Tuesday, 25 September 2012

రామాయణము-రమణీయ కధనాలు--5 అహల్య--2

               


                అ హ ల్య       
                                             రెండవ భాగము
                      
                     











                     అహల్యా శాప విమోచనానంతరం మిధిల లో ప్రవేశించిన విశ్వామిత్రుడు శతానందుని తో “ రేణుక జమదగ్నిని కలిసినట్లు నీ మాతృమూర్తి అహల్య నీ తండ్రిని కలిసింది “ అంటాడు. ఇచ్చట రేణుకా జమదగ్నుల ప్రస్తావన రాబోయే పరశురాముని ఆగమనాన్ని సూచిస్తోంది .
             
   
                                          సీతా – అహల్య ల వృత్తాంత్తాల్ని  ఏకముఖంగా పరిశీలిస్తే రెండు విషయాల్ని మనం గుర్తించవచ్చు.అహల్యా గౌతముల పున స్సమాగమం తర్వాతే  సీతారామ కళ్యాణం జరగాలన్నది ఆది కవి నిర్ధేశం. శ్రీ సీతారామ కళ్యాణానంతరం  భార్గవ రాముని ఆగమనం అనివార్యం .ఆ విషయం తెలియజేయడానికే “రేణుక జమదగ్ని ని  కలిసినట్లు అహల్య గౌతముని కలిసింది “ అని చెప్పడం జరిగింది. ఆ మాట చెప్పింది అహల్యా గౌతముల కుమారుని తో విశ్వామిత్రుడు. రేణుకా జమదగ్నుల కుమారుడు ముందు రాబోతున్నాడు. రామచంద్రుణ్ణి  శ్రీ – రామునిగా, కళ్యాణ రామునిగా , శతానందుడు చేస్తే - రానున్న భార్గవుడు రాముణ్ణి కోదండరాముణ్ణి చేస్తాడు. ఇది ఒకతరం[ అవతారం} వేరొకతరానికి అథికారాన్ని బదలాయించే  సంధియుగం .  ఇది మహర్షి భావన.
                
              యాగ సంరక్షణ లో విజయులై  విశ్వామిత్ర ద్వితీయులుగా  మిథిలానగరానికి బయలుదేరారు రామలక్ష్మణులు.

                                విశ్వామిత్రుని గాథలతోను, రామలక్ష్మణుల ప్రశ్నలతోను దారి తరిగి పోతూ కాలం కరిగి పోతూ ఉంటే మిథిలోపవన ప్రాంతానికి చేరారు ముగ్గురు. వన్నెతరిగిన బంగారంలా, మేఘావృతమైన చంద్రబింబంలా  మాసిన అద్దంలోని ప్రతిబింబం లా అణగారిన కాంతితో ప్రకాశిస్తున్న గౌతమాశ్రమాన్ని చూచి, ప్రశ్నించాడు   శ్రీరామచంద్రుడు. వెంటనే” హంత! తే కథయిష్యామి’” అంటూ నిట్టూర్పు విడిచాడు విశ్వామిత్రుడు. భక్తులకొఱకు కదలివచ్చిన కరుణాథాముడు  శ్రీరాముడు. భర్తృసాన్నిథ్యానికి దూరమై తపిస్తున్న సాథ్వీమతల్లి అహల్య.ఆమెకు శాపమోక్షాన్ని కల్గించఢాని కై రాముడు ప్రశ్నించాడు. రాముని ప్రశ్న వినగానే  
“హంత” అన్నాడు విశ్వామిత్రుడు.

                 ఆ నిట్టూర్పు లో ఎంతో ఆనందం. ---    ఒక మహర్షి దంపతులను ఏకం చేసే శుభసమయం  ఆసన్నమైందనే ఆనందం. ఆ ఆనందానికి తాను ఆథారమౌతున్నాననే ఉద్వేగం.  ఎంతోకాలంగా కొనసాగుతున్న అహల్యాదేవి తపస్సు  సఫలీకృతం కాబోతోందన్న  ఉత్సాహం విశ్వామిత్రుని చేత “హంత”అనిపించింది.  ఎంతో బరువు  దిగిపోయినప్పుడు మనలో నుండి వచ్చే దీర్ఘ నిశ్వాసకు ప్రతిపదమే  ఈ “హంత “ అనేది.

