Wednesday, 31 October 2012

రామాయణము-రమణీయకథనాలు-10 అశోకవని లో దు:ఖయోగిని


2                                
                                          అశోకవని  లో  దు:ఖయోగిని
                                                    


                   లోకంలో బాధ అనేది రాక పూర్వం భరించడం అతి భయంకరంగా ఉంటుంది. కాని అనుభవింపక  తప్ప నప్పుడది ఆశాభావంతో  అతి తేలిగ్గా భరించబడుతుంది. ఇదిలోకరీతి.  అశోకవనం  లోని శింశుపా వృక్షం క్రింద  రాశీభూత దు:ఖయై కూర్చున్న భూజాత ను దు:ఖయోగిని గా దర్శించిన ద్రష్ట శ్రీ సుప్రసన్న.  సీతాదేవి అగ్నిప్రవేశాన్నిఅనుభూతి దృక్పధంతో ఆవిష్కరించిన కావ్యమిది.    
      
                                    ఋతువులు మారుతున్నా  అక్కడ శిశిరఋతువే రాజ్యమేలుతోంది. సముద్రుడు భయంకరంగా ఘోషిస్తున్నాడు. అణచుకోలేని బాధతో సుళ్లు తిరుగుతున్నట్లుగా బారలు చాస్తూ లంకను తనలో కలుపుకోవాలని యత్నిస్తున్నాడు. కన్నకూతురు  దు:ఖాన్ని చూడలేక  గుండెలు లవిసేలా రోదిస్తున్న  కన్నతండ్రి రోదనధ్వని అది.

                         కారు చీకటిలో సైతం కాంతిమయంగా,  తమో సరస్సున హిమపటల పరీత శ్వేత పుండరీకం వలె, మంచున తడిసిన మల్లెమొగ్గల మాలగా శింశుపా వృక్షం క్రింద       “క్షీరాబ్థికన్యక “దర్శనమిస్తోంది. తమస్సు అజ్ఞానానికి ప్రతీక కాగా తేజస్సు జ్ఞానానికి ప్రతీక. ఆంతరంగిక లోకమే కాని బాహ్యజగత్తు లేని యోగిని ఆమె. “మహా దు;ఖమందున తప్తమయిన యట్టి జీవియె యోగిత నందుకొనును” అంటారు కవి. తప్త కాంచనం కాంతిని పొందినట్లు  దు;ఖాగ్ని తప్తమైన జీవి               ” యోగిత “నందు కొంటుంది .

                        “ఆమె యీ లంక యన్నది అసలె యెరుగ
                        దిక అయోథ్యయు మిథిలయు నెపుడొ మరచె
                         ఆమె కిపుడు దేశము , లోకమంచు,  చేత
                        మందు, ఊహయందును, కోర్కెయందు లేదు. “               27.వ.ప 
                                  
             కోరికలు లేని యోగినియై రామరూప థ్యానమగ్నయైన జానకికి  రావణాసురుడు  --- తమశ్శుద్ధ రూపిణులైన రాక్షసస్ర్తీలను  కాపలాగా నియోగించాడు. వీరు ఎప్పుడు నిద్రపోతారో ,ఎప్పుడుమేల్కొంటారో తెలియదు. తామసా కృష్ట లైన రాక్షసకాంతలు సీతమ్మ సౌందర్యాన్ని చూసి ఈర్ష్యతో                              “అమ్మవారి లాగున్నదే “అంటూ  గుసగుసలు పోతూనే నిద్రలోకి జారి పోయారు. వాళ్లకి మళ్లీ మెలకువ వచ్చేసరికి అది “విభీషణ రాజ్యమటంచు తెలిసె” అంటూ రాక్షసనిద్ర అంటే ఏమిటో  చమత్కారంగా తెలియజేశారు కవి.

              



                                    సీతమ్మ కూర్చున్నట్టు గా చెప్పబడుతున్న తిన్నె - శ్రీలంక

                                                                                       (Google సౌజన్యం తో )
                       ఎదలో తొట్రుపాటు
,నడకలే తడబాటు, కన్నులలో వెడబాటు సంచలిస్తుంటే- రాక్షసకాంతలు భయంతో ప్రక్కకు తప్పుకుంటుంటే రామచంద్రుని చెంత నుండి విభీషణుడు  సీతామాత సమీపానికి వచ్చాడు.  సీతమ్మ ముంగిలిలో దోసిలొగ్గి రావణుని మరణాన్ని , రామచంద్రప్రభు  విజయపురస్సరంగా ప్రకటించాడు.
                 
                        “ ఆమె నా స్వామి సన్నిథి కానయింప
                         వేగ తావచ్చుటయు విన్నవించినాడు                      45.ప
      కాని సీతాసాధ్విలో కదలిక లేదు. ఏమి చేయాలో  పాలుపోలేదు లంకేశ్వరునికి.---

                       “ ఏ కదలికయు కాంచక , ఏమిచేయ
                        రాక, తద్గత దృష్టి మరల్చ లేక
                       అట్టులే ఒక్క క్షణకాల మచట నిలిచె  “               46 .ప
                                 
                    విభీషణుని హృదయం లో కదలికలు అతిశయించి, ఆత్మ నంటుతున్నాయి. మూసిన కన్నుల్లో సైతం ఆమె మూర్తియే ప్రత్యక్షమౌతోంది.” సర్వఋషి భావితాత్మ విద్యా రహస్య మగుచు” వాక్కుల కందని కాంతి కనుల ముందు కదలాడసాగింది.

                  పూర్వదిశాభాగం ఎరుపురంగు ను సంతరించుకొంది. ఆ సుప్రభాతం మొట్టమొదటి సారిగా   స్వాతంత్య్రాన్ని పొందినట్లుగా ఉదయిస్తోంది .చెట్లకొమ్మల చివర్లో కన్పించే ఎఱ్ఱని కాంతులు సున్నితమైన గోళ్ల చివర పండిన గోరింటాకు వలె ప్రకాశిస్తున్నాయి. తాడి ఎత్తున లేచిన తరంగాల చివర తురిమిన మందారపూల వలె  సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి.

