటి లో పడితే నీటిప్రవాహం లోనే కలిసి పోతుంది. కాబట్టి ప్రాప్తముంటే  ఫలితం దగ్గుతుంది. లేకపోతే ఎంత ప్రయత్నించినా ప్రయోజనముండదు.

ఎన్నిచోట్లు తిరిగి యేపాట్లు బడినను
అంట నియ్యక శని వెంటఁ దిరుగు
భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా
విశ్వదాభిరామ వినురవేమ !

                     ఓ వేమా ! ఎన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించినా , ఎన్నో  పవిత్ర నదీ నదాలలో  గ్రుంకు లిడినా శని మన వెంట నంటే ఉన్నప్పుడు  ఎటువంటి ఫలితము ప్రాప్తించదు. ప్రదేశాలు మారినంత మాత్రాన మన కర్మ ఫలం మారదు కదా !
                     అందు వలన  ప్రతిక్షణం మన  పూర్వజన్మ కర్మానుసారం గానే  మన జీవితం నడుస్తుంటుంది కాని  మంత్రాలు, తంత్రాలతో మార్చుకుందా మను కుంటే కుదరదు. అందుకే పెద్దలు “బుద్ధి : కర్మానుసారిణీ  “  అన్నారు. మన కర్మననుసరించే మనలో ఆలోచనలు  కూడ కలుగుతూ ఉంటాయి. ఇది కాదనలేని సత్యం.

అనువు గానిచోట నథికుల మనరాదు
కొంచెమైన నదియు గొదువ గాదు
కొండ యద్దమందు గొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ !
                   
                           ఓ వేమా ! అనువు కాని  ప్రదేశం లో ఆధిక్యాన్ని  ప్రదర్శించ కూడదు. ఒదిగి ఉన్నంత మాత్రాన   మనకు పోయేదేమీ లేదు. అద్దం లో కొండ చిన్నదిగానే కన్పిస్తుంది గదా !

     కర్మ

 ఇమ్ము దప్పువేళ నెమ్మె లెన్నియు మాని
కాల మొక్క రీతి గడప వలయు
విజయు డిమ్ము దప్పి విరటుని కొల్వడా
విశ్వదాభిరామ వినురవేమ !
             
                   ఓవేమా ! కాలం మనది కానప్పుడు అనవసరమైన ఆడంబరాలను వదిలివేసి ,  కాలం గడపాలి. కాని లేనిపోని భేషజాలకు పోకూడదు. అర్జునుడంతటి వాడే కానికాలం వచ్చినప్పుడు పేడియై విరటుని  సేవించవలసివచ్చింది కదా !

కర్మ మధికమైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి దగని చోటఁ
గంకుభట్టుఁ జేసెఁ గటగటా దైవంబు
విశ్వదాభిరామ వినురవేమ !

                        ఓ వేమా ! కర్మ బలవత్తరమైనప్పుడు తప్పించుకోవడం  ఎవరి వల్ల కాదు. ధర్మరాజు వంటి వాణ్ణే లాక్కొచ్చి  కంకుభట్టు గా విరాటుని కొలువు లో పడేసిన విథి ని ఎవరు తప్పించు కోగలరు. అందుకే విథి బలీయమనే విషయం గ్రహించండి.

లక్ష్మి యేలినట్టి లంకాథిపతి పురి
పిల్లకోతి పౌజు కొల్ల బెట్టె
జేటుకాలమయినఁ జెఱుప నల్పులె  చాలు
విశ్వదాభిరామ వినురవేమ !
    
                     ఓ వేమా !  ఒకనాడు  ఐశ్వర్య లక్ష్మికి నివాసం గా  వెలిగిన లంకానగరం  అల్పమైన కోతులచేత  నాశనాన్ని పొందింది. అందుకే పోయేకాలం అంటే చేటుకాలం వస్తే  ఎంత బలవంతుడైన  ఏమీ చేయలేక ఒక అల్పుని చేతిలోనే  పరాజితుడౌతాడు.


చిక్కియున్న వేళ సింహంబు నైనను
బక్క కుక్క కఱచి బాధ చేయు
బలిమి లేని వేళఁ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ !

                  ఓ వేమా ! బలం లేనప్పుడు పంతాలు పనికిరావు. కాలం కలిసిరానప్పుడు  తాడే పామై కరుస్తుంది.  కారణాంతరాలవల్ల చిక్కిపోయి , బలహీనం గా ఉన్న సింహాన్ని  బక్కగా ఉన్న కుక్క   కూడ కరచి బాధ పెడుతుంది.

దాతృత్వము

ఇచ్చువాని యొద్ద  నీని వాడుండె
జచ్చుగాని  యీవి సాగ నీడు
కల్పతరువు  క్రింద గచ్చపాదున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ !
      
                  ఓ వేమా ! దానగుణం గల్గిన మహానుభావుని చెంత ఒక పిసినారి వాడుంటే వాడు చచ్చినా దానం మాత్రం చేయనివ్వడు. అన్నికోరికలను తీర్చే కల్పవృక్షం మొదట్లో  గచ్చపొద ఉంటే అది ఎవరికీ పనికి రాదు సరి గదా. దాని ముళ్ళు గుచ్చుకుంటాయని దాని సమీపానికి కూడ ఎవరూ వెళ్ళరు. ధర్మాత్ముని వద్ద పిసినారి ఉన్నా  అదే సంభవిస్తుంది.
            
దాత గాని వానిఁ దఱచుగా వేడిన
వాడు దాత యౌనె వసుధ లోన
అవురు దర్భయౌనె యబ్ది లో ముంచిన
విశ్వదాభిరామ వినురవేమ !
             
                               ఓవేమా ! దానగుణం లేని వాణ్ణి మనం పలుమార్లు దాన మడిగినంత  మాత్రాన వాడు దాత కాడు. ఎందుకంటే గరికగడ్డి ని తీసుకెళ్ళి సముద్రం లో ముంచినా అది పవిత్రమైన దర్భ అవ్వదు కదా !

కఠినచిత్తుడు

 పరగ ఱాతిగుండు పగులగొట్టగ వచ్చు
కొండలన్ని పిండి కొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరగింప రాదురా
విశ్వదాభిరామ వినురవేమ !

             ఓ వేమా ! పెద్దబండఱాతి గుండునైనా  ప్రయత్నం చేత పగుల కొట్టవచ్చు. పెద్దపెద్ద కొండలనైన పిండి పిండి గా చేయవచ్చు. కాని కఠినహృదయుని మనస్సును మార్చి దయగలవాని చేయడం మాత్రం అసాథ్యం.

 వంపుకఱ్ఱ కాల్చి వంపు దీర్పగ వచ్చు
కొండలన్ని పిండి గొట్టవచ్చు
కఠిన చిత్తు మనసు కరగింపగా రాదు
విశ్వదాభిరామ వినురవేమ !
      
                              ఓ వేమా !  ప్రయత్నిస్తే వంకరగా ఉండే  వెదురు కర్ర ను కాల్చి వంపును సరిచేయవచ్చును. కొండలను పిండి చేయవచ్చును. కాని కఠిన హృదయుని మనస్సును మాత్రం ఎన్ని విధాల ప్రయత్నించినా  దయ గల హృదయం గా మార్చడం  మాత్రం సాథ్యం కాదు.

ధన మహిమ

విత్తము గలవాని వీపున  పుండైన
వసుధ లోన చాల వార్త కెక్కు
పేదవాని  నింట పెళ్ళయిన నెఱుగరు
 విశ్వదాభిరామ వినురవేమ !

                  ఓ వేమా !   డబ్బున్న వాడి మీద పుండు పుడితే దేశమంతా ఒక పెద్దవార్త గా చెప్పుకుంటారు. కాని ఒక పేదవాని ఇంట్లో పెండ్లి జరిగినా  ఎవరు పట్టించుకోరు. ఇది  డబ్బులో ఉన్న గొప్పతనం.

ఆపద గల  వేళ నరసి బంధువుఁ జూడు
భయము వేళ జూడు బంటుదనము
పేద వేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ వినురవేమ !