             శ్రీ రాముని పాదథూళి సోకి, అదృశ్య , నిరాహారయై తపిస్తున్న అహల్యకు అసలు రూపం వచ్చింది . గౌతమాశ్రమం లో కలకూజితాలు థ్వనించాయి.   ఫలవృక్షాలు చిగిర్చి పుష్పించి , ఫలవంతాలు కాగా            పూ బాలలు  శిరసు లూపి అతిథులను ఆహ్వానిస్తున్నాయి.     ఉగ్ర తేజ స్సంపన్నుడైన గౌతమ మహర్షి ఆశ్రమం లోకి ప్రవేశించాడు.        ఆపుణ్యదంపతులకు పాదాభివందనం చేసి , వారి ఆశీస్సులను పొంది, మిథిలకు ప్రయాణమయ్యారు కుశికసుత దాశరథులు.

                               మిథిలలో ప్రవేశించిన రాముడు    శ్రీ రాముడై     కళ్యాణ రాముడైనాడు. గౌతమాశ్రమంలో  దంపతీ పూజ చేయించి పెళ్లికొడుకుగా రాముని మిథిలానగరంలోకి  ప్రవేశింపజేశారు వాల్మీకి.    ఇది ధర్మయుత ఆర్షసంస్కృతికి చిహ్నంగా భాసించింది. ....... తన తల్లిని తండ్రితో కలిపిన  పరంథాముడగు    శ్రీ రాముని పూజించాడు శతానందుడు . సీతను రామున కిచ్చునట్లుగా ఏర్పరచి దైవఋణం తీర్చుకున్నాడు. రఘురాముడు సీతారాముడు    కాగా లక్ష్మణు   డు ఊర్మిళో పేతుడైనాడు . ఆ యదృష్టం అహల్యా గౌతముల  ఆశీ: ప్రభావమే నని భావించవచ్చు. ఇది వాల్మీకి మహర్షి కల్పన.

                ఈ ఘట్టంలో  విశ్వామిత్రుడు  చెప్పిన వృత్తాంతంలో అహల్య దోషిగా  “దేవరాజ కుతూహలాత్” అనే పదం వలన ముద్ర  వేయబడింది. బ్రహ్మ మానస పుత్రి,  మహర్షి పత్ని  దేవరాజ కుతూహలయై జార యైంది.  ” సురకార్యార్థమిద” మని ఇంద్రుడు    తప్పించుకున్నా మగవారి రాచకార్యాలకు ఆడది గా అహల్య బలైంది. జారగా మిగిలింది. అందుకే  ఉత్తరకాండ లో   ఇంద్రుని   గౌతముని గా భావించి {–త్వద్రూపేణ దివౌకసా- } అహల్య ఏకశయ్య అయినట్లు చెప్పి, బాలకాండలోని మాలిన్యాన్ని కొంత  ప్ర క్షాళన  చేయఢానికి ప్రయత్నించినట్లు  కన్పిస్తుంది. కాని ఆడదాని మీద పడిన అపవాదు గాయం మానినా మానిపోని మచ్చలాగా శాశ్వతంగా మిగిలిపోతుంది. అహల్య విషయంలో అదే జరిగింది .         వేదాలలో    ప్రతీకాత్మకంగా    వాడిన ” అహల్యాయైజార” శబ్ధం అనంతర కాలికుల కావ్యాల్లో, కల్పనల్లో రెక్కలు విదిల్చి విహరించి తుదకు  అశ్లీలార్థ కథలకు  అలవాలమైంది.