                     రాఘవాన్వయుని హృదయంలో ఆలోచనలు చిగురులు సాగుతున్నాయి. సాగరుని లోతు, సూర్యుని తీవ్రత గల్గిన ఆ భావాల్లో జన్మజన్మలుగా వీడజాలనట్టి “ శ్రీదేవి” ఆలోచనలే సంచలిస్తున్నాయి.

                                “  గలగలమటంచు నొక్కచిక్కని తరంగ
                                 మమల హేలా నిధానమై  అరుగుదెంచి
                                  కాళ్ళు కడిగెను తనకు ,బంగారు టందె
                                  లను ధరించిన సీతవచ్చిన విధాన  “       3వ.స-9వ.ప
                                   
                            అలల సవ్వడులు బంగారపు టందెల పాదధ్వనితో కాళ్ళు కడిగిన సీత గుర్తుకు వస్తుంటే -  ఇసుకతో ఆడుకుంటున్న గాలి  మైథిలి వచ్చి తన చెవిలో ఏదో ఊసులు చెపుతున్న తీయని భావనను కల్గిస్తుంటే, ఇంత జరిగింది ఎవరి కోసమనే ప్రశ్న  ఉదయించింది రామచంద్రుని మనస్సులో.
                                 
                                 “ఇంత టింతటి  సంగ్రామమెవరి కొరకు
                                   ఇంత  ఇంత రక్తప్లుతి  ఎవరికొరకు
                                  స్వాత్మకొరకయి,జీవమృత్స్నాకరండ
                                  వర్తికయి, ఒక మహాదివ్యమూర్తి కయి  “                       11.వ.ప
                                             
                          ఒకమహోన్నత మూర్తి కోసం ఈ పోరాటం , రక్తపాతం  జరిగింది. సీతమ్మ కోసం వెళ్లిన విభీషణుడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ  రావడం చూసింది  వానరసేన. అంగదుడు లేచి నిలబడ్డాడు. లక్ష్మణుడు అన్న ముఖంలోకి చూశాడు.  విభీషణుని కన్నుల్లో ఏదో దివ్యానుభూతి  వేదనతో మిళితమౌతోంది. రాముని చూపులు” ప్రశ్నావశమ్ములై “ పౌలస్త్యుని ముఖంమీద నిలిచాయి. ప్రశ్నించాలన్న ప్రయత్నం అందరికీ పెదవుల మీదకు చేరి ఆగిపోయింది.

                  “ విన్నపము సేసె నెల్ల విభీషణుండు
                   పది నెలల నుండి తల్లి కన్పడిన తీరు
                    తాను చూచిన దెల్లను తాను ననుభ
                    వించినది ఎల్ల వాక్కుల యంచు లందు.”             21.వ.ప
               
                     యోగీశ్వరేశ్వరి యైన సీతారూపాన్ని వారి ముందు రూపు కట్టించాడు మాటలలోనే విభీషణుడు.  తన మనసులో సీతా మాత రూపాన్ని ధ్యానించి కనులు మూసుకున్న లక్ష్మణునకు   ------

                           “  అతని ఊహలు చూపులై ,అతని మేథ
                               అద్దమై ఊర్మిళ ను గూర్చిఅవగతించె “          23.   ప  
                                                                                  
                                                                                   
                           “ ఊర్మిళా రమ్య మృదు విలాస హేలా స్మృతి” పరంపరలు కదిలాయి లక్ష్మణునిలో. వసంతర్తులు, గ్రీష్మతేజాలు, ఇంద్రధనస్సులు ,శరశ్చంద్రికలు వెల్లివిరిశాయి. ఆనాడు అయోధ్యలో తాను విడిచి వచ్చిన నాడు  ఉన్న ఊర్మిళ  రూపే  ఈనాడు కన్పిస్తోంది. ఇదెలాసాధ్యం. సందేహనివృత్తి చేసుకుంటూ  -
                           
                                 “ ఇంతదూరమ్ము తనదాక నేగుదెంచు
                                 నామె లో చూపుల వెలుంగు లటుల కాద
                                  యేని ఆమెను తా జూచు టెటులిపుడు
                                 వెల్గులేనిదే ఎట్లు కన్పించుటగును ?             35ప
                                                                                                          
               అనుకుంటాడు  లక్ష్మణుడు.  ఆనాటి మల్లెలు సైతం వాడని స్ధితిలో ఉన్న ఊర్మిళను దర్శించగల్గిన ప్రభావం ఊర్మిళదే. “అతని యాత్మయే తనయాత్మ యగుట కొరకు నొందు యోగ  సమాధియె” ఊర్మిళ  సాథించింది. ఊర్మిళా మహత్వం లక్ష్మణుని అనుసరించి ,రామసేవలో  తరించింది. సీతోర్మిళలు ఒకే యోగానికి   రెండుప్రక్కల వారుగా, విదేహ రాజర్షి తపో విభూతి ని సమపాళ్ళుగా పంచుకొన్నవాళ్లుగా దర్శనమిస్తున్నారు.
                   
             ఆలోచనాముద్రితులై భావనా పథం లో తమ దేవేరులను వీక్షిస్తున్న అన్నదమ్ములైన రామలక్ష్మణులను ఆశ్చర్యంతో చూశాడు ఆంజనేయుడు.