                    ఓ వేమా ! సాధారణ వేళల్లో  అందరూ ఆత్మీయుల్లాగానే కన్పిస్తారు. కాని ఆపదలు సంభవించినప్పుడే అసలు బంధువులు ఎవరో తెలుస్తారు. భయం వేసినపుడే  మనిషి లోని  ధైర్యం వెలుగు చూస్తుంది. దరిద్రం చుట్టుముట్టినపుడే  భార్యలోని  అసలు గుణం  బయటపడుతుంది.

ఆలి మాట విని అన్నదమ్ములఁ విడిచి
వేఱె పోవు వాడు వెఱ్ఱివాడు
కుక్క తోక పట్టి గోదావరీదునా
విశ్వదాభిరామ వినురవేమ !

                ఓ వేమా ! పెళ్ళాం చెప్పుడు మాటలు విని  అన్నదమ్ములను , ఉమ్మడి కుటుంబాన్ని వదిలి వేసి వేరుకాపురం పెట్టేవాడు వెఱ్ఱివాడు. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదటం సాథ్యం కాదు గదా !

మగని కాలమందు మగువ కష్టించినా
సుతుల కాలమందు సుఖము నందు
కలిమి లేమి రెండు గల వెంత వారికి
విశ్వదాభిరామ వినురవేమ !
              
            ఓ వేమా ! భర్త ఉన్నప్పుడు ఇల్లాలు ఆయనతో కలసి కష్టపడి ఇంటిని వద్ధిలోకి తీసుకువస్తే కొడుకుల కాలం లో వారికి ఇంటి విషయాల్లో  సలహాలను  ఇస్తూ, మనవళ్ళను  మనువరాళ్ళను చూసుకుంటూ సుఖంగా ఉండవచ్చు. ఎంతవారికైనా కలిమిలేములు ఉంటాయి కాబట్టి  కష్టపడితే సుఖాలను పొందవచ్చు నంటాడు మహాకవి.

ఇంటి ఆలు విడిచి ఇల జాఱ కాంతల
వెంట తిరుగువాడు వెఱ్ఱివాడు
పంటచేను విడిచి పరిగ యేఱిన యట్లు
విశ్వదాభిరామ వినురవేమ !                       

              ఓ వేమా ! ఇంట్లో ఉన్న ఇల్లాలిని కాదని వేశ్యల వెంట తిరిగేవాడు వెఱ్ఱివాడు. పంట పొలం లోని పంటను వదిలేసి ,  ఇతరుల చేలల్లో  పరిగ కోసం వెతిక్కునేవాణ్ణి  పిచ్చివాడనక  ఏమంటారు మరి.
                  రైతు వరిపంట కోయించి కుప్ప వేయించిన తరువాత చేలో అక్కడక్కడ మిగిలిపోయిన వరికంకులను ఏరుకోవడాన్ని  పరిగ ఏరుకోవడం అంటారు.

             దైవమదొక్కటే

 పశులవన్నె వేఱు పాలేక వర్ణమౌ
పుష్పజాతి వేఱు పూజ యొకటె
దర్శనంబు వేఱు దైవంబ దొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ !

                  ఓవేమా ! పశువులు ఎన్ని రంగుల్లో ఉన్నా పాలరంగు మాత్రం ఒకటి గానే ఉంటుంది కదా ! ఎన్ని రంగుల పువ్వులున్నా చేసే పూజ మాత్రం ఒక్కటే. దేవుళ్లు ఎన్ని పేరులతో పిలువబడుతూ , దర్శించబడుతున్నా  భగవంతుడు మాత్రం ఒక్కడే !

పలు తొడవులు వేఱు బంగారు మొకటియ
పరగ ఘటము వేరు ప్రాణ మొకటి
అరయ తిండ్లు వేఱు ఆకలి ఒకటిరా
విశ్వదాభిరామ వినురవేమ !
                
                       ఓ వేమా. ! ఆభరణాలు రకరకాలు ఉన్నా అందులోని బంగారం ఒకటే కదా. జీవుల శరీరాలు  వేరువేరు రూపాల్లో ఉన్నా వాని లోని ప్రాణం ఒకటే కదా. అలాగే తినే పదార్థాలు వేరైనా అందరిలోను ఉండే ఆకలి ఒక్కటే గదా !
  