             వాల్మీకి మహర్షి నైతికవర్తనను , ధానిపై సమాజానికున్న బాథ్యతను తెలియజెప్పడానికి థర్మ ప్రబోధాత్మకంగా అహల్యా వృత్తాంతాన్ని వ్రాశారు.  బ్రహ్మమానసపుత్రికయైనా ,మహర్షిపత్ని యైనా  తప్పుచేస్తే  శిక్ష తప్పదన్న హెచ్చరిక , థర్మ ప్రకటనం మహర్షి ఉద్దేశ్యం. అయితే పసివారికి నిప్పు కాలుతుందని తెలియజేయడానికి సెగ చూపిస్తే సరిపోతుంది కాని అంగవైకల్యం సంభవించేటంతగా కాల్చలేము గదా. అహల్య విషయంలో రెండవదే జరిగింది .అస్తిత్వానికే లోపం ఏర్పడింది. బాలకాండ – ఉత్తరకాండ కథల నడుమనున్న అంతరాన్ని పరిశీలిస్తే అహల్యా శీల  సంరక్షణకు మహర్షి చేసిన ప్రయత్నం మనకు అర్థమౌతుంది  .
      
       అహల్యాజారుడైన ఇంద్రుని శపించి, అహల్యను సైతం” వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ “  అంటూ అదృశ్యగా పెక్కేండ్లు తపించి రామచంద్రుని పాద స్పర్సచే ఫవిత్రీకృత గాత్ర కావలసిందని వాల్మీకంలో గౌతముని ఆజ్ఞ. కాని – అథ్యాత్మరామాయణం లో అహల్య రాయిగా మారినట్లు చెప్ప బడింది.

                  దుష్టే త్వం తిష్ట దుర్వృతే శిలయా2శ్రమే మమ
                 నిరాహారా దివారాత్రం తప: పరమమాస్థితా!!                  { అ.రా. బాల.5   ]

     అదేవిథంగా ఆనంద రామాయణ ,సత్యోపాఖ్యానాలయందు సైతం అహల్య కు శిలా రూపమైన శాపమే కన్పిస్తుంది. తులసీదాసు కూడ అహల్య ను శిలారూపంగానే ధర్శించారు. బ్రహ్మపురాణంలో—

                          తామప్యాహముని: కోపాత్ త్వం చ శుష్కనదీ భవ
                          నదీభూత్వా పునారూపం ప్రాప్య్ససే ప్రియ కృన్మమ!!

    అంటాడు గౌతముడు.ఎండిపోయిన నదిగా శాపం.గౌతమీనదితో కలిసి నప్పుడు విమోచనం చెప్పబడింది. పధ్మపురాణం లో ---

                 అస్థి చర్మ సమావిష్టా నిర్మాంసా నఖవర్జితా....... చిరంస్థాస్యసి--  {  ప.పురా.సృ. 158-43]

ఎముకలు చర్మము తోను మిగిలి మాంసము గోళ్లు లేని దానివై నలుగురు చూచుచుండగా చిరకాల ముండవలసినది గా శాపం అహల్య కు కన్పిస్తుంది .            

                       .” అస్యా దోషో న చైవాస్తి  దోషో2యం పాకశాసనే “ {సృ.158.38] అని పద్మపురాణం లో రామచంద్రుడు అహల్యను సమర్థించడం సైతం మనకు కన్పిస్తుంది.    ఇక    విచిత్ర రామాయణాదుల్లో కన్పించే కథలు మరీ అశ్లీల ద్యోతకాలు.  

                   ఈవిథంగా  వేదవాజ్ఞ్మయం నుండి లౌకిక వాజ్ఞ్మయం మీదుగా ఆథునిక వాజ్ఞ్మయం వరకు 
అహల్యా వృత్తాంతం  పలువిథాలుగా మనకు కన్పిస్తుంది .   




*****************************************************************************








Friday, 21 September 2012

రామాయణము -- రమణీయకధనాలు –5 - అ హ ల్య-1


                 అ హ ల్య                  ప్రథమ భాగము

                          



   శ్రీ   బ్రహ్మ మానస  పుత్రిక యై ,  మహర్షి, మంత్రద్రష్ట, న్యాయసూత్ర ప్రణేత, అక్షపాదుడు నైన గౌతమ మహర్షిని పరిణయ మాడి పంచకన్యలలో ప్రథమతాంబూలం అందుకుంటున్న పతివ్రతా శిరోమణి అహల్య.
       