                                 “తరణి యొక్కడె వారలిద్దరుగ నైన
                                  ఒకడు కాంతి యగును మరియొకడు వేడి “       45.వ.ప
                                     
                           సీత ,ఊర్మిళలు  యోగానికి రెండువైపు లైతే  రామలక్ష్మణులు సూర్యునికి రెండువైపుల్లా దర్శనమిచ్చారు ఒకరు కాంతి యైతే మరొకరు వేడి అనుకొన్నాడట ఆంజనేయుడు..
                        
                            తన ఆత్మను దర్శించడానికి బయలుదేరాడు  రామచంద్రుడు. అత్యంతోత్సుకత తో అనుసరించారు వానరులు. అమ్మ ను చూస్తామన్న  ఆనందం వారందరి ముఖాల్లోను కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ముందు నడుస్తున్నాడు విభీషణుడు. వెనుక నడుస్తున్న అందరిలోను ఆలోచనల్లో తేడా ఉండవచ్చు గాని గమ్యంమాత్రం ఒక్కటే. అందుకే  ---
                              “ ఊహ లందున భిన్నత ఉండవచ్చు
                              గమ్యమొకటియే జీవ జగమ్ము నందు”  
                                                                                        48.వ.ప
            “ మార్గాలు వేరుగాని గమ్యం మాత్రంఒక్కటే అనేది” వేదాంత సారం. పరిసరాలను వీక్షిస్తూ, శింశుపా వృక్ష సమీపానికి చేరాడు రఘువీరుడు.

                                “ ఆ మహాయాజ్ఞి ముందర హైమకాంతి
                                   విచ్చుచుండెడి యజ్ఞాగ్ని విధము, జనక
                                  రాజకన్యక, వీక్షించు రామచంద్రు
                                     కనులలో కోటివెల్గులు పెనలువడియె  “        3.23
                                       
                                ఇల్లాలిని  చూచిన రామచంద్రుని కన్నులలో  కోటికాంతులు పెనవేసుకున్నాయి. సౌమిత్రి కన్నుల్లో దివ్యతేజస్సు, వానరుల నేత్రాలలో మహానంద స్రోతస్సు - ఎవరి మనస్సు ఏ స్థాయిలో స్పందించిందో  ఆ స్థాయిలోనే  అనుభూతులు పల్లవించాయి.
                               
              స్వామి నడిచి నంత మేర గాలికి చల్లదన మొచ్చింది. స్వామి చూపు పారి నంత మేర తరువుల తలల్లో విరులు వికసించాయి.  వనంలో వసంతం నూత్న 
సౌందర్యం తో ప్రత్యక్షమైంది.
                    “  చల్లనివి, చిక్కనివి యైన స్వామి చూపు
                      లవనిజాత దేహమ్మునం దలమి కొనియె                       3.34
                                                                                        
                    చిక్కని చూపులు చల్లనై వైదేహి శరీరాన్ని తాకుతుంటే, గౌతమీ నది వలె గొంతు గాద్గద్యాన్ని పొందగా, కరుణ పొంగులు వారు చుండ గా,  “ఓసి మైథిలీ ! వైదేహీ! ఓసి జానకీ!”     అంటూ పిలిచాడు రాముడు. ఆతని పిలుపులు ఆమెయందున “విరజానదీ మనోజ్ఞభంగ దివ్యరవమై “ “ శ్రీవికుంఠనగరశింజిత కాల  సూచక మనోజ్ఞ పాంచజన్యరవమై” ప్రతిధ్వనించాయి.  ఆకాశగంగ లోని బంగారు  తామరపూవు వంటి ఆ యమ్మ జానకిని వొంగి “నల్లని  మబ్బు బాలరేఖ ను  పట్టుకొనినట్లు”  తన చేతుల్లోకి తీసుకున్నాడు దాశరథి. వహ్ని     జ్వాలలు వియోగ భవ కీలలై చెలరేగాయి

                       “ భగ్నమయ్యె వైశ్వానర పర్వతమ్ము
                        మబ్బులో చంచలాలత మండిపడియె
                        భవుని  ఫాల దృగ్వహ్నులు పడగలెత్తె
                        స్వామి స్పర్శచే సీతలో సర్వమందు “      3.40
                             
                     చిరకాల వియోగ సంభవ స్వామి స్పర్శ తో జానకిలో జనించిన వహ్ని కీలలు  వైశ్వానర పర్వత భగ్నజ్వాలలై , భవుని ఫాల దృగ్వహ్నులై, జానకి కన్నుల్లోను, చెవుల్లోను తుదకు  -
                   
                         “ ఆమె తనువు నందు నన్నియెడల నగ్ని
                            ఉద్భవించె జీవ హోమ మట్లు “                  3.42
                        
                               సీతమ్మ అగ్ని పునీత అయ్యింది . రామచంద్రుని స్పర్శతో  జనించిన వియోగ వహ్ని జ్వాలల్లో” జీవహోమం “జరిగినట్టు  సీత అగ్ని పునీత యైంది.  రామచంద్రుడు సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించాడని అందరూ అనుకున్నారు . కాని జరిగింది ఇది. అక్కడ చేరిన వారందరు స్మృతిని కోల్పోయి ఆశ్చర్యంలో మునిగి పోయారు. అశోకవనంలోని వృక్షాలు వెలుగుల వాన జల్లుల వలె నూత్న పల్లవాలతో పూవులను కురిపించాయి.  ఆమని నూత్న అలంకారాలతో ప్రత్యక్షమైంది. అగ్ని జ్వాలలతో చుట్టబడిన సీత  “అమృత వర్షాధ్వమందు” తడిసినట్లు ప్రకాశించింది. సీతారాములు ఒక్కటైనారు.

               సర్వసృష్టికి మూలము. సర్వభావనా నిర్థిష్ట రూపంగా రాముడు,” సహస్రార  చక్ర కీలాప్త వహ్ని” లో ఒదిగిన మహాశక్తి గా సీత  వేరుగా కన్పించి, ఒక్కటిగా నిలిచిపోయారు.
                      