 ******************************************************************************************************4 వ భాగం త్వరలో **********************************************















Saturday, 9 August 2014

శతకసౌరభాలు - 4 వేమనశతకము - 2

శతకసౌరభాలు - 4

                             వేమన శతకము -2

                      


                       నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు చంపు
                      బైటఁ గుక్క చేత భంగపడును
                      స్ధాన బల్మి గాని తనబల్మి కాదయా
                       విశ్వదాభిరామ వినురవేమ !
       


                               ఓ వేమా !   మొసలి నీళ్ళ లో ఉంటే ఏనుగు నైనా అవలీలగా  చంపగలదు కాని అదే మొసలి నీటిని విడిచి బైట ఉన్నప్పుడు కుక్క చేతనే  వెంటాడి చంపబడుతుంది. ఎందుచేతనంటే అక్కడ మొసలికి ఉన్నది స్ధానబలమే కాని సహజ బలం కాదు. అందుకే   ‘నీళ్ళలోన మొసలి నిగిడి దూరము పారు బైట మూరెడైన పాఱలేదు ‘  అంటాడు మరొకచోట  వేమన.

  డబ్బు విలువ                   
                     
                          కులము లేని వాడు  కలిమి చే వెలయును
                        కలిమి లేని వాడు కులము  దిగును
                       కులము కన్న భువిని కలిమి  ఎక్కువ సుమీ
                        విశ్వదాభిరామ వినురవేమ !
                     

                        ఓ వేమా!   కులం లేకపొయినా , గుణం లేకపోయినా డబ్బున్నవాడు సమాజం లో కీర్తించబడతాడు. ధనము లేనివాడు ఉన్నత కుల సంజాతుడైనను వాడిని  తక్కువగానే చూస్తారు. ఎందుకంటే ఈ లోకం లో డబ్బు కున్న విలువ  మరి దేనికీ లేదు.   
                  
                   కులము గలుగువారు గోత్రంబు గలవారు
                     విద్యచేత విఱ్ఱ వీగువారు
                      పసిడి గల్గు వాని బానిస కొడుకులు 
                      విశ్వదాభిరామ వినురవేమ !
                

                         ఓ వేమా.!    నేటి సమాజం లో కులగోత్రాలు గొప్పవని చెప్పుకొనేవారు, మేము గొప్ప విద్వాంసులమని విర్రవీగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడ డబ్బున్న వాళ్ళకి తొత్తులుగా , బానిసలు గా వ్యవహరిస్తారే కాని  దాని కంటే అతీతులు కాదంటున్నాడు వేమన.  ధన ప్రభావం అంత గొప్పది . అందుకే ‘డబ్బు లేని వాడు డుబ్బు కు కొఱగాడు’ అంటారు పెద్దలు. ‘ధనమూలమిదం జగత్ ’ అన్నది జగమెరిగిన మాట. ‘డబ్బు చేతిలో దేవుడున్నాడనేది ‘ జానపదుల మాట.
   
       లోభి గుణము
            
             
                  కనియు కానలేడు కదలింపడా నోరు
                  వినియు వినగ లేడు విస్మయమున
                  సంపద గలవాని సన్నిపాతంబిది
                    విశ్వదాభిరామ వినురవేమ !
                 
                 సర్వమును ఇచ్చునట్టి ఆ దైవమునకు ప్రియమైన  ఓ వేమా ! డబ్బున్న వాడు ఎదుటివాడు పడుతున్న బాధలను , కష్టాలను చూస్తూ కూడ చూడనట్లుంటాడు.  నోరువిప్పి మాటాడడు. మన బాధలు చెప్పు కుంటుంటే వినినట్టుగానే ఉంటాడు కాని వినడు.   విచిత్రమేమిటంటే   చూసినా చూడనట్టు ,మాట్లాడినా మాట్లాడనట్టు , విన్నా విననట్లు ఉండటం   సన్నిపాత రోగ లక్షణ మైతే ఇటువంటి రోగమే ధనవంతుడికి  ఉంటుందని  తెగేసి చెపుతున్నాడు వేమన. 