    హలం నామేకహా వైరూప్యం హల్యం తత్ప్రభవం భవేత్
          యస్యా నవిద్యతే హల్యం తేనాహల్యేతి విశ్రుతా !!   {వా. ఉ.-30.29 ]

హల్య మనగా వైరూప్యం. అది లేనిది అహల్య. సర్వాంగసుందరి గా సృష్టికర్త చేతనే ప్రశంసించబడిన సౌందర్యం అహల్య ది. కాని- ఈమె పై చెలరేగినంత దుమారం సాహిత్యలో మరే పాత్ర మీద లేదంటే అతిశయోక్తి కాదు. వేదవాజ్ఞ్మయం నుండి దక్షిణాంథ్ర సాహిత్యం మీదుగా ఆధునిక సాహిత్యం వరకు అహల్య అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తోంది. తైత్తిరీయారణ్యకంలో ఇంద్రుణ్ణి యాగానికి ఆహ్వానించే సందర్భంలో  ---
                    
                           “   ఇంద్రాగచ్ఛ హరివ ఆగచ్ఛమేథాతిథే :
                           మేషవృషణశ్వస్య మేనే గౌరావస్కంది న్నహల్యాయై జార                                                                                                                  
                           కౌశిక  బ్రాహ్మణ గౌతమ బ్రువాణ “  { కృ.య.తై.ఆరణ్యకం—2-70}
 గౌతమ- అహల్య- ఇంద్ర- కౌశిక  అనునవి రామాయణ పాత్రలు. శ్రీరామచంద్రుడు ఆ పాత్రలను పునీతం చేశాడు. పైమంత్రానికి విద్యారణ్యుల వారి భాష్యాన్ని పరిశీలిస్తే –“-  హే ఇన్ద్ర పరమైశ్వర్యయుక్త : ఇహ 
కర్మణ్యాగచ్ఛ హరివ- హరినామక అశ్వౌ అస్య విద్యతే  ...  ...     ..... తస్మిన్నర్థే వృషణశ్వస్య మేనే
“ ఈరీతిగా వైదికపరంగా కొనసాగిన వ్యాఖ్యానంలో” అహల్యాయై జార” అన్న పదానికి—“అహల్యా గౌతమస్య భార్యా తస్యా ఇంద్రే జార ఇతి పురాణే ప్రసిద్థం “ అని వదిలి వేయడం మనం గమనించవచ్చు.
                   
     శ్రీ కుమారిలభట్టు తన తంత్రవార్తికంలో వేదములందలి ఇంద్రాహల్యల ప్రస్తావన ను  వివరిస్తూ --  చంద్రుడే గౌతముడు. గో శబ్దమునకు ఉత్తమ కిరణములని యర్థము.

{ సర్వేపి రశ్మయ: గావ ఇత్యుచ్యంతే }  . చంద్రుని యొక్క భార్య యగు రాత్రియే అహల్య.”
అహ: లీయతే యస్యాం సా అహల్య”—పగలు దేనియందు ముగియునో అది అహల్య – అనగా రాత్రియే అహల్య. ఇంద్రుడనగా” పరమైశ్వర్యసంపన్నుడగు సూర్యుడు “ అని అర్థము.
             
      కనుక ఇంద్రశబ్దవాచ్యుడగు సూర్యుడు ఉదయింపగానే అహల్య అనగా రాత్రి  నశించిపోతోంది. కావుననే ఇంద్రుడు” అహల్యాయై జార” --అని సంబోథించ బడుచున్నాడు. 
                      