                             “ అంత వరకు ఇద్దరైన సీతారాము
                        లా క్షణమ్ము నుండి   ఆత్మభావ
                        మందునైక్య మంది , రంత కన్నను సృష్టి
                       యందు   నేకయుగళ మసలె లేదు  “             3 .48
                             
                             సిద్ధి పొందిన యోగిని  స్వామిలో లీనమైంది. సీతారాములను మించిన ఏకరూపులు జగతిలోనే మరొకరు లేరు అన్న విశ్వాసమే కవి  చేత ఈ కావ్యాన్ని వ్రాయించింది.

                     “ ఆనంద నిధాను డైన శివుడు, దుఖరూపుడు రాముడు,  సౌఖ్యరూపుడు శ్రీకృష్ణుడు మనస్సారథులుగా” ఈకావ్యనికి శ్రీకారం చుట్టిన కవి తన కావ్యాన్ని  అనుభూతి విచారణాశీలక కావ్యంగా  చెప్పుకున్నారు. ఆనందమే సుఖదు:ఖరూపాలను పొందినట్లు యోగమనే తపనలో ఆనంద మావిర్భవించినట్లు దు:ఖవహ్ని తప్తమైన మనస్సులో తేజ స్సముద్రం ప్రవహించడం కవి నిరూపించదలచిన సత్యం. ఆనందమే సుఖదు:ఖరూపాలను పొందినట్లుగా , వాల్మీకియే కాళిదాస భవభూతులుగా జన్మించారని ఊహించిన ఈ కవి కి  రామకథ అంటే ఎంత ప్రపత్తి ఉందో  ధీని వలన తెలుస్తోంది .

                      “ఈ గీతి నా ఆత్మ లోన కోటి
                    పుట్టువుల పూర్వమున నుండి తట్టుచుండు”    అవతారిక.2.ప
                              
                         అనడంలోనే  కవిలో కలిగిన చిరకాల మధన పర్యవసానమే ఈ కావ్యామృత కలశ ఆవిర్భావమని  మనకు అర్ధమౌతోంది  .  ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య  సీతమ్మ అగ్నిప్రవేశాన్ని   అనుభూతి పరంగా ఆవిష్కరించి, దర్శించి, తరించిన రామభక్తులు.  




**********************సీతాయాశ్చరితంమహత్   ************************        
                                                      

Friday, 26 October 2012

రామాయణము-రమణీయకథనాలు-9 విశ్వనాథ వారి మాండవి


                              కవిసామ్రాట్ విశ్వనాథ వారి  మాండవి { వాసంతిక}

                మాండవి  భరత రాజేంద్రుని ఇల్లాలు. అయోధ్యానగర సార్వభౌముని  ధర్మపత్ని గా వాల్మీకిమహర్షి చేతనే కాదు అనంతర కాలికులు ఎవ్వరి చేతను దర్శించబడని సౌందర్యం ఈమెది. కుశధ్వజుని కొమార్తె గా, భరతుని పాణిని గ్రహించి , అయోధ్యా నగర రాజప్రాసాదంలోకి  అడుగుపెట్టింది. మిథిలానగరం నుండి వచ్చి  దేవతాపూజాదికాలు పూర్తిచేసుకొని అంతపురం లో అడుగు పెట్టిన ఈమె తిరిగి కనబడదు వాల్మీకంలో.
              
          మాండవి పాంచ జన్యశక్తి గా మార్కండేయ పురాణంలో చెప్పబడింది. వాసన్తిక అను కన్యతో శ్రీమహాలక్ష్మి ప్రస్తావన పరంగా....
                           “    అయం మమపతి శ్ర్శీమాన్ శేషేణ చ  దరేణ చ
                               సుదర్శనేన సాకేత గృహే దశరథస్య చ
                                           ****************************
             
                                      శక్తి స్తు పాంచజన్యస్య మాండవీ తి ప్రకీర్తితా “           మార్కం.పు. ఉత్త. 1వ.అ

                          అని పాంచజన్యశక్తి యే   మాండవి గా  చెప్పబడింది. కవిసామ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ గారు మాండవి ని  ఉత్తమ కావ్య నాయికగా  దర్శించారు. ఈ లఘుకావ్యం “ వాసంతిక “అనేపేరుతో కృష్ణాపత్రిక  స్వర్ణసంక్రాతి   సంచిక లో ప్రచురితమైంది. మృదుమధుర వ్యంగ్యవైఖరీ ఫ్రాభవం తో  కావ్య ప్రయోజనాన్ని  అలవోకగా సాథించారు మహాకవి   విశ్వనాథ.

                     తెల్లవారితే శ్రీ రామచంద్రుని పట్టాబిషేకం. భరతుడు  మాండవీ సిత సౌథమండలి కి బయలు దేరి   వెళ్లాడు. రంగవల్లికలు దిద్దబడిన వితర్ధిక మీద కోమలి కోసం ఎదురు చూస్తూ  కూర్చున్నాడు. ఇల్లాలు వచ్చింది. అసంస్కృత శిరోజాలతో కాషాయాంబరధారణియై వచ్చి కేలుమోడ్చి నిల్చిన ఇల్లాలిని చూచిన భరతుని ఎదలో  వేదనాజలథులు పొంగులు వారాయి.