                  గొడ్డుటావుఁ బిదుక కుండ గొంపోయిన
                 బండ్ల నూడ దన్ను పాల నీదు
                 లోభి వాని నడుగ లాభంబు లేదయా
                  విశ్వదాభిరామ వినురవేమ !

                     సర్వేశ్వరునకు ప్రియమైన ఓ వేమా !     గొడ్డు పోయిన ఆవు దగ్గరకు పాల పిదుకడానికి పాత్ర తీసుకెళ్లి కూర్చుంటే పండ్లు రాలేట్టు తన్నుతుంది కాని పాలను ఇవ్వదు. అలాగే నువ్వు ఎంత అవసరం లో ఉన్నా పిసినారి వాడి దగ్గరకు సహాయం కోసం వెడితే  అవమానకరమైన మాటలను పడవలసి వస్తుంది కాని  కొంచెం  ప్రయోజనం ఉండదు .
             
                  మేక కుతిక పట్టి మెడ చన్ను గుడువగా
                   ఆక లేల మాను నాశ గాక
                  లోభివాని నడుగ లాభంబు లేదయా
                   విశ్వదాభిరామ వినురవేమ !


                             ఓ వేమా !  మేక మెడ క్రింద చన్నులా వేలాడే మాంసపు తిత్తిని పట్టుకొని  ఆశగా ఎంతసేపు   కుడిచినా   పాలు రావు . ఆకలి తీరదు కదా. అలాగే పిసినారి ని ఆర్ధిక సహాయం కోసం  ఎంతసేపు దేవిరించినా మనకు సమయం వృధా తప్పితే దక్కేది ఏమీ ఉండదు.


                                  పెట్టి పోయ లేని వట్టి నరులు భువిని
                                 పుట్టనేమి వారు గిట్టనేమి
                                  పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా
                                   విశ్వదాభిరామ వినురవేమ ! 


                    ఓ వేమా ! దాన గుణము లేని నరులు ఈ భూమి మీద పుట్ట నెందుకు. చావనెందుకు . అటువంటి  వారి వలన ఎవరికి  లాభము.పుట్టలోని చెదలు పుడుతూ , నశిస్తూ ఉన్నట్టే ఈ పిసినారి వాళ్ళు  కూడ పుట్టడం చావడానికే తప్పితే ఎవ్వరికీ అణు మాత్రం కూడ ఉపయోగ పడరు కదా !


  తత్త్వ వివేచన
  

                      ఏమి గొంచు వచ్చె నేమి తా గొని పోవు
                       పుట్టువేళ నరుడు గిట్టువేళ
                      ధనము లెచటికేగు తా నెచ్చటి కేగు
                       విశ్వదాభిరామ వినురవేమ !


                    ఓ వేమా !  ఈ జీవి భూమి మీదకు వచ్చే టప్పుడు ఏమి తీసుకొచ్చింది . రేపు  పోయేటప్పుడు ఏమి తీసుకెడుతుంది. నానబాధలు పడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోతుంది . తన కట్టె కాలి తానెక్కడికి పోతాడు. ఈ విషయాలను మానవుడు  తెలిసికూడ మర్చిపోయి ప్రవర్తిస్తుంటాడు.


                       తనువదెవరి సొమ్ము తనదని పోషింప
                     ద్రవ్య మెవరి సొమ్ము దాచుకొనగ
                        ప్రాణమెవరి సొమ్ము పారిపోకను నిల్వ
                        విశ్వదాభిరామ వినురవేమ !


                       ఓ వేమా ! ఈ శరీరం తనకు చెందినదనే మోహంతో చక్కని సౌందర్య సాధనాలను వాడుతూ , ఎండకు ,చలికి  బలి కాకుండా కాపాడు కుండూ ఉంటాము.  ఈ దేహం ఏమైనా శాశ్వతమా  ?. నీ దని కాపాడుకోవడానికి.  డబ్బంతా   ఎవరి సొంతమని నీవు పోగేసి కూడ పెడుతున్నావు.  అలాగే  ప్రాణం ఏమైనా నీ స్వంతమా? పారిపోకుండా ఉండటానికి. కాలం వచ్చినప్పుడు హంస లేచి వెళ్లి పోతుంది.   ఇవన్నీ అశాశ్వతాలని తెలిసి కూడ జీవుడు మాయ లో పడి ‘ నాది’ ‘ నేను’ అనే భ్రాంతిలో పడి కొట్టుకుంటుంటాడు.