        నిరుక్తంలో  ” అహల్యా యై జార” అను శ్రుతివాక్యాన్ని  వ్యాఖ్యానిస్తూ—“ఆదిత్యో2త్ర జార ఉచ్యతే రాత్రే ర్జరయితా “-- అనగా సూర్యుడే ఇంద్రుడు . రాత్రిని ఫోగొట్టుటచే అతడు” అహల్యాయై జార “అని సంబోధించబడుచున్నాడు.
        భట్ట భాస్కరులు “ అహల్యాజారు “డనగా వాక్పరిణామకారకుడగు ఇంద్రుడని, “గౌరావస్కంది...”.అన్న  మంత్రంలోని ” గౌర “శబ్దమునకు ఆద్యంత గ్రహణం చేత  “గౌతమ దార” అని  వ్యాఖ్యానించారు.
          
     ఈ వివరణల్ని పరిశీలిస్తే   గౌతమ-అహల్య- ఇంద్ర శబ్దాలు వేదంలో ప్రతీకాత్మకంగా ప్రయోగించ బడ్డాయని తెలుస్తుంది . కాని – వేదాలకన్న భిన్నంగా రామాయణాది కావ్యాల్లో రమణీయేతివృత్తంగా అహల్య కథ రూపు దాల్చింది. రామాయణంలో అహల్యా వృత్తాంతం రెండు ప్రదేశాల్లో కన్పిస్తుంది. బాలకాండ లోని వృత్తాంతంలో అహల్య దోషిగా కన్పిస్తుంటే –ఉత్తరకాండ లోని వృత్తాంతం ఆ దోష పరిహారార్థం చెప్పబడినట్లు కన్పిస్తుంది.  బాలకాండ కథలో ఇంద్రుడు గౌతమమహర్షి వేషంలో వచ్చినట్లు తెలిసి కూడ అహల్య- ఇంద్రునిపై మక్కువతో ---
          
               ముని వేషం సహస్రాక్షం  విజ్ఞాయ రఘునందన
             మతిం చకార దుర్మేథా దేవరాజ కుతూహలాత్ !!  { వా.బాల.48-19}                                                                              

ఇంద్రునకు తనను తానుగా అర్పించుకున్నట్లు వ్రాయబడగా, ఉత్తరకాండలో ఆమె తెలియకపోవుటచే తన భర్త యే ననుకొని అతని కోరిక తీర్చినట్లు వ్రాయబడింది.
                   అజ్ఞానాత్ ధర్షితా విప్ర  త్వద్రూపేణ దివౌకసా                                                                                                        
           న కామకారాత్ విప్రర్షే ప్రసాదం కర్తు మర్హసి  {  వా-ఉ.కాం.30-44}
      
  --- అని ప్రార్థిస్తుంది అహల్య. బాలకాండ కథలో అహల్య పాపనిష్కృతిని పొందగా ఉత్తరకాండలో ఇంద్రుడు పాప పరిహారాన్ని పొందాడు. గౌతమ మహర్షి శాపాన్ని పొందిన ఇంద్రుడు ---- 
     

        కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మన  :
       క్రోధ ముత్పాజ్య హి మయా సుర కార్య మిదం కృతం  {వా.ఉ .కాం.49-2}

సురకార్యాన్ని నిర్వహించ గలిగానన్న తృప్తితో దేవలోకానికి వెళ్లి పోతాడు. ఇది క్లుప్తంగా  అహల్యా వృత్తాంతం.
      
   రావణుడు సీతను అపహరించాడు. రాముడుద్థరించాడు. అక్కడ సీత ఏఅపచారం చేయలేదు. కాని రాముడాగ్రహించాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిపునీతయైన సీత “ దీప్తామగ్నిశిఖామివ “అన్నట్లు ప్రకాశించింది వాల్మీకంలో.
                  
      దేవకార్యం కోసం ఇంద్రుడు అహల్యను చేరాడు. గౌతముడు కోపించాడు -శపించాడు . రామచంద్రుడుద్థరించాడు. తపించిన అహల్య” దీప్తామగ్నిశిఖామివ “ వలె ప్రజ్వరిల్లింది.    పునీతలైన  సీత- అహల్య లిద్దరికి ఒకే విశేషణం వాడటంలోని మహర్షి అంతర్యం అత్యంత నిగూఢము. అతి పవిత్రము కూడా.
               