                                  “యింతి గనుగొంచు భరతుని హృదయ పద్మ
                                  కేసరంబులు విడజారె భాసురములు”

                             అన్న మాటలు మహాకవి విశ్వనాథ వి.  ఎంతోకాలం  తర్వాత  ధర్మపత్ని మాండవీ మందిరానికి వచ్చిన భరతునకు ఆమెయొక్క ఆహార్యాన్ని  చూసేసరికే   మనసు లోని ఉత్సాహం ఆవిరై పోయింది. అందుకే భరతుని హృదయమనెడి పద్మమునందలి కేసరములు భాసురాలను వదిలి వేశాయి అన్నారు విశ్వనాథ. “యోగిని “గా నిలబడిన ఇల్లాలిని ఏదోవిధంగా పల్కరించి మాటల్లోకి దించాలన్నది రామానుజుని ఆలోచన. చెంతనే ” వాసంతిక  “{  మొల్లవంటి పూలతీగ} కన్పించింది. అది నాటి చాలాకాలమైంది. కానిఇంతవరకు మొగ్గ తొడగలేదు.  భార్యకు ఆ తీగ పై గల అభిమానాన్ని ఆధారం చేసుకొని సంభాషణలోనికి దిగుతాడు భరతుడు.” ఇదిచూలెంతయు గాదా-“ అన్నపల్కులు  భరతునివి. ఆమాటలు విన్న మాండవి నెమ్మదిగా ఇలాఅంది.

                         “ నే నింటి లోన నెక్కడో
                          పూని మహావ్రతము,బూమొక్కలకున్
                           దానెవరు నీరువోసిరి
                           చాన యదుపు తోటమాలి శ్రద్ధయు గలదే “

                        భార్ర్య్డ్య మాటలకు ఆశ్చర్యపోయాడు". ఈ మహావ్రతము ఎవరికోసమన్నా"డు భరతుడు.” భర్తయొల్లని సతి ఇంతకంటె ఏంచేయగలదు.” చెడిపోయిన గృహసంస్కృతులకై తానీవ్రతాన్ని అవలంబించాను కాని ఆ దైవానికి  మాత్రం అనుగ్రహం కలుగలేదు.

                                   “ నా భర్త యొక్కడున్నా డన్నగారితో
                                     బాటు జటాధారి పట్టణమున
                                    నతని భార్యను నేన, యపకీర్తి పాలైన
                                    యత్తగారును సుఖమఱిన నేను
                                     కుమలి పోవుచు నాదుకొంచుంటి మొక రొక
                                     రీమాత్ర” వాసంతి” యొదిగెనేని
                                     ఆ యత్తగారు దయాక్షీరపాదోధి
                                       శ్రీమతి యాయమ చేతి చలవ.”


                       మాండవి మాటల్లో భర్త తో చెప్పలేని , చెప్పాలనుకున్న ఎన్నో భావాలు సుళ్లు తిరిగాయి . కళ్లముందు కమ్ముకొన్న  మంచుపొరలు తొలగిపోయాయి భరతునికి.”  శ్రీరామ కీర్తి పతాకాభిరామ యష్టి మూర్తి “యైన  మాతృ మూర్తి కన్నులముందు కన్పట్టింది భరతునికి. వాసంతి ఈ మాత్రం నిలిచిందంటే దానికి కారణం......” దయా క్షీరపాదోధి”   యైన అత్తగారి చలువ అన్న మాండవి మాటల్లో విన్పించిన ధ్వని భరతుని లోని విజ్ఞతను మేల్కొలిపింది. వెంటనే “ రక్షోరాట్పరోక్షారి  సత్పదముల్ ఝారి క్షమింప వేడెదన యీవాసంతియున్ విచ్చునే కద తానప్పటికంచు “ లేచాడు. చేసిన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి వెంటనే దిద్దుకొవాలనే తపన భరతునిది.  ఎంతోకాలంగా మదిలో గూడుకట్టుకొన్న వేదన తీరే రోజు ఆసన్నమైంది. ఇన్నేళ్లుగా కన్నతల్లికి దూరంగా ఉంటూ, ఆమెను నిందిస్తూ  ఆమె ప్రవర్తనను  దూషించాడు.


                       కాని తన కన్నతల్లి కైకేయి పై తాను పెంచుకున్న ఏహ్యభావం తప్పని , ఆమె యే  శ్రీ రామ చంద్రుని  కీర్తి పతాకకు  ఆధారపు కొయ్య వంటిదని, ఆవిడ దయా క్షీర పాదోధి అని , రావణసంహారము, ఇంత రాక్షససంహారం జరగటానికి  ఫరోక్షంగా కైకయే కారణమనే విషయం  మాండవి మాటల్లో ధ్వనించింది భరతునికి.  ఆమె రక్షోరాట్పరోక్షారి. అంటే  కైకేయి  రాక్షసరాజైన రావణునకు పరోక్షశత్రువట. ఎంత అద్భుతమైన  ఫ్రయోగమో మహాకవిది.  మరొక్కసారి ఆ మహనీయుని  కవితా సరస్వతి కి వేవేల వందనాలు.

                  ఒక్క సారిగా  భరతుని లో తల్లి కైకయి పై నున్నకోప. వ్యతిరేక, ఏహ్య భావాల స్థానంలో  గౌరవము , ప్రేమ , అంతకు మించి   ఆమెకు బిడ్డయై నందుకు  తొలిసారిగా గర్వము చోటుచేసుకున్నాయి. వేగంగా  కైకేయీ భవనానికి చేరుకున్నాడు భరతుడు.. తనపాపాన్ని ప్రక్షాళన చేసుకోని కాంతిచంద్రుడై మరలి మాండవీ మందిరానికి వచ్చాడు.

                       “  ఆ సాయంతటి కైకేయీ పద సపర్యా ధుర్యు డై వచ్చుచున్     
                        వాసంతీ లత చిన్నిపూవిదులు శోభం గాంచె  రామానుజుం
                        సీమంత మధూళికా రచిత నూత్నారుణ్య కాశ్మీర రే
                        ఖా సంపన్నిధి మాండవీ ముఖ  లసత్కంజాత సంజాతమున్. “


          మాండవీ ముఖవినిర్గత దరహాస చంద్రికలు భరత రాజేంద్రునిపై ప్రతిఫలించి, పులకించాయి.” వాసంతిక”   చిరునవ్వు చిందించింది.