                               అందుకే ఆంద్రమహాభారతం లో యక్షుడు ధర్మరాజును ప్రశ్నిస్తూ  ఈ లోకం లో ఆశ్చర్యకరమైన విషయమేమిటని అడుగుతాడు. అందుకు ధర్మజుడు సమాధానమిస్తూ. ...

            “ అహన్యహని భూతాని గచ్ఛన్తీహ యమాలయమ్
             శేషా : స్ధావర  మిచ్ఛన్తి కిమాశ్చర్య మిత : పరమ్ !! “

                   -అంటాడు. అంటే ప్రతిరోజు  జీవులు యమ సదనానికి వెళుతూనే ఉన్నారు. కాని మిగిలిన  వారు తాము పోయేవారం కాదని . శాశ్వతులమని భావిస్తున్నారు . ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది అంటాడు.

                               ఈ మాయే  ఈ లోకాన్ని నడిపిస్తోంది.   దీన్నే 'వైష్ణవమాయ 'అంటుంది మహా భాగవతం .

     అన్నదాన  ప్రాశస్త్యము                 

                  
                   అన్నిదానము లను అన్నదానమె గొప్ప
                    కన్నతల్లి కంటె ఘనత లేదు
                    ఎన్న గురుని కన్న  నెక్కుడు లేదయా
                     విశ్వదాభిరామ వినురవేమ ! 
                         

                              ఓ వేమా. దాన గుణము సర్వదా కొనియాడదగినది. దానము లన్నింటిలోనికి అన్నదానము గొప్పది . ఆకలి తో ఉన్న జీవికి ఆప్యాయంగా  అందించే ఆహారానికంటే మించిన దానం మరొకటి లేదు. కన్నతల్లిని మించిన దైవము లేదు.  గురువును మించిన గొప్పవాడు లేడు.

       ఆశ
                 

                    ఆశ చేత మనుజు లాయువు గలనాళ్ళు
                 తిరుగుచుందురు భ్రమ ద్రిప్ప లేక
                మురికి భాండమందు ముసురు నీగల భంగి
                 విశ్వదాభిరామ వినురవేమ !
               
                      ఓ వేమా.  ఆశ యనేది మిక్కిలి చెడ్డది.  ఆశా పాశములచేత బంధించబడిన నరుడు  అనేక కష్టాల పాలౌతాడు.  ఆ ఆశ చేతనే మానవులు మాయ లో చిక్కుకొని, మురికి కుండ చుట్టూ తిరిగే ఈగల్లాగా  బతికి ఉన్నంతకాలం దేనికో ఆరాట పడు తుంటాడు.

                
                           ఆశ పాపజాతి అన్నింటి కంటెను
                           ఆశ చేత యతులు మోస పోరె
                         చూచి విడుచు వారు శుద్ధాత్ము లెందైన
                           విశ్వదాభిరామ వినురవేమ !
             

           ఓ వేమా. ఆశ  అన్నింటికంటే మిక్కిలి చెడ్డది. ఈ ఆశ యనే ఉచ్చులో చిక్కుకొని గొప్ప గొప్ప యతీశ్వరులే మోసపోయారు.  తెలిసి విడిచిన వారే విశుద్ధాత్ములుగా  కీర్తించ బడుతున్నారు.
                       
                        ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి
                        గోచి బిగియ గట్టి గుట్టు దెలిసి
                       నిలిచి నట్టి వాడె నెఱయోగి యెందైన
                         విశ్వదాభిరామ వినురవేమ !