   హల మనగా నాగలి .  సీత – నాగేటి చాలు. అనగా నాగలి చే ఏర్పడింది.
                             
   ఇది       అహల్య       మొదటి భాగము


***********************************************************





Wednesday, 19 September 2012

రామాయణము --- రమణీయకధనాలు – 4 - ఊర్మిళ

                   


                   ఊ ర్మిళ               
          




  శ్రీ  మద్రామాయణ మహాకావ్యంలో ఊర్మిళ  రామానుజుని  ఇల్లాలు. లక్ష్మణుని అగ్నిసాక్షిగా వివాహమాడి అయోథ్యానగరం అంత:పురంలో అడుగుపెట్టిన దశరథుని కోడలు. జనకరాజర్షి ఔరసపుత్రిక. సీతాసాథ్వి ముద్దుల చెల్లెలు.వాల్మీకి మహర్షి చే అందమైన పేరు పెట్టించుకున్న ముగ్ధ.  ” సీతాయా: చరితం మహత్ “అంటూ సీతాకథాగానం లో మునిగిన మహర్షి అంత: పురం చేరిన ఊర్మిళను మళ్లీ పల్కరించలేదు. జనకుని కుమార్తెగానే ఊర్మిళ వాల్మీకంలో ప్రస్తావించ బడింది.
                          
                       సీతాం రామాయ భద్రంతే ఊర్మిళాం లక్ష్మణాయ చ
                             వీర్యశుల్కాం మమసుతాం సీతాం సురసుతోపమాం
                        
      ద్వితీయామూర్మిళాం చైవ త్రిర్ధదామి న సంశయ : !! {బా-కాం. 71-21]
        
  అంటూ జనకమహర్షి తన రెండవ బిడ్డను విశ్వామిత్రాదులకు పరిచయం చేశాడు. అంతేకాదు.
                     
                       లక్ష్మణాగచ్ఛ భద్రంతే ఊర్మిళాముద్యతాం మయా
                          ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ  మా భూత్కాలస్య పర్యయ:

అని అల్లుని చేతిలో బిడ్డ నుంచి తన బరువును దించుకున్నాడు రాజర్షి.  [బా.కాం. 73-304 ]
అయోథ్యానగరంలో గృహప్రవేశాది విథిపూర్వక క్రియాకలాపం పూర్తి చేసుకొని అత :పురంలో అడుగుపెట్టిన  ఊర్మిళ తిరిగి కనపడలేదు.ఆమెకై చూచి చూచి నిరాశచెందిన సాహితీప్రియులు, రామకథాగానతత్పరులైన జానపదులు ఊర్మిళను కావ్యనాయికను చేసి కావ్యాలు వ్రాయడానికి,  ప్రయత్నించారు.
            
     శ్రీ మైథిలీశరణ్ గుప్త వంటి ప్రసిద్ద హిందీకవులు సాకేత్, పంచవటి వంటి కావ్యల్లో ఊర్మిళ ను అపురూప క్వ్యనయికగా సృష్టించి ఉపేక్షితను అపేక్షితగా మార్చి ఆమెయే రామకథాగమనానికి ప్రధానపాత్ర అన్నంతగా ఆ పాత్రకు విశిష్టతను ఆపాదించారు.తెలుగు  నేలపై  విన్పించే “ ఊర్మిళాదేవి నిద్ర,”“లక్ష్మణదేవరనవ్వు “వంటి జానపదగేయాలు తెలుగువారికి ఊర్మిళ పై  నున్న అభిమానాన్ని, ఆరాధనాభావాన్ని ప్రస్పుటం చేస్తున్నాయి. ఒకవైపు హిందీకవుల ప్రభావం మరొకవైపు జానపద గేయాల ప్రభావం తెలుగు కవులను ప్రేరేపించగా  తెలుగుసాహితీ జగత్తులో కూడ ఊర్మిళ కావ్యనాయికగా ఆవిర్భవించింది.
                        