               మాండవి భరతుని లో కరడుగట్టిన మాతృవైముఖ్యాన్ని కరిగించి వేసింది. శ్రీరాముని కీర్తి పతాకకు ఆధారపు కొయ్య గా కైకమ్మను నినదించిందిమాండవి. ఉపదేశికయై కావ్యంలో  తన పాత్రను శాశ్వతీకరించుకొంది “  కాంత “ గా మాండవి. ఇది విశ్వ నాథవారి అపూర్వ సృష్ఠి. కాంతా సమ్మితమైన కావ్యంలో    కావ్య ప్రయోజనాలలో ఒకటైన ఉపదేశాన్ని నాయకునకు  నాయిక చేత నే  ధ్వన్యాత్మకంగా ఇప్పించి, కావ్యానికి , కావ్యనాయికకు కూడ ఉన్నత గౌరవాన్ని  కల్పించిన  మహాస్రష్ట  శ్రమద్రామాయణ కల్పవృక్ష సృష్టికర్తలు . 
  

  ********   కాలోహ్యయం నిరవధీ     విపులాచ పృధ్వీ******************                          

Tuesday, 23 October 2012

రామాయణము- రమణీయకథనాలు -8 సీతాయాశ్చరితం


                  

                 
                 .....  సీతాయాశ్చరితం



          






                       శ్రీమద్రామాయణం ఆది కావ్యం. అనాది ఆది యైన పురుషోత్తముని దివ్యగానం. నాన్యతో దర్శనీయమైన అపురూప పాత్రల అపూర్వ సంయోజనం రామాయణం. ఇది  రామస్య> అయనం రామాయణం. అయనం అనగా గమనము లేక ప్రయాణము. రాముని యొక్క  జీవన గమనాన్ని తెలిపేది కాబట్టి రామాయణం అయ్యింది .  దీనిలోనే సీతాయనం కూడా  ఉంది. సీతాయా :అయనం  సీతాయనం అనవచ్చు కదా!.   మరి  ఎందుకు పిలవడంలేదు?.  వాల్మీకి కూడ సీతాయా: చరితం అనే అన్నాడు  కాని  సీతాయనం అనలేదు. ఎందుకని?.

      చంద్రుడు లేనిదే  చంద్రిక అంటే వెన్నెల లేదు. వాక్కు లేనిదే అర్థము లేదు. రాముడు లేనిదే సీత లేదు. రాముడు సీతతో కలిసి నడిచినదే రామాయణం.  రామునితో కలిసి తిరిగిన సీతాగమనమే సీతాయా: చరితం అవుతుంది. స్త్రీ పురుష యోగమే శక్తి. స్త్రీ శక్తి విరహిత పురుషుడు  పరిపూర్ణుడు కాలేడు. నిస్తేజు డౌతాడు. నిర్వీర్యుడౌతాడు.  పురుష యోగము లేని  స్త్రీ మూర్తి  పరిపూర్ణత పొంద లేదు. విరాగిని గా ఉండి పోతుంది లేదా క్షుద్ర రూపిణి గా మారిపోతుంది. అందు కే  మాతృత్వము పరిపూర్ణత కు ప్రతీక. అంబ,అమ్మ   తల్లి, జనని, మాతా ఇవన్నీ పర దేవత ను మనం ఆర్తి గా ఆరా థించే పేర్లు . ప్రేమ గా పిలుచుకునే పేర్లు.  అందుకే మహాకవి కాళిదాసు  ----
                               “ వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ: ప్రతిపత్తయే
                                 జగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !! “  
  
           వాక్కు,  అర్థముల వలే కలసిన ఆది దంపతులు  ఈ లోకానికే తల్లి దండ్రులు అన్నాడు. దంపతులకున్న గౌరవం మనసంస్కృతిలో ఒంటరి జీవికి లేదు.  మన భారతీయసంస్కృతి  దంపతీపూజ కు ఉన్నత స్థానాన్ని కల్పించింది. భర్త చాటు భార్య అనడం తప్పు. భర్త కు తగ్గ భార్య గా  ఉండాలి  .ప్రకృతి పురుషుల కలయికయే శక్తి. అష్టాదశ పురాణాల్లోను వ్యాసభగవానుడు స్థాపించింది అదే వాల్మీకి చెప్పింది . భార్యలేని భర్తకు పరిపూర్ణతలేదు. భర్త లేని భార్యకు చరిత లేదు. “ శ్రీ శ్రీశ యో స్తు    సంబంధశ్చంద్ర చంద్రికయో  రివ “అన్నారు పౌరాణికులు.   లక్ష్మీ నారాణుల సంబంధం చంద్ర చంద్రికల వంటిదని  అంటారు పౌరాణికులు. శివపార్వతులు, సీతారాములు. గౌరీశంకరులు, లక్ష్మీనారాయణులు,  ఉమా శంకరులు  అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు గా చెప్పుకుంటాము. స్త్రీ  పురుషుల ఎక్కువ తక్కువ ల ప్రసక్తే లేదు   . స్త్రీ  పురుషుల కలయికే జీవితం .  జీవితాలు చెప్పేదే చరిత్ర. కలసి జీవించడమే మన కావ్యాలు మనకిచ్చే సందేశం. కావుననే సీతాయనం కాదు సీతాయాశ్చరితం మహత్.
     