         ఓ వేమా. ఆశ యనే  మాయా పాశాలను కోసివేసి , శరీరం లో జ్వలించే కోరికలనే కామాగ్నిని చల్లార్చి, కౌపీనాన్ని  బిగియ కట్టి , జీవుల జనన మరణ జీవ రహస్యాల గుట్టు మట్టులను   తెలుసుకొని , నిలిచిన వాడినే  నిజమైన యోగి అంటారని ఆత్మయోగి యైన వేమన అభిభాషణ. అందుకే సర్వేశ్వరునికే అభిరాముడనని తనకు తానే ప్రకటించుకున్నాడు  యోగి వేమన.

                        నీళ్ళలోని మీను నెఱి మాంస మాశించి
                        గాలమందు జిక్కు కరణి భువిని
                        ఆశ దగిలి నరుడు నాలాగె  చెడిపోవు
                         విశ్వదాభిరామ వినురవేమ !

                    ఓ వేమా. నీళ్ల లో ఉండే  చేప  గాలానికి  వేలాడుతున్న   ఎఱ ను చూసి ఆశ పడి  గాలానికి చిక్కుకొని మరణించి నట్లే మానవుడు ఆశ యనే గాలానికి చిక్కుకొని  నాశనమై పోతున్నాడు.

         రాజసేవ

                          చచ్చి పడిన పశువు చర్మంబు కండలు
                            పట్టి పెఱికి తినును పరగ గ్రద్ద 
                             గ్రద్ద వంటి వాడు జగపతి కాడొకో
                                     విశ్వదాభిరామ వినురవేమ !

                                       ఓవేమా  !  చచ్చిన పశు కళేబరాన్ని  గ్రద్ద పీక్కు తిన్నట్టు గా రాజనే వాడు జనులను పన్నుల రూపంలో దయాదాక్షిణ్యాలు లేకుండా  పీడించుకొని తింటాడు. రాజు గ్రద్ద లాంటివాడే.
                     
                          ఎరుక లేని దొరను నెన్నాళ్ళు గొలిచిన
                         బ్రతుకు లేదు వట్టి భ్రాంతి కాని
                         గొడ్డుటావు పాలు గోరితే చేపునా 
                          విశ్వదాభిరామ వినురవేమ !
                     

                                               ఓ వేమా! మన కష్టాన్ని గుర్తించి మన్నించలేని  ప్రభువును ఎంతకాలం విశ్వాసం గా  సేవించినా మనం  ఆశపడటం తప్పితే ఫలితమేమీ ఉండదు. మనకు అవసరమని గొడ్డు పోయిన ఆవు దగ్గరకు  వెళ్ళి బ్రతిమలాడితే మాత్రం పాలు ఇస్తుందా ? ఇవ్వదు కదా !
                         
                           అలను బుగ్గ పుట్టి నప్పుడే క్షయ మౌను
                         కలను గాంచు లక్ష్మిఁ గనుట లేదు
                        ఇలను భోగ భాగ్య మీ తీరు గాదొకో
                         విశ్వదాభిరామ వినురవేమ !
                  
                                          ఓ వేమా !  సముద్రపు అలల యందు బుడగ పుట్టి ఏ విధంగా క్షణకాలం లో నశించిపోతుందో , కలలో కన్పించిన ధనరాశులు వాస్తవం లో ఏ విధంగా  అదృశ్య మై పోతాయో అలాగే ఈ భూమి మీద భోగభాగ్యాలనేవి క్షణభంగురాలే కాని శాశ్వతాలు కావు.
                    
                         
                           కోతి నొనర దెచ్చి కొత్తపట్టము గట్టి
                           కొండముచ్చు లెల్ల గొలిచి నట్లు
                            నీతి హీనునొద్ద నిర్భాగ్యులుండుట
                           విశ్వదాభిరామ వినురవేమ !
                             

                               ఓ వేమా !   కోతిని రాజును చేసి కొండముచ్చులన్నీ చేరి కొలిచినట్లుగా నీతిమాలిన వారి వద్ద నిర్భాగ్యులు చేరుతుంటారు.  అయోగ్యుని కి పట్టం కడితే అవినీతి పెరిగిపోయి , అసమర్ధులు అధికారులౌతారు.






 ****************************  మూడవ భాగం త్వరలో  **********************************