   “ ఊర్మిళా శేష శక్తి  ర్హి జనకస్యౌ రసీసుతా” అని ఊర్మిళాదేవి ఆది శేషుని శక్తిగా పురాణాలు ప్రస్తావిస్తున్నాయి.{రామా.సా.-బాల-12-39 ] .  వాల్మీకి , తులసీదాసాదులే కాదు.కరుణా రసైక మూర్తిభవభూతి సైతం ఉత్తర రామచరిత్రలో ఊర్మిళావృత్తాంతాన్ని మాటమాత్రంగా వదిలివేయడం ఊర్మిళా దురదృష్టమే.
                    
    మిథిలానగరంలో ఆ కళ్యాణ ముహూర్తబలం ఎట్టిదోగాని ఆ ఆక్కచెల్లెండ్రు నల్గురు కష్టాల కడలిని యీదవలసిన వారయ్యారు. వారిలోను జనకపుత్రికలకే  కష్టాలు ఎక్కువగా కన్పిస్తాయి. అందులోనూ ఊర్మిళా లక్ష్మణుల జీవనగమనంలో రాముని కైంకర్యసమయమే ఎక్కువ. సీతాసాథ్వి భర్తృవియోగాన్ని సహించలేక ఆయనతో పాటు అడవులకు అడుగులు వేయడానికి సాహసిస్తే  --అన్నను అనుసరించాడు లక్ష్మణుడు. ఆసమయంలో భర్త వెంట ఊర్మిళ కూడా వస్తానందో –అసలు లక్ష్మణుడు తను అన్న వెంట వెడుతున్నట్లు ఊర్మిళతో చెప్పాడో లేదో కూడ వాల్మీకి లేఖిని వ్రాయలేదు.
.                           
     తనవెంట అడవులకు వస్తానన్న తమ్మునితో  శ్రీరాముడు  “పృచ్చస్వ సౌమిత్రే సర్వమేవ సుహృజ్జనం “[ వా.రా.అ.కాం. 31-26 }అని-అంటాడు. ఇచ్చట “సర్వమేవ“అన్న సముచ్చయంలోనే ఊర్మిళ కూడ ఉండి ఉండవచ్చు.
                     

                     సీతారాములతో లక్ష్మణుడు అడవులకుపోగా ఏకాంతంగా అంతపురంలో పదునాల్గు వసంతాల్ని గడపటం ఊర్మిళ వంతయ్యింది. మాండవీ శ్రుతకీర్తులకు కనీసం భర్తల సాహచర్య భాగ్యమన్నా లభించింది కానీ ఊర్మిళకు నాథుని నిరీక్షణలోనే నిండువేసవులు, గండు శీతులు నిండు గ్రీష్మాలు గానే మిగిలిపోయాయి. రాజపుత్రికగా సామాన్యమైన ఆలోచనలకు అతీతంగా ఆవిడ ఎలా ఉండగలిగిందన్న ఆలోచన  కవుల కలాలకు కొత్త ఊపిరినిచ్చింది. భాషాబేధం లేని  రీతిలో ఉత్తర, దక్షిణ భారతదేశ కవుల హృదయాలలో కొత్త కొత్త భావాలకు పరదాలు తీసిన ఊర్మిళ పాత్ర  ఉత్తమ కావ్యసృష్టికి కారణభూతమైంది.
                         
    శ్రీ మైథిలీ శరణ్ గుప్త పంచవటి కావ్యంలో పర్ణశాలకు వెలుపల శిలాతలంపై కూర్చొని దీర్ఘాలోచనల్లో మునిగిపోయిన లక్ష్మణుని ఊహల్లోకి ఊర్మిళను రప్పించారు. ప్రణయదేవత ఊర్మిళా మధుర స్మృతులు ఊహల్లో ఊరట కల్గిస్తుండగా శూర్పణఖాగమనం సంభవిస్తుంది. ఊర్మిళా మనోనాథుడు శూర్పణఖను చూసే సమయానికి అతని మనస్సులో ఊర్మిళయే నిండి ఉన్న సన్నివేశం ఔచితీ సంభరితం.
                       