                   జానకి లేని రామచంద్రుడు “చంద్రిక లేని  చంద్రుని వలె” కాంతి హీను డయ్యాడు. సీతలేని  రాముడు శక్తి ని కోల్పోయి, కష్టాల పాలయ్యాడు. సీత చెంత నుండగా “గడ్డిపరక” సైతం రామబాణమై తుంటరుల పీచమడిస్తే,సీతాపహరణం తరువాత రాముడు సమస్తశక్తుల్ని కోల్పోయినవాడై, బేలయై విలపిస్తూ, కొండల్ని, కోనల్ని కలయ తిరుగుతూ, గ్రద్దల్ని, కోతుల్ని సహాయమడుక్కోవలసివచ్చింది.    నలభై వేలమంది  ఖర దూషణాది రాక్షసులను ఒక్కడుగా మట్టుపెట్టిన అసహాయ శూరుడైన రామచంద్రుడు   సీతాపహరణం జరిగిన తరువాత  ఎదుటివాడ్ని నమ్మించడానికి తన బలాన్ని ప్రదర్శించి చూపించవలసిన దుస్థితి కి  వచ్చాడంటే అందుకు కారణం రాముడ  శ్రీ   -రాముడు కాకపోవడమే.” శ్రీ “విరహితుడైన-సీత లేని - రాముడు నిస్తేజుడైపోయాడు.

           “  శ్రీ   “ అనేది   లక్ష్మీ బీజం. సర్వశక్తి సమన్వితంగా ఆ బీజాక్షరం భాసిస్తుంది.
                      “ మహాలక్ష్మర్థకశ్చస్యాత్ ధనార్థ రేఫ ఉచ్యతే.
                      {ఈ} తుష్యత్యర్ధో2పరో నాదో బిందు: దు:ఖ హారార్ధక: “     మం .పు.18
                          
          సర్వసంపత్కరము, సర్వదుఖ హరమునైన శ్రీలేని రాముడు వియోగవ్వధా దుఖితుడై విలపించాడు. క్రోథించాడు .తపించాడు .పోరాడి తుదకు శ్రీకరమైన సీతను పొంది  సీతారాముడు గా కీర్తి నందాడు.మైథిలీ పాణిగ్రహణం రాముని శ్రీరాముని   చేసి గృహస్థుగా మార్చి పట్టాభి షేకానికి సిద్ధం చేసింది. కాని కైకేయీరూప కాలవాహిని  రాముని గమనాన్ని మార్చి, రణంయలోని మునులచెంతకు చేర్చి, రాక్షససంహారం  చేయించింది. క్షత్రియవీరుడుగా, యువరాజు గా జైత్రయాత్ర పూర్తి చేసుకొని ,సర్వ శక్తి సంపన్నుడై రాజ్యలక్ష్మి ని పరిగ్రహించి, రామచంద్రుడు లోకారాధ్యుడై  ఆదర్శప్రాయుడైనాడు.సీతామహా సాధ్వి సీతామాత యై    జగదారాథ్య యైంది.
        
          రామాయణాన్ని రామ అయనం, రామా అయనం అని  రెండు విధాలుగా విభజిస్తే – సీతారాములిద్దరికి  సమప్రాధాన్యాన్ని చేకూర్చవచ్చు.


                          “ బాలేవ రమతే సీతా బాలచంద్ర నిభాననా
                           రామా రామేవ్యాదీనాత్మా వజానే2పి వనేసతీ “      వా.2.60-10

                మైథిలీ దాశరధులు సత్యస్వరూపానికి ప్రతినిధులన్న భావం” రామా”   “రామ”  శబ్దాలలో మహాకవి వ్యంజితం చేశారు. అశోకవనం లో సీతామాతను చూచిన  ఆంజనేయుడు  ఆమెలో రాముని పోలికలుండటం చూచి ఆశ్చర్యపోతాడు . తల్లీకూతుళ్ల మధ్య,అక్కాచెల్లెళ్ల మధ్య, రక్తసంబంధీకులమధ్య   పోలికలుండవచ్చునేమో గాని భార్యాభర్తలమధ్య ఒకే పోలికలుండటం ఆశ్చర్యం కలిగస్తుంది.- అందుకే ఇలా అనుకుంటాడు హనుమ.
              
              “ అస్యా దేవ్యా యధారూపం అంగ ప్రత్యంగ సౌష్టవం
                 రామస్య యధా రూపం   తస్యేయ మసితేక్షణా”         వా.5.15-51
              
       ఈ పోలికల్లో దాగి వున్న రహస్యాన్ని " దేవమాయేవ నిర్మితా " అన్న పదంతో ఛేదించారు మహాకవి వాల్మీకి.
                     
          


                 సీతారాముల దాంపత్యం జగతికి ఆరాథ్యం. శ్రీరామునకు తగిన ఇల్లాలు మైథిలి. పంకజముఖి సీత వంటి భామమామణియున్ అన్నఅభిమానం ప్రజల్లో నిలిచిపోయింది. మహావీరుడై, శివధనుష్కండనుడైన రఘుకులాన్వయుని పరిణయమాడిన వధువువమైథిలి.కష్టాల్లో భర్తకు తోడునీడగా నిలిచి అనుకూలవతి,అనురాగవతి, పుత్రవతియునై అభిమానవతిగా భూప్రవేశం చేసేవరకు సీతాపాత్ర అత్యుత్తమమైన , అత్యుత్కృష్టమైన రీతిలో మలచబడి" సీతాయా: చరితం మహత్" అని మహర్షి చేతనే  కొనియాడబడిన పవిత్రశీల. జానకీ మాత సకల సద్గుణ సముపేత. తనకు కీడు చేసిన వారికైన హాని చేయ నంగీకరించని కరుణామృత  మాతృహృదయమామెది.
                                “  ప్రణిపాత ప్రపన్నాహి మైథిలీ జనకాత్మజా
                                  పాపానాం వా శుభానాం వా వధార్హాణాం ప్లవంగమ
                                  కార్యం కరుణ మాత్రేణ నకశ్చి న్నాపరాధ్యతి  --  “        6. 119-44
                                   