  “ సాకేత్” కావ్యంలో రాముని తీసుకురావడానికి చిత్రకూటానికి బయలుదేరిన భరతుని వెంటవున్న అంత:పురజనంలో ఊర్మిళను కూడ పంపించి, అక్కడ పర్ణశాల లో ఒంటరిగా ఊర్మిళా లక్ష్మణులను కలిపి తృప్తిగా నవ్వుకొన్నారు  శ్రీ మైథిలీ శరణ్ గుప్త.
                 
     ఊర్మిళ సమాథి లోనే ఉండి ఆ నిద్ర లోనే పధ్నాలుగు సంవత్సరాలు గడపడం జానపదుల సృష్టి.” కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది “అనేది జనపదాల్లో వాడుకలో ఉంది. అందుకే ఆవిడ బాథ వీళ్ల భాధగా భావించి  ఊర్మిళను సమాథి లోకి పంపించారు జానపదులు. అదేమార్గంలో కొంతమంది తెలుగు కవులు కూడ తమకావ్యాల్లో ఊర్మిళను సమాథి లోకి పంపించి ,యోగ ప్రభావంతో ఆవిడ భర్తను ప్రత్యక్షంగా దర్శిస్తూ, సంభాషిస్తున్నట్లు ,తుదకు రామాదులు అయోథ్యకు తిరిగి రావడాన్ని కూడా తన యోగవిద్యాప్రభావం తో  తెలుసుకొని ఊర్మిళ యే ముందుగా అంత: పురంలో అందరికీ తెలియజేసినట్లుగా  కూడ వ్రాసేశారు.
                               
      పతంజలి యోగశాస్త్రం లో  సమాథిని గురించి    “ఇదేవాత్మ మాత్మవిర్భాసం స్వరూప శూన్యమివ సమాథి: “ { ప.యో.శా.-3.2, 3.3]అని చెప్పబడింది.

“తాను థ్యానించే వస్తువుని మాత్రమే భావించడం థ్యానమనబడుతుంటే, థ్యానం థ్యానించే వస్తువు        యొుక్క స్వరూపంగా పరిణమించి థ్యానిస్తున్నాననే   బాహ్యస్మృతి లేకపోవడమే సమాథి.”
అటువంటి సమాథి స్థితిలోనే  ఊర్మిళ ఫధ్నాలుగు వసంతాలు గడిపిందని కొందరు కవులు యోగశాస్త్ర ప్రసక్తి ని కూడా తమ కావ్యాల్లోకి తీసుకొచ్చారు. ఊర్మిళ ను ఉత్తమ నాయికగా తీర్చి దిద్దారు.ా
                            
    “ ఊర్మి “అంటే తరంగం. రామాయణ కథావేగాన్ని పెంచడానికి ఈ “ఊర్మి” ఉపయోగపడి,వేగంగా కథను గమ్యానికి చేర్చి, రామకథాబంథాన్ని ఏకసూత్రంగా  మలచిందని  చెప్పవచ్చు.రాముని వెంట లక్ష్మణుడు వెళ్లకపోతే రామకథకు పరిపూర్ణతే లేదు గదా! అందుకు పరోక్ష సహకారి ఊర్మిళ.
              
    “ భజ్యతే స్వయమేవ భంగ:” అన్న నిర్వచనాన్ని అంగీకరిస్తే తనంత తాను నశించునది అనే అర్థంలో రాముని సేవకై పతిదేవుని పంపి పథ్నాలుగువసంతాలు నిద్రామూర్తిగా,నిశ్చైతన్యగా, యోగినిగా తన్నుతాను కృశింప చేసుకొని తపస్వినిగా రూపొందిన ఊర్మిళ కు వాల్మీకి చేసిన నామకరణం సార్థకమేననిపిస్తుంది.







-- వందే రామం దూర్వాదళశ్యామం సీతాపతిం సుందరం -