                  పలుకే బంగారంగా బాలకాండలో అసలు మాట్లాడక దర్శనమాత్రం చేతనే అలరించిన జానకీదేవి సుందరకాండలో అతిమాత్రంగా సంభాషిస్తుంది. సీతారాముల కళ్యాణం లోకకళ్యాణంగా భావించే భారతజాతి సీతారాముల దాంపత్యాన్ని ఆదర్శదాంపత్యం గా ఆరాధిస్తోంది. సీతమ్మ లోకారాధ్య. మాతృస్వరూపిణి. శ్రీరాముని సైతం తన కాంతివలయం లో కప్పివేయగల కాంతిచ్ఛట.” ఏదేశ వాజ్ఞ్మయమునందైనా శ్రీరామచంద్రుని వంటి పురుషోత్తముడు లభించినా లభించవచ్చునేమో గాని సీతవంటి ఆదర్శచరిత్ర యగు పతివ్రతాతిలకము లభించుట దుర్లభమని “ { శ్రీమద్రా.వైభ. పు.523}  పలికిన వివేకానందుని పల్కులు అక్షరసత్యాలు.
                     
                  ఎన్ని ఇడుముల నెదుర్కొన్నా” భర్తా హి మమదైవతం” {2.16.89} అని ప్రకటించిన నిశ్చల నిర్మల హృదయ యీమె. లోకం కోసం అగ్నిప్రవేశం చేయించినా, అరణ్యంలో వదిలేసినా, ఓర్పుతో సహనంతో భర్తగౌరవాన్ని కాపాడి  రామచంద్రుని లోకారాథ్యుని గా నిలిపిన ఉత్తమ ఇల్లాలు. రాముడు లోకం కోసం ప్రవర్తించినా “ నేదానీం త్వదృతే సీతే స్వర్గో 2పి  మమరోచతే. “ {2.42.30 ]నీవు లేక స్వర్గమును కూడ అంగీకరించనన్న మధురభావనను భర్తలో కల్పించిన మహాసాథ్వి.
               
              “ త్వద్వియోగేన మేరామత్యక్తవ్యమిహ జీవితమ్”     { 2.5.29} అన్న  పల్కులు రామవియోగాన్ని సహింపలే మరణిస్తానంటున్న సీతవి. వారి వైవాహిక ప్రణయం  జగదారాథ్యం కావడానికి ప్రథానకారణం వారిలోని ఆరాథనా భావమే. అది వాల్మీకి  అపూర్వ పాత్ర చిత్ర కల్పనా చాతుర్యం.

                     “  ప్రియా తు సీతా రామస్య  దారా పితృకృతా యితి
                      గుణాద్రూపా  గుణాచ్ఛాసి ప్రీతి ర్భూయో2భి వర్థతే. “     వా.1-77-27    
                        
          తండ్రిచే అంగీకరించబడిన భార్యగా సీతను స్వీకరించినను  అనురూప గుణాన్విత, సౌందర్య సముపేత అగుటచే  ఆమె యందు అనురాగము వృద్ధిఛెందుచున్నది. మరి  జానకీదేవి విషయం చూస్తే------
                            
                                 “  తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే
                                 అన్తర్గత మపివ్యక్త మాఖ్యాతి హృదయం హృదా “          వా.1.77.29
                                      
                         “ సీతాహృదయంలో రామచంద్రుడు ద్విగుణుడై వర్తిస్తున్నాడు. ఆమె హృదయాతర్గతమైన ప్రేమను ఆమె హృదయం  అతని హృదయానికి చెప్పుచుండెను.-“-- అని  వ్రాయడంలోనే సీతారాముల అన్యోన్యతను వర్ణించడం లో వాల్మీకి లేఖిని పరవశించింది.  అంతేకాక-—“మనస్వీ తద్గతమనా స్తస్యాహృది సమర్పిత: “ అంటాడు మహర్షి. సీతమ్మకు  మహర్షి వాడిన విశేషణం” మనస్వీ “ఎంత తియ్యనిమాటో చూడండి.అమ్మ మనస్వి. నిండైన మనస్సుగలది.   ఆమె నిండుమనసులో భర్త కు ఎంత ప్రేమను పంచగలదో బిడ్డలకు అంత ప్రేమను అందించ గలదు. అందుకే మహాకవి లేఖిని ఆ కరుణాలవల్లి  సీతమ్మ కు” మనస్వి” పదాన్ని వాడింది. వారిరువురి దాంపత్యం  అటువంటిది. అందువల్లనే  అశోకవనంలో సీతాదేవి ని చూచిన హనుమంతుడు-  --“ యుక్తా రామస్య భవతీ ధర్మపత్నీ గుణాన్వితా” అంటూ మెచ్చుకుంటాడు.
                           
           ప్రకృతి ప్రేమస్వరూపిణి. కాని కోపగిస్తే ప్రళయాన్ని సృష్టిస్తుంది. అలాగే సీతామాత రాముని చెంత ప్రేమస్వరూపిణి  గా గోచరిస్తుందే కాని,  శత్రువుల చెంత, రావణాదులను  తిరస్కరించి    అబిశంసించే టప్పుడు మహా శక్తి గా రూపుదాలుస్తుంది . ఆ” శక్తి “పాతివ్రత్య ప్రభావమే. పతివ్రతాసాధ్వి శోక సంతాపాలు కార్చిచ్చులై కాలకూట విషం గా   మారి కాముకుల్ని కాల్చి వేస్తాయన్న యదార్ధం రావణాదులు తెలుసుకోవడానికి ఆలస్యం పట్టింది. త్రిలోకవిజేతయైన  రావణుడు సైతం” మహాశక్తి” ముందు కంపించి పోయాడు.   శక్తిస్వరూపిణి గాథలు కోకొల్లలు. విజయగాథలు ఎప్పుడు మథురంగానే ఉంటాయి.   




*******************************నందన నామ విజయ దశమి శుభాకాంక్షలతో  *********